అంతరంగం
లోకం ఇచ్చే బిరుదులు (ఇంట్లో వాళ్ళు కూడా ఇవ్వొచ్చు)మీకు ఎన్ని ఉన్నాయి?
ఎవరైనా మిమ్మల్ని క్రింది విధంగా అనచ్చు, వివిధ సందర్భాలలో!
మీకు అనుభవం అయ్యిందా!
అహంభావి!
పొగరు బోతు!
చాతకాని వాడు!
ఏమీ తెలియదు!
సమర్ధత లేదు!
మాట్లాడం రాదు!
సొల్లు వాగుతాడు!
పద్ధతి లేదు!
ఎందుకూ పనికి రాడు!
మూర్ఖుడు!
ఇత్యాదులు ఇంకా కూడా ఉండొచ్చు!!!
కానీ
ఒక్క విషయం నీ బుర్రకెక్కుంచుకో!
ఇన్ని లక్షణాలు ఒక సగటుమనిషిలో ఉండటం అసాధ్యం.నువ్వు సగటు కంటే పోటుగాడివి కాదు కదా!మూర్కుడికి కూడా ఇన్ని అవలక్షణాలు ఉండవు! మూఢుడికి అసలు ఏమి తెలియదు! నువ్వు ఈ రెండు తెగలకి సంబంధించిన మేధావివి కాదుగా-సగటు మానవుడు మూఢుడు కాదు, మూర్కుడు కాదు!
ఎక్కడా మన పురాణాలలో, ఇతిహాసాలలో, ఆఖరికి కృష్ణుడు అర్జునుడికి చెప్పినట్టుగా భగవద్గీత లో కూడా చదివిన గుర్తులేదు!దాఖలాలు లేవు!
మరి ఇన్ని అవలక్షణాలు నీలో ఎవరైనా చూసి అభిప్రాయపడితే కంగారుపడొద్దు- అవాకులు చవాకులు అన్నా ఓ మూలకూర్చోని మూలగకు;సింగినాదం, జీలకర్ర కాకపోతే ఏంటి మరీనూ! అంత నీలుగుడు పనికిరాదు.ఎందుకంటే అవతలవాళ్లు చూసే విధానం, మరియు వాళ్ళ విధానాలు వాళ్లకి ఉంటాయిగా మరీ. నీ సగటు బుఱ్ఱకి అదీ తట్టక పోతే ఎలా-మరియు వాళ్ళ దృక్పధం,అది వాళ్లకున్న స్వేచ్ఛ మరియు అభిప్రాయం.
సాధారణంగా ఈ అభిప్రాయవ్యక్తీకరణవల్ల ఒకటి మాత్రం తేటతెల్లమైతుంది.వారికి నీమీద సదాభిప్రాయంగాని గౌరవంగాని బొత్తిగాలేదని.దానివల్ల నీ వ్యక్తిత్వానికి కించిత్తు ప్రమాదం కూడా లేదు.మీరు చాలా చెడ్డవారని కంగారుపడి మీలో మీరు అభిప్రాయానికి రాకండి, మరియు మథన పడకండి.అది వారి స్వభావం మరియూ అవతల వాళ్లని అంచనా వేసే విధానం. వాళ్లకి ఆ స్వతంత్రం ఉందిగా, మన పూర్వీకులు స్వతంత్రం తెచ్చి ఇచ్చారుగా అందరికీ!
గమ్మత్తు ఏమిటంటే వాళ్ళ లోపాలు వాళ్ల కళ్ళకి కనపడవ్,అందుచేత వాళ్లలో ఈ లక్షణాలు ఉన్నా వాళ్ళకి తెలియదు.ఏతావాతా నే చెప్పొచ్చేదేమిటంటే వాళ్ళకి ఈ విషయం చెప్పడానికి ప్రయత్నం చెయ్యద్దు-వాళ్ళకి కోపం రావొచ్చు.పైన పేర్కొన్న బిరుదుల్లో మీరు కొద్దిగా మెరుగు పర్చుకోవచ్చు మీకు అనిపిస్తే, అదీ ఆ లక్షణాలు కొద్దిగా ఉన్నాయని అనిపిస్తే మాత్రమే సుమీ!
ఏదైనా మనం అంత వెధవాయలం కాదుగా మరి కన్యాశుల్కంలో గిరీశం చెప్పినట్టు.అయినా అవతలవాళ్ళ అభిప్రాయానికి, వాళ్లు ఇచ్చే బిరుదులు పట్టించుకోవద్దు (విశ్వనాథవారు కూడా ఈ అభిప్రాయం వెలిబుచ్చినట్టు నాకు బాగా గుర్తు-వాళ్ల అబ్బాయి పావనశాస్త్రి ఒక సందర్భంలో నాతో మాట్లాడుతున్నప్పుడు!)
అంత తీవ్రంగా బాధపడొద్దు, జీవితం సాగించ లేవు-ఎందుకంటే జీవితం సాగుతుంది కనుక.ఇలా అన్నీ పట్టించుకుంటే బాపూ రమణలు అంత సఖ్యంగా, ఒకే ప్రాణంలా వుండేవారా మరి-ఎదో పెద్దముండావాణ్ణి చెబుతున్నా చెవికి వేసుకో.అసలే లాక్ డౌన్ లో ఉన్నావ్- తెలుసుకో విజ్ఞతతో వుండు.
స్థాయి- మానవ సంబంధాలు
ఇదేమిటి స్థాయికి- మానవ సంబంధాలకు ఏమిటీ సంబంధం అనుకుంటున్నారా- వస్తున్నా అక్కడికే వస్తున్నా!
చిన్నతనం నుంచి ఈ వివక్షత చూస్తూనేఉన్నాం, అంటరానితనం అంటారుగాని ఇప్పుడు నేచెప్పే జాడ్యం ఆరోజుల్లో అంతగా ఉండేది కాదు,ఇప్పుడు అది కోవిడ్ మహమ్మారిలాగా ప్రబలిపోయింది! కోవిడ్ కి వాక్సిన్ కనిపెట్టగలిగారు గానీ, ఈ జబ్బుకి మందే లేదు!
మన బాల్యంలో స్నేహితులతో చాలావరకు కలసిమెలసి ఆడుకున్నా మనకంటే కొద్దిగా ఎక్కువలో ఉన్నవాడు కొద్దిగా గీర్వాణం చూపించేవాడు- కనపడకుండా- వీళ్ళని మాత్రం మనతో ఆడనిచ్చేవాళ్ళం; ఒకళ్ళిద్దరు కనపడేట్టే గీర్వాణం చూపించేవాళ్ళు -వీళ్ళని మాత్రం సాధ్యమైనంత దూరంగా పేట్టేవాళ్ళం!
అలాగే బంధువుల్లో కూడా-రాకపోకలు, పలకరింతలు ఉన్నా, కొందరుమాత్రం స్థాయీబేధం చూసే పలకరింపులు, రాకపోకలు చేసేవాళ్ళు; దీనివల్ల ఆర్ధికంగా బలంలేనివాళ్ళు, ఆర్థికపరిస్థితి ఓ మోస్తరుగా ఉన్నవాళ్లు- కాస్త స్థితి కలిగినవాళ్ళు పలకరించినా వీళ్ళలో మాత్రం ఏదో తప్పుచేసిన వాళ్ళలాగా కొంత ఆత్మాన్యూనతా భావానికి గురి అయ్యేవాళ్ళు కూడా కొందరు ఉండేవాళ్ళు- “ఆర్ధిక అసమానతలు” అనేవి కొలబద్దగా ఈ రోజుల్లో మానవసంబంధాల్లో, రక్త సంబంధాల్లో ప్రభావం చూపడం అనేది బాధాకరమయినా విషయం అయినా ఇది కఠోరవాస్తవం.
కలియుగ ప్రభావాల్లో ఇది కూడా ఒకటి- జనాలు డిజిటల్ అయినా- యుగం కలియుగమేగా.డిజిటలైజేషన్ వల్ల ఇంకొంత తొందరగా ఇలాంటి మాయరోగాలు చప్పున వచ్చేస్తాయి- అంతే!
జీవితంలో క్రమేపి మనం ఎదుగుతున్నకొద్దీ ఇలాంటివాళ్ళు మనకు తారస పడుతూనే ఉంటారు ప్రతీ దశలోనూ-ఈ రోజుకీనూ.మనకూ కాస్త బుర్రా ఉంది, దానిలో గుజ్జూ ఉంది కాబట్టి ఇలాంటి వాళ్ళతో ఎలా మెలగాలో తెలుసుకాబట్టి, మనమూ ఆయా సందర్భాల్లో నటించేస్తూ బయటపడుతూంటాం.
మనం ఎవరి ఇంటికి వెళ్లి ఉన్నా-ఎవరు వచ్చి మనఇంట్లో ఉన్నా మన స్థాయివాళ్ళే-మనకంటే స్థాయి ఎక్కువ ఉన్నవాళ్ళు ఎప్ప్పుడైనా బసచేశారా మనఇంట్లో-టపీమని చెప్పేయచ్చు-లేదూ అని!
అలా అని వాళ్ళు పలకరించరనీ, ప్రేమ లేదనీ కాదు వాళ్ళకి.ఎంతవరకు అంతవరకే వీళ్ళ ప్రేమలు ఆప్యాయతలూనూ .వాళ్ళు వాళ్ళ స్థాయిలో ఉన్న బంధువులతోనూ, స్నేహితులతోనూ కలివిడిగా ఉంటారు; తోబుట్టువుల్లోనే ఈ తారతమ్యాలు చూస్తున్నాం.
దీన్ని ఆక్షేపించవలసిన పనీ లేదు,మనం జుట్టు పీక్కోవాల్సిన పనీలేదూ. అందుకే వియ్యానికైనా కయ్యానికైనా సమతూకం ఉండాలి అని సామెత కూడా ఉందిగానీ, ఈరోజుల్లో రక్త సంబంధీకుల్లో, బంధువుల్లో కూడా ఇలా స్థాయి చూసుకుంటాం అని మన పూర్వీకుల ఊహకు కూడా అందలేదు!
ఏవిటో వాళ్ళు చాలా చాదస్తం గాళ్ళు,వెర్రిబాగులవాళ్ళలాగా ఉన్నారనుకుంటా- ఏమాత్రం కూడా మనం ఇలా తయారవుతాం అని అనుకోలేకపోయారు. అవును మరి మనకున్నంత తెలివితేటలు అప్పటివాళ్ళకి లేవు కదా- అమాయకులాయే మరి!
ఈ విషయంలో నీనెవెరినీ వేలెత్తి చూపించడంగానీ, తప్పుపట్టడంగానీ చెయ్యట్లేదు సమాజంలో మన చుట్టూ అనాదిగా వస్తూనే వుంది,మనం చూస్తూ ఉన్నదే.ఈ రోజుల్లో తోబుట్టువుల మధ్యా, రక్తసంబంధీకుల మధ్య- ఒక తరంలో ఉన్న ప్రేమలు-వాళ్ళ పిల్లలో ఉంటున్నాయా.
వాళ్ళు పెద్దతరం వారితోగానీ వాళ్ళ సాటివయసు బంధువులతోగానీ కలిసి ఉండట్లేదు.అక్కడా వాళ్ళస్థాయి ప్రకారమే స్కూల్ లోనూ,కాలేజీలోనూ స్నేహాలు చేస్తున్నారు.అలాగే బంధువుల్లో కూడా తమ స్థాయికి తగ్గవాళ్లతో ఒక రకంగా వుంటారు,స్థాయి కానివారితో వేరేరకంగా ఉంటారు -తోబుట్టువులైనా, రక్తసంబంధీకులైనా అంతా ఒకటే-ఆ విషయంలో అలోచించి ప్రవర్తించడంలో ప్రజాస్వామ్యమే-నీ నా అనే తేడాలేదు- అందరూ ఒకటే!
ఇంకొందరుంటారు- కనపడినా పలకరించకుండా మొహం చాటేసేవాళ్ళు-ఏమిటో వాళ్ళు ఏమనుకుంటారో- అవతలవాళ్ళకి ఏమైనా తేడా ఉంటుందా వీళ్ళ ప్రవర్తనతో - వెర్రివేషాలు కాకపోతే!
జీవితంలో మనం ఏ స్థాయిలో ఉన్నా స్థాయి మరిచి అన్ని స్థాయిల వాళ్ళతో కలసి మెలసి ఉండటం అసలైన ఉన్నతస్థాయి!
చిరంతరం ఉండలేని మనం చిరస్థాయిగా ఉండాలంటే- అరమరికలు లేకుండా స్థాయీభేదం లేకుండా అందరితో కలిసి జీవించేద్దాం- ఓ పనై పోతుంది ఈ జీవితానికి!
ఏదో ఉండబట్టలేక ఈ నాలుగు రాతలు గానీ, మీకు తెలియకనా ఈ విషయాలు
కింద కూర్చోవడం...
ఈ రోజుల్లో ఎల్లవేళలా- వయసుతో సంబంధంలేకుండా అందరం కుర్చీ,టేబుల్ కీ అతుక్కుపోతున్నాం-నిద్రలేచింది మొదలు- పడుకునేటప్పుడు మంచం ఎక్కేంతవరకు!
ఈ మధ్యకాలంలో,ఇంట్లోనే కాదు ఎక్కడా కిందకూర్చోవడం మర్చిపోయింది మన శరీరం-నేల అంటే తెలియదు, నేలని తాకి- కాళ్లతో కాదు-ఎన్నేళ్ళయిందో గుర్తుకూడా లేదు మరి.ఎప్పుడో చిన్నప్పుడు నేలతో చాలా నేస్తంగా ఉండేవాళ్ళం, నేలమీదే ఎక్కువగా ఆడుకునేవాళ్ళం- నేలే మన ఆప్తమిత్రం అన్నట్టు.
అలాంటిది కొద్దిగా పెద్దఅవగానే అదాటుగా దాన్ని మర్చేపోయాం, ఎప్పుడన్నా కింద కూర్చోవాల్సిన పరిస్థితి వస్తే నానా అవస్థలూ పడుతున్నాం.అలాకాకుండా చిన్నతనంలో ఉన్నఅదే మైత్రి కొనసాగిస్తూ అప్పుడప్పుడు అదే నేలని పలకరిస్తూ ఉంటే స్నేహం కొనసాగేది-చులాగ్గానూ-ఆనందంగానూ టపీమని కూర్చోవాలని అనిపించేది -కూర్చోగలిగేవాళ్ళం!
పొద్దున్న మంచం మీదనుంచి లేచింది మొదలు ఎక్కడ కూర్చున్నా కుర్చీపైనే; నేల మనఅందరికీ బాల్యంనుంచి ఆప్తమిత్రుడేగా-ఆడామగా తేడా లేకుండా ఎవరికైనా- అలా ఎలా మర్చిపోగలం! దాన్ని మర్చిపోయినందుకు ఫలితం అనుభవిస్తున్నా మనకు తెలిసిరావడం లేదు!
ఆరోగ్యంగా ఉన్న శరీరమైనా,దాన్ని గారాబం చేస్తే, ఒళ్ళు వంగదు- పూర్వంవాళ్ళ లాగా ఒళ్ళువంచి పనిచేయకపోయినా మన ఒళ్ళు మనం అప్పుడప్పుడన్నా వంచకపోతే కొన్నాళ్ళకి అది మనమాట వినడం మానేసి వంగడమే మానేస్తుంది; “వంగడం అంటే ఏంటి” లేదంటే వంగడం అంటే విత్తనమా అంటుందేమో-అలా అడిగినా ఆశ్చర్యం లేదు!
ఇప్పటికే శరీరాన్ని ఎక్కువ గారాబంగా చేసేసాం-టపీమని కూర్చోలేము, బాసిపీఠం ఎంతమంది వేయగలుగుతున్నాం, ఓవేళ వేసినా ఎంతసేపు నిశ్చలంగా అలా కూర్చోగలుగుతున్నాం.అసలు ఈ ధ్యాసే ఎందుకు రావట్లేదో మరి- ఆ…. అంత తీరిక ఎక్కడ ఏడిసింది ఈ పరుగుల జీవితంలో-కూర్చునేంత తీరుబడి ఎక్కడిది అని మనకు మనమే సరిపెట్టేసుకుంటున్నాం, బండి లాగించేస్తున్నాం!
దానివల్ల ఎవరికీ ఇబ్బంది లేదుగానీ, ఈ క్రమంలో, ఈ అలవాటుతో మనకు మిగతా సుఖాలు మరిగినట్టే శరీరానికి కూడా సుఖం పెరిగిపోతుంది- పొరపాటున ఎప్పుడన్నా కూర్చోమన్నా మన శరీరం మనమాట వినదు.
అసలు ఎలా తయారయ్యాం అంటే “అసలు ఇక ముందుజీవితంలో కింద కూర్చోవాల్సిన పనేలేదు, అవసరమే రాదు” అనే భావనలో బతికేస్తున్నాం;
ఏమన్నా అంటే “అంత తీరుబడి ఎక్కడవుంది” అని సన్నాయి నొక్కులు నొక్కుతారు.అక్కడికేదో మనం కిందకూర్చోవడం పరోపకారంలాగా-దేశాన్ని ఏదో ఉద్ధరిస్తున్నట్టు-తొక్కలో ఫీలింగ్ ఒకటి!
కింద కూర్చోవడం నామోషీ అనే భావన చాలామందిలో ఉన్నట్టుంది!
మిగతా వాళ్లంతా కుర్చీల్లో కూర్చుంటే మనం కింద కూర్చుంటే అవతలివాళ్ళు ఏమనుకుంటారో అనో, లేదా మనం తక్కువ అయిపోతామో అనే భావన- ఇవన్నీ అక్కరలేని ఆలోచనలు మాత్రమే అని అనుకున్నరోజున- మీరు ఇంట్లో కింద కూర్చోవడం మొదలు పెడతారు.
ఎలాంటి బేషజాలు లేకుండా చక్కగా వేరేవాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు కూడా కింద కూర్చునే వాళ్ళు నా బంధువుల్లోనూ,స్నేహితుల్లోనూ ఉన్నారు-ఈ సందర్భంగా వాళ్ళని ఓసారి తల్చుకుంటున్నాను.
ఇప్పటికైనా వచ్చిన నష్టం ఏమీ లేదు,ఇక నుంచైనా రోజులో ఒక్కసారైనా కింద కూర్చోవడం అలవాటు చేసుకోండి- అది మీ ఆరోగ్యానికి మంచిది- ఉన్న “మాయరోగాలు” కూడా తగ్గుతాయి (ఈ సంగతి కూడా గూగుల్ చేత చెప్పించుకోవాలా- సిగ్గుచేటు కాదూ)
కనీసం ఇంట్లో టి.వి- ఠీవిగా చూసేటప్పుడన్నా ఓ బాసి పీఠంలోనో, వజ్రాసనంలోనూ కూర్చోవచ్చుగా- ఆరోగ్యానికి ఆరోగ్యం, వళ్ళూ ఒంగుతుంది-అప్పుడూ వెధవ కుర్చియేనా!
“ఆ… మాకేం రోగాలు లేవు, ఓవేళ వచ్చినా వళ్ళు వంచాల్సిన పనేం లేదుగా- మంచం మీద పడుకోవడంతో, కుర్చీలో కూర్చోవడమో చేస్తాం-కింద కూర్చుంటామా ఏమిటీ” అని అనేస్తే మీ ఇష్టం మరి.ఒక విధంగా అదీ నిజమే, ఆసుపత్రిలో కూడా కుర్చీలోనే కదా ముందు కూర్చునేది- మంచం మీదకి చేరే లోపు- మీ ఇష్టం అలాక్కానివ్వండి “మీ కుర్చీ-మీ మంచం"తోడూ-నీడగా ఉంటాయి ఎల్లప్పుడూనూ!
గమనిక:
ఎప్పుడైనా మీ ఇళ్ళకి వచ్చినప్పుడు నేను కింద కూర్చుంటే మాత్రం ఏమీ అనుకోకండి
జ్ఞాపకాలు
జ్ఞాపకాలు ఉండనివాళ్ళు,లేనివాళ్ళు ఎవరూ ఉండరు-కానైతే అందరికీ వాళ్ళ జ్ఞాపకాలు గుర్తు ఉండవు-.జ్ఞాపకాలలో మంచివి ఉంటాయి, చెడువి ఉంటాయి. మంచివి-ఆ మంచి ఎవరివల్ల జరిగిందో జ్ఞప్తిపెట్టు కోవడం,జ్ఞప్తికి తెచ్చుకోవడం సంతోషాన్నిఇస్తుంది.చేదువి,చెడువి గుర్తుపెట్టుకోవడం,ఆ మనుషుల్ని మన మనసులో పెట్టుకోవడం మున్సిపాలిటీ వాళ్ళ చెత్తకుండీని బుఱ్ఱలో పెట్టుకున్నట్టే; కంపే-ఇంపు కాదు కదా ఏమాత్రం.
అలాకాకుండా మంచి విషయాలు,మంచి సంగతులు గుర్తుపెట్టుకుని పదేపదే గుర్తుతెచ్చుకుంటే ఆనందం, సంతోషం పెరుగుతుంది.చెడువి, చేదువి అయిన సంఘటనల విషయంలో మనుషుల నుంచి మనం నేర్చుకోవలసిన విషయాలు నేర్చుకోవాలి,అంతవరకే వాటి పని.చెత్తతో మెమరీ బాక్స్ నిండి ఉంటే డిలీట్ బటన్ నొక్కుతాం కదా మన చరవాణిలో-మరి మన “మనసు-జీవితం” చరవాణి పాటి విలువ చేయదా.
అసలు జీవితంలో జరిగే ప్రతి సంఘటనని క్షుణ్ణంగా అనుభవించడం, ఆస్వాదించడం ఆ సంఘటనల్లోంచి నేర్చుకోవాల్సిన జీవితసత్యాలు చాలా ఉంటాయి. చెడుకి కుంగిపోయి, మంచికి వళ్ళుతెలియకుండా,రెచ్చిపోకుండా సమతూల్యత పాటించడం అలవర్చుకుంటే జీవితంలో అన్నీ జ్ఞాపకాలే- చేదైనా,వేప చేదు ఒంటికి ఎంత మంచిదో- కొన్ని చేదు సంఘటనలు జీవితంలో తీపినిఇస్తాయి దీర్ఘకాలంలో, ఆ విచక్షణ,ఆకళింపు ఉండాలి ప్రతి మనిషికి.
