నేనూ - మా ఊరు

ఈమధ్యే అద్దెకుండేవాళ్లు ఖాళీ చేయడంవల్ల మా డాబామీద వాటా ఖాళీగా ఉంది కొన్ని రోజులుగా.కింద విశాలంగా ఉంటుందని మేము కింద ఉంటూ పై వాటానే అద్దెకి ఇస్తూ ఉంటాం ఎప్పుడూనూ (కాస్త సందడిగా ఉంటుందని-డబ్బుకోసం కాదు)

ఈరోజు పొద్దున్నే లేవగానే చప్పుళ్ళు వినబడుతున్నాయి-లారీ ఆగిన చప్పుడు, సామాన్ల చప్పుడూనూ- ఆ చప్పుళ్ళకి మెలకువ వచ్చేసింది(ఎవరో కొత్తవాళ్లు వచ్చినట్టున్నారు- నాన్న అన్నారు ఎవరో ఆఫీసర్ కి అద్దెకిస్తున్నారని వివరాలకోసం నేనూ పెద్దగా ఆసక్తి చూపెట్టలేదు) తర్వాత అమ్మని అడిగితే వివరాలు ఎలాగూ తెలుస్తాయి అనుకున్నా- వివరాలనిబట్టే వాళ్ళమీద నాకు “ఆసక్తి” ఉంటుంది-నా మనసులో భావం పట్టేసి ఉంటారు ఈ పాటికి!

వేసవి సెలవలు అవటం మూలాన నేను ఆలస్యంగా లేచినా అమ్మ సుప్రభాతం ఉండదు-వెంకటేశ్వరస్వామికి తప్ప.అదే కాలేజీ జరుగుతున్న రోజుల్లో అయితేనా - సూరీడు లేచేముంది నేను లేచి తీరాలి- అదేదో సూరీడు నేను లేపితేగానీ మాఊళ్లోకి, మాఇంట్లోకి రానట్టు.

మామూలు రోజుల్లో అయితేనా...

“ఏరా సూరి, సూర్యనారాయణుడు వచ్చి చుర్రుమని పొడుస్తున్నా ఇంకా పక్క మీద దొర్లడమే.ఇంత సమయందాకా పడుకుంటే శుభం కాదురా, లే, ఇప్పటికి రెండుసార్లు లేపాను, లే ఇక..” అలా అమ్మ సుప్రభాతం సాగుతూనే ఉంటుంది నేను లేచేంతవరకూ.

అప్పుడప్పుడు అమ్మతో అంటుంటాను-"నీ సూరి లేవకపోయినా ఆ సూరీడు రోజూ నాకంటే ముందే లేస్తాడుగా"!

సెలవలు అవడం మూలాన కాస్త వెసులుబాటు నాకు, విశ్రాంతి అమ్మగొంతుకు!

ఏదైతేనేం కాస్త రాత్రిపూట స్నేహితులతో కాలక్షేపం చేయడానికి, గోదారిగట్టు కాలవల్లో ఈత కొట్టడానికి, వీధి అరుగులమీద కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి, రెండవ ఆట సినిమాలు చూడటానికి అనుమతి దొరికేది (బుద్ధిమంతుణ్ణి బాబు నేను) వేసంగి సెలవుల్లోనే- ఏ స్కూల్ పిల్లలకైనా,కాలేజీ పిల్లలకైనా!

వీధి అరుగులమీద రాత్రిపూట కబుర్లు చెప్పుకుంటూ ఉంటే- చిరాకు పడేవాళ్ళు కొందరైతే,మెచ్చుకునేవాళ్ళు కొందరూ-ఎంచేతంటే దొంగల భయం ఉండదుగా మా వీధిలో.వేసవికాలం అవడంవల్ల- ఆరుబయట వీధిలో అందరూ మంచాలు వేసుకొని, వాటికి దోమతెరలు కట్టుకుని పడుకోవడం అలవాటు.మాది ఓ పక్కగా ఉన్న సందు అవటంవల్ల సాయం సమయానికే రద్దీ ఉండేదికాదు- మా వీధిలో ఉండేవాళ్ళం తిరగడం తప్ప.

కొన్ని ఇళ్లవాళ్లయితే,సంధ్యా సమయానికే వాళ్ళ ఇళ్లముందు నీళ్లు చల్లేవారు, మళ్ళీ ఎనిమిది గంటలకల్లా రెండవ విడత నీళ్లపోత- కళ్ళాపి చల్లినట్టు.పగలు ఎండకి నేల వేడెక్కి ఉండేది గదా, మొదటిసారి చల్లినప్పుడు వేడి ఆవిరి అంతా పోయేది.రెండవ విడత చల్లడంవల్ల పడుకునే సమయానికి భూదేవి తాపం తగ్గి చల్లపడిపోయేది.

తర్వాత మంచాలు, దోమతెరలు కట్టే ఏర్పాట్లలో మునిగిపోయేవారు.నీళ్లు చల్లే కార్యక్రమం ఆడపిల్లలది - ఆడపిల్లలులేని ఇళ్లల్లో మగపిల్లలో,పెద్దవాళ్ళో చేసేవాళ్ళు. మంచాలు,వాటికి దోమతెరలు కట్టే కార్యక్రమం ఆయా ఇళ్లల్లో ఉన్న మగపిల్లలు చేసేవాళ్ళు.దీనికి తోడు అందరూనూ పడుకునేముందు, మరచెంబులతోనూ, కొమ్ము కూజాలతోనూ మంచినీళ్లు పెట్టుకునేవాళ్ళు, ఓ తాటాకు విసనకర్రనూ కూడా -మధ్యరాత్రి విసురుకోవడానికి-ఒక్కోసారి గాలి స్తంభిస్తుంది కదా!

అప్పుడప్పుడు డాబాపై పడుకోడానికి వెళ్ళినప్పుడు ఆకాశాన్ని చూస్తూ నక్షత్రాలు లెక్కపెడుతూ నిద్రలోకి జారిపోవడం నాకు చాలా ఇష్టం.అసలు ఆ వెన్నెల, నక్షత్రాలు ఆకాశం చూస్తూ ఉంటే అసలు ప్రపంచం మొత్తం అవే అయినట్టు, నేనొక్కడినే ఈలోకంలో ఉన్నట్టు మిగతా ప్రపంచాన్ని మరిచిపోయి వాటి వైపు మైమరిచి చూస్తూఉంటా.

డాబాపైకి వెళ్లి పడుకోవచ్చు,ఇంట్లో ఏ సి.వేసుకొని పడుకోవచ్చు- కానీ ఈ సరదా ఉండదుగా!

ఇంత పెద్ద ఇల్లు పెట్టుకొని నేను అప్పుడప్పుడు ఇలాబయటపడుకోవడం అమ్మా నాన్నకు పెద్దగా ఇష్టం ఉండదు-అలా అని నా సరదా కాదలనలేరు-అయిష్టంగానే ఉంటారు,అందుకనే నేను కూడా అప్పుడుడప్పుడే ఇలా బయట పడుకుంటాను -నాకయినా ఈ సరదా ఈ వయసులోనే కదా!

నాకూ కూడా విధిగా ఉండేది ఈ పని నేను పడుకునే రోజు- సరదాగా ఉండేది అనుకోండి ఈ పనులు చేయడానికి,అందునా సెలవలు కూడా! చిన్నపిల్లలం కదా-కాలేజీకి వెళ్లేవాళ్ళు చిన్నపిల్లలు కాదా ఏమిటి-“కొద్దిగా పెద్ద చిన్నపిల్లలం” అన్నమాట- “బుడుగు” అంత కాకపోయినా-అలాగే పెద్ద “సీగాన పెసూనాంబలు” కూడా ఉన్నారండి మా వీధిలో-కాకపోతే నేనంటే భయం లేదు,ఏం చేయనుగా వాళ్ళని!