ప్రపంచంలో కష్టపడకుండా ఉన్న మనిషిని చూపించగలమా ఎవరమైనా- “ఎండా వానల్లగా- చీకటి వెలుగుల్లాగే” కష్ట సుఖాలు కూడాను జీవితంలో.ఉగాది పచ్చడి ఏం చెపుతుంది మనకి,ఉత్తిగా పచ్చడి చేసుకొని తినేయడమేనా అందులోని అర్ధం పరమార్ధం తెలుసుకోపోతే ఎలా?
ఆ పాటి విజ్ఞత ఉంటే జీవితంలో సంతోషానికి ఢోకాలేదు, ఈ మాటలు జ్ఞప్తికి పెట్టుకోండి మీ జ్ఞాపకాలను పిలిచే ముందు ఇకనుండీ.అసలు ఇలా ఉండగలిగితే జ్ఞాపకాలు ప్రత్యేకంగా గుర్తు పెట్టుకొనవసరం లేదు,అవే తన్నుకుంటూ గుర్తుకొస్తాయి,మన ప్రమేయం, ప్రయాస లేకుండానే!!!
జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోవాలంటే మొదట జ్ఞాపకాలు ఉండాలి; అవి గుర్తు తెచ్చుకునే వాటిలా ఉండాలి.ఒక్క జ్ఞాపకం జ్ఞప్తికి తెచ్చుకుంటే వేయిచంద్రుల వెలుగుతో ముఖం విప్పారుతుంది-అదే వేరొకరితో చెప్పుకుంటే చంద్రుడు మన చెంతకొచ్చినట్టు ఉంటుంది!
మనం జీవితంలో ఎదిగే క్రమంలో రకరకాల వ్యక్తులు తారసపడుతూ ఉంటారు, అందులో కొంతమంది మన జ్ఞాపకాల్లో మిగిలిపోతారు- ఆప్రయత్నంగానే.ఎలాంటి వ్యక్తులు అయినా మనకు అనుభవాలు మిగులుతాయి- కొందరు వ్యక్తులవల్ల జీవిత సత్యాలు కూడా నేర్చుకుంటాం-అంచేత మనకు తారస పడే వ్యక్తులు అందరూ ముఖ్యులే- “మరక మంచిదే- సర్ఫ్ ఎక్సెల్ ఉందిగా”- అలాగే ఎలాంటి వాళ్ళనైనా ఎదుర్కోవడానికి మన మెదడుందిగా!
జ్ఞాపకాల్ని గుర్తు తెచ్చుకోండి, మళ్ళీమళ్ళీ జీవితంలో సంతోషం పొందుతూనే ఉండండి.జ్ఞాపకాలు గుర్తు పెట్టుకోవడానికి, మరలా గుర్తు తెచ్చుకోవడానికి- మేధావితనమూ అక్కర్లేదూ, శాస్త్రవేత్తలమూ కానక్కరలేదు- నిత్యం సంతోషంగా జీవించే దృక్పధం ఉంటే చాలు!
ఆ నలుగురూ ఎవరు...
మన జీవితంలో అందరికీ ఎందరో పరిచయస్తులు ఉంటారు- రక్తసంబంధీకులు, తోబుట్టువులు, చుట్టాలు, దూరపు చుట్టాలు, బాల్యస్నేహితులు, స్నేహితులు, ఆప్తులు, హితులు, సన్నిహితులు, ముఖపరిచయం ఉన్నవాళ్ళు, ఓ మాదిరి పరిచయం ఉన్నవాళ్ళు, సహోద్యోగులు, ముఖపుస్తకపు స్నేహితులు, ఇరుగుపొరుగువాళ్ళు, తరచుగా కనపడుతూ-పలకరింపుగా నవ్వేవాళ్ళు-ఇంకా బోలెడుమంది!
చూసారా ఎంతమందితో మనకి పరిచయాలో,ఎంతమంది మందీమార్బలం ఉందో మన మానవసంబంధాలు నెరపడానికి.వీళ్ళేకాకుండా మనం తరచుగా వెళ్లే ప్రదేశాల్లో-పలకరించేవాళ్ళు,పలకరింపుగా చూసే వాళ్ళు,కోకొల్లలు.
మరి ఇంతమంది ఉంటే మరి మన పెద్దవాళ్ళు ఇలా ఎందుకు అనేవారు...
నలుగురూ నవ్వుతారు!
నలుగురూ ఏమనుకుంటారు!
నలుగురూ చూస్తారు!
నలుగురిలో అవమానపడకూడదు!
నలుగురితో నవ్వుతూ ఉండాలి!
నలుగురితో కలిసిమెలిసి మెలగాలి!
నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలి!
నలుగురినీ పిలిచేట్టుగా ఉండాలి!
నలుగురికి చెప్పుకునేట్టుగా ఉండాలి!
నలుగురి నోళ్ళలో నానకూడదు!
నలుగురితో చెప్పుకునేట్టుగా ఉండాలి!
నలుగురితో బాధ చెప్పుకుంటే ఉపశమనం కలుగుతుంది!
నలుగురిలో నవ్వులపాలవ్వద్దు!
ముఖ్యమైన విషయం మరియూ తమాషా ఏమిటంటే-ఆ నలుగురూ మనకు తెలిసిన వాళ్లయిఉండొచ్చు,తెలియని వాళ్ళయినా కావచ్చు.ఇంకో విశేషం ఏమిటంటే మనమెరిగిన ఇంతమందిలో ఆ నలుగురూ ఎవరో మనకి తెలియదు- వాళ్ళకీ తెలియదు!
ఈ తమాషాలో-తమాషా ఏమిటంటే మనకు "చివరలో" కావాల్సిన ఆ నలుగురూ ఎవరో ఏ నరమానవునికి తెలియదు-ఇంకా వింత అయిన విషయం ఏమిటంటే ఆ నలుగురూ ఎవరికి అవుతారో ఆ అయ్యేవాళ్ళకి కూడా తెలియకపోవడం.
ఇంకో విశేషం ఏమిటంటే-ఇలాంటి మాటచెప్పిన మన పెద్దలకు కూడా తెలియదు ఆ నలుగురు ఎవరో.అందుకనే మన పెద్దలు చెప్పేది-మన జీవితాల్లో నలుగురితో కలిసిమెలిసి ఉండండి అని!
కాబట్టి చివరికి తేలింది ఏమిటంటే-ఆ నలుగురు ఎవరో ఎవరికీ తెలియదు కాబట్టి- మనకు జీవితంలో తారసపడే అందరితో కలిసిమెలిసి ఉంటే పోలా- ఏమంటారు!
కొత్త సంవత్సరం
కొత్త సంవత్సరం ఎదురు చూసినంతసేపు పట్టలేదు-కొత్త సంవత్సరం రానూ వచ్చింది,మొదటి రోజూ అయిపోనూ అయిపొయింది- మొదటి వారం కూడా అయిపోవచ్చింది.
కాకపోతే నా బుర్రకు చిన్న సందేహం- “కొత్త సంవత్సరం మన జీవితాల్లోకి ప్రవేశించిందా,మనం కొత్త సంవత్సరంలోకి ప్రవేశించామా”- గభాల్న సమాధానం చెప్పేయకండి- ఓస్, ఈమాత్రం తెలియదా అని;కొద్దిగా ఆలోచించండి,లాజిక్ గా కాదు, తెలివితేటలతో కాదు, అలా అని దీర్ఘంగా వేడివేడి కాఫీ తాగుతూనో (చల్లటి ద్రవాలు ఇష్టపడేవాళ్లు అవి చేతులో పెట్టుకోనో) అలోచించి, చించి కనుక్కోవాల్సిన విషయం కాదు- చాలా సూక్ష్మం- నే చెప్పేస్తా!
కాలం-మనం కలసి ప్రయాణిస్తున్నాం సమాంతరంగా-జీవంగా ఉన్న ప్రతి జీవీనూ-బౌతికంగా.కాకపోతే మిగతాజీవుల్లా కాకుండా మనిషి మాత్రం మానసికంగా గతానికి వెళ్తాడు, భవిష్యత్తులోకి కూడా వెళ్లగలడు- కొంతమంది గతంలోనే బతికేస్తుంటారు-అది వేరు విషయం.
కొత్త సంవత్సరంలో ఓ వారంరోజులు కూడా అయిపోవచ్చాయి;ఒక మంచి ఆలోచనో,ఓ మంచి విషయం, లేదా ఓ మంచి సంఘటనో జరిగి ఉండచ్చు మీలో కొంతమందికి-మీకు ఆనందం కలిగించినదో, సంతోషాన్ని ఇచ్చినదో.ఆనందం పంచుకుంటే ద్విగుణీకృతం అవుతుంది అని మన అందరికీ తెలిసిన విషయమే; అంచేత అవేవో నా చెవిన కూడా వేయండి-నేనూ సంతోషిస్తాను మీ సంతోషానికి- ఆనందానికి.
ఇంకో విషయం కూడా-నూతన సంవత్సరం 2021 వచ్చేముందు కొంతమంది వాళ్ళ యొక్క భావాలు,ఉద్దేశాలు కిందివిధంగా తెలియ చేశారు-సామాజిక మాధ్యమాల ద్వారా.
జనవరి ఒకటి అనేది విశేషం కాదు కొత్త సంవత్సరం మనది కాదు- ఇది విదేశీ సంస్కృతి, ఉగాది మాత్రమే మన కొత్త సంవత్సరంగా భావించాలి అని,అంచేత వాళ్లకి ఎవరూ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు పంపొద్దని,వాళ్ళుకూడా ఎవరికి పంపం అని- ఇతరులు కూడా ఇదే ఆచరించాలని మనవి చేశారు,కొంతమంది చాలా నిర్దిష్టంగా, నిష్కర్షగా చెప్పారు. సరే వాళ్ళ అభీష్టం మేరకు నేను శుభాకాంక్షలు పంపడం జరగలేదు- ఓ వేళ- ఏ పొరపాటునో వాళ్లకు నా శుభాకాంక్షలు చేరితే మన్నించండి-వారి అభిప్రాయలు భిన్నంగా ఉన్నా గౌరవిస్తాను.
ఇక ఈ విషయంలో నా అభిప్రాయం కూడా తెలియచేస్తాను...
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు జనవరి కేలండర్ నే పాటిస్తాం-ఇందులో అభిప్రాయబేధాలు ఏమీ లేవనుకుంటా- వారికి “ఉగాది” అనేదే ఆంధ్రుల కొత్త సంవత్సరం- అది కూడా చక్కగా, ఆనందంగా, విశేషంగా కుటుంబ సభ్యులతో జరుపుకుంటూనే ఉన్నారు ఆంధ్రులు ఎక్కడ ఉన్నా కూడానూ- ఇందులో కూడా చర్చలకి తావే లేదు-మిగిలిన పండుగల లాగానే ఇదీ యధావిధిగా జరుపుకుంటున్నాం కాబట్టి.
ఇకపోతే నిత్యజీవితంలో మనం చైత్ర మాసం, వైశాఖమాసం అని ఎక్కడ రాయం- జనవరి- ఫిబ్రవరి అనే రాస్తాం.ఇందులో ప్రాంతీయ విబేధాలు, వేరే రకమైన ఆలోచనలు ఎందుకు వస్తాయో నాకైతే అంతుపట్టడం లేదు.మత ప్రసక్తి,కుల ప్రసక్తి, ప్రాంతీయ ప్రసక్తి రావాల్సిన సందర్భమే కాదు.కొత్త ఆంగ్ల సంవత్సరం అనేది ప్రపంచ వ్యాప్తంగా కొద్దీ గంటల తేడాతో అందరు ఉత్సాహంగా జరుపుకుంటారు.
కొంతమంది వాదన ఎలా ఉంటుంది అంటే-యువత మద్యం తాగి చిందులు వేయడాలు, అవి-ఇవీ ఉంటాయి- ఇది యువతని ప్రోత్సహించడమే చెడు అలవాట్లకు అని. డిసెంబర్ అర్ధ రాత్రి ఒక్క రోజే తాగరుగా తాగేవాళ్ళు, వాళ్లకి
ఇష్టం వచ్చినప్పుడు తాగుతూనే ఉంటారు-తూగుతూ, ఊగుతూనే ఉంటారు; ఇవి పూర్తిగా వ్యక్తిగత అలవాట్లు-మితి మీరనంతవరకు-ఇతరులకు ఇబ్బంది కలిగించనంత వరకూ-మనమెవరం వ్యక్తిగత అలవాట్లని కట్టడి చేయటానికి!
వ్యక్తిగతముగా నాకూ ఇష్టం లేకపోవచ్చు-ఇలాంటి వ్యవహారాలు- కానీ జనవరి ఒకటిని స్వాగతించడానికి అభ్యంతరం ఎందుకు?అదేదో ఘోరమో, అపచారమో చేస్తున్నట్టు!
అదీకాకుండా నూతన సంవత్సరం అనే సందర్భం -ప్రపంచ వ్యాప్తంగా -కులాలలకు, మతాలకు,వర్ణాలకు అతీతంగా అందరికీ -ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకునే ఏకైక అవకాశం.శుభాకాంక్షలు చెప్పగానేనో, నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికితేనో- ప్రాంతానికో, సనాతన ధర్మనికో హాని ఏం జరుగుతుంది అని అనుకోవడం ఏమి సమంజసం.
ఇందులో శాస్త్రీయతని చూడవలసిన పని లేనేలేదు- భూప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి జనవరి ఒకటి 2021 ని అలాగే రాస్తారు గాని-ఇంకో రకంగా రాయారుగా- మనది ఈ ప్రాంతమైనా!
సనాతన ధర్మంలో ఏం చెప్పారు“వసుదైక కుటుంబకం” అనేగా- ఆ భావన ఉన్నప్పుడు ఇంతకంటే వేరే సందర్భం ఉందా ఏడాదిలో-మతాలకి అతీతంగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియచేయడానికి!
ఒబామోనో, ట్రంపో వైట్ హౌస్ లో దీపావళికి దీపాలు వెలిగిస్తే, కొంతమంది అమెరికన్లు ఇళ్లలో దీపాలు వెలిగిస్తే సంతోషిస్తాం.అలాగే సప్తసముద్రాల అవతల ఉన్న మన దేశీయులు- వాళ్ళు ఏ మతం వాళ్లయినా-మరీ ముఖ్యంగా అక్కడే స్థిరపడినవాళ్లు- చాలా మంది క్రిస్మస్ కి ఇళ్లలో క్రిస్మస్ ట్రీ పెట్టి విద్యుత్ దీపాలతో అలంకరణ కూడా చేస్తారు-ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు కూడా.అలా అని వాళ్ళు మతం ఏమీ మారే లేదే-అక్కడ సంస్కృతిలో జీవన స్రవంతిలో కలిసి మెలిసి జీవిస్తున్నారు.
ఇప్పుడు ప్రపంచీకరణ వల్ల (గ్లోబలైజషన్) భూగోళం మొత్తం ఓ కుగ్రామం అయిపొయింది, ఈరోజున మన భారతీయులు లేని దేశం ప్రపంచపటంలో లేదంటే అతిశయోక్తి కాదు “ఈ దేశం-ఆ దేశం” అని లేదు-నలుమూలలకు వెళ్లి, వాళ్ళు విజయపతాకాన్ని ఎగరవేస్తున్నారు, మన దేశానికి ఎనలేని ఖ్యాతిని కూడా తెస్తున్నారు, దేశానికి మరింత గుర్తింపు తెస్తున్నారు- ప్రతి భారతీయుడూ గర్వపడేలాగా.
ఇక్కడ ఓ విషయం ప్రస్తావించాలి- నేను- మా అమ్మాయి- అందరి తల్లితండ్రుల్లాగానే మాట్లాడుకుంటూనే ఉంటాం; సప్తసముద్రాల అవతల ఉన్నా కూడా- మేము కాదు ఉంది- వాళ్ళే మరి-మేము మన కర్మభూమి పైనే ఉన్నాం!
నేనూ తానూ తరచుగా మామాటల్లో, ఆధ్యాత్మికతకి సంబంధించి, అద్వైతానికి సంబంధించి, మానవ సంబంధాల గురించి, విలువల గురించి, భవద్గీత గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం మామూలు కుశల ప్రశ్నలు- కబుర్లతో బాటు- ఓ విధంగా సత్సంగం చేస్తాం-అని చెప్పొచ్చు.
పై విషయం కూడా మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం-అప్పుడు ఒక మాట అంది చివరగా!
“ప్రపంచవ్యాప్తంగా అందరికీ-ఏ విధమైన తేడాలు లేకుండా శుభాకాంక్షలు చెప్పటానికి ఉన్న ఏకైక అవకాశం కదా నాన్నా -అద్వైతసిద్ధాంతానికి ఇది మరో ఉదాహరణ కదా” అంది;ఓ పాతిక ఏళ్ల వయసుదాటిన తరంలో ఉండి, సప్తసముద్రాల అవతల ఉంటూ కూడా ఆ మాట వాడినందుకు -అద్వైతాన్ని అంత సూక్ష్మంగా చెప్పినందుకు ఖచ్చితంగా గర్వపడ్డాను- అద్వైత సిద్ధాంతాన్ని అర్ధం చేసుకోవడానికి ఆట్టే సమయం పట్టలేదు- దాని లోతుల్లోకి వెళ్ళడానికి అర్హత సాధించింది అనుకున్నా!
మరో విషయం-నేను ప్రస్తుత ఉండేది బెంగుళూరులో- ఒక్క తెలుగు ప్రజలు తప్ప దేశంలో వేరే ప్రాంతాల వారు ఎవరూ ఈ అభ్యంతరాలు వ్యక్తం చేయడం నేను చూడలా,వినలా.
నా వరకూ కొంతమందికి ఈ భావన కలిగి ఉండటం అసహజంగా తోచింది, వారికి సహేతుకంగానే ఉండి ఉండవచ్చు, ఏది ఏమైనా వారి అభిప్రాయాలకి గౌరవం ఇవ్వాలి, ఇస్తాను కూడా.అదే కదా మన దేశ సంస్కృతీ, గొప్పతనమూనూ- “భిన్నత్వంలో ఏకత్వం”!
ఎందుకో ఈ విషయం ప్రస్తావించాలి అనిపించింది-అంతకంటే ఇంకేమీ లేదు...
ముగించేముందు మరోసారి జ్ఞాపకం చేస్తున్నా-ఈవారంలో జరిగిన మంచి విషయాలు,సంతోషం కలిగించిన మాటలు, సందర్భాలు- నాకు కూడా పంచడం మర్చిపోకండి- నేనూ సంతోషిస్తాను.
మనిషి ఆలోచనల విధానం, స్థాయి...
ఓ వ్యక్తి బస్సుకోసం బస్సుస్టాప్ లో నిలబడ్డాడు, బస్సులు వస్తున్నాయి, వెళ్తున్నాయి,కానీ తనకి కావాల్సిన బస్సు మాత్రం రాలేదు.విసుగు పుడుతోంది, వేచివేచి,”ఇప్పుడైనా బస్సు వస్తే బాగుండును,చాలాసేపటి నుంచి నుంచున్నాను” అనుకుంటున్నాడు.అంతలో తనకి కావాల్సిన బస్సు రానేవచ్చింది,మొహం కలువ పువ్వంత అయింది-కాకపొతే రద్దీ బాగాఉండటంవల్ల ఎక్కగలనా,ఎక్కినా నిలబడటానికి చోటు దొరుకుతుందా అనే బాధ, క్షణకాలం క్రితం ఉన్న ఆనందం మటుమాయం అయ్యాయి.
బస్సు ఎక్కా గలిగాడు,నిలబడటానికి చోటూ దొరికింది,మళ్ళీ సంతోషపడ్డాడు, “అమ్మయ్యా” అనుకుని. “కాస్త కూర్చోవడానికి చోటు దొరికితే బాగుండును” అనుకున్నాడు మనసులో!
కొంతదూరం ప్రయాణం చేసిన తర్వాత ఓ సీట్ దొరికింది,గబాల్న వెళ్లి కూర్చున్నాడు- ఎం.ఎల్. ఏ పదవికి పోటీ చేయడానికి టికెట్ దొరికినంత సంబరంగా-ఇంకెవరైనా పోటీకి వస్తారేమోనని.కూర్చున్నాడు గానీ,”సీట్ ఇరుకుగా ఉంది,గాలి రావడం లేదు” అనుకున్నాడు .ఇలా అనుకునేంతలో కిటికీ దగ్గర కూర్చున్న వ్యక్తి లేచాడు,అతను దిగేచోటు వస్తోందనుకుంటా.వెంటనే కిటికీ వైపుకు తన శరీరాన్ని లేవకుండానే లాఘవంగా జరిపేశాడు విజయగర్వంతో.
చక్కటి గాలి, రోడ్డుమీద వెళ్లే మనుషులు,వాహనాలు,షాపులు,మాల్స్,చాలా అందంగా అనిపించాయి-ఓ రధం ఎక్కిన అనుభూతి, అప్పటిదాకా బస్సు స్టాప్ లో వేచిఉన్న కష్టం అంతా మర్చిపోయాడు.
కాసేపటికి దృష్టి వాహనాలమీద పడింది,వాహనాల మీద వాళ్లంతా, రయ్యిరయ్యిమని తన బస్సుకన్నా వేగంగా వెళుతున్నారు. “మనిషిలో మనిషి” గొణుగుడు మొదలయింది- “తాను ఎన్నాళ్ళు ఇలా బస్సుల కోసం స్టాప్ లో వేళ్ళాడుతూ,బస్సులోపలా వేళ్ళాడుతూ ఈ విధంగా ప్రయాణం చేయాలి” అనుకున్నాడు,ఆ ఆలోచన రాగానే,తనమీద తనకే జాలీ,బాధ, కోపం కూడా కలిగాయి-తన స్థితికి.
ఈ ఆలోచనల్లోనుంచి బయట పడ్డాడు, తను దిగవలసిన స్టాప్ వచ్చేస్తోంది అని తన మెదడు చెప్పడంతో.ఉసూరుమంటూ బస్సు దిగాడు,దిగటం అయితే
దిగాడుగానీ, ఆ ఆలోచనలోంచి మాత్రం బయటపడలేకపోయాడు.
ధ్యాస అంతా ఎప్పుడెప్పుడు స్కూటరో, మోటార్ సైకిలో కొంటానా అనే- ఎలాగైతేనేం కొన్నాళ్ళకి అతను ఓ స్కూటర్ కొనుక్కోగలిగాడు,ఆ అనుభవాన్ని, ఆనందాన్ని తనివితీరా అనుభవించడం మొదలుపెట్టాడు.స్కూటర్ డ్రైవ్ చేసుకుంటూ వెళుతూ,రోడ్ మీద వెళ్లే బస్సుల వైపు చూస్తూ ఆ కిటికీ దగ్గర కూర్చున్న ప్రయాణీకుల్ని చూస్తూ, ఆ బస్సుని వేగంగా దాటుకుంటూ చాలా గర్వంతో కూడిన అనుభూతికి లోనయ్యేవాడు- కొన్నాళ్లవరకూ!