మరి ఇన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఇళ్ళకి తాళాలు వేసి వీధిలో పడుకుంటే దొంగలకు ఆటవిడుపు కదా ఇల్లు చక్కబెట్టేయ్యరూ-ఇళ్ల వెనకాల్నించో,ఇంటి పైకప్పు పెంకులు తీసి లొపలకి చల్లగా జొరబడటానికి సులువు కదా(మాది డాబా ఇల్లు అనుకోండి)మాలాంటి కుర్రకారు కాస్త మెలకువగా ఉండేవాళ్ళం- అందుచేత మా వీధిలో దొంగలు సాహసం చేసేవాళ్ళు కాదనుకోండి!

వేసవికాలం దొంగలకు మంచి సీజన్, చాలా బిజీగా ఉంటారు-కాస్త ఈ సమయంలోనే నాలుగు ఇళ్లలోపడి కాస్త వాళ్ళ ఇళ్లల్లోకి మన సామాను, డబ్బులు చేరేస్తే, సీజన్ లేనప్పుడు కూడా బతికేస్తారు-వాళ్ళూ బతకాలిగా!

అప్పట్లో మా చుట్టుపక్కల ప్రాంతాల్లో “గజదొంగ గంగయ్యకి” పెద్దపేరు ఉండేది- అతను దొంగతనం అనుకున్నాడు అంటే ఆ ఇంట్లో చేసి తీరేవాడు-వంటినిండా నూనె రాసుకొని ఒక్క నిక్కరు మాత్రం వేసుకొచ్చేవాడుట దొంగతనాలకు- మంచిదొంగ అనేవారు-మనుషుల్ని ఏమీ చేసేవాడు కాదట.

మధ్యాహ్నం భోజనం సమయంలో అమ్మని అడిగాను “ఎవరమ్మా మన డాబామీద కొత్తగా దిగినవాళ్ళు” అని “సబ్- -రిజిస్ట్రార్ గారుట- బదిలీ అయి మన ఊరు వచ్చారు”అంది అమ్మ!

“ఓహో” అన్నాను, “పిల్లా-జెల్లా లేరా” అని అడిగా యధాలాపంగా “లేకేం-ఇద్దరు ఆడపిల్లలు,ఓ అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతోంది,ఇంకో అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతోందట”!

చెప్పొద్దూ, అప్పటిదాకా యధాలాపంగా వింటున్న నేను,నిటారుగా అయిపోయాను- ఉత్సాహంగా-ఆచివరి వాక్యం మీద ఆసక్తి కలిగింది(మా ఊళ్ళో ఉంది ఒకటే ఇంజనీరింగ్ కాలేజీ అవడం మూలాన)అమ్మదగ్గర మాత్రం బయట పడలేదు.తనంతట తాను ఇంకా వివరాలు ప్రస్తుతానికి అడగటం మంచిది కాదని గమ్ముని భోజనం ముగించేసాను.రేపో-మాపో కనపడకుండా ఉండరుగా, ఎలాగూ పరిచయాలూ, గట్రా అవనే అవుతాయి కదా-కొద్దిగా ఓపికపడితే బోలెడు సంగతులు తెలుస్తాయి అని అనుకున్నా-ఎలా ఉంటారో కూడానూ!

నాకు ప్రదీప్ అని ఓ మంచి సన్నిహితుడైన స్నేహితుడు ఒకడున్నాడు, స్థితిమంతులు -వాళ్ళ నాన్న అగ్రికల్చరల్ ఎం.ఎస్ సి.చదివారు- వంశ పారంపర్యంగా వస్తున్న వ్యవసాయాన్ని వదలటం ఇష్టంలేక, చదువు అయిపోగానే ప్రదీప్ వాళ్ళ తాతగారికి వ్యవసాయంలో తోడుగా ఉండేవారు.వాడికో చెల్లి ఉంది, తన పేరు లత, ఇంటర్మీడియట్ చదువుతోంది.

ప్రదీప్ తాతగారు పోయిన తర్వాత,ఆధునిక వ్యవసాయపద్ధతిలో వ్యవసాయం చేయడం మొదలు పెట్టారు ప్రదీప్ నాన్నగారు.

మా స్నేహితులకు ఊళ్ళో తిరగడం,సినిమాలతో పాటు- కాస్త ఆటవిడుపు ప్రదీప్ వాళ్ళ పొలాలకేసి వెళ్లడం.

మేముండే ఈ పట్నానికి ఓ అయిదు కిలోమీటర్లో దూరంలోనే వాళ్ళకి పొలాలు ఉన్నాయి, పొలం పక్కనే ఓ పెద్దఇల్లు కట్టించారు ఎప్పుడైనా పొలం పనులమీద వెళ్ళినప్పుడు ఓ నాల్రోజులు ఉండాల్సివస్తే ఉండటానికి.ధాన్యం, వ్యవసాయం తాలూకు సామాన్లు, సరంజామా, ట్రాక్టర్, టిల్లర్ అవీ అన్నీ అక్కడే ఉండేవి- ఓ ఇద్దరు పనివాళ్ళు కుటుంబాలతో పొలం దగ్గరే ఉంటారు.

ఏదో ఆస్తి పాస్తులు వున్నాయి కదా అని, ఇంట్లో ఒక్కడే మగపిల్లవాడని,వాళ్ళూ గారాబం చెయ్యలేదు, వీడూ చెడుస్నేహాలు చెయ్యలేదు. కాస్తో కూస్తో పేరున్న కుటుంబం కాబట్టి కాస్తంత ఎక్కువగానే ఒళ్ళు దగ్గరపెట్టుకునే ఉండేవాడు.నేను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నా మా ఊళ్ళోనే-వాడూ నేనూ క్లాస్ మేట్స్ మే!

divider

మరుసటిరోజు డాబా పైఅంతస్తుకి వెళ్లాను అలవాటుగా-మామిడిచెట్టు కొమ్మలు, సపోటా కొమ్మలు రెండవ అంతస్తు పై దాకా ఉంటాయి-కాస్త నీడగానూ, చల్లగానూ ఉంటుంది.ఎప్పుడైనా ప్రదీప్, తతిమ్మా స్నేహితులు వచ్చినా మేం అంతా ఇక్కడే కాస్త ముచ్చట్లు డాట్ కామ్ నడుపుతాం.

అదే ఏ సాయంత్రమో అయితే టీ,కాఫీల వరకు మా ఇంట్లోంచి వచ్చేవి- అప్పుడప్పుడు వేడివేడిగా చిరుతిళ్ళు కూడా -అమ్మ ఎప్పుడైనా చేస్తే.ముందే చెప్పానుగా నాకూ ప్రదీప్ కి ఏ అలవాటూ లేకపోవడం వల్ల, చుట్టుపక్కలవాళ్లకి ఇబ్బంది ఉండేదికాదు. ప్రదీప్ పొలాల వైపు వెళ్ళినప్పుడు మాత్రం ఏదో చిన్న అలవాట్లు ఉన్న ఒకళ్ళు, ఇద్దరు స్నేహితులు మాత్రం అక్కడ సేదతీరేవారు- మితిమీరకుండా!

ఆరోజు డాబామీదకి వెళ్లేసరికి ఓ అమ్మాయి అక్కడ నుంచొని ఉంది- నన్ను చూసి పలకరింపుగా అన్నట్టు నవ్వింది-పరిచయాలు అక్కర్లేకుండా, నేను ఎవరో అర్ధం అయుంటుంది- అలాగే నేను కూడా తానూ ఎవరో ఊహించుకోగలనుకదా- తిరిగి నేను ఓ చిరు నవ్వు నవ్వాను. అప్పుడు తనని తాను పరిచయం చేసుకుంది

"నా పేరు జ్యోత్స్న"అంది

"నా పేరు సూరి"అని నేను పరిచయం చేసుకున్నాను

అమ్మ చెప్పింది- పెద్ద అమ్మాయి ఇంజనీరింగ్ అని, అయినా ఆవిషయం తెలియనట్టే తనని అడిగాను (ఏ వెర్రివెధవ అయినా అలాగే అడుగుతాడు అమ్మాయిల్ని-దీనికి ఓ పెద్ద మేధావితనం అక్కర్లా) "ఏం చదువుతున్నారు" అని అడిగాను దానికి సమాధానంగా"ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతున్నా"అంది మనసులోని ఆనందాన్ని మోహంలో చూపించకుండానే నేను అన్నాను "నేనూ ఇంజనీరింగ్ రెండవ సంవత్సరమే" అన్నా (ఊళ్లోఉంది ఒకటే ఇంజనీరింగ్ కాలేజీ కాబట్టి రోజు కలవచ్చు అనుకున్నా మనసులో)

జ్యోత్స్నకు కూడా తెలుసు అతని పేరు,ఇంజనీరింగ్ చదువుతున్న సంగతి- ఏదో మాట్లాడాలి కాబట్టి అడిగింది అంతే-ఇందులో వేరే ఉద్దేశాలు ఏమీ లేవు ఆమెకి.

మాటల్లో వాళ్ళ చెల్లెలి పేరు రాఖీ అని ఇంటర్ మీడియట్ రెండో సంవత్సరంలో ఉంది అని చెప్పింది!

తర్వాత మాటల్లో మా ఇద్దరి గ్రూప్ లు వేరు అని తెలిసింది- జ్యోత్స్న ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్- నాది కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్.జ్యోత్స్న నాన్నగారు “సబ్ రిజిస్ట్రార్” అవటంవల్ల కాలేజీలో సీట్ దొరకటం సులభం అయింది- లేకపోతే అంత సులువు కాదు.

అప్పుడు జ్యోత్స్నతో ప్రదీప్ గురించి, మాస్నేహం గురించి, వాడి చెల్లెలు లత గురించి చెప్పాను, లత కూడా ఇంటర్ మీడియట్ రెండో సంవత్సరంలో ఉంది అని.తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది, లత వల్ల తన చెల్లెలికి కూడా ఓ క్లాస్ మేట్ మరియూ స్నేహితురాలు దొరకపోతున్నందుకు; నాకు మరీ మరీ థాంక్స్ చెప్పింది.

ఓ రోజు అమ్మ- జ్యోత్స్నా వాళ్ళ కుటుంబాన్ని సాయంత్రం పూట కాఫీలకి మా ఇంటికి పిలిచింది-వాళ్ళ నాన్న ఆఫీస్ నుంచి రాగానే అందరూ మాఇంటికి వచ్చారు- కాఫీలు,ఫలహారాలు అయినా తర్వాత- సహజంగానే గ్రూపులుగా విడిపోయి కబుర్లు చెప్పుకున్నాం. అమ్మా-వాళ్ళ అమ్మ, నాన్న- వాళ్ళ నాన్న, నేనూ-జ్యోత్స్నా,రాఖీ ఎవరి కబుర్లలో వాళ్ళం పడిపోయాం,దానితో కాస్త కొత్త పోయిన తరవాత ఒకరి ఇంటికి మరొకరు రాకపోకలు మొదలు అయ్యాయి- తర్వాత రోజుల్లో.

తర్వాత ఓరోజు డాబాపైన కలిసినప్పుడు జ్యోత్స్న మాటల్లో అంది- వాళ్ళింటిపాదీ చాలా ఆనందించారట-మరీ ముఖ్యంగా వాళ్ల అమ్మా, నాన్న-మాఇంట్లో వాళ్ళందరం అరమరికలు లేకుండా కలిసిపోయి ఆప్యాయతగా వాళ్ళతో మాట్లాడినందుకు. అప్పుడు “మాకూ ఓ మంచికుటుంబం దొరికింది అని మేమూ అనుకున్నాం”అని తనతో చెప్పాను-ఎప్పుడైనా కనపడితే ఏదో సాధారణంగా దొర్లే సంభాషణలు- మాటలు నడిచేవి!

మాదీ వ్యవసాయ ఆధారిత కుటుంబమే-ప్రదీప్ వాళ్ళ అంత కాకపోయినా మాకూ ఓ పాతిక ఎకరాల పొలం-తోటా అదీ ఉంది, నాన్న వ్యవసాయం చూసుకుంటారు.రెండు కుటుంబాలకు వ్యవసాయంతో సంబంధం ఉండటం వల్ల మానాన్న- ప్రదీప్ వాళ్ళ నాన్న తరచూ కలుస్తుంటారు-రెండు కుటుంబాల మధ్య బాంధవ్యాన్ని మించిన స్నేహం ఉంది-వేరేవాళ్లు ఈర్ష్యపడేంత!

ఓ రోజు ప్రదీప్, వాడి చెల్లి లత మాఇంటికి వచ్చినప్పుడు ప్రదీప్ ని,లతని జ్యోత్స్నకి, తన చెల్లెలు రాఖీకి పరిచయం చేసాను.వాళ్ళిద్దరికీ కాస్త కొత్త పోతుందని, ఎప్పుడైనా కాలక్షేపానికి తనకి- లతకి కూడా ఒకరికొకరు ఉంటారనే ఉద్దేశంతో. లతా- రాఖీ ఒకటే కాలేజీ, క్లాస్ మేట్ కూడా అవడంవల్ల చాలా తొందరగానే ఆప్తమిత్రులు అయిపోయారు!

తొందరగానే వాళ్ళు ముగ్గురూ మంచి స్నేహితులయ్యారు, సెలవలు అవడం మూలాన జ్యోత్స్నా,రాఖీ-లతా వాళ్ళ ఇంటికి ఒకటి రెండుసార్లు వెళ్లారు.అలాగే మేమందరం కలిసి ప్రదీప్ వాళ్ళ పొలానికి వెళ్ళాం ఓసారి-వాళ్లద్దరూ పొలాలు, ఇల్లూ, తోట బాగా ఎంజాయ్ చేశారు;పనిలోపనిగా ఓరోజు మా పొలాలు కూడా చూపించాను వాళ్ళిద్దరికీ.

జాక్ పాట్ లాగా ఇప్పుడు రాఖీకి కూడా లత పరిచయం అవడంతో జ్యోత్స్నా వాళ్ళింట్లో వాళ్ళు కూడా చాలా ఆనందించారు-వాళ్ళకి మా కుటుంబం- పిల్లలకి మంచి స్నేహితులు దొరికారు అని. సాధారణంగా ఏదైనా కొత్త ఊరుకి బదిలీ అయి వచ్చేవాళ్ళకి కొద్దిగా బెంగగా ఉంటుంది- ఊరు ఎలా ఉంటుందో, అక్కడ వాళ్ళు ఎలా ఉంటారో అని, స్నేహితులు దొరుకుతారో లేదో అని- ఇప్పుడు జ్యోత్స్నా వాళ్ళ కుటుంబానికి ఆ బెంగ తీరిపోయింది.

కొత్తపరిచయాలతో రోజులు హాయిగా గడిచిపోయాయి, ఊళ్ళకి వెళ్లిన స్నేహితులు కూడా వచ్చేసారు.కాలేజ్ కొత్త సంవత్సరం మొదలయ్యింది,మూడో సంవత్సరంలోకి రావడంవల్ల, చదువుల్లో సీరియస్ నెస్ పెరిగింది సహజంగానే.

జ్యోత్స్నఓ వారంరోజులు బస్సులో కాలేజీకి వచ్చివెళ్ళేది, తర్వాత తాను ఓ స్కూటీ కొనుక్కుంది.మొదటిరోజు “నా మోటారుసైకిల్ మీద తీసుకెళ్తా” అని ఆఫర్ చేస్తే వాళ్ళఇంట్లో ఏవైనా అనుకుంటారేమో అని ఊరుకున్నా.మళ్ళీ సభ్యతకి అడగకుండా ఉంటే బాగుండదని- వాళ్ళూ అడగలేదని అనుకుంటారేమో అని కూడా- ఓ రోజు మాటల మధ్యలో తనతో అదే మాట అన్నా-తాను “అలాగే” అంది, కానైతే మొదటిరోజు వాళ్ళ నాన్నగారు కార్ లో వచ్చి దింపి వెళ్లారు- తిరిగి వచ్చేటప్పుడు మాత్రం నా మోటార్ సైకిల్ మీద వచ్చింది.