లోపల మనిషి ఊరుకోడుగా-పురుగు తొలిచినట్టు తొలుస్తుందిగా మెదడు-ఓరోజు దృష్టి తన పక్కనుంచి వెళ్లే కార్ల మీద పడ్డది- సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు తాను చూసేవాడు, కార్లో కూర్చున్నవాళ్ళు కబుర్లు చెప్పుకోవడం, కారులో వాళ్ళు రేడియో వినడం,పాటలు వినడం,అలసటలేకుండా కార్ సీట్ లో కూర్చొని నవ్వుతూ కబుర్లు చెప్పుకోవడం- ఒక్కరే వెళ్లేవాళ్ళు సిగ్నల్ దగ్గర న్యూస్ పేపర్ చదవడం కూడా.
అప్పటిదాకా స్కూటర్ డ్రైవ్ చేస్తూ పొందిన ఆనందం మొత్తం గాలితీసిన బుడగలా అయిపొయింది; ఇతరులంతా తనని ఏదో తప్పుచేసేవాడిని చూస్తున్నట్టుగా అనుభూతి-“ఛా, తనదీఒక బతుకేనా”,ఆ కార్ ముందు తన స్కూటర్ ఓ చిన్న సైకిల్ లా కనిపించింది-నిజంగా తప్పుచేసినవాడిలాగా న్యూనతకి లోనయ్యాడు-క్షణకాలం!
ఇంతలో వర్షం మొదలయ్యింది,కారులో వాళ్ళు తడవకుండా అదేమీ పట్టించుకోకుండా డ్రైవ్ చేస్తున్నారు.తనేమో ఎక్కడైనా షెల్టర్ దొరుకుతుందేమో అనే ధ్యాసలో ఓ ఓవర్ బ్రిడ్జి కిందకెళ్ళి స్కూటర్ ఆపి నుంచున్నాడు,అప్పటికే సగం తడిసిపోయి;స్కూటర్ని వదిలేద్దామనేంత కోపం వచ్చింది,అంతలోనే తమాయించుకున్నాడు తన స్థితికి.ఇక అది మొదలు స్కూటర్ ప్రయాణం ఆనందించడం కాస్తా పోయింది,ధ్యాస అంతా కారు మీదే.
ఏదైతేనేం కొన్నాళ్ళకి ఇన్స్టాల్మెంట్ లో ఓ కార్ కొన్నాడు-ఇంక మన వాడి ఆనందానికి అంతే లేదు “ఎలాన్ మస్క్” కంపెనీ వాళ్ళ ఎలక్ట్రిక్ కార్ కొన్నంత సంబరపడిపోయాడు, రోడ్డుకి రారాజులాగా అనుభూతి చెందుతూ డ్రైవ్ చేసేవాడు-ఠీవిగా-అడవిలో మృగరాజులాగా.రోడ్డుమీద వెళ్లే స్కూటర్లు, మోటార్ సైకిళ్ళు, మనుషులూ వేగంగా మాయం అవుతూ చీమల్లా కనపడటం మొదలుపెడుతున్నాయి.అదే ఓ ఎత్తైన బ్రిడ్జి మీదనుంచి డ్రైవ్ చేస్తూ కిందకి చూస్తుంటే ఆ అనుభూతే వేరు.
అలా కార్ లో వెళ్తున్నప్పుడు తాను పూర్వం నిలబడే బస్సు స్టాప్ కనపడింది, స్టాప్ లో జనం.క్షణకాలం తాను అలా నిలబడ్డ రోజులు,తన జీవితం గుర్తుకొచ్చి, లిప్తకాలం గర్వ పడ్డాడు తాను ఈ స్థితికి చేరుకున్నందుకు.
కాలక్రమేణా ఆ వ్యక్తికి పెళ్లి అయింది,ఇప్పుడు ఓ ఇల్లు, భార్య, మంచి ఉద్యోగం-ఇంతకంటే ఎవరికైనా కావాల్సింది ఏముంటుంది జీవితంలో. కానీ మనిషి ఆలోచనలు అక్కడితో ఆగవు కదా- ఆశాజీవి కాదు, బహు ఆశల జీవి కదా!
కొత్తకాపురం,జీవితం “మూడు సినిమాలు,ఆరుమాల్స్” లా హుషారుగా గడిచిపోతోంది. లోపలున్నవాడి సణుగుడు మొదలయ్యింది మళ్ళీ- బయట మనిషిని ప్రశాంతంగా బతకనీయడుగా; అప్పటిదాకా వాడే కారు ఇరుకుగా కనపడటం మొదలయ్యింది, తన కార్ పక్కనుంచి పెద్ద కార్లు, ఖరీదైన కార్లు వెళ్లిపోతుంటే - ఏదైనా సరే ఓ పెద్ద కార్ కొనాలనే నిర్ణయానికి వచ్చేసాడు- మనిషిలో ఉన్న మరో మనిషి ఊరకనే ఉండడు కదా!
ఇక ఇంతటితో ఆపేస్తాం-ఆవ్యక్తి వెనకాలే అతని జీవితాంతం వరకూ నేను వెళ్ళలేను- అవసరం కూడా లేదు,దాదాపుగా ఇదే ప్రతీ మనిషి మనస్తత్వం ప్రవర్తనానూ!
ఏదైనా వస్తువు వాడుకకు కొందాం అని అనుకోవడంతో మనిషి జీవిత ప్రయాణం మొదలు అవుతుంది, అన్ని వస్తువులు కొనుక్కుంటాం క్రమేపీ-సంపాదన పెరగటంతో.దాని తర్వాత మనం కొనే వస్తువులు,సౌకర్యంగా ఉండటంతో బాటు, మన స్థాయి సమాజానికి చెప్పడానికి ఉపయోగపడేవే -మన ఆత్మ సంతృప్తిని, అహాన్ని చాల్లార్చేదే.
గడియారం కొనడం- సమయం చూడటానికి,స్కూటర్, మోటార్ సైకిల్, కొనడం మన రోజువారి వినియోగానికి,కార్ కొనడం-సుఖంగా, క్షేమంగా, వేగంగా ఎక్కువమంది ప్రయాణించడానికి అలాగే,టి.వి. అయినా, వాషింగ్ మెషిన్ అయినా,ఫ్రిజ్ అయినా, ఎలాంటి వినియోగపడే వస్తువు అయినా ఇవి ప్రాధమికంగా ఎవరైనా కొనాలనుకునేవి కొనే వస్తువులు కూడా!ఇక్కడ చెప్పదగినది, మన ప్రాధమిక ప్రయోజనం- ఈ సమయంలో ధర - బ్రాండ్, మరియూ కంపెనీపేరు ముఖ్యం కాకపోవచ్చు- ఎందుకంటే తాహతు మొదటి మెట్టు ఇక్కడ.
మన స్థాయి పెరిగిన తర్వాత, బ్రాండ్, ఎక్కువ ఖరీదువి కొనడం అనేవి ప్రాధాన్యత సంతరించుకుంటాయి- మన స్థాయిని ఆ విధంగా ప్రదర్శించడానికి ఉపయోగపడతాయి-ఆత్మతృప్తి మనిషికి.ఇందులో ఎంతమాత్రం తప్పుగానీ ఆక్షేపణగానీ లేదు- ఆశే లేకపోతే మనిషి ఎదుగుదల ఆగిపోదూ!
అలాగే మనం వెళ్లే హోటళ్లు కూడా-దర్శినీల నుంచి,నిలబడి తినే ఫలహారశాలల నుంచి- పెద్ద హోటళ్ళకి వెళ్లే స్థాయికి చేరుకుంటాం.
గమ్మత్తు ఏమిటంటే ఈ ఎదిగే పరిణామ క్రమంలో, మనకు ఎత్తులో ఉన్న ప్రతిదాన్ని విమర్శిస్తుంటాం-మనకు అందుబాటులో లేకపోవడమే ప్రధానకారణం- అంతర్లీనంగా, వాస్తవంగా.దీన్నే వంచన అంటారు-మనల్ని మనం వంచన చేసుకోవడం అనుకోండి-ఇతరులని కాదు.అప్పటికీ మీకు వంచన అనే పదం నచ్చకపోతే ఇంగ్లీష్ లో “హిపోక్రసి” అనుకోండి-అయినా మనం ఒప్పుకోము మన విషయంలో-అది అలా ఉంచుదాం వాగ్వివాదాలకు పోకుండా!ఒక్కోసారి ఇంగ్లీషువాడి పదాలు బాగుంటాయి- తెలుగులో బూతుమాట అనలేం సభ్యత అడ్డు వస్తుంది- ఓవేళ నోట్లోంచి దొర్లినా అది తప్పే-అదే ఇంగ్లీష్ లో తిడితే నాగరికత, మనకు ఓ కంఫర్ట్ కూడా.
చిన్న ఉదాహరణ
దారి పక్కన ఉండే ఫలహారశాలలో పది రూపాయలు ఇచ్చి కాఫీతాగే రోజుల్లో- హోటల్ కి వెళ్లి కూర్చొని ఇరవై రూపాయలిచ్చి తాగేవాడు మనకు దుబారా మనిషిలా కనపడతాడు; “పది రూపాయల్లో కాఫీ దొరుకుతుంటే- ఇరవై రూపాయలిచ్చి తాగాలా గొప్పకాకపోతే” అనుకుంటాం.
ఆ ఇరవై రూపాయలిచ్చి తాగేవాడు కూడా అనుకుంటాడు- యాభై రూపాయలు ఇచ్చి కాఫీ తాగే వాడి గురించి ఇలాగే.అలాగే 100 రూపాయలవాడు స్టార్ హోటల్ లో 250 రూపాయలిచ్చి తాగేవాడి గురించి అనుకుంటాడు “వాళ్లకి వళ్ళు బలిసిందని”- లేకపోతె 250 రూపాయలు పెట్టి కాఫీ తాగాలా అని.
ఈ ఆలోచనలకూ అంతూపొంతూ ఉండదు!!!
మన స్థాయి పెరిగినకొద్దీ పైస్థాయివాడి వైపు చూసే విమర్శచేస్తాం, కింది స్థాయివాణ్ని అనుకుంటాం- “ఓ పది రూపాయలు ఎక్కువ ఇచ్చి, శుచి-శుభ్రత ఉన్న హోటల్ లో వాళ్ళూ తాగొచ్చుగా” అని- మనం ఆ స్థాయి నుంచే వచ్చామని స్పృహే ఉండదు-మనం ఎదిగిపోయాం కదా- గతాన్ని “గజనీ” లాగా చులాగ్గా మర్చిపోతాం.
ఏతావాతా చెప్పేదేమిటంటే-ప్రతి ఒక్కరం ఎదగాలి జీవితంలో-ఈ ఎదిగే ప్రక్రియలో పైన పేర్కొన్న విధంగా అనుకోకుండా- మనకంటే పైన ఉన్నవాణ్ణి కోపంగానో, ఈర్ష్యతోనో చూడకుండా-మనకంటే ఆర్ధికంగా కొద్దిగా తక్కువగా ఉన్నవాళ్ళని చులకన భావంతోనో, తేలికభావంతోనో చూడకుండా ఉండగలిగితే మన ఆనందం ద్విగుణీకృతం అవుతుంది-నిస్సందేహంగా.
మనకు తెలిసినవాళ్ళు ఎదుగుదల కూడా మనకు ఆహ్లాదాన్నిఇస్తుంది-అది అందరూ గమనించివుంటారు!
మూడో వ్యక్తి
"మూడో వ్యక్తి" అనే పదం, అది ఎవరో పాతతరానికి తప్ప కొత్త తరానికి తెలియడానికి అవకాశాలు చాలా తక్కువ ప్రస్తుతం సమాజంలో ఉన్న పరిస్థితుల్ని బట్టి.అదీ కాకుండా ఈ తరానికి తమకుతాము తప్ప రెండోవ్యక్తే అక్కర్లేదు,ఇక మూడో వ్యక్తి అంటే అర్ధం కానీ పదమే-అర్ధం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదేమో-కొంతమందికి!
భార్యా- భర్తల దాంపత్య జీవితంలో, కలిసి కాపురం అన్నాక ఇరువురిలో అభిప్రాయం బేధాలు,కొన్ని విషయాలలో భిన్నమైన అభిప్రాయలు ఉండటం చాలాచాలా సహజం.ఇద్దరూ వేర్వేరు కుటుంబ నేపధ్యాలనుంచి వచ్చిఉంటారు కాబట్టి తేడాలు ఎక్కువ ఉన్నా పెద్దగా ఆశ్చర్యపడవలసిన పనేలేదు. ఒక్కొక్కసారి మాటామాటా తేడా వచ్చి మాటలయుద్ధం కూడా జరగవచ్చు (ఇది వారి యొక్క ప్రవర్తననిబట్టి ఉంటుంది-వారిరువురి మధ్య)
ఎన్ని అభిప్రాయం బేధాలున్నా మూడోమనిషికి అవకాశం ఇవ్వకూడదు-వాళ్ళ సమస్యల్ని వాళ్ళే సామరస్యంగా పరిష్కరించుకోవాలి-వ్యవధి తీసుకున్నా కూడా; ఒక వేళ వాళ్ళ సమస్య జీవితసమస్యగా మారి చిక్కుముడి అవుతుంటే తల్లి తండ్రులు ఖచ్చితంగా సమయానికి కల్పించుకుని సమస్య పరిష్కారం దిశగా అడుగులెయ్యాలి!
దంపతుల్లో ఎవరైనా వాళ్ళ సమస్యలు బయటవాళ్ళకి చెప్పుకుంటే -ఇరువురి మధ్య సఖ్యతలేదని తెలిసినవాళ్ళు-ఆదంపతుల్లో వేరొకరిగురించి ఇంకో బాగస్వామితో చులకనగా,తేలికగా మాట్లాడటానికి అవకాశం ఉండొచ్చు - బయటవాళ్లకు కూడా ఇంటిగుట్టు తెలిసే అవకాశం ఉండొచ్చు,దీనివల్ల ఇబ్బందులకు కూడా గురికావచ్చు-అలా అని అందరూ ఇలా చేస్తారని కాదు- కీడెంచి మేలెంచమన్నారు కదా!
దంపతుల్లో ఎన్ని అభిప్రాయబేధాలున్నా పూర్వం పెద్దవాళ్ళు అందుకే ఒక పట్టాన కల్పించుకుని వేళ్ళు పెట్టేవారుకాదు-తలదూర్చేవారు కాదు.ఆ దంపతులే తమంతట తామే వారి ఇరువురి మధ్య ఉన్న బేధాల్ని,అంతరాయాల్ని తగ్గించుకోవాలి కనుకే- అలాగే ఆ దంపతులూ చేసేవారు, కాపురాలు చక్క దిద్దుకునేవారు!
ఆర్ధిక స్వాతంత్య్రం,స్వేచ్ఛ అనే మాటలకు విపరీతార్ధాలు తీసుకుని సొంత నిర్వచనాలు ఇచ్చుకుంటున్నారు ఇప్పటి తరంలోని చాలా మంది దంపతులు. అందరూ చదువుకుంటున్నారు, ఉద్యోగాలుచేసి సంపాదించుకుంటున్నారు కూడా - చదువు విజ్ఞానాన్ని,వివేకాన్ని పెంచాలి గానీ అహాన్ని కాదు; అహాన్ని ఆత్మాభిమానంగా తమకు తామే నిర్వచనం ఇచ్చుకుని అశాంతికి గురి అవుతున్నారు.
ఇప్పుడు మూడో వ్యక్తి ఎవరంటే (సోషల్ మీడియా) సామాజిక మాధ్యమే- వారి బలహీనతతో ఈ మాధ్యమాలకు ఎక్కేస్తున్నారు,వ్యక్తిగత విషయాలు-వాళ్ళ రాతలతో-ఇంటిగుట్టు రట్టుచేసుకోవడం అంటే ఇదే-సినిమా వాల్ పోస్టర్లు వేసినట్టే.
ఈ మూడోవ్యక్తి-అదే ఈ సామాజిక మాధ్యమాలు వీళ్ళ ఇబ్బందుల్ని కష్టాల్ని ఏమైనా "ఆర్చేవాళ్ళా,తీర్చేవాళ్ళా"! ఈ సామాజిక మాధ్యమం సినిమా వాల్ పోస్టర్ లాంటిది అని గుర్తించాలి- సినిమా పోస్టర్ ని అందరు ఆసక్తిగా చూస్తారు- అది వినోదం కల్పించేది కనుక- కానీ జీవితాలు అలా కాదే!
కల్పితప్రపంచంలో బతకడం మానేసి వాస్తవప్రపంచంలో తిరిగి బతకడం అలవాటుచేసుకొని,నలుగురితో కలిసిమెలిసి తిరిగితే కాస్త మానవసంబంధాలు మెరుగుపడి, ఇల్లు-ఇంట్లోవాళ్ళకు కూడా ప్రశాంతంగా ఉంటుంది-మూడో వ్యక్తి అవసరం కూడా రాదు.
మీకున్న సన్నిహితులతో కూడా సఖ్యతగా ఉండటం అలవాటు చేసుకోండి-ఓ చెవి మీ కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది వాళ్ళ దగ్గర-మీ కోసం!
ఋతువులు మన అధీనమా!
సాధారణంగా ప్రకృతిలో వర్గీకరించిన ఋతువులు ఆరు!
అవి...
వసంతఋతువు (Spring) గ్రీష్మఋతువు (Summer) వర్షఋతువు (Rainy season) శరదృతువు (Autumn)హేమంతఋతువు (Winter)శిశిరఋతువు (Winter & Fall)
వాతావారణ మార్పులవల్ల,భౌగోళిక పరిస్థితులవల్లా అన్ని ప్రదేశాలలో ఇన్ని ఋతువులు అందరం చూడలేము,ఆ అందాలని అనుభవించాలేము- చాలా తక్కువ దేశాల్లోనే అన్ని ఋతువుల్ని ప్రజలు ఆస్వాదించగలుగుతారు!
ఆదేశాల పేర్లు “సుందర్ పిచాయ్” ని అడిగితే చెప్పేవాడే కానీ నే అడగలా!
ఆదిమానవుడి కాలం నుంచి మానవుడు ప్రకృతితో పోరాటం సాగిస్తూనేఉన్నాడు తన బతుకుతెరువుకి.ఎప్పుడూ ప్రకృతికి అనుగుణంగా తన పరిసరాల్ని,
వాతావరణాన్ని తనకు సానుకూలంగా చేసుకోవడంలో సఫలీకృతుడు అవుతూనే ఉన్నాడు-ప్రకృతిమీద విజయం సాధించాలనే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు-తృష్ణ తీరక!
కాలానుగుణంగా, సహజంగా ప్రకృతిలో వచ్చే మార్పులకు, మానవ తప్పిదాలవల్ల వచ్చే పరిణామాలకు ఎప్పటికప్పుడు సవరణ చేసుకుంటూ ముందుకు వెళుతూనే ఉన్నాడు, విజయాల్ని సాధిస్తూనే ఉన్నాడు - బాలభారతం లోఅన్నట్టు- “మానవుడే మహనీయుడులా” ఎన్నో జయాలను తాను పొదివి చేసుకున్నాడు,చేసుకుంటూనే ఉన్నాడు- అవరోధాలని అధిగమిస్తూ.
ఈ ఆలోచనలు- “లక్ష్మణరేఖ”- పరిధి దాటనంత కాలం మానవుడు జయాల్ని చవిచూస్తూనే ఉంటాడు.ఎప్పుడైతే ప్రకృతిమీద ఆధిపత్యానికి ప్రయత్నం చేస్తాడో- ప్రకృతిని విచ్ఛిన్నం చేస్తాడు- అప్పుడు ప్రకృతి యొక్క “స్పందన- ప్రతిస్పందన” తట్టుకునే శక్తి మానవునికి లేదు-గత ఏడాదిగా చూస్తూనే ఉన్నాం కూడా- ఈ శతాబ్దంలో కనీవినని వైపరీత్యాలని!
అన్ని ఋతువులకు అనుగుణంగా పరిస్థితులని మలచుకోవడం,అధిగమించడానికి సాధనాలను సృష్టించడం వరకే మనిషి పని.ఆయా ఋతువులపై అజమాయిషీ చేస్తూ, పెత్తనం చెలాయించడానికి మాత్రం ప్రయత్నంచేస్తే పరిణామాలు విపరీతంగా ఉంటాయి.ప్రకృతి ఎప్పటికప్పుడు తన ప్రతిస్పందనని తెలియచేస్తూనే ఉంది సమస్త మానవాళికి. ఇలా చేసినప్పుడు గతంలో కూడా ఎన్నోవిపరీతాలు, మహమ్మారులను మానవాళి ఎదుర్కొంది!
అలాగని కొత్తకొత్త ఆవిష్కరణలు చేయడంలో మానవ ప్రయత్నాలు మానమని అర్ధం కాదు- ప్రకృతిని, సృష్టిలోని అన్ని జీవులని సమన్వయ పరచుకున్నప్పుడే ఈపరిశోధనలకు, ఆవిష్కరణలకు సార్ధకత.అంతేగానీ, ఈ సృష్టిలో మానవులుతప్ప వేరే ఇతర జీవరాసులు లేకుండా చేయడం-మన స్వార్ధంకోసం చేస్తే - ప్రకృతి సమతూల్యం దెబ్బతిని లోకవినాశనానికి దారితీస్తుంది.
ఎందుకంటే భగవంతుడి ఈ లోకాన్ని సృష్టించింది కేవలం మానవుల మనుగడకే కాదు- సకల చరాచర జీవులకు కూడా.ఒక్క క్షణం మానవులొక్కరే ఉండే ప్రపంచాన్ని ఊహించండి-మానవులకే మనుగడే ఉండదు- క్షణకాలంలో మనం కూడా ఈ లోకంనుంచి మటుమాయం అవుతాం!
మనం తెలుసుకోవలసినది,జ్ఞప్తికి వుంచుకోవాల్సింది ఇంకో విషయం ఏమిటంటే- ఈఋతువులే కాదు- సమస్తలోకాలకి, సమస్త ప్రాణికోటికి యజమాని ఒకడున్నాడని, వాని ఉనికిని గ్రహించాలని- ఆ స్పృహ ఉండి మనం మెలిగినప్పుడే ఆనందంగా జీవించగలుగుతాం!
“భూత భవ్య భవన్నాదః “
“గడిచిపోయినది, గడుస్తున్నది, గడవబోయేది”- ఈ మూడింటికి అధిపతి - శ్రీమహా విష్ణువు!
స్వస్తి
జై శ్రీమన్నారాయణ
ప్రేమ
ప్రేమ అనే పదానికి విస్తృతమైన అర్ధం ఉంది- ప్రేమ అనేది సార్వజనీకమైనది, సర్వ మానవాళికి వర్తించేది,అందమైన అర్ధం ఉన్న పదం,సానుకూలమైన పదం. మానవ సంబంధాలలో ఎవరి మధ్యనైనా ఉపయోగించతగ్గ పదం.కుటుంబసభ్యుల మధ్య, తోబుట్టువుల మధ్య, స్నేహితుల మధ్య, హితుల మధ్య, సన్నిహితుల మధ్య, శ్రేయోభిలాషుల మధ్య- వీళ్లూ వాళ్ళూ అని కాకుండా ఏ ఇద్దరి వ్యక్తుల మధ్యా వాడే పదం.
ఆంగ్లబాష లో పదం “లవ్”- కానీ లవ్ సమానార్థకం కాదు ప్రేమ అనే తెలుగు పదానికి.ఎప్పుడైతే లవ్ అనే పదం వాడటం మొదలు పెట్టామో- ప్రేమ అనే పదాన్ని వదిలేసి- దౌర్భాగ్యమే జరిగింది నా దృష్టిలో.
లవ్ అనే పదం యువతరం వాడటం వల్ల ఇదేదో ఇరువురి ప్రేమికుల మధ్య వాడే పదంలా-మిగిలిన మానవసంబంధాలలో వాడితే తప్పుఅని అర్ధంవచ్చే పరిస్థితి వచ్చింది ఈరోజుల్లో!
ప్రేమ అనేది భగవంతుడు ప్రతీ జీవికి-మనుషులతో బాటు-సృష్టిలోని ప్రతి జీవికి పుట్టుకతోనే ఇచ్చిన గొప్ప వరం.మనం నిత్యం చూస్తూనే ఉన్నాం పశుపక్ష్యాదులలో కూడా అవి వ్యక్తం చేసే ప్రేమని-మనుషులతో కూడా.ఎప్పుడైతే దీన్ని ఒక సంకుచితమైన భావానికి పరిమితి అయిందో ప్రేమ అనే పదం వేరే ఇతర మానవసంబంధాల్లో వాడటానికి, పదప్రయోగానికి-అందరికీ బెరుకు ఏర్పడింది.
మన పురాణాలలోగానీ, శాస్త్రాల్లోగానీ, ఇతిహాసాల్లోగానీ, భారత, భాగవత, రామాయణాలలో గానీ గమనిస్తే ప్రేమ అనే పదం, ఆ భావం ఎంత విస్తృతంగా వాడబడిందో తెలుస్తుంది;అలాగే ప్రేమ అన్నిరకాల మానవసంబంధాల్లో ఎలా వ్యక్తపరిచేవాళ్లో చదివాం, విన్నాం కూడా.మనం వీటిని ప్రామాణికంగా తీసుకోవాలి గానీ- ఆంగ్లపదాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజుల్లో వాడే అర్ధంతో కాదు.వాస్తవానికి లవ్ అనే ఆంగ్ల పదానికి కూడా కొంతవరకు విస్తృత అర్ధమే ఉంది- మన దురదృష్టం ఏమిటంటే మనదేశంలో దాని వాడుక ప్రేమికుల మధ్య, భార్యా భర్తల మధ్య ఎక్కువగా అన్వయిస్తున్నారు;ఈ రెంటికే పరిమితం అయిపొయింది వాడుక భాషలో.
ప్రేమించడానికి మనసు ఉండాలి-అందర్నీ ప్రేమించవచ్చు- కుచ్ఛితమైన అర్ధంతో కాదు!
ఇకనుంచి అయినా మీరు ఇతరులని ప్రేమిస్తూ ఉంటే నిర్భయంగా ఈ పదం విస్తృత భావనలో వాడండి!
ప్రేమ అనేది ఎంత అందమైన అనుభూతి, మనల్ని ఎవరు ప్రేమించినా, మనం ఇతరులను ప్రేమించినా-అది అనుభవైక వేద్యం మాత్రమే,వర్ణించనలవి కాదు!
ఆకు-వక్కా-సున్నం
భార్యా-భర్తలు “ఆకు, వక్క, సున్నంలా” కలసిమెలసి ఉండాలి;పంటికింద రాయిలాగా వక్క-దవడ వాచేలా సున్నం -మరీ తమలపాకులలాగా అమిత ఘాటుగా ఉండకూడదు.
అందరంఅలా అనుకుంటాం గానీ నిజానికి అలా కుదురుతుందా.వక్కా ఎక్కువవుతుంది- ఒక్కోసారి సున్నం ఎక్కువై దవడలు వాస్తాయి కూడా; తమలపాకులు బాగున్నాయి కదా అని ఓ రెండు ఎక్కువ లాగిస్తే ఏమవుతుంది- ఘాటుకి గొంతు పొలమారదూ.
ఇదీ అంతే, అలా చెప్పినాయనకి మాత్రం పంటికింద రాళ్లు పడకుండా ఉన్నాయా,పళ్ళు రాలకుండా ఉన్నాయా,దవడలూ వాచీ ఉంటాయి,తమలపాకు ఘాటుకు గూబ గుయ్యిమనీ ఉంటుంది.బయటకు చెప్పుకు ఛస్తాడా, మరీను.పెద్దాయన కదా ఆయన మాటలు జనం ఉంటారని చెప్పి ఉంటాడు.
ఈ రోజుల్లో గరికపాటిలాంటి వారు కూడా ఈవిషయంలో చమక్కులు వేస్తుంటారు-భార్యా భర్తల మీద,కాపురాలు మీద. అలా అని నన్నో పురుష పక్షపాతిగా భావించక్కర్లా -అందుకే పుల్లింగాలకి-స్త్రీలింగాలకి తేడా విచక్షణా నేను చెప్పబోవడం లేదు, చూపించబోవడం లేదు. ఈ విషయంలో అందరూ సమానమే, బాధ్యులే – నిస్సందేహంగా! ఓ కుటుంబంలో స్త్రీ భాద్యత కావచ్చు, మరో కుటుంబంలో పురుషుడు బాధ్యత కావచ్చు!
ఏదో పూర్వపు పెద్దాయన చెప్పాడు కదా మా ఇంట్లో మేము అలా లేము అని బెంగతో మంచం పట్టి జబ్బున పడబోకండి.మీరు కూడా పెద్దాయనలాగే “జీవితసారం” అంతా కాచి వడబోసినట్టు ఈ సుభాషితం అందరికీ చెప్తూ, ఓ అనుభవజ్ఞుడిలాగా బతుకు బండి లాగించేయండి. ఈ సరికే వేదాంతమ్ వంటపట్టేసి ఉంటుంది కూడా; మీ ఒంట్లో పరిస్థితులు, ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నా ఎవడికి తెలుస్తాయి కనుక;కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అంటే ఇదే మరి.
ఆఖరికి “ఆకు వక్కా సున్నం” అమ్మేవాడి పరిస్థితి కూడా ఇంతే- ఇవి అమ్ముతున్నంత మాత్రాన వాడి గూబ వాయదా,పన్నుకదలదా,గొంతు మండదా ఘాటుతో-డాక్టర్లు అయినంత మాత్రాన వాళ్లకి జబ్బులు చేయవా ఏమిటీ, అలాగే ఇదీనూ.
ఈ మాత్రం లౌక్యం, తెలివి లేకుంటే జనాలు మీచెవులకి తాటాకులు కట్టేయరూ; అవేవో మీరే జనానికి కట్టేస్తే పోలా,మీదరిదాపులకీ ,మీ జోలికీ రారు.ఇది కాదు తెలివిగా బతికేయడం అంటే-బయటపడకుండా!
సంసారాలు అన్నప్పుడు ఆ మాత్రం "సరిగమలు" లేకుండా ఉంటాయా- కాకపోతే శృతి మించి లయతప్పకూడదు- అలా లేకుంటే ఏదో ఉడిపి హోటల్లో భోంచేసినట్టు ఉంటుంది- చప్పగా!
ఒక్క పాన్ షాప్ లో కిళ్లీలు, పెళ్లిళ్లలో కిళ్ళీలు మాత్రమే సమపాళ్లలో ఉంటాయి- అక్కడ మాత్రం ఈ తమలపాకుల ప్రియులు (తాంబూల సేవనమే యజ్ఞంలాగా భావించేవాళ్లు) మొహమాటం లేకుండా ఎన్నయినా లాగించేయచ్చు- నిర్భయంగా!
మనకు అక్కర్లేనివి!!!
సహజంగా మన దగ్గర మిగిలినవి,మిగిలి పోయినవి,పనికిరానివి,వాడనివి,మనకు అక్కర్లేనివి,ఎక్కువైనవి ఇతరులకు ఇస్తాం- ఇది మానవ నైజం.ఇలా ఇచ్చేవాళ్లలో కొంతమంది ఇదేదో గొప్ప పని అనుకుంటారు- నిస్సందేహంగా మంచి పనేకానీ గొప్ప విషయం కాదు.ఏంచేతంటే ఇవన్నీ మనకు అవసరం లేదు కాబట్టే అవతల వాళ్లకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం-మంచిగా ఉన్నవి బయట వాళ్లకి ఇవ్వాలంటే ప్రాణం పోదూ మరి!!
మనం వాడే వస్తువులుగానీ,తినే పదార్థాలు- వంటపదార్థాలతో సహా (“మిగిలిపోయాయని” కాకుండా)అవతలవాళ్ళకి ఇచ్చేవాళ్లూ ఉన్నారు.కాకపొతే ఇలాంటివాళ్ళు చాలా తక్కువశాతం ఉంటారు; ఇలాచేయడానికి దండిగా ఉండవలసింది డబ్బు కాదు-పెద్ద మనసు,దొడ్డమనసు. కొంతమంది ఇళ్లల్లో వాళ్ళు తాగే టీ లాంటిది ఇవ్వకుండా- వేరే రకంగా (అది ఎలా ఉంటుందో మీ వర్ణనకే వదిలేస్తున్నా) ఇచ్చే ఘనులు కూడా ఉన్నారు- ఆస్తి ఏమైనా తరిగిపోతుందా మనం తాగే టీతో పాటే పనిమనిషికి ఇస్తే- ఇక్కడా కక్కుర్తే!
మరి కొందరు ఉంటారు జంధ్యాల అహ నా పెళ్ళంటా సినిమాలోని కోటా శ్రీనివాసరావు పాత్రలాంటి వాళ్ళు (సినిమా చూస్తున్నప్పుడు అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళు ఉంటారా, జంధ్యాల కొద్దిగా ఓవర్ యాక్షన్ అతిగా చేయిస్తాడు తన సినిమాలోని పాత్రలతో అని- తర్వాత అనిపిస్తుంది జీవితంలో ఇలాంటివాళ్ళని చూట్టం తారసపడినప్పుడు – “తస్సాదియ్యా జంధ్యాల కరెక్టుగానే చూపించాడు” అని- జంధ్యాల దర్శకుడే కాదు దార్శనికుడు కూడా)
వీళ్ళకి ఇవి ఇవ్వడానికి కూడా మనసు రాదు.ఓసారి ఒకఇంట్లో చూసి నిర్ఘాంతపోయా-డ్రై ఫ్రూట్స్,జీడిపప్పు,నట్స్ లాంటివి గోద్రెజ్ బీరువాలో పెట్టడం.ఇక ఊహించుకోండి వాళ్ళు ఏలాంటివాళ్ళో;బయట మాత్రం “ఓ చాగంటి-ఓగరికపాటి” స్థాయిలోనే వాళ్ళ మాటలు ఉంటాయి-సూక్తి ముక్తావళులతో,నీతి వాక్యాలతో- ఎవరిని మోసం చేస్తున్నట్లు- స్వయంగా వాళ్ళని వాళ్ళు కాదూ!
ఇక్కడ నాకొక విషయం చెప్పాలనిపిస్తుంది,ఎంతో ఉచితం సందర్భోచితంకూడా.
మా అమ్మ చిన్నప్పుడు మాకు చెబుతూండేది.తన చిన్నతనంలో వాళ్ళ పెద్దన్నయ్య చెప్పిన మాటలు “అమ్మాయీ,పనివాళ్ళకి మనం తినేవే పెట్టాలమ్మా పాడై పోయినవి,మిగిలిపోయినవి,మనకు ఎక్కువయ్యాయి అని కాదు”.
ఈయన మా పెద్ద మేనమామ-స్వాతంత్ర సమరయోధుడు కూడాను;నేను బెజవాడలో ఉన్నరోజుల్లో మా దగ్గరకి అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉండేవారు. స్వగ్రామం నిడదవోలు- మా అమ్మా నాన్న “పెళ్లి సందడిలో” చెరువు గట్టు, అట్లపాడు రేవు,పొలాలు, అరటి గెలలు అవీ అని చెప్పానే- ఆ మామయ్య అన్న మాట.విఠాల పురుషోత్తం గారు ఆయన పేరు- ఆరోజుల్లో నిడదవోలు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ,రాజమండ్రిలోనూ ఈయన పేరు తెలియనివాళ్ళు వుండేవాళ్ళు కాదు.ఆ సమయంలో బెజవాడలో బొగ్గు వ్యాపారం కూడా ఉండేది ఈ మామయ్యకి. సూర్యాపేట లో “లక్ష్మి ఎక్స్ రే క్లినిక్” అని ఉండేది-ముగ్గురు అన్నదమ్ముల ఆసుపత్రి దగ్గర-అక్కడ మామయ్యా వాళ్ళ ఇల్లు ఉండేది.ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న బయోలాజికల్ ఈవాన్స్ (దాట్ల వాళ్ళది) స్థాపించిన రాజుగారు -మామయ్యకి ఆప్తులు కూడా.
ఈ నా అనుభవాలు, జ్ఞాపకాలు కూడా రాయడానికి అవకాశం ఉండటం చేత నాకు జీవితంలో ముఖ్యులని స్మరణ చేసుకుంటున్నా ఈ సందర్భంగా.పాఠకులకు, చదువరులకు వీళ్ళు తెలియకపోవచ్చు.నాకున్న ప్రేమ అభిమానం, కృతజ్ఞత పూర్వకంగా వీళ్ళ ప్రస్తావన తెస్తున్నా సందర్భాన్నిబట్టి;చదువరులు సహృదయంతో నా మనసులో భావాల్నిఅర్ధం చేసుకుంటారని భావిస్తున్నా.
ఎవ్వరం కూడా మన జీవితంలో తారసపడ్డవాళ్ళలో,కొంతమందిని మర్చిపోలేం- వీళ్లందరివల్ల కూడా మన వ్యక్తిత్వం సంపూర్ణంగా రూపు దిద్దుకోవడం జరుగుతుంది- తల్లితండ్రుల పెంపకంతోపాటు.
మనకు భగవంతుడు ఇచ్చింది, ఇంకా ఇస్తూఉన్నది మన వంటికి,ఇంటికి, పంటికే కాదు.తగినవాళ్ళకి, అవసరమైన వాళ్లకి ఇవ్వడంకోసం మాత్రం కూడా(ఎప్పుడూ “చిన్నినా పొట్టకి శ్రీరామ రక్షా” అనుకుంటే ఎలా)అంతేగానీ మేడలూ మిద్దెలూ కట్టుకోవడానికో పెద్దపెద్ద కార్లు కొనుక్కొని మనం ఒక్కళ్ళమే అనుభవించటానికి కాదు.
ఇంకొంతమంది ఉంటారు తాము వాడని వస్తువులని అటక మీద దాస్తారుగానీ అవి ఉపయోగపడేవాళ్ళకి ఇవ్వాలంటే మాత్రం ఏమాత్రం మనసు రాదు.మనసు లేని మనుషులు ఉండరు, మరి వీళ్ళ మనసేమిటో ప్రత్యేకంగాఉంటుంది-ఏం చేసుకుంటారో కట్టికెళ్తారా పోయేటప్పుడు!!!ఆ మాత్రం కూడా ఇంగితం లేకుండా- పైగా వీళ్లంతా బాగా చదువుకున్నవాళ్ళు, అన్నీ ఉన్నవాళ్లే మరి “జీవం” నిర్జీవం అవగానే చివరకి మిగిలేది “కింద చాప- పైన ఒక గుడ్డ ముక్క” ఆచ్ఛాదనకి అంతేగా;ఎంత తొందరగా తత్వం బోధపడితే అంత సంతోషాన్నికోల్పోకుండా ఉంటారు మిగిలిన జీవితభాగంలో!!
సూక్షం ఏమిటంటే ఓ ఏడాదిపాటు ఓ వస్తువు మన అటకమీద ఉండి మనం తీయలేదూ అంటే దానితో మనకు ఉపయోగం లేదని అర్ధం.ఇది తెలుసుకోక “ఎప్పుడో ఉపయోగపడతాయి” అని అలా వాటిల్ని అటక మీద కప్పెయ్యడం ఏమి సబబు! అవేవో రోజూ ఉపయోయించుకునే వాళ్లకి ఇస్తే ఎంత ఆనందం-మన దగ్గర ఉన్నవి ఇవ్వటంలో ఉన్న ఆనందం తీసుకోవడంలో లేదు!
ఏదో నా పిచ్చి- -చాదస్తంగాని నేను చెప్పాలా ఇవన్నీనూ,అందరికి తెలిసినవేగా - ఈ వర్గంవాళ్ళకి కొద్దిగా తొందరగా జ్ఞానోదయం అవ్వాలని నా కోరిక!
పిల్లలు – ప్రేమలు, కాంక్షలు, వ్యామోహాలు!!!
పిల్లలమీద ప్రేమ,మమకారం తల్లిదండ్రులకు ఉండటం సహజం-ఆ ప్రేమే కాంక్షగా రూపాంతరం అయినప్పుడే అది ఇబ్బందులకు, కొన్నిసార్లు ప్రమాదాలకు దారితీస్తుంది-గారాబం అనేది, ఇందులో నేను చేర్చలా!
ఈస్వభావం ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలు చేసే ప్రతీచర్యకూ వంత పలుకుతారు, అడ్డు చెప్పరు-కాంక్ష, వ్యామోహం వల్లా; వీళ్ళు భవద్గీత చదువుతారు.అందులో శ్రీ కృష్ణుడు చెప్పిన “వ్యామోహాల” గురించీ చదువుతారు. అవి, వీరికి అన్వయించు కోరు-ఏంచేతంటే ఆ హితబోధ అర్జుననుకు కదా కృష్ణపరమాత్మ చేసింది-వీరికి అవి అంటవాయె మరి!
ఈ తల్లిదండ్రుల పెంపకంలో పిల్లలు ఎలా తయారవుతారో నేను క్లుప్తంగాగాని, విపులంగాగాని చెప్పవలసిన పనిలేదు-మన కళ్ళముందు రోజూ కదలాడే ఇలాంటి వాళ్ళు వేనకువేలు ఉన్నారు.ఈ విధంగా పెరుగుతున్నపిల్లల మనోభావాలు, ప్రవర్తనా విభిన్నంగా ఉంటుంది బయటవారికి-తల్లిదండ్రులకు ఆ తేడానే కనిపించదు సహజంగానే!
ఈ పెరుగుతున్న క్రమం నుండి, పెద్దవాళ్ళు అయేంతవరకూ, చిన్న ఇబ్బందులు తల్లిదండ్రులు పడ్డా, బయట పడరు-ఎవరితో చెప్పుకోరు-నామర్దా మరి! బయటవాళ్లకు కూడా ఆ పిల్లల ప్రవర్తనల వాసనలు,రుచులు చూడటం, అనుభవించటం జరుగుతుంది-సర్దుకుపోతారు- వాళ్లకున్న సభ్యత వల్ల.
అసలు సమస్యలు, మొదట్లో పట్టించుకోకపోవడం వల్ల చిన్న ఇబ్బందులు పెద్దవి అవుతాయి.కానీ ఆ పాటికే ఈ పిల్లలకు సొంత వ్యక్తిత్వాలు (తల్లితండ్రుల ఆకాంక్షకి భిన్నంగా- తల్లితండ్రులు లోలోపల కుమిలిపోతుంటారు-సొంత వాళ్లకు చెప్పుకుంటే నామోషీ కనుక) ఎదిరించడాలు, లక్ష్య పెట్టక పోవడాలు జరుగుతుంది.కొంతమంది పిల్లలు విపరీత పోకడలకు వెళ్ళటానికి అవకాశం లేకపోలేదు ఈ కాంక్షల, వ్యామోహాల పెంపకంలో!
ఈస్థితిలో తల్లితండ్రులు నిస్సహాయ స్థితికి వస్తారు-వాళ్ళ పిల్లలు కాబట్టి! ఈ విధంగా పెరిగిన పిల్లల ప్రవర్తన ఎలాఉంటుందో,అవి వారి జీవితాలను ఎంత ఇబ్బందిలోకి నెట్టేస్తాయో ఊహించలేరు.
భగవద్గీత చాలా మంది చదువుతారు,అర్ధం అవుతుంది- విషయాలని ఆకళింపు కూడా చేసుకుంటారు;ఆచరణలో ఎందుకు పెట్టరు?
.
.
.
ప్రతీ శ్లోకం ముందూ- తర్వాత,శ్రీ కృష్ణుడు-“పార్థా,” “పార్థా” అనే అంటుంటాడు.ఆమాత్రం అర్థం చేసుకోని మట్టిబుర్రలం కాదుగా మరి-అవన్నీ అర్జుననుకు చెప్పినవి-మనకి కాదుకదా.అర్జుననుకు కృష్ణ భగవానుడు ఏం చెప్పాడో గీతలో- అనే ఉత్సుకతతో మాత్రమే వీరందరూ చదివి ఉంటారు.
వారికి గీతను అన్వయం చేసుకోమనడం అన్యాయం కదా!
వారి మానాన వారిని వదిలేస్తే "లోకా సమస్తా సుఖినో భవంతు" కదా!
మనం-మన మానాన మన సంగతి చూసుకోవడం, విజ్ఞుల లక్షణం అని ఆ గీతాకారుడే ఆగీతని దాటవద్దనీ ఎక్కడో ఒక శ్లోకంలో చదివినట్టు గుర్తు మరి.ఆ గీతను మనం వంట పట్టించుకొని మనకు అన్వయించుకునే విజ్ఞతని మానవాళికి ఇవ్వాలని శ్రీకృష్ణునికి నా ప్రార్థన!