రాఖీ కాలేజీ మా ఇంటినుంచి నడిచివెళ్లి వచ్చే దూరం అవటంతో-తాను మాత్రం రోజూ నడిచి వెళ్లివచ్చేది కాలేజీకి!

divider

ఊరు చిన్నది కూడా కావడంవల్ల బయట విషయాలు, అవతలవాళ్ళ విశేషాలు చప్పున తెలిసిపోతాయి.జ్యోత్స్నా వాళ్ళ నాన్నగారు చాలా నిజాయితీ కల మనిషి అని మంచివాడు అని కూడా తెలిసింది.దానితో మాఅందరికీ కూడా అయనమీద గౌరవం బాగా పెరిగింది.అయన కూడా నాతో కలిసిపోయి వయసు పట్టింపు లేకుండా సరదాగా ఉండేవారు.

ఊళ్ళో చాలామందికి ఆయన సంగతి తెలియడంతో మా కాలేజీలో జ్యోత్స్నఅంటే చాలా గౌరవంగా ఉండేవాళ్ళు తన స్నేహితులు.కాలేజీలో కొంతమంది లెక్చరర్లకు కూడా ఈ విషయం తెలిసి జ్యోత్స్నని కొద్దిగా ప్రత్యేకంగా చూసేవాళ్ళు-అందులో తాను చదువులో “టాప్”- దానివల్ల కూడా తాను కాలేజీలో అందరికీ ఫేవరేట్ అయిపొయింది. అదేమాట ఓసారి జ్యోత్స్నతో నవ్వుతూ అన్నాను “నీకు సెలబ్రిటీ స్టేటస్ వచ్చేసింది కాలేజీలో, మీరు మా ఇంట్లో ఉండటంవల్ల నాకు కూడా కొద్దిగా ప్రత్యేకత పెరిగింది అనుకో” అని.

ఎవరన్నారు సమాజంలో నిజాయితీపరులు లేరని, ఇదే నిజాయితీకి,ధర్మంగా ఉండేవాళ్ళకి సమాజం ఇచ్చే విలువకు నిలువుటద్దం.ఆ నిజాయితీగా ఉన్న మనిషికే కాదు, అతని కుటుంబ సభ్యులకి, వాళ్లకి ఆత్మీయంగా ఉన్నవాళ్ళకి కూడా సమాజం విలువ ఇస్తుంది.

జ్యోత్స్నా వాళ్ల అమ్మా-నాన్నలకి మాఊరు నచ్చడంతో,నాన్నకు తెలిసినవాళ్ల ద్వారా ఊరికి బయటగా ఓ ఎకరం పొలం కొన్నారు, అయన పదవీ విరమణ తర్వాత ఇల్లు కట్టుకొని-పల్లెవాతావరణంలో ఇక్కడే స్థిరపడిపోదామనే ఉద్దేశంతో. పొలం అమ్మినవాళ్ళు నాన్నకు తెలియడమేకాక వాళ్లకి కూడా జ్యోత్స్నావాళ్ళ నాన్న గురించి విని ఉండటంవల్ల సరసమైన ధరకే పొలం ఇచ్చారు-నాన్నే దాని చుట్టూ కంచె అదీ పాతించారు;ఆ విధంగా మాఊరు చాలా అచ్చి వచ్చిందని సంతోషించారు,రోజులు చాలా వేగంగా పరుగిడిపోతున్నాయి.

మేమంతా ఇంజనీరింగ్ నాలుగవ సంవత్సరంలోకి రావడం- రాఖీ, లతా కూడా ఇంజనీరింగ్ మీద ఇష్టం ఉండటంతో, ఇంటర్ మీడియట్ అవడం, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాయడం, కౌన్సిలింగ్ అదే కాలేజీ ఎంచుకోవడం వాళ్లిద్దరూ మా కాలేజీలో చేరిపోవడం చకచకా జరిగిపోయాయి. మా అందరిమధ్య పరిచయాలు, స్నేహాలు ఓ ఏడాది గడిచిపోవడం వల్ల- మామూడు కుటుంబాలు చాలా దగ్గర అయిపోయాయి

నల్లేరుమీద బండిలాగా జీవితం ఇలా సాఫీగా ఆనందంగా ఎందరికి గడుస్తుంది అందునా మంచి స్నేహితులతో, ఆప్తులతో కాలం గడుపుతూ.ఇంజనీరింగ్ చివరి సంవత్సరం వచ్చేసరికి నాన్న నాకు ఓ కార్ కొని ఇచ్చారు.ఒకసారి మా మూడు కుటుంబాలు కలిసి ఆటవిడుపుగా మూడు కార్లలో నాలుగు ఊళ్ళు తిరిగి వచ్చాం.

అంత ఆస్తిపాస్తులు ఉన్నా,ప్రదీప్ వాళ్ళ నాన్నగారు గర్వం- బేషజాలు లేని మనిషిఅవడంవల్ల(ఈరోజుల్లోని నడమంత్రపు సిరిగాళ్లలాగా కాదు) అందరూ ఆయనతో కాస్త స్వేచ్ఛగా, కలివిడిగా ఉన్నారు- మరీ ముఖ్యంగా ఆ ట్రిప్ తర్వాత. ఆయనకి కూడా జ్యోత్స్నా వాళ్ళ కుటుంబం నచ్చింది.

చివరి సంవత్సరం అవడం వల్ల పూర్తిగా చదువుల్లో పడిపోయాం అందరం-కాస్త ఆటవిడుపులు కట్టిపెట్టి.క్యాంపస్ సెలక్షన్ లో మా ముగ్గురికి జాబ్ ఆఫర్లు కూడా వచ్చాయి- మరీ ముఖ్యంగా జ్యోత్స్నకి -మంచి జీతంతోబాటు.

మొత్తానికి అందరం పరీక్షలు అవీ బాగా రాసాం, కాలేజీ “ఫేర్వెల్ ఫంక్షన్” కూడా చాలా బాగా జరిగింది- అందరం బాగా ఎంజాయ్ చేసాం-కుర్రాళ్ళం,అమ్మాయిలు కలిపి దుమ్ము లేపేసాం - విద్యార్థిదశకి అది చరమాంకం-దాదాపుగా- పై చదువులకి వెళ్లకపోతే.

సాధారణంగా కొన్ని కొన్ని విద్యార్థి బాచెస్ అంటే లెక్చరర్లకు, ప్రిన్సిపాల్ కి ఇష్టం ఉంటుంది- అలాగే మేమంటే మా ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేకమైన ఇష్టం-కొంతమంది మా లెక్చరర్లతో బాటుగా!

మా అందరికీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనీ ఉండేది, అన్నీ మంచి కంపెనీల ఆఫర్లు రావడంతో మా ఇళ్లలో అందరూ ఉద్యోగాల్లో చేరమని సలహా ఇచ్చారు “కావాలంటే తర్వాత అయినా చదువుకోవచ్చు కదా, కాస్త ఉద్యోగ అనుభవం వచ్చిన తర్వాత”! అంటూ!

నాకూ, ప్రదీప్ కి, జ్యోత్స్నకి వేరువేరు నగరాల్లో ఉద్యోగాలు వచ్చాయి.పరీక్ష ఫలితాలు రావడానికి, దానితో మేము ఉద్యోగాల్లో చేరడానికి సమయం ఉండటం వల్ల- మాతో బాటుగా లతా, రాఖీ -అందరం కలిసి వాన్ లో ఓ పదిహేనురోజుల పాటు ఎటుఅయినా వెళ్లివద్దామని నిర్ణయించుకున్నాం.ముందుగా ఇంట్లోవాళ్ళు వాన్ లో వెళ్ళడానికి ఇష్ట పడలేదు.రైళ్లలోనో, ఫ్లైట్స్ లోనో వెళ్ళమని సలహా ఇచ్చారు-రోడ్డు ప్రమాదాల భయంతో.