నారు పోసినవాడు నీరుపోయక మానడు!!!
ఇది చాలా పురాతనకాలం నుంచి వస్తున్న నానుడి,ఇప్పుడు ఇక్కడ దీని ప్రత్యక్ష అర్థం, సంబంధం చెప్పుకుందాం. ఆ రోజుల్లో మనదేశం మొత్తం వ్యవసాయమే జీవనాదారంగాఉండేది.రైతు పొలంలో విత్తు నాటింది మొదలు నీటిమీదే ఆధారపడేవాడు.విత్తిన తరువాత అది చిన్నచిన్నమొక్కలుగా మారుతుంది ఆ నేల తల్లి పురుడు పోసుకున్నాక.
ఆ చిన్నమొక్కల్ని “నారు” అంటారు.దూర దూరంగా వాటిని పొలంలో నాటేసేవాళ్ళు.అవి కాలక్రమేణా పెరుగుతూ ఉండేవి.ఆ సమయంలో ప్రతీ రైతు ఆకాశం వైపే చూసే వాడు.నేలతల్లి మీద నాలుగు చుక్కలు చిలకరించమని.
అనివార్యకారణాలవల్ల వానలు పలకరించడం ఆలస్యం అయినా,వచ్చినా సరిపడనంత రాకపోయినా,పొలాల్లో ఉన్న బావులద్వారా చేలకు నీరు అందించేవారు పంటకోసం.ఆ పంట ఇంటికి చేరేంతవరకూ చేనుని కంటికిరెప్పలా కాపాడేవారు కాపలాకాస్తూ,విత్తునాటింది మొదలు నీటి అవసరానికి తనవంతు ప్రయత్నం చేస్తుండేవాడు ఆకాశంవైపే చూస్తూ కూర్చోకుండా-ఎక్కువశాతం వర్షంమీదే ఆధారపడ్డా కూడా.
నా ఉద్దేశ్యం ప్రకారం ప్రతి చేనుకి (నేలకి) రైతుమీద నమ్మకం ఉంటుంది.నారు పోసినవాడు నీరు పోయకుండా ఉంటాడా అని.ఆ నమ్మకంతోనే తమ మీద పడ్డ ప్రతీ వర్షపు చుక్కని తమలో ఇముడ్చుకొని,ఇంకించు కుంటుంది;ఎంతైనా నేలతల్లి కదా.పంట ఎదుగుదలలో తనపాటి సాయం పూర్తి సామర్ధ్యానికి చేస్తుంది ఆ నేల. అలాగే నారుపోసిన రైతువర్షం మీదే ఆధారపడతాడు ప్రత్యక్షంగా-పరోక్షంగా ఆ వర్షం కురిపించే భగవంతునిపై!
ఇదే సామెత మానవసమాజంలో ఉన్న మనుషులుకూడా విరివిగా వాడేవారు; ఇంకొకటి- మన అందరికీ తెల్సిన విషయమే ఆ రోజుల్లో పెద్ద కుటుంబాలే అన్నీ; పిల్లా పాపలతో కళకళలాడుతూ ఉండేవి లోగిళ్ళు.లేమిలో ఉన్నా“లేదు” అనే మాటే లేకుండా పెరిగిన జీవితాలు వాళ్ళవి. సంతుని ఇచ్చిన భగవంతుడు చూడకుండా ఉంటాడా అన్న ధీమా (భీమా లేని రోజులవి) ధైర్యం కూడా ఉండేది.అలా అని తమ వంతు ప్రయత్నం చేయకుండా ఉండేవాళ్ళు కాదు కుటుంబపోషణ, బాధ్యత విషయాల్లో-ఎప్పుడైనా కుటుంబాల్లో ఇబ్బందులు, కష్టాలు ఎదురైనప్పుడు మాత్రం ఈసామెతని అనుకునేవారు,సాంత్వన పడేవారు-భగవంతుణ్ణితలుచుకుని!
అంతేగానీ మనలాగా ప్రతీ చిన్నవిషయానికి అర్థం పర్థం లేకుండా వత్తిడికి లోనయ్యేవారు కాదు.ఎంత ఇబ్బంది అయినా వాళ్ళు అధైర్యపడేవాళ్ళు కాదు; సోమరిపోతుతనాన్ని ఏమాత్రం ఆశ్రయించేవాళ్లు కాదు!
వాళ్ళ శ్రమకి, కష్టాలకి తగ్గట్టే వాళ్ళు వాళ్ళవాళ్ళ ఇబ్బందుల్ని అధిగమించడంవల్లే మాతరం, తర్వాత తరం,ఈ విధంగా సుఖంగా ఉండగలుగుతున్నాం.ఈ ఒక్క విషయం మన జీవితాంతం వరకు మర్చిపోకుండా ఉండటం వాళ్ళ మీద మనకున్న ప్రేమకు తార్కాణం-కృతజ్ఞులుగా మిగిలిపోదాం.
కోవిడ్ ఫోబియా (భయం)!!!
మనం కోవిడ్ గురించి విస్తృతంగా మాట్లాడుకోవడం మొదలుపెట్టి సుమారుగా మూడునెలలపైనే అయ్యింది.కేసులు పెరగడం మొదలైన కొద్దీ ప్రపంచం అంతా లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది.జనం అంతా ఈ కొత్త విధానానికి క్రమేపి అలవాటుపడ్డారు.ఇప్పుడిప్పుడే కొద్దిగా బయటకురావడం,ఆఫీసులకు వెళ్లడం మొదలు అయ్యింది- పలుచగా.
కొత్త పద్ధతి నేర్చుకున్నాం,కొత్తగా బతకాలని కూడా అర్ధం చేసుకున్నాం. ఈ విపత్కర పరిస్థితుల్లో కొంతమంది వంటరిగా ఉండవలసిన పరిస్థితి నెలకొంది,ఖచ్చితంగా ఒంటరితనం వీళ్ళని వెన్నాడుతుంది- మదిలో.
ఒక పక్క వైరస్ భయం,ఈ సమయంలో ఎవరూ భయపడాల్సిన పనిలేదు;ఈపాటికి మన అందరికి తెలుసు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
సహజంగానే ప్రస్తుత వాతావరణంలో మనం ఎవరి ఇంటికీవెళ్లలేం,ఎవరు మన ఇంటికి రారు కూడా- ఇది శ్రేయస్కరం మరియూ ఉభయ తారకం”భయకారకం కాదు”,ముందు జాగ్రత్త మాత్రమే.
కోవిడ్ మనకు వచ్చేస్తుందని భయపడాల్సిన పనిలేదు;సన్నిహితులు ఎవరూకూడా మన చెంతలేరని గానీ,వున్నా చెంతకురావడంలేదని గాని వ్యాకులపడనవసరం లేదు.అనవసర మనోవ్యాకులతో బెంగపెట్టుకోవడం గానీ, ఎవరూ కలవడం లేదనిగానీ,కలిసినా మాట్లాడటంలేదనిగానీ అనుకోనక్కర్లా.వాళ్లంతా ఎక్కడకీ వెళ్ళట్లేదు,మనుషులూ మారలా, వాళ్ళ మనసులూ మారలా.
“అందరూ ఎవరి జాగ్రతలో వాళ్ళు ఉండవలసిన సమయం ఇది”,అని మన బుర్రలోకి ఎక్కించుకుంటే ఏ దిగులు,బెంగా ఉండవు.ఆ ఆలోచన,వితరణకి మన మనసుని మళ్లించాలి.
ప్రస్తుత పరిస్థితుల్లో ఆఫీసులకి వెళ్తున్నా ఎవరికీ పూర్తిస్థాయిలో పని లేదు.కాస్త వెసులుబాటు ఉన్న సమయంలో ఇంట్లోకానీ, ఆఫీస్లో కానీ మీకు ఇష్టమైన వ్యాపకాన్ని కొనసాగించండి.చదవటం, రాయడం, డ్రాయింగ్,మీకు మనసుకు నచ్చింది.ఇన్నాళ్లుతీరిక చిక్కక లోపల నిద్రాణమై ఉన్నవి బయటకి తీసి దుమ్ము దులపండి.
“దులపర బుల్లోడా దుమ్ము దులపర బుల్లోడా” అని అంతస్తులు సినిమాలో భానుమతి పాడినట్లు-ఈ దెబ్బతో మీ బెంగా,భయం పటాపంచలైపోతాయి.పైపెచ్చు మీధైర్యం మూడు రెట్లు పెరుగుతుంది కూడా!!
పై పెచ్చు అది “లోకం చుట్టిన వీరుడు”లాగా ప్రపంచం అంతా తిరుగుతూ అందరికి అంటించిపోతోంది, దీన్ని మనగ్రహం నుంచి తరమలేకపోయినా మనదేశంలో దీన్ని కచ్చితంగా తొందరలో అదుపులోకి తీసుకుంటాం.అప్పుడు అది కోరలుపీకిన పాములాగా అయిపోతుంది.బుసమాత్రమే కొడుతుంది- దాని సహజ స్వభావానికి, కాటు వేయలేదు.బుస బుసలకి అలవాటు పడతాం, అంతే మరి- అంతటితో దాని సంగతీ అంతే మరి.
మానవుడు ఆశావాది కదా,నిరాశావాదానికి, నిస్పృహకి తావు ఇవ్వకండి.
చరిత్రపుటల్ని ఒక్కసారి మననం చేసుకోండి.మానవాళి సాధించిన ఘనతలు, విజయాలు,నిర్భయంగా ఎదుర్కొని గట్టెక్కిన అడ్డంకులు,మనకు అసాధ్యం అంటూ ఏదీ లేదు.కావాలంటే “బాలభారతంలోని” ఘంటసాల పాడిన “మానవుడే మహానీయుడూ”పాటని గుర్తుచేసుకొని మీరూ పాడుకోండి మదిలో లేదా గట్టిగా,మీకు వినపడేలా.
కొద్ది రోజుల్లోనే నవ్వుతూ,తుళ్ళుతూ మనవాళ్ళందరితో సమీపంగా,చెంతనే ఉండే రోజులు వస్తాయి.ఈ లోపులో “టెక్నాలజి” ధర్మమా అని మనం అందరితో “దృశ్య రూపంలో” కూడా మాట్లాడుకోవచ్చు కదా;ఒంటరితనం అనిపించినప్పుడు అలా మాట్లాడండి.నాతో కూడా మాట్లాడండి నిస్సంకోచంగా-మనసు విప్పి!!!
ఈ పరిస్థితులు ఎల్లకాలం ఉండవు,మహా అయితే రెండు మూడు నెలలలో పరిస్థితి చాలావరకు చక్కబడుతుంది.
ఆ నమ్మకంతో ముందడుగు వెయ్యండి!
మౌనం అర్ధాంగికారం!!!
“మౌనం అర్ధాంగికారం” ఇది ఈరోజుల్లో ప్రామాణికంకాదు.పూర్వపురోజుల్లో గౌరవంవల్లగాని,భయంవల్లగానీ,సర్దుబాటు మనస్తత్వంవల్లగానీ కొన్ని విషయాల్లో మౌనం వహించేవారు.అది “కొంతవరకు అంగీకారమే” అనే భావనలో అవతల వ్యక్తులు వాటిని కార్యాచరణలో పెట్టేవారు.ఈ మౌనంగా ఉన్నవాళ్ళనుండి ప్రతిఘటన గానీ,ప్రతికూలభావన గానీ వ్యక్తం కాకపోవడంవల్ల చెల్లుబాటు అయ్యేది, అదే వరవడి నడుస్తూ ఉండేది సాధారణంగా.
కానీ ఈరోజుల్లో,మొదలుగా-ఎవరూ మౌనంగా ఉండటంలేదు-వారి అభిప్రాయాలను, అయిష్టతను నిర్మొహమాటంగా,బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు.ఏదో కారణాన మౌనంగా ఉన్నంత మాత్రాన పూర్వంలాగా అర్ధాంగికారంగా అసలు పరిగణించరాదు.ఈ "మౌన భంగిమ"ఖచ్చితంగా వారికి అంగీకారంకాదనే అర్ధం చేసుకుంటే,మానవసంబంధాలలో-ఇంట్లో వ్యక్తులతో కూడా- కలతలు, మనస్పర్థలు లేకుండా ఉంటాయి.
మునుపు ఒకసారి నేను "ఎవడి గొడవలో వాడుంటే గొడవలే లేవు" అని చెప్పినట్టు గుర్తు- ఇది గుర్తు పెట్టుకుంటే చాలు “తారకమంత్రంలా”!!!
ఈ రోజుల్లో మానవసంబంధాలు అనేదానికి కూడా అర్థం మారిపోయింది; అవతలవారికి,ఇవతలవారి మీద అభిప్రాయం మారనంతవరకే మనమీద వాళ్ళకి ప్రేమ, అభిమానాలూనూ!
ఏదో కారణంగా-సహేతుకం అవచ్చు కాకపోవచ్చు,అసలు కారణాలు కూడా లేక పోవచ్చుకూడా-వారి మానసికస్థితిని (mood) బట్టి కూడా ఉండొచ్చు - “వాళ్ళ mood వాళ్ళ ఇష్టం కదా మరి”;మనప్రమేయం లేకుండా వాళ్లు అభిప్రాయాలను మార్చుకుంటే మానవసంబంధాల అర్థం మారిపోతుంది.
ఈ చిన్న తేడాని ఈ మారుతున్న లోకంలో కనిపెట్టి మసులుకుంటే,ఏదో ఈ మాత్రమైనా ఒకళ్ళకి ఒకళ్ళకి మధ్య సంబంధాలు నిలుస్తాయి.ఎవరితో చనువు ఉన్నామన పరిధిలో ఉండాలి.ఇవి పూర్వంరోజులు కాదుకదా,“పరిధి దాటావు” అని “హద్దులు మీరావు” అని ఆత్మీయులు చెప్పడానికి.ఆత్మీయతలో హద్దులేంటి విడ్డూరం,వెధవ వేషాలు కాకపోతేనూ!!!
ఇదే వ్యక్తులు వాళ్లకి అవసరం అయినప్పుడు మాత్రం అన్ని పరిధులు చెరిపి మన చెంతకు చేరతారు చాలా అతితెలివిగా (వాళ్లు అది తెలివి అనుకుంటారు)-అక్కడ మనం కొంచెం తెలివిగా మెలగాలి.నా ఉద్దేశ్యం వాళ్లకు సహాయం చేయొద్దని కాదు.
కార్యార్ధి అయి వచ్చిన వాళ్ళని నొప్పించక, మనకు చేతనయినంతలో చేసి పంపాలి-కానీ వాళ్ళు వాళ్ళ అవసరానికి వచ్చారని మాత్రం గ్రహించాలి,అంతే గాని,ఏదో మళ్ళీ మనదగ్గరకు వచ్చారని ఎగేసుకొని పూర్వంలాగా వెళ్లే ప్రయత్నం కూడదు.
ఇలాంటి అవసరార్ధం చేసే స్నేహాలు,సంబంధాలు కోకొల్లలు ఈరోజుల్లో,కలియుగానికి తోడు డిజిటల్ యుగమాయే మరి!మీకూ బోలెడుమంది ఉండేఉంటారులేండి,ఈ కలియుగపు అవసర,అవకాశగాళ్ళు-అప్పటికి ఏదో నేను చెప్తేగానీ మీకు తెలియనట్టు నా చాదస్తం కాకపోతేను.
తస్మాత్ జాగ్రత!
జీవన క్రమం, పరిణామం!!
ముందు విత్తనం,మొలకెత్తడం,పూవు చిగురిస్తుంది, చిగురించడం,కాయగా, పండుగా మారడం-ఇదీ వరుస క్రమం-ప్రకృతిలో!
ప్రజలకు ఉపయోగపడే చోట ఉంటే ఆఫలాలు, కాయలు అందరూ ఆస్వాదిస్తారు.ఆ చెట్టునుండి లెక్కకుమించి విత్తనాలు తయారవుతాయి.ఆ చెట్టుచేసిన ప్రకృతి ధర్మాన్ని అవి కూడా పాటిస్తాయి-ఆ విత్తనాలు ఎక్కడ వేస్తే అక్కడ!
ఇక్కడ గమనించవలసిన విషయం చూస్తే,సూక్ష్మం బోధ పడుతుంది;
ఆచెట్టు నుండి ముందుగా కాయలుగానీ, పండ్లుగానీ వీడిపోతాయి,అవి మరోచోట విత్తనాలుగా మొలకెత్తి ఆ తల్లిచెట్టు చేసిన ధర్మాన్ని కొనసాగిస్తాయి.కొన్నాళ్లకు ఆ చెట్టు మోడుబోయి క్రిందకు ఒరిగి,తన పుట్టుకకు, ఉనికికి కారణమైన తల్లి ఒడిలోకి చేరుకుంటుంది.
దానితో దాని పుట్టుక, గిట్టుట చాలా సహజంగా, చడీచప్పుడు కాకుండా జరిగిపోతుంది- చాలా నిశ్శబ్దంగా!
తనని వీడిన కాయలగురించిగాని,పండ్ల గురించిగాని కించిత్తు చింత ఉండదు.ఎందుచేతనంటే తనని వీడిన ఆసంతానం వేరేచోట వృద్ది చెందుతూ మానవాళికి ఉపయోగపడతాయి అని.ఈక్రమంలో చెట్టుకూ,దాని సంతానానికి- వేటికి చింత ఉండదు.మనం ఈక్రమాన్ని పట్టించుకోము,ఎందుకంటే అది సర్వసాధారణంగా జరిగే ప్రకృతి ధర్మం కాబట్టి.
ఇదే సామ్యం మనుషుల జీవితాల్లో కూడా ఉంటుంది.ప్రకృతిలో ప్రతీజీవికీ, మొక్కకూ, చెట్టుకూ, మనుషులకు కూడా సృష్టి లో కొన్నియుగాలుగా ఇది జరుగుతోంది-ఇది ప్రకృతి, మరియు సృష్టిధర్మం కాబట్టి.
ప్రతీ యుగంలో జరిగింది,జరుగుతోంది, జరగబోయేది ఇదే.మన ముందు తరం మన ముందే వెళుతుంది, మనం వారి అడుగుజాడల్లోనే వెళతాం. రాబోయే తరం, ఆ తర్వాతి- తరతరాలు ఇదేక్రమం- ఈసృష్టి ఉన్నంత వరకూ!
ఇన్ని అనుభవాల్ని కళ్ళముందు చూసి, గ్రహించికూడా ప్రతి మనిషీ తానుమాత్రం శాశ్వతంగా ఉండాలని ఆశ పడుతుంటాడు- అది జరగదని, ప్రకృతి విరుద్ధం అనీ తెలిసికూడా!
దీన్ని అవగాహనారాహిత్యం అనలేము,మనిషికి వివేకం, విజ్ఞానం ఉంది కాబట్టి. ఇది గీతాకారుడు చెప్పిన “మోహం, వ్యామోహం” వల్ల కలిగే ఫలితం.గీత చదివినా, పురాణములు, ఇతి హాసములు విన్నా మనిషికి ఈఆశ మాత్రం చావదు, తను పోయేంత వరకూ;ఏమి వ్యామోహం,ఏమి ప్రీతీ-తనవారి మీద, వస్తువులమీద, తనప్రాణం మీద;దీనికి అంతేలేదు.
ప్రవచన కర్తలు-వారు చేప్పేవి వారుచెబుతున్నారు,భక్తీ విపరీతంగా పెరిగింది.వినడం ఒక వ్యాపకంలా అయింది, పట్టించుకోవడం- వంటికి, మనసుకి ఏ మాత్రం జరగటంలా.
ఎంత మూర్ఖత్వం,అజ్ఞానం అంటే (కొంతచనువుతో ఈ పదాలు వాడుతున్నా- కటువుగా అనిపించినా)మనకు తెలిసిన, దేవుళ్లుగా నిత్యం కొలిచే-సాక్ష్యాధారాలు ఉన్నశ్రీరాముడు, శ్రీ కృష్ణుడు కూడా వారివారి తనువులు చాలించారని వారియొక్క అవతార ప్రయోజనం అవగానే అని తెలిసినా-వ్యామోహం యొక్క ప్రభావం ఎంత తీక్షణంగా ఉంటుందో తెలుస్తోంది.
తన జీవితాంతం బతకడానికి విత్తు ఉన్నా,ఇంకా పాకులాట మానడు; ఇంకా ఇంకా కూడపెట్టాలన్న తృష్ణ వీడడు.
జీవిత పరమార్ధాన్ని, అర్ధాన్ని తెలుసుకొని, తనకు అన్వయించుకుంటూ జీవించేవాళ్ళు బహు తక్కువ ఈకలియుగంలో.శ్లేష్మంలోపడ్డ ఈగలాగా ఈ బంధాలతో,పీకుడుతో చివరిక్షణం వరకూ జీవించేవాళ్లు కోకొల్లలు.
ఎంత తొందరగా కనువిప్పు కలిగితే మిగిలిన జీవితాన్ని నిజమైన ఆనందంతో జీవిస్తారు
కోవిడ్-మన జీవన సరళి!!!
కోవిడ్ ఇప్పుడు మనతో కలివిడిగా ఉంటానికి,చెంతకి రావటానికి ప్రయత్నిస్తుంది-తీవ్రంగా,తనతో మెలిగే సన్నిహితుల ద్వారా-మనం బయటకివెళ్లడం మొదలు పెట్టినప్పటి నుంచి.మొహమాటపడకుండా చెప్పండి, తప్పక నీతో స్నేహం చేస్తా,కానీ,సామాజికదూరంతోనే,నీతోనైనా కూడా-నా సాటివారితో చేస్తున్నట్టు.
ఏదైనా,నువ్వు మాదేశానికి వచ్చినప్పుడు చాలా తీవ్రంగా, దూరాలోచనతో వచ్చావు,నీ యజమాని ఆజ్ఞపై-వాడికి దూరాలోచన,దురాలోచన రెండూ మెండు.
“అలెగ్జాండర్, మొగలుల”లాగా ప్రపంచాన్ని జయించి ఆధిపత్యం వహిద్ అనుకుంటాడు నీయజమాని-మా చరిత్ర పుటల్ని ఒక్కసారి తిరగేసి చూడమను - ఆ భావనతో అడుగిడిగినవాళ్ళని ఈ“నేలపుత్రులు” కాలక్రమేణా ఎలా మట్టికరిపించారో! మునుపటి రోజుల్లో- మీదేశం,మాదేశం చాలా శతాబ్దాలుగా మిక్కిలి మిత్రత్వంతో ఉండేవాళ్లం,ఆ రాజుల కాలమే నయం.మీ అధినేతకి పదవీ దాహం, సామ్రాజ్యకాంక్ష ఎక్కువై శత్రుదేశంగా తయారయ్యాడు!
దీనికితోడు మా దాయాదులతో అతిచెలిమి- వందమంది ఉన్న మా దాయాది సోదరులు, కౌరవులే మట్టి కరిచారు ద్వాపరయుగంలో,కలియుగపు దాయాది మాకెంత,నువ్వెంత?
కలసి ప్రయాణానికి మేమేప్పుడు సయ్యే,చెలిమితో-అది నిర్ణయించుకోవాల్సింది మీఇద్దరే “జోగి జోగి రాసుకుంటే బూడిదరాలినట్టు” మీరిద్దరూ ఎన్ని కుయుక్తులు పన్నినా లాభం లేదు- మీ ఇద్దరికీ!
నీ తీవ్రతని తగ్గించి నీ ఉనికిని గుర్తించాము (ఇప్పటికే మా దేశంలో కుదేలై పోయావు) దీని విరుగుడు కూడా మేమే తయారుచేస్తాం ప్రపంచానికి-ఏమో ఎవరు చెప్పగలరు,నీ జన్మ స్థానానికి కూడా మేమే విరుగుడు మందుని సరఫరా చెయ్యొచ్చు.
మా భారతీయులు "కోవిడ్ ని - కావిడిలో కుండలాగా" మోస్తుంటాం, కొత్త అలవాటుతో,అలా మాతో “దూరంతో దగ్గర అవుతావు”. మా అలవాట్లు, సంప్రదాయాలకు,నువ్వు కూడా మురిసిపోయి నీ మెరుపులు కోల్పోయి, మాలో మమైకమై పోతావు-నీలో ఉన్న చెడ్డని కొల్పోతావ్.అది ఈజాతి, సంప్రదాయాల గొప్పతనం.శత్రువుకి కూడా ఆతిధ్యం ఇచ్చి మిత్రుడుగా చేసుకుంటాం,అది మా నరనరాల్లోనే ఉంది.,దా! కలిసి సాగుదాం- నీవు పుట్టిన ప్రయోజనాన్ని మరిచి మాలో ఒక్కటై పోతావ్-నీ జాతి లక్షణాన్ని,లక్ష్యాన్ని మరచి!
ఒకందుకు నువ్ మేలే చేశావ్,కాస్త పద్ధతులు నేర్పావ్,బద్ధక రాయుళ్ల దుమ్ముదులిపావ్;పద్దతిగా, శుభ్రమే అలవాటుగా ఉన్నవాళ్ళని గర్వపడేలా చేశావ్-నీ దయవల్ల కొత్తరకంగా బతకడం అలవాటు చేసుకున్నాం.
ఇంటిపట్టున ఉండటం,ఇంట్లోవాళ్ళతో మాట్లాడటం,ఇంటితిండి తినడం- కొత్తగా ఉన్నా బాగుంది.మాలోమేమే కొత్త ప్రపంచాన్ని చూస్తున్నాం; కొంగొత్తగా,బాగా బావుంది.
జీవితంలో కొత్త ఉత్సాహం,పెనుమార్పు మా జీవనవిధానంలో,ప్రతి మనిషిని,ప్రతి ఒక్క దాన్ని మార్పులకీ గురిచేసింది.ఒకేరకంగా బతికేస్తున్న మనందరం,కొత్త రకంగా బతకడం మొదలు పెట్టాం; కొత్తగా ఉన్నాకొంగొత్త గా ఉంది.జీవితాల్లో పునరోత్సాహం తెచ్చింది.కొత్త రకంగా, పూర్తిగా విరుద్ధంగా“ఇదే జీవితంలో” కొత్తరకంగా బతకడం-నిజంగా కొత్త ఉత్సాహమే.చాలామంది పునర్జీవులయ్యారు, నిర్జీవంగా,నిస్సత్తువగా బతుకుతున్న కొందరికి ఇది వరం.
ఇకనైనా ప్రకృతితో మమైకమై ఇతర జీవరాసులతో సహజీవనం సాగిద్దాం, సహజీవనం అన్నా కదాని సింహం భుజంమీద చెయ్యివేసి మాట్లాడమని కాదు దానర్థం,“అత్తారింటికి దారేది”లో పవన్ చేత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అనిపించినట్టు.వాటి దోవన వాటినీ బతకనిద్దాం అవి జీవించే చోటులోకి కూడా వెళ్లి మనం ఇళ్ళు కట్టుకోకుండా!!!
సరి కొత్తగా బతకడం నేర్చుకుందాం- ఇనుమడించిన ఆనందంతో-“వేయండి అడుగులు బహు శ్రద్ధగా”!!!
కొన్ని జాగ్రత్తలు!!!
రాబోయే మూడు నెలలనుంచి ఆరునెలల వరకూ- కనీసం-మీరు ఎవరి ఇళ్లకు వెళ్ళకండి-బంధువులు, మిత్రులు, ఆప్తులు అయినా మీరు వారి శ్రేయస్సు, ఆరోగ్యం కోరే వారయితే-అలాగే ఎవరినీ మీ ఇంట్లోకి రానివ్వకండి!
పని మనిషిని ఒకటి నుంచి రెండు నెలల వరకు రానివ్వకండి,పూర్తి జీతం ఇచ్చేయండి- మార్చ్, ఏప్రిల్, మే లో ఇచ్చినట్టు!
సూచించిన ఆరోగ్య సూత్రాలు పాటించండి!
బయట తిండి మానేయండి- కాఫీ,టీల తో సహా!
ప్రయాణాలు వద్దు!
ఆఫీస్,ఇల్లు, ముఖ్యమైన బజారు పనులకు మాత్రమే పరిమితం- బయటకు వెళ్ళినప్పుడు!
ఇంట్లోపనులు చేయని మగవాళ్ళు లాక్ డౌన్ ధర్మమా అని ఇప్పుడు కాస్త అలవాటుపడి ఉంటారు.కాబట్టి ఇంట్లో పనులు చేయండి ఆ పని,ఈ పని- అని లేకుండా అన్నిపనులు, వర్గీకరణ లేకుండా!
చేతనయినంత లో నిస్సహాయులకు సహాయం చేయండి!
ఈ లాక్ డౌన్ తో చాలామంది జీవితాలు చెల్లాచెదరయ్యాయి!
వైరస్ రెండవ కెరటం (సెకండ్ వేవ్) వచ్చిపోయేంతవరకు అప్రమత్తంగా ఉండండి పరిసరాలతో!
వైరస్ ఎవరో ఒంట్లో ఉందో,ఉన్నవాళ్ళకే తెలియని పరిస్థితి!
పరిస్థితులు చక్కపడ్డాక కొద్దిగా స్వేచ్ఛగా ఉండొచ్చు!
“బతికుంటే బలుసాకు తినొచ్చు” అనే సామెత గుర్తు పెట్టుకోండి!
శుభం!!!
“నేను-నాగుండె ఊసులు”!!!
మన గుండెచప్పుడు మనకి ఎలా వినపడదో మనగుండెల్లో చప్పుళ్ళు పరులకు వినపడవు, అలాఅని ఆచప్పుళ్ళు చేయకుండా ఉంటుందా- గుండె?అమ్మో,గుండె ఆగిపోదు! దాన్ని ఆగనిస్తానా?నేను పోయేంతవరకు!!!
“గుండెచప్పుడు” చప్పుడు చేయకుండా- అవిశ్రాంతంగా-సవ్వడి చెయ్యకుండా పనిచేస్తుంది,దాని చప్పుడు వినడంలేదు కదా అని చప్పుడు చెయ్యడం మానితే?!!!అందుకే దానికి “అనవసర చప్పుళ్ళు” మన మెడదులోవి వినపడనీయకండి,ఈ చప్పుళ్ళకి ఆగుండె “చప్పుడు”చెయ్యడం మర్చిపోతుంది.
అందుకే అది చెప్పేకబుర్లు వింటుంటా,నేను వంటరిగా ఉన్నప్పుడు-అదికూడా-నామీద ప్రేమతో- ఎంతైనా నా గుండె కదా! నేను వంటరితనంలోకి వెళ్లకూడదని-ఎన్నో కబుర్లతో ఊసులాడుతుంది అదీ నామదిలొనే- చప్పుడు చేయకుండా!
జీవితాంతం మనకు తోడుగా-“చేదోడు వాదోడుగా”ఉండేది అదే కదా! "రోజూ నువ్వు విశ్రమించు,నేను నిన్ను చూసుకుంటాను, నీవిశ్రాంతి నా విశ్రాంతిగా మార్చుకుంటాను" అంటుంది!
గుండెతో మాట్లాడుతూ ఉండండి,కబుర్లతోపాటు, మన క్షేమసమాచారాలు చెపుతుంది.ఆ కబుర్లలో దానికి ఒంట్లో బాగులేకపోయినా మనం సులువుగా పట్టేయచ్చు-ఆది చెప్పకపోయినా!
మీగుండె కూడా చెప్తుంది, వినండి మరి-ఆ ఊసులు నాకుకూడా పంచండి!!!
పాత రోజులు - పాత మధురాలు-ఆపాత మధురాలు!!!
పూర్వంరోజుల్లో కుటుంబభారం ఇంటి పెద్దమీద ఉండేది, ఏకవ్యక్తి సంపాదన; పిల్లలు ఎదిగివచ్చినా ఉద్యోగ అవకాశాలు, ఉపాధి దొరకటం కష్టంగా ఉండేది.పిల్లల చదువులు, మంచి చెడులు, ఆడపిల్లల పెళ్లిచేసి బాధ్యత తీర్చుకోవడం తలకు మించిన పని ఇందులో ఇంట్లోఇల్లాలు పాత్ర మరి ముఖ్యంగా చెప్పుకోవాలి; గుట్టుచప్పుడు కాకుండా, బయటకి గంభీరంగా కనపడుతూ ఇల్లూ, సంసారంని నెట్టుకొచ్చేవారు.ఉన్నంతలోనే లేనివారికి- మూడోకంటికి తెలియకుండా చేసేవి- లెక్కలేనన్ని చేసేవారు-సలహాలు, సహాయాలూను.ఆ రోజుల్లోని ఆడాళ్లకు, ప్రతీ అమ్మకు జోహార్లు!
వీటికి తోడు-ఈ ప్రయాణంలో- పూజలు, నోములు, వ్రతాలు, పండగలప్పుడు - పిండి వంటలు, ఉపోషాలు,దేవాలయాలకు వెళ్ళటాలు, పిల్లల పురుళ్ళు- పుణ్యాలూ లెక్కలేనన్ని ఉండేవో-మహా ఇల్లాళ్ళు-ఎలా చేసే వారో, విసుక్కోకుండా, నవ్వుతో!
ఆ రోజుల్లో ఆడవాళ్లకు ఆట్టే చదువుకోవడం ఉండేదికాదు-అవకాశాలు, సదుపాయాలు, సంప్రదాయాలూను, పెళ్లి ముందు ఇంట్లో పనులు, బాధ్యతలూనూ-ఎక్కువగా పెద్ద కుటుంబాలాయే- మీదుమిక్కిలి నియంత్రణలేని రోజులాయేను!!!
"వాడు మగాడ్రా బుజ్జి" అని తనికెళ్ళ భరణి ఎవరినో ఒక్కళ్ళని అంటానికి అవకాశం ఉండేదికాదు ఆ రోజుల్లో!
(“గరికపాటివారు” అన్నట్లు -ఈరోజుల్లో ఘాట్టిగా అనుకున్నా ఒక్కళ్లని కంటమే కనాకష్టం.వాళ్ళకు ఆఫీసులో పని, "వర్క్ ఫ్రమ్ హోమ్" తప్ప, "వర్క్ ఎట్ హోమ్" ధ్యాసా, ఊసూ రెండూ లేవు.మధ్యలోకరోనా గొడవ ఒకటి- వీళ్ళగొడవ వదిలేసి, మళ్లీ అసలు విషయంలోకి వద్దాం.)
దానితో ఆడపిల్లలు పెళ్ళికాకముందు తండ్రిమీదా, పెళ్ళి తర్వాత భర్తమీద ఆధారపడి బతుకు వెళ్లదీయాల్సి వచ్చేది; పైపెచ్చు, పెద్దగా కోరికలు వుండేవికాదు, పిల్లలూ, భర్త వారి బాగోగులూ తప్ప. ఒకవేళ ఒకటో అరో ఉన్నా పైకి అడిగే పరిస్థితి వుండేదికాదు-చాలా కుటుంబాలలో.
ఆ రోజుల్లో మధ్యతరగతి కుటుంబాలే ఎక్కువ,ఆస్తిపరులు బహుతక్కువ- వారిలో అతిశయం ఉన్నవాళ్ళు కూడా వుండేవారు-మధ్యతరగతి వారిమీద డాంబికాలు పోయేవారు-సహజం అనుకోండి.
ఇప్పటికీ సమాజంలో ఆ జాడ్యం పోలేదు, ఇంకా ఎక్కువయింది అనుకోవాలి- ఆ రోజుల్లో డబ్బులున్నవాళ్ళు మాత్రమే అలాగ వుండేవారు; ఏమి మాయరోగమో, ఈరోజుల్లో- కొంతమంది మధ్యతరగతివాళ్ళ దశ తిరిగి- నాలుగు డబ్బులు రాగానే నడమంత్రపుసిరి ఆవహిస్తోంది- ఇప్పటితరం గురించి రాయాలంటే ఒక గ్రంథం అవుతుంది!
అయినా ఇలాంటి నడమంత్రపుసిరిగాళ్ళు, మొబైల్ కన్క్షన్లలాగా కోకొల్లలు;ఇంకో సందర్భంలో మాట్లాడుకుందాం.
ఏతావాతా- దీని మూలాన భర్తమీద పూర్తిగా ఆధారపడుతుండే వారు,దీనికి తోడు-పాప పుణ్యాలు- దైవం,దయ్యం-భయం, భక్తి- కూడా మెండుగా ఉండేవి.
(ఈరోజుల్లోవాళ్లు “చాగంటి వారి” మాటలు, ప్రసంగాలు వింటారు,దానికేమీ లోటులేదు-కానీ ఆ చెవిలో విని ఈ చేవిలోనుంచి వదిలేసే వాళ్ళ శాతమే ఎక్కువ అని నా కచ్చితమైన అభిప్రాయం.కాదు అని ఇప్పటితరం వాళ్ళు- మారి చూపితే నా అభిప్రాయం ఆనందంగా మార్చుకుంటా నర్రా! నా ఆశా అదే కదా మరి!)
ఆరోజుల్లో ఆడవాళ్ళు ఉన్నంతలోనే,తృప్తిగా,సంతృప్తిగా, సంతోషంగా బతికేవారు- నిరాశ నిస్పృహలు లేకుండా-ఇప్పటితరంలా కాదు!
అలాగే మగవాళ్ళు కూడా-కాడి బరువు ఎక్కువైనా మోస్తూనే జీవితాలను నెట్టుకెళ్లే వాళ్లు!
ప్రతి ఇల్లాలు వార్ధక్యంలో పునిస్త్రీగానే పోవాలనుకునే వారు- ఏంచేతంటే, దురదృష్టవశాత్తు జరగరానిది జరిగితే భర్తలేని జీవితం దుర్భరమే మరి ఆ రోజుల్లో!
ఆ రోజుల్లో బాల్య వివాహాలు ఎక్కువగా ఉండేవి అని చదివాము,విన్నాం కూడా,అంచేత, భర్తపోయిన మధ్య వయస్కులు, పెద్దవాళ్ళు చాలా కుటుంబాలలో సర్వసాధారణంగా కనపడేవారు.
ఆరోజుల్లోని మగాళ్లు,ఆడవాళ్ళు పడ్డ కష్టాలు ఈతరంలో వాళ్ళకి ఏమాత్రం అర్ధంకాదు, చేసుకొనే ప్రయత్నం కూడా చెయ్యరు- మాతరం తప్ప- మేము ఆ వాతావరణంలోనుంచి వచ్చినవాళ్ళం కాబట్టి.
ఇప్పటితరానికి డబ్బులు, అవకాశాలు, సదుపాయాలు అన్నీ ఉన్నాయి, వీళ్ళు ఒక్క విషయం స్పృహలో ఉంచుకోవాలి; వీళ్లు ఈ స్థితిలో ఉన్నారు అంటే- అది వీళ్ల తల్లితండ్రుల వల్లా, వీళ్ల తల్లితండ్రుల- తల్లితండ్రుల పెంపకం వల్లా అని.
పాతతరం అంత కాకపోయినా ("కాలేరు కూడా", నాకు మొహమాటం లేదు ఈమాట అంటానికి) కొద్ది శాతం అన్నా విలువలు పాటిస్తే వీళ్ళ పిల్లలూ, తర్వాత తరం సుఖంగా ఉంటారు; మాతరానికి ప్రతీకగా ఉన్నవాణ్ణి, ఇంత కంటే కోరినా అత్యాశే అవుతుంది ఈ డిజిటల్ యుగంలో.
అమ్మ!!! ఆ పిలుపే మధుర భావన!!!
ఈ రెండక్షరాలపదమే లేతే జగతిలేదు,సృష్టే లేదు.భగవంతుడు ఈసృష్టి చేసాడంటారుగానీ అది నిజంకాదు!
వాస్తవానికి స్త్రీనీ, పురుషుణ్ణి,మరియూ ప్రకృతిని మాత్రమే సృష్టించాడు.
సృష్టి,పునః సృష్టి చేసింది,చేస్తుంది,చెయబోయేది,"అమ్మ"తనంతోనే కదా.
ఆమాటకొస్తేసాక్షాత్తు ఆసృష్టికర్త తాను ఎల్లవేళలా అందరికి అందుబాటులో ఉండలేనని అమ్మని అర్ధించాడట-అమ్మని తనకి ప్రత్యామ్నాయంగా ఉండమని-అమ్మవారి సలహాతో-ఎంతైనా “జగాలనేలే తల్లి” కదా!
అమ్మ నిర్వచనం అనితరసాధ్యం,విధాతకైనా! సంతు ఎంతఉన్నా అందర్నీ సమానంగా చూసే దృష్టి,ఎవరో ఒకరిమీద కొద్దిపాలు ప్రేమ ఎక్కువున్నా,పక్షపాత వైఖరి మాత్రం లేనిదే అమ్మ.ఒక వేళ ఏఅమ్మ అయినా అలాఉన్నా, మీ పెద్దమనసుతో మర్చిపోయి అమ్మని తిరిగి ప్రేమించండి.ఎంతైనా అమ్మ కదా మిమ్మల్ని ఆ దివినుండి ఈభువికి తెచ్చింది-భగీరథుడు గంగను తెచ్చినట్టు!
ప్రతిజీవి పుట్టుకకు తన గర్భాన్ని గృహంగాచేసి,నవమాసాలు లాలనగా సాకుతుంది.అందుకే అన్నారు "మానవుడి తొలిగృహం తల్లి గర్భం". ఈ ఇంటి ముందు ఎన్ని కట్టుడు గృహాలు,భవనాలు సాటిరావు.
తల్లికి నిర్వచనం చేసే సాహసం చేయలేను కానీ-మనం,మన ఎదుగుదల, మన స్థితే-మొత్తంగా "మనమే" ఆమెకు నిర్వచనం!
ఆమెలేని ఉనికే లేదు ఏజీవికి ఈసృష్టిలో! ఏదో పాశ్చాత్యులలాగా ఏడాదికి ఒక్కరోజు తలుచుకొని,మరొక్కరోజు మాత్రమే ప్రతీ ఏడాదీ తలుచుకొనే వస్తువా అమ్మ?
అది వారి సంస్కృతి కాబోలుబహుశా! కానీ మీబాధ్యతగా మీభుజానికెత్తుకొని వారికీ అమ్మని రోజూ ప్రేమించడం,ముదిమిలో ఆదరించి చిన్నపిల్లని సాకినట్టుగాసాకడం నేర్పండి.ఏంచేతంటే బాలలూ వృద్దులూ ఒకటే.పరభాషా గడ్డమీద, సీమాంతరాల మీద ఉన్న భారతీయులు అమ్మ అనే పదానికి అర్ధం నేర్పండి- మీరుకూడా వారి సంస్కృతిలో పడకుండా!
ప్రతి మనిషి పుట్టాక,పలికే తొలి పదమే అమ్మ.అదే మన జీవిత పరమపద సోపానంలో తొలిమెట్టు.ఎలా మరిచి పోగలరు మనిషన్నవారు? మనిషిగా, శారీరకంగా దూరమైనా-మన జీవితాంతంవరకు మనకుతోడుగా ఉండేది- మానసికంగా అమ్మే!
అలాంటి అమ్మను ఒకరోజు జ్ఞప్తికి తెచ్చుకోవడం కాదు,మన “స్మృతి పధంలో” ఎల్లప్పుడూ మనతో ఉండేదే అమ్మ.
ఆ త్రిమూర్తులను సృష్టించింది ఆ శక్తి స్వరూపిణి జగన్మాతే కదా!అమ్మగురించి ఆయనకి చెప్పాలా!భగవంతుని ఉనికే అమ్మ!అందుకే "అమ్మ"కు ప్రత్యామ్నాయ పదం"భగవంతుడు"!!!
మాతృమూర్తులకు నా నమస్సుమాలు-భువిపైన వారికి!నమస్సుమాంజలులు దివికేగినవారికి!
మొక్క ఎదుగుదలలో - "కంచె" పాత్ర!!!
విత్తనాలు వేసినతర్వాత పాదుచేసి రక్షణగా,సంరక్షణగా "కంచె" వేస్తారు. ఆ కంచే లేకపోతే మొక్క ఎదుగుదలే కాదు,ఉనికికే ప్రమాదం!ఆ మొక్కే పెద్దయి వృక్షంగా పెరిగే దశలో ఆకంచె క్రమేపీ కనుమరుగవుతుంది; ఆ విషయం ఆ చెట్టుగాని ప్రజలుకానీ పట్టించుకోరు,ఆ స్పృహే ఉండదు! కాలక్రమంలో ఆ చెట్టు పూలుపూసి, కాయలు కాస్తుంది, పండ్లు ఇస్తుంది; జనం ఆ కాయలకోసం, పండ్లకోసం రాళ్ళు విసురుతారు, తనకాయలు, పండ్లకు రాళ్లదెబ్బలు తగిలినప్పుడు -ఆ చెట్టుకు కంచె గుర్తుకు వస్తుంది.