అదీ కాకుండా మూడు ఇళ్లలోని వారసులం కదా- అలా పెద్దవాళ్ళు అనుకోవడం సహజమే కూడా.అయినా సరే మేము మెల్లిగా, జాగ్రత్తగా డ్రైవ్ చేస్తాం అని చెప్పి ఎలాగైతే ఒప్పించాం మా ఇళ్లల్లో.కాకపోతే మేము రోజూ మూడుపూటలా ఎవరో ఒకరం ఫోన్ లో వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలని ఎక్కడ ఉన్నారో చెప్పాలని షరతు పెట్టారు-దాదాపుగా మా ట్రిప్ అంతా ఆ బాధ్యత జ్యోత్స్నే తీసుకుంది-మా మూడు ఇళ్ళకి తనే ఫోన్ చేసేది- మేము “సరే” అని మా యాత్రకి బయలుదేరాం.

జ్యోత్స్న కూడా డ్రైవింగ్ నేర్చుకుని- అప్పుడప్పుడు నాకారు, ప్రదీప్ కారు డ్రైవ్ చేస్తూ ఉండేది కాలేజీలో చదువుకునేటప్పుడు,దానితో ముగ్గురు డ్రైవర్లం అయ్యాం మా యాత్రకి.

divider

వెళ్ళేది వాన్ లో కాబట్టి,ముందుగా దక్షిణప్రాంతం చూడాలని అనుకున్నాం- భవిష్యత్తులో మిగతా ప్రదేశాలు చూడటం ఎలాగూ కుదురుతుంది.ఈ సమయంలో మన ప్రాంతాలు చూడటం అశ్రద్ధ చేస్తే ఇంక అసలు తీరికా దొరకదు, ఆ.. ఎప్పుడైనా చూడొచ్చు, మనకు దగ్గరిగా అనే భావం కలుగుతుంది ఎవరికైనా సహజంగా. (తిరుపతిలో ఉండేవాళ్ళు- ఆ…. కొండపైకే కదా అని కొందరు అశ్రద్ధ చేస్తున్నట్టు)

ట్రిప్ ముందే ఎక్కడకి వెళ్ళాలి, ఏక్కడ ఆగాలి, ఏ హోటల్ లో ఉండాలి, చూడవలసిన ప్రదేశాలు ఏమిటి, దారిలో పుణ్యక్షేత్రాలు ఏమైనా ఉంటే అవి కూడా చూడాలంటే ఎంత టైం పడుతుంది-అక్కడ పద్ధతులు అవి -గురువాయూర్ దేవాలయం, అనంతపద్మనాభ స్వామి దేవాలయాల్లో -ఎలా పడితే అలా ఉన్న వస్త్రధారణ అనుమతించరు కదా- అవన్నీ లెక్కలోకి తీసుకున్నాం- సుందర్ పిచాయ్ ధర్మమా అని ఈ వివరాలు తెలుసుకోవడం చిటికలో పని- ఓ రెండు కెమెరాలు, ఎవరి లాప్ టాప్ లు వాళ్ళం కూడా తీసుకెళ్లాలి అని ప్లాన్ చేసాం.

మొత్తానికి మన ఆంధ్రా ప్రాంతంతో మా విహారయాత్ర మొదలు పెట్టాం!

చెప్పడమైతే పదిహేను రోజులు అని చెప్పాం కానీ, ప్రదీప్ కి నాకు ఓ నెలరోజుల సమయం పడుతుందని ముందుగానే తెలుసు.ఒక్కసారే నెల రోజులు అంటే ఇళ్లల్లో ఒప్పుకోరని ఇద్దరం కూడబలుక్కుని అలా చెప్పాము.జ్యోత్స్న అనుమానంగా నవ్వుతూ నా వైపు చూసిందిఅప్పుడు, ఓ సైగతో తాను గమ్మున ఉండిపోయింది.

ముందుగా మన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తో మొదలు పెట్టాం,ఇక్కడే ఓ వారం రోజులు పట్టింది-అదీ ఉరుకులు పరుగుల మీద,అటునుంచి హైదరాబాద్ మీదుగా కర్ణాటకలోకి ప్రవేశించాం.మేము తిరిగే ప్రదేశాలు, మా ఫోటోలు ఎప్పటికప్పుడు అందరి ఇళ్లకు పంపే బాధ్యత లత తీసుకుంది.రాఖీ-జ్యోత్స్నా వంతులవారీగా రోజూ మాఅందరి ఇళ్లల్లో వాళ్ళతో మాట్లాడే డ్యూటీ తీసుకున్నారు-మధ్య మధ్యలో నేనూ ప్రదీప్ కూడా మాట్లాడుతూ ఉండేవాళ్ళం.

జ్యోత్న్సకి డ్రైవింగ్ వచ్చినా సాధ్యమైనంతవరకూ నేనూ, ప్రదీపే డ్రైవ్ చేసేవాళ్ళం, జ్యోత్స్న గొడవపెట్టేది తనకు డ్రైవింగ్ ఎక్కువ టైం ఇవ్వటం లేదని;పొద్దున్నే బయలుదేరాల్సిన టైంలో అందరికంటే ముందే రెడీ అయిపోయి డ్రైవింగ్ సీట్ తీసేసుకునేది.

ఎమర్జెన్సీ మందుల కిట్ పెట్టుకున్నాం-ముందు జాగ్రత్తగా, రకరకాల బ్రేకుఫాస్టులతో, భోజనాలతో బాగా ఎంజాయ్ చేస్తూ సాగిపోతున్నాం!

ఓ పదిరోజులు అవగానే జ్యోత్స్న చేత ఫోన్ చేయించి తానూ లతా బలవంతంచేసి ఇంకా మిగిలిన ప్రదేశాలు చూడాలని అనుకుంటున్నాం అని, అంచేత పదిహేను రోజుల్లో కుదరదు కనుక ఓ మూడు నాలుగు వారాలు పట్టవచ్చు అని చెప్పమన్నాం.

దాంతో ఇంట్లో వాళ్లకి కోపం అయితే వచ్చింది గానీ- లతని, రాఖీని కూడా రంగంలోకి దింపి ఇంట్లోవాళ్ళని బతిమాలే కార్యక్రమం వాళ్ళకిచ్చేసాం- మేము తెరవెనకాల ఉండి.ఎంతైనా ఆడపిల్లలు-కూతుళ్లు కదా- కాదనలేక మా ఇద్దరికీ జాగ్రత్తలు చెప్పారు- బాధ్యతగా అందరు ఇంటికి చేరే పని మీ ఇద్దరిదీ అని మరీమరీ చెప్పారు.

ఇంట్లోవాళ్ళు ఒప్పుకోవడంతో- జ్యోత్స్న, రాఖీ, లత లకి ఓ మంచి లంచ్ ఇచ్చాం “ఎం.టి.ఆర్” బెంగుళూరులో!

గూగుల్ ధర్మమా అని ఏ ఊళ్ళో టిఫిన్లు భోజనాలు బాగుంటాయో సులువుగా తెలిసిపోయింది-స్నేహితుల ద్వారా ఓపాటి అవగాహన నాకున్నా.ఎప్పటికప్పుడు ఫోటోలు పేస్ బుక్ లో వీళ్ళు పోస్ట్ చేస్తున్నారు.వాళ్ళ ఫ్రెండ్స్ అయితే జెలస్ అయిపోతున్నారు లైకులతో, కామెంట్లతో-ఈసారి వాళ్ళని కూడా తప్పకుండా తీసుకెళ్లాలని కొందరి కామెంట్లు.