ఇవే లక్షణాలు మనుషులకీ అంటుకున్నాయి!
ఆ"కంచే" మన తల్లిదండ్రులు, ఆ కంచెనే మర్చిన “ఇప్పటి చెట్టే” ఆ తల్లిదండ్రుల పిల్లలు- మనం!
ఈ ధోరణి చూసిన “ధరణి” ఒక ఉదాసీనతతో నవ్వుతోంది.బహుశా- అది తన “పైన” మనుగడ సాగిస్తున్న తల్లిదండ్రులకు ఒక సంకేతం కావచ్చు మరియూ తన గర్భంలో కలిసిపోయిన తల్లిదండ్రులకు సానుభూతి తో కావచ్చు.ఇలాంటి తల్లి తండ్రులకు, అలాంటి పిల్లలకూ మన సమాజంలో కొదవే లేదు.ఇది చూసినప్పుడు,
విన్నప్పుడు మనసు వికలం అవుతుంది,ఆ పిల్లలమీద జుగుప్స కలుగుతుంది!
అలాంటి తల్లిదండ్రులకు శతకోటి నమస్కారాలు,నా ప్రగాఢ సానుభూతి!
చదువుల తల్లితో నాఅనుభవం!!!
చదువుల తల్లి సరస్వతి ఈఉదయం ఒక్కసారిగా నాతో అంది-నీ రాతలు మొదలుపెట్టించింది నేను,నీ బ్రతుకులో ఇంత “లావుపాటి” (నువ్వు సన్ననైనా కూడా) రాతరాసింది నేనే.చాలాకాలంగా ఇంగ్లిష్ లోనే రాస్తున్నావు.అన్ని బాషలూ నానుంచి వచ్చినవే కానీ,నువ్వు నీ మాతృభాష మర్చిపోకూడదు అనే-నీ మాతృభాష లో తిరిగి రాతలు రాయించడం మొదలు పెట్టించానుఅని - ధవళవస్త్రాలతో,ధవళ పద్మంమీద కూర్చొని,ఆవిడ పదేపదే అన్నట్టు అనిపించింది. నేనేమీ కాదనలేదే, ఏమో ఎందుకు అందో,అందుకని ఆవిడ ప్రస్తావన తెస్తున్నా! మన తలరాతలు ఆవిడగారి భర్తగారు రాస్తే, ఈవిడగారు మన చేతిరాత, బుఱ్ఱలో గుజ్జు ఇస్తూ ఉంటుంది.అక్షరాభ్యాసం చేసేముందు తలుచుకొని, ఆ తర్వాత ఆవిణ్ణి మర్చిపోయేరకంవాణ్ణి కాదు- ఆసంగతి ఆవిడకి తెలుసు.అందుకే “పుస్తకం మరియు లేఖిని” నుండి-“కంప్యూటర్, మౌస్, కీ బోర్డ్ కి” మారినా ఆవిడ కటాక్షం చూపిస్తోంది.
కనుకనే వాళ్ళ ఆయన నామొహం మీద,ఈవిడ నాచేతిలో “కొంచెం”- కంటే ఎక్కువగానే రాసినట్టున్నారు.ఏదో ఈమాత్రం రాస్తున్నా,జీవితం భేషుగ్గా ఉందన్నా వాళ్ళిద్దరి చలవే మరి.
ఇప్పటి పిల్లలు కూడా చిన్నప్పుడు పలకా, బలపం పట్టుకున్న తర్వాత పరీక్షలప్పుడు మాత్రమే గుర్తు తెచ్చుకోవడం కాకుండా- జీవితాంతం తలుచుకోండి.ఆవిడ దయవల్లే బుద్ది,జ్ఞానం ఇనుమడిస్తాయి.లేదంటే మందభాగ్యులం,బుద్ధి హీనులుగా అవుతాం జీవితాంతం.తల్లిదండ్రులు కూడా జ్ఞాపకం పెట్టుకొని మరీ,పిల్లలకి ఈవిషయం చెప్పాలి.అంతేగానీ పిల్లకాయల్ని “బాసరలో” అక్షరాభ్యాసం చేయించి సరస్వతిని మర్చిపోతే అంతే సంగతులు. ఆపైన మీ యిష్టం మరి!
ఇందులో మరో మేలు ఉంది,ఈవిడ మనతో సంతోషంగా ఉంటే,ఆవిడ కటాక్షం దొరుకుతుంది- దొరికితే,వాళ్ళాయనకి మన గురించి కొద్దిగా సిఫార్సు చేస్తుందర్రా. బ్రహ్మరాతని మనం కొద్దిగా మార్చుకోడానికి అవకాశం దొరుకుతుంది,అనుభవంతో చెప్తున్నా.
ఈ సూక్ష్మం మీ చెవిని వేస్తున్నా,మీ ఇష్టం ఇకపై మరి!
జీవితంలో ఇంకేం కావాలి!
అడక్కుండానే అందరూ ప్రేమగా చూస్తుంటే-ఇంకేం కావాలి! మాట్లాడమంటే పాటలుపాడే మిత్రులున్నప్పుడు - ఇంకేం కావాలి!
నీసంతోషమే తమ సంతోషంగా భావించే కొంతమంది ఉన్నప్పుడు-ఇంకేం కావాలి!
నీ ఆనందం- బాధ పంచుకోవడానికి ఆప్తులున్నప్పుడు-ఇంకేం కావాలి!
అడగంగానే సహాయం చేసేవాళ్లున్నప్పుడు-ఇంకేం కావాలి!
వేళాపాళా లేకుండా కబుర్లు చెప్పేవాళ్లున్నపుడు-ఇంకేం కావాలి!
నీమాటే నమ్మకంతో వేదంగా భావించేవాళ్లున్నప్పుడు-ఇంకేం కావాలి!
అవసరమైనప్పుడు సేదతీర్చడానికి భుజాలున్నప్పుడు-ఇంకేం కావాలి!
షరతుల్లేకుండా ప్రేమ పంచేవాళ్లున్నప్పుడు-ఇంకేం కావాలి!
జంధ్యాల లేకపోయినా-హాస్యగ్రంధులెక్కువ ఉన్నవాళ్లు ఆప్తులైతే- ఇంకేం కావాలి!
కుటుంబవైద్యుడే సలహాలు తీసుకుంటుంటే- ఇంకేం కావాలి!
అనారోగ్యమే దరిదాపుల రానప్పుడు-ఇంకేం కావాలి!
పరులు ఈర్ష్యపడేంత ఆనందంగా బతికేస్తుంటే- ఇంకేంకావాలి!
వయసుతో సంబంధం లేకుండా అప్పుడప్పుడు బాల్యంలోకి తొంగిచూస్తూ జీవిస్తుంటే- ఇంకేం కావాలి!
నువ్వు చేసే ప్రతిపనినీ ప్రోత్సహించే వాళ్ళుంటే-ఇంకేం కావాలి!
డబ్బుతో సంబంధం లేకుండా సంతోషంగా బతుకుతున్నప్పుడు-ఇంకేం కావాలి!
ఇంకేదీ అక్కర్లేదు అనిపిస్తున్నప్పుడు- ఇంకేం కావాలి!
“ఇంకేం కావాలి” అనే ప్రశ్నకు సమాధానం లేనప్పుడు - ప్రశ్నయే సమాధానం అయినప్పుడు ఇంకేమీ అక్కర్లేదు ఈ జీవితానికి!
నూటికి నూరుపైసల సంతోషంతో మీరు బతుకుతున్నట్టేగా మరి!
పలకరింపు!
పలకరించడం అనేది ఓ చిన్నపదమే గానీ-మానవసంబంధాలు గాఢంగా-దృడంగా ఉండాలన్నా, అలాగే ఉండకపోవటానికి కారణాలు కూడా ఈపలకరింపే మనిషికి.కొంతమంది పలకరింపుతోనే ఆప్యాయత అంతా తొణికిసలాడుతుంది, పులకరించిపోతాం ఆనందంతో,సంతోషంతో.
ఇంట్లోవాళ్ళని ఓరకంగాను,స్నేహితులని ఓ రకంగానూ,ఆప్తులని మరో రకంగానూ, సహాధ్యాయుల్ని ఇంకో రకంగానూ, ఇరుగూ పొరుగు వాళ్ళని వేరే రకంగానూ, పరిచయమైన వ్యక్తుల్ని మరో రకంగానూ, అడపా-తడపా బజారుల్లోనూ, బయట కనపడేవాళ్ళని ఓ రకంగానూ, ఇలా వ్యక్తుల్నిబట్టి మన పలకరింపులు వివిధ రకాలుగా ఉంటాయి.
“ఆ….. పలకరించడమేగా” అనుకుంటాం కానీ-అది నిజంగా అద్భుతమైన కళ-అందరి సొత్తూ కాదు.ఈ పలకరింపులో మనం వ్యక్తం చేసే భావాలు- ఓ గాయకుడు ఎంత వైవిధ్యంగా పాడతాడో ఆ లెవెల్లో మనమూ మన ప్రతిభని ప్రదర్శిస్తుంటాం- ఒక్కోసారి మనకు తెలియకుండానే-మనకే తెలియదు అంత ప్రతిభ మనలో నిద్రాణమై ఉందని; మనమేం తక్కువ వాళ్ళమేమీ కాదు!
ఓవేళ మీకుగాని ఈ కళ లోపించివుంటే, ఖచ్చితంగా మీకు తెలిసినవాళ్లలో ఒకళ్లో, ఇద్దరో దీనిలో ఆరితేరిన వాళ్ళు గుర్తుకొస్తారు ఖచ్చితంగా!
ఈ పలకరింపు అనేది మామూలుగా అయితే వేరొకరిని కలిసినపుడు మన మెదడు చేసే అసంకల్పిత చర్య-.సాధారణంగా మన పలకరింపుతోనే మన భావాలు వ్యక్తం అవుతాయి-నాటకపు పలకరింపులతో సహా! మన పలకరింపుల్లో ఎంత కౌశలం దాగివుందో ఓసారి లుక్కేద్దాం - ఇబ్బందిగా మొహం పెట్టి పలకరించడం!
లోపల ఇబ్బందిగా ఉన్నా మొహం నిండా నవ్వు పులుముకుంటూ పలకరించడం!
“క్లోజ్ అప్ టూత్ పేస్ట్” ఏడ్వర్ టైజెమెంట్ లో లాగా నోట్లో ఉన్న పళ్ళన్నీ బయటపెడుతూ పలకరించడం!
ఏదో పలకరించాలి కాబట్టి పలకరించడం!
కష్టమైనా-ఇష్టంగా మొహంపెట్టి పలకరించడం!
మనసులో భావాలూ, విరుపులూ స్పష్టం చేస్తూ పలకరించడం!
ఆప్యాయంగా దగ్గరకి తీసుకుని స్పర్శిస్తూ పలకరించడం!
ఆలింగనం చేస్తూ పలకరించడం!
చేతులస్పర్శ ద్వారా ఆప్యాయతని అందిస్తూ పలకరించడం!
భుజం తట్టుతూ పలకరించడం!
కళ్ళతో పలకరించడం!
నవ్వుతో పలకరించడం!
మర్యాదపూర్వకంగాపలకరించడం!
చనువుతో పలకరించడం!
ఎత్తిపోటు మాటలతో పలకరించడం!
మూతీ-ముక్కూ విరుస్తూ పలకరించడం!
వ్యంగంగా పలకరించడం!
కవ్వింపుతో పలకరించడం!
పలకరించాలి కాబట్టి పలకరించడం!
రహస్యంగానూ, మౌనంగానూ పలకరించడం!
ఎవరినైతే పలకరిస్తామో వాళ్లకి మాత్రమే అర్ధం అయ్యేట్టుగా పలకరించడం!
సభ్యత కోసం పలకరించడం!
నలుగురికోసం పలకరించడం! (ఆ నలుగురూ ఎవరో ఓ పెద్ద వ్యాసమే రాసి పంపాను-ఇంతకు మునుపే-మళ్ళీ అడక్కండి)
పలకరించకపోతే ఏమైనా అనుకుంటారేమో అని పలకరించడం!
"నలుగురితో నారాయణ"లాగా పలకరించడం!
ఇంకేమైనా పలకరింపులు ఉంటే తెలియచేయండి!
ఇప్పటికయినా అర్థమైందా పలకరింపు ఎంత ముఖ్యమో, ఈ కళ ఎక్కువగా అభ్యసించడం ఎంత అవసరమో.ఇందులో చెప్పిన అన్నిరకాల పలకరింపులు మనకు రాకపోయినా,చేతకాకపోయినా-సగటు మానవుడికి ఇవన్నీ ఉండటం మంచిది-ఎన్ని ఎక్కువ నేర్చుకుంటే అంతమంచిది- హాయిగా,రోజువారి బతికేయడానికి-కానీయండి, మొదలుపెట్టండి ప్రాక్టీస్ చేయడం!
చిన్నచిన్న ఆనందాలు, సంతోషాలే ముఖ్యం
సమయపాలన చాలామందికి ఉండదు,వాళ్ళు చేసే పనులు వాళ్ళ పధ్ధతి ప్రకారం,వాళ్ళ నిర్ణీత సమయంలో చేస్తూవుంటారు(అందరికంటే ప్రతీ పనికి ఎక్కువ సమయం తీసుకుంటారు) వీళ్ళకి ప్రతీపనికి ఓ లెక్క- సమయం ఉంటాయి.కొద్దిగా తొందరగా చేసేవాళ్ళని చూసినా,హడావుడిగా చేసేవాళ్ళని చూసినా వీళ్ళకి చిన్న చూపే,ఎందుకంటే వీళ్ళ ఉద్దేశంలో వాళ్ళందరూ నిర్దారించిన సమయం తీసుకోకుండా తొందరగా చేయడమే వీళ్ళ పాపం- “పని తొందరగా చేయడం తొందరపడి చెయ్యడం కాదే”!
సాధారణంగా ఈ అలవాటు ఉన్నవాళ్లకి సమయపాలన ఏమాత్రం ఉండే అవకాశమే లేదు.కానీ వాళ్ళ ఉద్దేశంలో సమయాన్ని చక్కగా ప్రతి పనిలో సాగిస్తున్నాం కాబట్టి, సమయపాలన వీళ్ళు పాటిస్తున్నట్టుగా వేరెవరూ చేయడం లేదనే భ్రమలో బతికేస్తుంటారు.చేసే ప్రతీపనిలో ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల జీవితంలో ఏమి కోల్పోతున్నారో వీళ్ళకి తెలియదు.ఎవరి ఇష్టప్రకారం, స్వేచ్ఛగా వారు జీవించవచ్చు- ఇందులో వేరేవాళ్లు అభ్యంతరపెట్టడానికి హక్కే లేదు.కానైతే వీళ్ళలాగా అవతలివాళ్ళు లేరనే విమర్శలు మాత్రం సరికాదు
(ఇరుపక్షాలకు)
నా అభిప్రాయం ప్రకారం వీళ్ళకి ఇంకో ప్రమాదం కూడా ఉంది (వాళ్ళవరకే పరిమితం అనుకోండి) ఇలా ప్రతీపనికి “భారత రాజ్యాంగకర్త” నిర్దేశించిన సమయాన్ని పాటించడంవల్ల వీళ్ళకి జీవితంలో ప్రాధాన్యాలు ఉండవు.అంటే ఉండవని కాదు, అవి జరగవు- వాళ్లకి అంత సమయం,తీరికా లేవు కాబట్టి- జీవితంలో చాలా చిన్న చిన్నఆనందాలు కోల్పోతారు.దాన్ని వాళ్ళు అంగీకరించకపోయినా కూడా-ఇది కఠోర వాస్తవం.అయినా వీళ్ళ అంగీకారం మనకెందుకు-వాస్తవాలు, జీవిత సత్యాలు మాట్లాడుకునేటప్పుడు- “వేమన” శతకాలు మన అభిప్రాయాలు తెలుసుకొని రాశారా-ఆయన చెప్పతల్చుకున్నది ఏ “శశబిషలూ” లేకుండా నిర్ద్వందంగా చెప్పేసారు!
పై పెచ్చు అవతలవాళ్ళని ఎడాపెడా అనేస్తూ ఉంటారు- “జనానికి ఇంత తీరుబడి ఎక్కడ ఉంటుందో” ఆ…. ఎందుకు ఉండదూ ఎక్కడ పనులు అక్కడ వదిలేసి- కక్కా బిక్కీగా చేస్తూ ఉంటే- సుబ్బరమ్ లేకుండా- మాకూ దొరుకుతుంది మేమూ అలా చేస్తే” అని.అంతేగానీ జీవితంలో వీళ్ళు ఏం కోల్పోతున్నారో రవ్వంతకూడా అర్ధంచేసుకునే ప్రయత్నమే చెయ్యరు.ఈ రొటీన్ జీవితానికి అలవాటుపడ్డ క్రమంలో “కాలం ఆగదు- కాలుడూ ఆగడు” అయ్యో జీవితాన్ని వ్యర్థం చేసుకున్నామే అని పశ్చాత్తాపపడినా ప్రయోజనం లేదు.
అదృష్టవశాత్తూ ఇలాంటివాళ్ళు ప్రపంచంలో చాలామంది కాదు కానీ కొద్దిమంది ఉంటారు.వీళ్ళందరికీ భగవంతుడు “మేలుకొలుపు” పాడి, వీళ్ళ మొహాన కాసిని నీళ్లు చల్లి, వీళ్ళు తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలని దేవుడికి దండం పెట్టడం తప్ప మనం మాత్రం ఏం చేయగలం చెప్పండి.
అయినా“కందకి లేని దురద కత్తిపీటకెందుకు” అన్నచందంగా-నాకూ మీకూ ఎందుకు చెప్పండి వీళ్ళసంగతి-వాళ్ళు వాళ్ళ లెక్కప్రకారం హాయిగా బతికేస్తున్నారు!
నా తాపత్రయం అల్లా,ఇలాంటివాళ్ళు “చిన్నచిన్న ఆనందాలు,సంతోషాలే ముఖ్యం జీవితంలో” అని ఎప్పుడు తెలుసుకుంటారో ఏమిటో!
నేననుకోవడం- లార్డ్ టెన్నిసన్ రాసిన “బ్రూక్” పద్యం బాగా గుర్తుండి ఉంటుంది వీళ్ళకి- మనలాగే!
"మెన్ మే కం అండ్ మెన్ మే గో -బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్"
కాదనలేం కదా- వాళ్ళ మానాన వాళ్ళని వదిలేద్దాం!!!!
ప్రయాణాలు - పలకరింపులు, చుట్టరికాలు - వంశవృక్షాలు
ఈ మధ్యకాలంలో రైల్లో ప్రయాణం చేస్తున్నా, బస్సుల్లో ప్రయాణం చేస్తున్నా- చేసేదే తక్కువ (బెంగుళూరు వచ్చింది మొదలు నా వరకు గత ఐదేళ్లుగా కార్ ప్రయాణమే-రైలు, బస్సులో తక్కువే) ప్రయాణాల్లో పక్కవాణ్ణి పట్టించుకోవడమే లేదు, ఓ పుస్తకం చదవడం లేదు,ఎప్పుడూ జాతకం చూసేవాళ్లలాగా ఆ చరవాణితో మమైకమేపోవడం, చెవిలో రెండు వైర్లు పెట్టుకోవడం-ఈ ప్రపంచంతో నాకేమిటి సంబంధం అన్నట్టుగా!
ఏదో కొంతమంది పలకరింపుగా మనం సీట్ దగ్గరకు వెళ్ళినప్పుడు “ముఖ కవళికలు మారుస్తారు” ఎవరో బలవంతం చేసినట్టు, మరి కొంతమందైతే అదేదో “వాళ్ళ పక్కన కూర్చోవడం తప్పు అయిపోయినట్టుగా ఓ లుక్కు” ఇస్తారు.
విమానాల్లో సంగతి అసలు చెప్పనే అక్కర్లేదు, ఎవడికి వాడు- ఆ విమానానికి యజమాని అయినట్టు, ఏదో మనం వాళ్ళ పక్కన కూర్చోవడానికి వాళ్ళు అనుమతి ఇవ్వడం ఏదో మనకు మేలు (మెహెర్బాని) చేసినట్టు ఫీల్ అవుతూ ఉంటారు-కొద్దిమంది మాత్రమే పలకరింపుగా నవ్వుతారు.
ఈ రోజుల్లో ఇంట్లోవాళ్ళతో మాట్లాడటానికి టైం ఉండటంలేదు, పూర్వం రోజుల్లో, బస్సు, రైలు ప్రయాణాల్లో, ఎంత మంచి అనుభవాలు, విచిత్రంగా కూడా ఉండేవి, పక్కవాళ్ళు రైల్లో, బస్సో కదలాగానే సంభాషణలు మొదలు పెట్టేవాళ్ళు, కాస్త మనమూ చొరవగా, సరదాగా మాట్లేడే స్వభావం అయితే; కొత్త విశేషాలూ తెలిసేవి, ప్రయాణాలు కూడా సరదాగా సాగిపోయేవి.
ఒకళ్ళనొకళ్ళు వంశవృక్షందాకా ఆరా తీసేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు కొంతమంది ప్రయాణీకుల్లో.చుట్టరికాలు తిరగేసేవాళ్ళు బీరకాయ పీచు చుట్టరికాలు కలిపేవాళ్లు కూడా కొంతమంది - అలా వాళ్ళు ఉన్నారు గదా అని బిగుసుపోయి కూచోవడం ఉండేది కాదు.
ఏదో వాళ్ళ సరదా, కలుపుగోలు మనస్తత్వం- అంతే,మనకు పోయేదేమీ లేదు, వాళ్ళకి ఒరిగేదేమీ లేదు ;ఈ ముచ్చట్లతో- ఇరువురికి ప్రయాణం ఓ మంచి అనుభవం అవుతుంది.ఒక్కసారి వాళ్ళు మన ప్రయాణాల్లో, కనపడటం కూడా తటస్థపడేది, నవ్వుతూ, ఆప్యాయంగా పలకరించేవాళ్ళు కూడా. పక్కవాడితో సరదాగా ప్రయాణం చేయడం అనేది కూడా ఓ కళే నా అభిప్రాయం ప్రకారం- కొంతమందికి ఇది ఇష్టం ఉండకపోవచ్చు, నా వరకు నాకు కొత్త వాళ్ళని పరిచయం చేసుకోవడం, కబుర్లు చెప్పుకోవడం సరదా.
బెంగుళూరు వచ్చిన ఈ అయిదు ఏళ్లలో హైదరాబాద్ రైలు ప్రయాణాల్లో ఇద్దరు ప్రయాణీకులు మాత్రం కనెక్ట్ అయ్యారు,అందులో ఒకరితో అయితే కాంటాక్ట్ లోనే ఉంటాము ఒకరికొకరం.