నేనూ, ప్రదీప్, జ్యోత్స్నా వేరేవేరే ఊళ్లలో ఉద్యోగాల్లో చేరిపోయినా రెండు నెలలకో, మూడు నెలలకి ఒకసారి అన్నా కలవాలని నిశ్చయించుకున్నాం-లతా రాఖీ, గయ్యిమని లేచారు మా మీద-“మరి మా సంగతో” అని.

మీకు చదువులున్నాయి- మాకు చదువూ లేదు- సంధ్యా లేదు-కన్ను కొడుతూ అన్నాను మీకు చదువులున్నాయి అన్నాను (మా క్లాస్ మేట్ సంధ్య అనే అమ్మాయి ఉండేది, జ్యోత్స్నకు కూడా తెలుసు)

అయినా లతకి,రాఖీకి కుదిరినప్పుడు వాళ్ళు మమ్మల్ని కలిసేట్టుగా-ఖర్చులన్నీ మేమే పెట్టేట్టుగా మా దగ్గర ఒట్టు వేయించుకున్నారు వాళ్లిద్దరూ.సందట్లో సడేమియాలా- లత మా ఐదుగురికి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసేసింది మా ప్రయాణంలోనే.

ఈ ప్రయాణంవల్ల జరిగిన పెద్ద లాభం ఏమిటంటే- ఒకళ్ళని ఒకళ్ళు అర్ధం చేసుకోవడం- ఇష్టాలు, అయిష్టాలు, అభిరుచులు, మనస్తత్వాలు, మూడ్ స్వింగ్స్ కూడా తెలుసుకోవడం- అందరం చాలా క్లోజ్ అయిపోయాం-అసలు మామధ్యలో రహస్యాలు లేనంతగా.ప్రతి ఒక్కరికీ మిగిలిన అందరిమీద ఓ రకమైన బాండింగ్ కలిగింది- ఇందులో మీరు వేరే అర్ధాలు వెతుక్కోనవసరం లేదు.

మాట్రిప్ లో తీసిన అన్ని ఫొటోలతో ఓమంచి ఆల్బం తయారు చేయించే బాధ్యత లత తీసుకుంది-తనకి ఫోటోగ్రఫీలో మక్కువ ఎక్కువ అవడంవల్ల-అందులో ప్రవేశం కూడా ఉండటంవల్ల!జ్యోత్స్న చాలా తెలివికలది- గలగలా మాట్లాడేస్తుంది- ఏవిషయం అయినా చాలా అవగాహనతో మాట్లాడుతుంది.

కాలవల్లో స్నానాలు అలవాటు అవడంవల్ల నేనూ- ప్రదీప్ “ఈత” విషయంలో “చేప” లాంటి వాళ్ళం,ఎంత సేపైనా ఈదేయగలం;కాకపోతే మేమిద్దరం ఉభయచరులం-చేపలా కాదు!

ముగ్గురు ఆడపిల్లలు మాత్రం మాఊరు వెళ్ళినతర్వాత ఈత నేర్చుకోవాలని నేను ఏకగ్రీవంగా తీర్మానించేసాను-నా ఉద్దేశంలో, డ్రైవింగ్, స్విమ్మింగ్ లైఫ్ స్కిల్స్ కింద వస్తాయి.అలాగే లతా, రాఖీ కూడా డ్రైవింగ్ నేర్పమని మమ్మల్ని అడిగారు- అలాగే అన్నాం.

మా లెక్క ప్రకారం ఒక్కొక్క రాష్ట్రం చూడాలంటే హీనపక్షం ఓ నెలరోజులన్నా పడుతుంది-కొద్దిగా వివరంగా చూడాలంటే.ఈ లెక్కన పూర్తి దేశంలోని అన్ని ప్రాంతాలు చూడాలంటే అధమం రెండు సంవత్సరాలైనా పడుతుంది.అంటే మన దేశంలోనే చూడాల్సిన ప్రదేశాలు అన్నీ చూడటానికి ఓ జీవితకాలం పడుతుంది అని.

కర్ణాటక మీదుగా, కేరళ వెళ్ళాం, అక్కడ అన్నీ కొబ్బరి నూనెతోనే వంటలు- కొద్దిగా తినాలంటే కష్టం అనిపించింది-కాకపోతే కేరళ ప్రాంతం “నాన్ వెజ్” కి ఫేమస్ అవడం వల్ల ఫుడ్ బాగా ఎంజాయ్ చేసాం.

నిజంగా అది “గాడ్స్ ఓన్ కంట్రీ” అనిపించింది- ఎక్కడ చూసినా ప్రకృతే, పెద్ద పెద్ద చెట్లు, సముద్రం, నీళ్లు,ఐలాండ్స్ ,బ్యాక్ వాటర్స్, హౌస్ బోట్స్ -ఓ అద్భుతమే అనిపించింది.

అక్కడివాళ్లు, హిందీ, ఇంగ్లీష్ కూడా మాట్లాడుతారు కాబట్టి పెద్దగా ఇబ్బంది అనిపించలేదు.కొచ్చిన్ సిటీ లో మాత్రం చాలామంది నార్త్ ఇండియన్స్ ఉన్నారు వ్యాపారాల్లో-ముఖ్యంగా మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో.

“త్రివేండ్రంలో” ఓ ఫ్రెండ్ ఉండటంతో వాడికి ముందుగా మా ప్రోగ్రాం చెప్పి వాణ్ని కలిసాం- వాళ్ళ ఇంటికి భోజనానికి తీసికెళ్ళాడు- అనంత పద్మనాభ స్వామి ఆలయానికి మాతో వచ్చాడు దర్శనానికి.అన్ని చోట్ల షాపింగ్ కూడా బాగాచేసాం-దాదాపుగా నచ్చిన ప్రతీది మూడు వస్తువులు కొనుక్కోవడం ఆనవాయితీ అయిపొయింది-మూడు ఇళ్లల్లోకి కావాలిగా మరి!

కొన్న వస్తువులు గుట్టలయిపోయాయి, భయం వేసేంత,అందుకే పగలని వస్తువులన్నిటిని కొచ్చిన్ నుంచి పార్సెల్ లో మాఊరు పంపించేశాం.

అనుకుంటాంగానీ ఇవన్నీ చూసినప్పుడల్లా ఆప్రయాణం గుర్తులు జ్ఞప్తికి వస్తుంటాయి!

divider

మున్నార్ మీదుగా తమిళనాడు లో ప్రవేశించాం, తమిళనాడు దేవాలయాలకు కూడా ప్రసిద్ధి-ముఖ్యంగా పురాతన దేవాలయాలు.రూట్ మ్యాప్ ప్లాన్ చేసుకుంటూ ఒక్కో ప్రదేశం దాటుకుంటూ మళ్ళీ తిరుపతి ద్వారా మన రాష్ట్రంలోకి ప్రవేశించాం.అక్కడ అందరం దర్శనమ్ చేసుకుని, కొండకింద ఉన్న గుళ్ళు, శ్రీకాళహస్తి చూసుకుంటూ - నెల్లూరులో ఆగాము.కోమలవిలాస్ లో అదిరిపోయే భోజనం చేసి; కాకినాడ లో సుబ్బయ్య హోటల్ లాగా నెల్లూరు కోమల విలాస్ అంత ఫేమస్.

అర్ధరాత్రి కల్లా మా ఊరికి చేరిపోయాం-బెజవాడ మీదుగా;ఆ విధంగా మా యాత్ర విజయవంతంగా ఆనందంగా ముగిసింది.

ఇంటితిండికి మొహంవాచి ఉన్నామేమో ఆవురావురుమంటూ తినటం, పడుకోవడం నాలుగు రోజులు.ఓ నాలుగు రోజులు విశ్రాంతి తీసుకుంటేగానీ బడలిక తీరలేదు, ఎవరి ఇళ్లల్లో వాళ్ళం మా ట్రిప్ విశేషాలు చేప్పడంతో సరిపోయింది ఓ నాలుగు రోజులు.

నేనూ ప్రదీప్ రోడ్డుమీదపడి ఊళ్లోఉన్న స్నేహితుల్ని కలిసి కబుర్లు చెప్పుకున్నాం- ముఖ్యంగా మా జైత్రయాత్ర విశేషాలు!

మూడు కుటుంబాలు పిల్లలతో కలిసి చాలారోజులు అవడం మూలాన-ప్రదీప్ వాళ్ళ పొలం దగ్గర ఇంటిలో కలవాలని అనుకున్నాం- ఓ ఆదివారం అందరం కలిసి సరదాగా గడిపాము.అందునా కొన్నాళ్లలో నేనూ, ప్రదీప్, జ్యోత్స్నా ఎవరిదారిన వాళ్ళం వెళ్ళిపోతాం కూడానూ- అదే పెద్దవాళ్లు కూడా పదేపదే అనుకున్నారు, మూడు ఇళ్ళు మూగపోతాయి అని-అందరం కొద్దిగా బెంగగా ఫీల్ అయ్యాం కూడా.ఇంకా నెలరోజులు ఉన్నాయి-మేము ముగ్గురం ఉద్యోగాల్లో చేరిపోవడానికి, ఆ నెలరోజులూ- ఇట్టే కుర్రకారు వయసులాగా పరుగెట్టేశాయి.

ఎవరిదోవన వాళ్ళం ఊళ్ళు వెళ్లి ఉద్యోగాల్లో చేరిపోయాం, కొత్త జీవితం, కొత్త వాతావారణం, పుట్టినప్పటినుంచి ఇప్పటివరకూ స్వేచ్ఛగా యథేచ్ఛగా పెరుగుతాం మన జీవితాల్లో.ఉద్యోగం రాగానే ఓ అనుభూతితోబాటు అనుకోని బాధ్యత ఫీల్ అవుతాం.జీవితంలో మొదటసారి డబ్బులు జీతం రూపంలో అందుకుంటే ఉంటే ఆ అనుభూతి ఆనందం వేరు- ఏదో సాధించామన్న ఓ ఫీలింగ్.

ఎంచేతంటే ప్రతిమనిషి ఈదశ చేరేవరకూ తండ్రి దగ్గరే ప్రతి పైసా తీసుకోవాలి, ఒక్కోసారి, విచ్చలవిడిగా కూడా ఖర్చు చేస్తాం- ఆ సమయంలో డబ్బు విలువ పెద్దగా తెలియకపోవచ్చు- ఊరికినే వస్తుంది కదా. బహుశా అందుకేనేమో రోజులు గడిచినకొద్దీ మెల్లిమెల్లిగా తెలుస్తుంది- మన తల్లితండ్రులు ఎంత కష్టపడితే ఆ డబ్బులు వస్తాయి అని.అలా అని అప్పట్లో తెలియదు అని కాదు, మన సంపాదన అంటూ మొదలు పెట్టిన తర్వాత స్వయం అనుభవం కదా.

బాగా డబ్బులున్నవాళ్ళకి కూడా డబ్బులు ఊరికే రావు-వాళ్ళూ కష్టపడాల్సిందే! ప్రతిమనిషి జీవితంలో ఇది బరువు- బాధ్యతల అనుభవానికి తొలిమెట్టు, అట్లాగే జీవితానికి అవసరమైనవన్నీ నేర్చుకుంటాం ఇక్కడే.పుస్తకాల్లో చదివినవి, మనం చూసిన వాతావరణం, మనుషులు, మనస్తత్వాలు భిన్నంగా ఉంటాయి, కొద్దిగా ఘర్షణ ఫీల్ అవుతుంది,క్రమేపి ఆ వాతావరణానికి అలవాటు పడిపోతాం.

కొత్త ఉద్యోగం, కొత్త ప్రదేశం, కాస్తా రూమూ అదీ దొరకడానికి సమయం పట్టింది, మొదటిసారి ఇంటి భోజనం మిస్ అవుతాం, ఆఫీస్ లో కలీగ్స్ ద్వారా హోటల్స్, మెస్సులు అవి కాస్త తెలిసాయి. ఊళ్ళో ఉన్నప్పడు వంట అలవాటు లేకపోయినా, కాఫీ, టీలు పెట్టుకోవడం కోసం ముందుగా ఇండక్షన్ స్టవ్,చిన్న చిన్న సామాన్లు కొన్నాం.గాస్ కి అప్లై చేయడం అయిపొయింది.గాస్ స్టవ్ రాగానే కాస్త టిఫిన్లు చేసుకోవడం మొదలు పెట్టా- ల్యాబ్ లో ప్రయోగాల్లాగా “యూ ట్యూబ్” ధర్మమా అని.

ప్రదీప్ కూడా దాదాపుగా ఇదే పని- ఎటొచ్చీ జ్యోత్స్నకి ఆ ఇబ్బంది లేదు- ఆడపిల్లలకి అదో అడ్వాంటేజ్- తాను మమ్మల్ని ఏడిపించడానికి తాను చేసే వంటలు వీడియో కాల్ లో చూపిస్తూ ఉండేది.

మా అందరికీ ఒకళ్ళకొకళ్ళం, ఇంట్లోవాళ్ళని మిస్ అవుతున్న ఫీలింగ్ లో ఉన్నాం, కాకపోతే రోజూ కాకపోయినా రెండు రోజులకొకసారన్నా మాట్లాడుకుంటూ ఉన్నాం, వారానికి ఒకసారి ఊళ్ళో మూడు ఇళ్లవాళ్ళతోనూ మాట్లాడుతున్నాం ముగ్గురమూనూ.ఏదో కూడబలుక్కోలేదు గానీ, ఏమో లోపల అందరికీ ఆ ఫీలింగ్ ఉండటంవల్లనెమో మా అంతట మేమే మాట్లాడుతున్నాం,ఇంట్లోవాళ్ళు కూడా హాపీగా ఉన్నారు.

నాన్న అయితే కార్, మోటార్ సైకిల్ వెంట తీసుకెళ్లామన్నారు.కానైతే నాతోబాటు ముందుగా మోటార్ సైకిల్ తెచ్చుకోవడంవల్ల తిరగటానికి ఇబ్బంది లేకుండా అయింది.కాస్త ఓ సింగల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్ తీసుకున్నాక మొదటిసారి ఇంటికి వెళ్ళినప్పుడు కార్ తెచ్చుకోవచ్చు అనుకున్నా-అదేమాట నాన్నతో కూడా అన్నా!

అక్కడ లతా, రాఖీ చదువుల్లో బిజీ అయిపోయారు, లత తాను ప్రామిస్ చేసినట్టుగానే మా ట్రిప్ ఫొటోల్లో మంచివి సెలెక్ట్ చేసి మూడు ఆల్బం చేసి మా ముగ్గురికీ పంపింది- ఫోటోలు అద్భుతంగా వచ్చాయి- ఆల్బమ్ కూడా బాగా డిజైన్ చేసింది- ఫోటోలు పెట్టిన తీరు అదీనూ- మంచి కాప్షన్ లతో బాటు- ఖచ్చితంగా అవి జీవితంకాలం గుర్తుండిపోయే జ్ఞాపకాలు మా అందరికీ.

divider

ఓ రోజు సడన్ గా ఎవరో తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది- జ్యోత్స్న పనిచేసే ఊరునుంచి, జ్యోత్స్న కలీగ్ అని, జ్యోత్స్నకి ఆక్సిడెంట్ అయిందని, హాస్పిటల్ లో చేర్పించాం అని, అతనే ప్రదీప్ కి, నాకు కూడా ఫోన్ చేసాడు.వెంటనే ప్రదీప్ తో మాట్లాడాను-వాడు బయలుదేరుతా అన్నాడు, ఆఫీస్ లో పర్మిషన్ తీసుకుని నేను టాక్సీ తీసుకుని బయలుదేరాను, నేను ముందుగా చేరాను హాస్పిటల్ కి.జ్యోత్స్న తలకి దెబ్బ తగిలింది,అదృష్టవశాత్తు ప్రమాదం ఏమీ కాదు, మధ్యరాత్రికి ప్రదీప్ కూడా వచ్చాడు.