పెద్ద పెద్ద రోడ్లు,కార్లు వచ్చాక, చాలామంది రైలు ప్రయాణాలు,బస్సు ప్రయాణాలు తగ్గించేశారు కూడా అనుకోండి కార్ అయినా సరే గమయానికి చేరడమే ప్రధానం కాదు-నిర్దిష్ట సమయానికి ఎలాగూ చేరతాం- ఈ పూర్తి ప్రయాణంలో సరదాగా సాగడమే అసలైన ఆనందం- జీవితమైనా అంతే; కాకపొతే జీవితంలో చేసే ప్రయాణం కొద్దిగా పెద్దది- అయినా చివరి మజిలీ వరకూ సరదాగా, ఆనందంగా గడిపేయడమే అసలైన జీవితం అంటే.
మామూలుగా నేను బెంగుళూరు నుంచి హైదరాబాద్ ఎప్పుడు వెళ్లినా సాధ్యమైనంతవరకూ కార్ లోనే వెళ్లి వస్తుంటాను.అందరికీ తెలిసిన విషయమే, బెంగుళూరు-హైదరాబాద్ రోడ్డు అద్భుతంగా ఉంటుంది-ఒక్కణ్ణే చులాగ్గా, అలసటలేకుండా డ్రైవ్ చేయడం అలవాటు అయిపొయింది;దారిలో టిఫినీలు, కాఫీలు తీసుకుంటూ హైదరాబాద్ చేరిపోవడం అలాగే తిరిగి వచ్చేటప్పుడు కూడా.
మన దారిని మనం డ్రైవ్ చేస్తుంటే వేరే కారు వాడు కెలికితే కాసేపు వాడితో పోటీపడటం, ఏ ట్రాఫిక్ దగ్గరో, టోల్ గేట్ దగ్గరో, టీ కి ఆపినప్పుడో, ఎవరో ఒకరం ఆగడం జరిగేది, దాంతో పోటీ ఆటోమేటిక్ ఆగిపోయేది.అనంతపురం ఏరియాలో జామకాయలు, సపోటాలు కొనడం రివాజు, చాలా తాజాగా ఉంటాయి- తోటల్లోంచి- తిన్నగా మన దగ్గరకి వచ్చేస్తాయి వాళ్ళ దగ్గర నుంచి.కొనుక్కోవాలనుకోండి- “గుండాయన అన్నట్టు డబ్బు ఊరికినే రాదుగా”- వస్తువైనా అంతే మరి!
వేసవికాలం అయితే తాటిముంజలు- తాటి మట్టల్లో కట్టి అమ్ముతారు - కార్ లో వెళితే అక్కడ హైదరాబాద్ లో తిరగడానికి ఆటోవాణ్ని బతిమాలక్కర్లేదు, ఆటోవాడితో “సికింద్రాబాద్ వస్తావా” అంటే “చార్మినార్ వెళ్తున్నా” అంటాడు- వాడితో బాటు వెళ్ళలేముగా మన పనులు మానేసి!
అలాగే ఓలా వాడిచేతో, ఊబర్ వాడిచేతో బాదించుకోకుండా, బాధించుకోకుండా ఉంటాం కూడా.వీటన్నిటికంటే ముఖ్యం బోల్డు సమయం మిగులు, మన వీలుప్రకారం ఎక్కడికైనా వెళ్లిపోవచ్చు.అందునా అలవాటైన, రోడ్లు, జనం, రోడ్లమీద వాళ్ళ విన్యాసాలు, చొరవగా, లాఘవంగా నడపడం అలవాటుగా, ప్లస్ హైదరాబాద్ డ్రైవింగ్ మర్చిపోకుండా ఉంటాం ఏదైనా అలా బస్సుల్లో, రైళ్లలో, పక్కవాళ్ళతో కబుర్లు చెపుతూ, అవీ, ఇవీ కొనుక్కుని తింటూ ప్రయాణం చేసిన రోజులూ, ఆ సరదానే వేరు.అన్నీ మారిపోయినట్టే, మనలోనూ, మన అలవాట్ల లోనూ మార్పులు వచ్చేసాయి-తెలిసి కొన్ని, అనుకోకుండా కొన్ని, మనకు తెలియకుండానే కొన్నీనూ.
ఈ ప్రయాణంలో పదనిసలు అనుభవించాలే గానీ, చెపితే అర్ధమయ్యేవి కాదు!
ఒక్కసారి మీరు ఫ్లాష్ బ్యాక్ లో ఉండండి ఈరోజు....
మొదటి సంతకం
మనకు రాయటం వచ్చిన దగ్గరనుంచి, చిన్నప్పుడు ఏది ఎక్కువగా రాసేవాళ్ళం అంటే -నిస్సందేహంగా “మన పేరే”,అంత ఇష్టం మన పేరన్నా, ఆ పేరు ఎక్కడపడితే అక్కడ రాయడమన్నా.పలకల మీదా, పుస్తకాల మీద, బండల మీద, ఏటిలోని ఇసకమీద, చివరికి నీళ్ళల్లోనూ ("రాళ్ళల్లో, ఇసకల్లో రాసాము ఇద్దరి పేర్లూ" పాటలా కాదు- ఇద్దరి పేర్లు రాసే వయసు అప్పటికి లేదుగా మరి) ఎక్కడపడితే అక్కడ రాసేయడమే! కానీ సంతకం విషయానికి వచ్చేటప్పుడు-సంతకం అంటే తెలుసుకానీ- అదేదో పెద్దవాళ్ళు- ముఖ్యంగా టీచర్లు, హెడ్ మాస్టర్ చేయాల్సిన, చేసేపని మాత్రం అని తెలుసు.నాన్న సంతకం చేస్తారని తెలుసు, అలాగే మనీ ఆర్డర్, రిజిస్టర్డ్ పోస్ట్ వచ్చినప్పుడు-ఇంట్లో పెద్దవాళ్ళు చేస్తారని కూడా తెలుసు!
ఆ సంతకానికి ఉండే విలువ మాత్రం సామాన్యం కాదు- అందునా మన “ఆన్సర్ పేపర్లు” దిద్ది ఇచ్చినప్పుడు- మనకు వచ్చిన మార్కులతో బాటు, మాస్టారి సంతకం కూడా చూస్తాం- చేశారో లేదో అని.ఓవేళ సంతకం లేకపోతే మాస్టారి దగ్గరకి మరీ వెళ్లి సంతకం పెట్టించుకునేవాళ్ళం.
ఇన్ని సంతకాలు చూసినా ఎప్పుడూ సంతకం చేయాలనీ అనిపించేది కాదు, అప్పుడప్పుడు ఏదో స్కూల్ ఫారాల మీద మన “పేరు” అన్నచోట- పేరు రాయమనేవారు,పొరపాటున “విద్యార్థి సంతకం” అని ఉంది అంటే టెన్షనే-సంతకం రాదుగా పేరు రాయడం తప్ప. వెంటనే దగ్గరే ఉన్న మాష్టారునో, స్కూల్ ఆఫీసులో వాళ్ళనో కంగారుగా అడిగేయడం.వాళ్ళు, చిరాగ్గానో, నవ్వుతూనే చెప్పేవాళ్ళు(వాళ్ళ మూడును బట్టి) “మీ పేరు రాయండిరా, అదే సంతకం” అని!
తొమ్మిదో,పదోతరగతికి వచ్చేసరికి మన పేరుతో రరకాలుగా సంతకం ప్రాక్టీస్ చేయడం జరిగేది, అందులో ఫ్రెండ్స్ ఏది బాగుందని చెప్తే అది ఖరారు చేసుకోవడం. పదో తరగతిలో అనుకుంటా- పబ్లిక్ ఎగ్జామ్ గా- సంతకం పెట్టమనేవారు;అప్పుడు మాత్రం పేరు కాకుండా మొట్టమొదటిసారిగా సంతకం చేస్తుంటే అదో చెప్పలేని ఫీలింగ్ మరి.
కాలక్రమేణా కాలేజీలో చేరే టైముకి సంతకాన్ని బాగా చేయడం నేర్చేసుకుని ఉంటాం; దాదాపుగా కాలేజీ దశనుంచి ఉద్యోగంలో చేరిన తర్వాత మన చుట్టుపక్కలవాళ్ళ సంతకాలు చూసి మన సంతకం ఇంకొద్దిగా రిఫైన్ చేసుకుంటాం; ఇంతవరకూ మన సంతకాలకేం ఇబ్బంది లేదు.
సంతకాల యొక్క ప్రాముఖ్యం,ఖచ్చితత్వం బ్యాంకులో మొదటసారి అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు తెలుస్తుంది-అప్పటిదాకా నేర్చుకున్న సంతకంతో “బ్యాంకు అకౌంట్” ఓపెన్ చేస్తాం.
ఇప్పటిలాగా “ఏ.టి.ఎం” కార్డులు ఉన్న రోజులు కాదు కదా మరి; డబ్బులు కావాలంటే బ్యాంకు కి వెళ్లి ఓ విత్ డ్రాయల్ ఫారం ఫిల్ చేసి నిర్దేశిత కౌంటర్ లో ఇవ్వడం- చిన్న ఊళ్ళో, ఒకటే బ్యాంకు ఉండటం మూలాన- అక్కడ పనిచేసే ప్రతి మనిషి- పేరు పేరునా తెలిసిపోతుంది.అంచేత ఎవరికి ఆ ఫారం ఇవ్వాలో అక్కడే ఇచ్చి, కాస్సేపాగి కాష్ కౌంటర్ వైపు తొంగి చూస్తూ ఉంటాం, ఎప్పుడెప్పుడు మనల్ని పిలుస్తారా, మన డబ్బులు ఇస్తారా అనే ఆత్రంత.
ఇంతలో మన ఫారం తీసుకున్నాయన (వెంకట్రావు అంకులో, సుబ్బారావు అంకులో) మనల్ని పిలుస్తారు (అదే వేరేఊరి నుంచి ట్రాన్స్ఫర్ అయి వచ్చినవాళ్లయితే- పేరు తెలుసుకుని "గారు" తగిలించి పిలిచేవాళ్ళం అనుకోండి. క్రమేపీ మనం ఫలానా వాళ్ళ అబ్బాయి అని తెలిసేది వీళ్ళకి) “మన సంతకం సరిగ్గా లేదని”- ఒకటే కంగారు, భయం వేస్తుంది- ఏదో మనల్ని వాళ్ళు కొట్టేస్తారేమోననే ఫీలింగ్ లోపల.
అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఫారంలో చేసిన సంతకానికి ఇప్పుడు చేసినదానికి ఓ మెలికో, ఒంపులొనో ఏదో తేడా ఉంది అని.ఓ చిత్తుకాగితం మీద అది చూసి రెండు మూడు సార్లు కాపీ చేయడం, అప్పుడు సరిగ్గా సంతకం చేయడం, కాస్సేపటికి మన డబ్బులు తీసుకుని బ్యాంకులోనుంచి బయట పడటం షరామామూలే.
క్రమేపీ జీవితంలో ఎదుగుతున్న కొద్దీ సంతకాలు పెట్టడం యాంత్రికం అయిపోతుంది.ఉద్యోగాల్లో,ఉన్నతస్థితిలో ఉంటే ఆ సంతకాలు కొంతమంది జీవితాల్ని మార్చేస్తాయి కూడా.
ఏది ఏమైనా మన మొహాలమీద భగవంతుడు ఓ సంతకం చేసి పంపిస్తాడు.మన సంతకాలతో అవతలవాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేద్దాం.మీరు సంతకాలు పెట్టేటప్పుడు ఈ విషయం గుర్తు పెట్టుకోండి-నవ్వులు చిందించండి ఇతరుల జీవితాల్లో, మీ జీవితాలతో బాటు!
జీవితంలో మీ చిరువవ్వే సంతకం చేసుకున్నారనుకోండి- ఇహ సంతకాలు రాకపోయినా, సంతకాలు చేయకపోయినా ఫర్వాలేదు-మీరు అప్రయత్నంగానే అలాగవుతారు,ప్రయతించించి చూడండి, కష్టంకాదు!
స్వార్ధంతో బతికేస్తున్నారు
ఈ మధ్య ఎవరితో మాట్లాడినా ఒకటే సాధారణమైన అంశం అందరు మాటల్లో తెచ్చేది.పూర్వపు ప్రేమలు ఏమై పోయినాయి,జనం ఎందుకు ఎందుకు నిర్దాక్షిమైన స్వార్ధంతో బతికేస్తున్నారు అని.
ఏపాటి చిన్న చరిత్ర చదివినా మనకు అవగతమయ్యేది ఏమిటంటే, ప్రతీ సమాజంలో- నా భావం వివిధప్రాంతాలని బట్టి-అంటే దేశం మొత్తం; మానవుల ప్రవర్తనకి దానికి కారణాలు, మూలాలు ఉంటాయి-భౌగోళిక పరిస్థితులు, వాతావరణంతోబాటు!
ఆటవికమానవుడు పూర్తిగా తన తిండి గురించి తన రక్షణ గురించే ఆలోచించేవాడు, క్రమేపి తర్వాత తనకంటూ ఒక భార్యా పిల్లలు, కుటుంబం ఏర్పడింది.మెల్లిమెల్లిగా తన ప్రాంతం, తన తెగవాళ్ళు అనే పరిధి గీసుకుని తగిన రక్షణతో జీవనం సాగించేవాళ్ళు-క్రమక్రమేణా మూగసైగల నుంచి బాషా ఉద్భవించింది.
తన అవసరాలకి అనుగుణంగా ప్రకృతిలో దొరికే వాటిని, ప్రకృతిని దారిలోకి తనకు అనుకూలంగా తెచ్చుకుని బతుకులో మార్పు తెచ్చుకున్నాడు.అప్పట్లో ఈ విశ్వం ఎల్లలులేని విశాల జగత్తు.బలమున్నవాడే రాజు అన్న సామెతలాగ కొన్ని శతాబ్దాలు గడిచాయి.క్రమేపి ఆది మానవుడే నాగరికత, కట్టు బట్టా అలవాటు చేసుకున్నాడు.
ఆదిమానవుడి తన పొట్ట గురించి, రక్షణవరకే పరిమితమయ్యాడు.ఎప్పుడైతే మానవ పరిణామక్రమంలో చోటుచేసుకున్న మార్పులవల్ల, తన కుటుంబం అనే భావన అంతరంగంలో ప్రవేశించిందో-తన ఆలోచనలకు తగ్గట్టుగా సంపాదన, దాచుకోవడం,అనే ప్రక్రియ మొదలైంది.రాజ్యాలు వచ్చాయి, రాజులు వచ్చారు, కొన్నివేల సంవత్సారాలు వారివారి రాజ్యాల్ని పరిపాలించారు- దేశం, ప్రజలు కూడా సుభిక్షంగా ఉన్నారు.నాగరికతే బాగా వెల్లివిరిసిన రోజులవి, ప్రజలు నిస్వార్ధంగా సంస్కారంతో మెలిగేవాళ్ళు.
ఇప్పుడు ప్రతీవాళ్ళు వాడే “వసుధైక కుటుంబం” అనే మాట“మనసా వాచా కర్మణా” సమాజంలోని ప్రతీమనిషి ప్రవర్తనలోనూ ప్రస్ఫుటంగా కనపడేది-ఒక్క రాజే కాదు; అంచేతే “యధా రాజా తధా ప్రజా” అనేవారు -ఇప్పుడు చెడుకి వాడుతున్నాం, అది వేరే సంగతి!
భారతదేశ చరిత్రలో ఏ పుట తిరగేసినా ఏ భారతదేశపు రాజూ తన ప్రజల్ని పీడించినట్టు మనకు కనపడదు (ఒకటో అరో ఉండి ఉండొచ్చు- “ఎడ్డెమ్ అంటే తెడ్డెమ్” అనేవాళ్ళు ఈ విషయంలో నా ఈకలు పీకే ప్రయత్నం చెయ్యొద్దు- నేనేమి చరిత్ర కారుణ్ణీ కాదు, మీకు చరిత్రా నేర్పట్లేదు)
కాలక్రమేణా రాజ్యాలు పోయాయి,రాజులు మట్టిపాలయ్యారు,కాలగర్భంలో కలిసిపోయారు;రాజ్యాలు పోయాయి, రాష్ట్రాలు ఏర్పడ్డాయి-దేశాలు ఏర్పాడ్డాయి- దానితో పాటు దేశద్రోహులూ పుట్టుకొచ్చారు.
తెల్లవాళ్లు వర్తకంరూపంలో రావడం,మనలో మనకు చిచ్చుపెట్టి ఈ కొంతమంది దేశద్రోహుల అండతో అఖండభారతదేశాన్ని దోచుకోవడం చరిత్రలో చదివాం-వాళ్ళు చేసిన అకృత్యాలతో పాటు.మన తాతలు స్వాతంత్ర్య సమరయోధులు, అమరులు అవడంతో బాటు ఆ దేశద్రోహుల గుర్తులు ఇంకా మిగిలిపోయాయి స్వాతంత్ర్య సిద్ధితో బాటు.
దేశ స్వాతంత్ర్యానికి పోరాటం చేయడంవల్ల- విదేశీయుల,మ్లేచ్చుల అక్రమణవల్ల- దేశభక్తితో పాటు- ప్రజలు పూర్తి నిస్వార్ధతను అలవర్చుకున్నారు.అది రెండు మూడు తరాల వరకూ సక్రమంగా కొనసాగింది.
క్రమేపి ఆదిమానవుడి స్థాయినుంచి ఇప్పటి డిజిటల్ యుగంవరకూ వివిధ రకాలుగా మానవుడు రూపాంతరం చెందాడు,దానికి తగ్గట్టుగా సమాజంలో మార్పులు చోటుచేసుకున్నాయి.
ఎప్పుడైతే ప్రపంచీకరణ పేరుతో ప్రజల ప్రవర్తనలో విశృంఖలత మొదలయ్యిందో స్వార్ధం ప్రజల్లో “జడలు విప్పారింది” -దానికి తగ్గట్టుగానే ఈ రోజుల్లో “జడలు” వేసుకునే యువతరం నారీమణులు కనపడరు, వాళ్ళ కేశాలు విప్పారి ఉంటున్నాయి- అడపా తడపా కనపడతారు ఎడారిలో ఎండమావిలా జడలతో.
ఈ మాట సందర్భానుసారం వాడా -జడలు గుర్తుకొచ్చి-అంతేగానీ వేరే ఉద్దేశంతో కాదు!
తమ బాల్యం, తల్లి తండ్రులు, రక్త సంబంధీకులు, బంధువులు, శ్రేయోభిలాషులు వీరి అవసరం నాకు లేదు అనే స్వార్ధస్థితికి చేరుకున్నాడు.వీళ్ళలో ఎవరైనా తమ సమ ఉజ్జీలుగా భావిస్తే- డబ్బు విషయంలో, ఉద్యోగాల విషయంలోనూ, అర్ధికి స్థితిగతుల విషయంలోనూ (కొలమానంగా) మాత్రమే-వాళ్ళతో సంబంధాలు కొనసాగిస్తారు.
మిగిలిన వాళ్లలో ఎవరు వీళ్ళకి సాటి రారో నిర్లజ్జగా,సంబంధాలు తెంచేసుకుంటున్నారు-వాళ్ళ గతాన్ని కూడా మర్చిపోయి-డబ్బున్నవాళ్ళు, డబ్బులేనివాళ్ళు ప్రాతిపదికగా! వింత ఏమిటంటే వీళ్ళలో చాలాశాతం మంది పూర్వాశ్రమంలో చాలా సామాన్యజీవితం గడిపినవాళ్ళే! కొంతమంది విషయంలో అయితే నలుగురూ చేయి వేస్తేగానీ జీవితాలు తెల్లారేవి కాదు ఆ రోజుల్లో!
ఎవరినైతే వీళ్ళు చులకనగానూ,ఏహ్యభావంతో చూస్తున్నారో- వాళ్ళు అనేవాళ్ళు లేకపొతే వీళ్ళు గతంలోనే కూరుకు పోయేవారు- మంచి భవిష్యత్తే లేకుండా.
నా అరవైఏళ్ల పైచిలుకు జీవితంలో ఇంత దరిద్రపు మనస్తత్వాలని చూడలేదు, స్పీడ్ యుగంలాగే వీళ్ళ సంఖ్యా రోజురోజుకీ పెరిగిపోతోంది-"రిలయన్స్ జియో" చందాదారుల లాగా, “ముఖేష్ అంబానీ సంపద”లాగా -అంతరం పెంచుకుంటూ అందలాలు పెంచుకుంటూ పై పైకి ఎదిగిపోతున్నారు.వీళ్ళకి స్పృహలోకి రాని విషయం ఏమిటంటే- అలా పై పైకి ఎదిగిపోతూ ఏదో ఒకరోజు వీళ్ళు పైకి ఒంటరిగానే వెళ్లిపోతారు అనే సంగతి!
ఇదేదో సమాజ స్పృహకో,జనాల్ని ఉద్ధరించటానికో రాయలేదు.ఈ కుళ్ళు,దరిద్రాన్ని చూసి తట్టుకోలేక ఒళ్ళు మంటతో వచ్చిన వేడిసెగ ఇది.
ఇది చదివి నేను పేర్కొన్న వర్గంవాళ్ళు ఓ వెర్రి నవ్వు నవ్వుకోవచ్చు మేధావుల్లాగా, ఇక నా పైతరంవాళ్ళు ఇంకా సజీవులుగా వార్ధక్యంలో ఉన్నవాళ్ళ బాధ వర్ణనాతీతం ఈ విషయంలో- కనపడ్డప్పుడల్లా ఇవే కబుర్లు మాతరం లాగే నిరంతరం- మా రెండుతరాలు ఎప్పుడు కనుమరుగై పోతాయో అని చూస్తోంది ఈతరం!
అలా కాకుండా గతాన్ని తల్చుకుని తప్పులు, నడవడిక, ప్రవర్తన- వర్తమానంలో సరిచేసుకుంటూ ఉన్న ప్రతీ మనిషికీ, సమాజానికీ, దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది- మన కళ్లెదుట ప్రపంచంలో, సమాజంలో రోజువారీ చూస్తూనేఉన్నాం.
ఈ తరంలో కొంతమందికైనా ఆ కనువిప్పు కలిగించాలని కోరుకునే కోట్లానుమందిలో నేనూ ఒకణ్ణి- శతకోటి లింగాల్లో బోడిలింగం లాగా!