మమ్మల్ని చూసి కళ్లనీళ్లు పెట్టుకుంది-ఉద్యోగాల్లో చేరేముందు ముగ్గురం ఒకరినొకరు తరచుగా కలుద్దామని అనుకున్నాం, మొదటిసారి ఈ విధంగా కలుస్తున్నందుకు కూడా జ్యోత్స్నబాధపడింది, నేనూ ప్రదీప్ ఊరడించాం తనని! “ఓ రెండురోజుల్లో తగ్గిపోతుంది, తగిలింది చిన్న దెబ్బలే” అని డాక్టర్ చెప్పాడు.నాకు పనివత్తిడి ఉండటంవల్ల ఇంకో రోజు ఉండి,జ్యోత్స్న కొద్దిగా కోలుకున్నాక వెనక్కి వచ్చేసాను- ప్రదీప్ మాత్రం జ్యోత్స్న హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేవరకూ ఉండి తర్వాత వెళ్తా అన్నాడు.

నాలుగోరోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసారు జ్యోత్స్నని, ప్రదీప్ ఇంకో రెండు రోజులుండి వెనక్కి వెళ్లి పోయాడు.ఇంట్లోవాళ్ళు కంగారు పడతారని మేము ముగ్గురం ఈ విషయం ఎవరికీ మాఇళ్లల్లో చెప్పలేదు.

ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాతలిచా-సలహా లాంటిది- ఇలా ఒకరికొకరు తోడున్నప్పుడు మాత్రం-ఇళ్లల్లో వాళ్లకి కబురుపెట్టి వాళ్ళను కంగారుకి గురిచేయకూడదు; అదీ అంత ప్రమాద పరిస్థితి కానప్పుడు, తర్వాత మాటల సందర్భంలో ఇంట్లోవాళ్లతో ప్రస్తావించవచ్చు వాళ్ళని కలిసినప్పుడు;అలా కాకుండా ఒకళ్ళే ఉంటే మాత్రం ఇంట్లోవాళ్లకి ఖచ్చితంగా తెలియచేయాలి.

ఓ నెల తర్వాత లాంగ్ వీకెండ్ రావటంతో ముగ్గురం మా ఊరికి వెళదామని అనుకున్నాం,అనుకున్నప్రకారం ముగ్గురం మాఊరు చేరాం-మూడు ఇళ్లలోనూ సందడే సందడి.సంపాదన మొదలు పెట్టిన తర్వాత ముగ్గురం ఇళ్ళకి ఏమీ పంపించలేదు, ఇంట్లో వాళ్లకి ఏమీ కొనలేదు కూడా.మొదటిసారి ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లోవాళ్ళకి సర్ ప్రైజ్ ఇద్దామని అప్పుడే అందరికీ ఏమైనా తీసుకెల్దామని అనుకున్నాం.నేను లతకి, రాఖీకి మొబైల్ ఫోన్ కొన్నా, అలాగే అమ్మా-నాన్నకి,జ్యోత్స్నా వాళ్ళ ఇంట్లోకి, ప్రదీప్ వాళ్ళ ఇంట్లోకి డెకొరేటివ్ ఐటమ్స్ కొని తీసుకెళ్ళాను.

ప్రదీప్, జ్యోత్స్నా కూడా అందరికీ ఎవరి వయసులకి తగ్గట్టుగా గిఫ్టులు కొని తెచ్చారు.ఒకరోజు మూడుకుటుంబాల వాళ్ళం ప్రదీప్ వాళ్ళ పొలానికి వెళ్లి అక్కడే భోజనాలు చేసి సరదాగా గడిపాం.మూడు రోజులు ఇట్టే గడిచిపోయాయి, ముగ్గురం తిరుగుబాట పట్టాం-మా మా నెలవులకు,కొలువులకు!

అలా చూస్తుండగానే ఏడాది దాటిపోయింది మేం ఉద్యోగాల్లోచేరి, ఇక్కడ కొన్ని ఆసక్తి కరమైన విషయాలు మీకు చెప్పాలి.జ్యోత్స్నా వాళ్ళు మాఇంట్లో దిగేముందు ఆ వయసులో సహజంగా ఉండే ఉత్సుకతే తప్ప జ్యోత్స్న మీద ఎందుకో వేరే అభిప్రాయం కలిగలా, అంచేతేమో మేమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం!

తాను ఆడపిల్ల, చదువు అయి ఉద్యోగంలో కూడా చేరింది, అందునా వేరేఊళ్ళో ఒక్కతే ఉంటోందికూడా ; సహజంగానే తన ఇంట్లోవాళ్ళు తన పెళ్లి గురించి అడగటం మొదలు పెట్టారట, ఈ విషయం నాతో ఓరోజు మాటల్లో చెప్పింది.

divider

“మంచిదే కదా, వెతికేయనా” అని, “నీకేమీ అభ్యంతరం లేకుంటే, ఇష్టం అయితే ప్రదీప్ ని పెళ్లి చేసుకోవచ్చుగా,వాడు చాలా మంచోడు, అలాంటివాడు దొరకటం కష్టం కూడా- మీ అమ్మా-నాన్నలకి పెళ్లి కొడుకుని వెతికే కష్టం కూడా తప్పుతుంది” అని నవ్వుతూ అన్నాను.

అప్పుడంది, “నాకు ప్రదీప్ అంటే ఇష్టమే, తన ఇష్టం తెలియకుండా నేను ఎలా బయటపడతాను ఎంతైనా. ప్రదీప్ వ్యక్తిత్వం, నాకు నచ్చింది, మొన్న నాకు ఆక్సిడెంట్ అయినప్పుడు చాలా కన్సర్న్ తో సేవ చేసాడు, దానితో అతనిమీద ఇష్టం మరీ పెరిగింది” అంది.

“కానీ... ప్రదీప్ వాళ్ళు బాగా డబ్బున్నవాళ్ళు,వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటారో లేదో- అతనికి ఓవేళ నా మీద ఇష్టం ఉన్నా” అంది. చెప్పొద్దూ, నేను చాలా సంతోషించా జ్యోత్స్న మాటలకి, అప్పుడు తనతో అన్నా, “ప్రదీప్ వాళ్ళ నాన్నా అమ్మలకి అలాంటి గర్వం అదీ లేదు.నేను ముందుగా ప్రదీప్ ని కదుపుతా, వాడి అభిప్రాయాన్నిబట్టి వాళ్ళఇంట్లో మాట్లాడే పూచీ నాది” అని జ్యోత్స్నకి ధీమా ఇచ్చాను.

ఆరోజు రాత్రే ప్రదీప్ కి ఫోన్ చేసి రేపు ఉదయాన్నే వాడి దగ్గరకి వస్తున్నా అని చెప్పా-“ఏంటిరా అంత అర్జెంటు” అన్నాడు- నా మాటల్లో ఉత్సాహం వాడికి అర్ధం కాక. “వచ్చి మాట్లాడతారా” అన్నా;జ్యోత్స్నకి చెప్పి ఉదయం కల్లా ప్రదీప్ గాడి దగ్గర వాలిపోయాను.

వాణ్ని సెలవ పెట్టమని చెప్పి తీరిగ్గా లంచ్ కి బయటకి వెళ్ళాం.నాన్చకుండాతిన్నగా విషయానికి వచ్చాను, తనకీ, జ్యోత్స్నాకీ జరిగిన మాటలు మొత్తం; అప్పుడు మనవాడి మోహంలో మెరుపు మెరిసి మాయమవడం నా దృష్టినుంచి తప్పించుకోలేకపోయింది.

ఇక వాడు సమాధానం చెప్పక్కర్లా అనుకున్నాను, ప్రదీప్ జవాబు చెప్పబోతుంటే నేనే అన్నా “ఒరేయ్, నీకూ జ్యోత్స్న అంటే ఇష్టం అంతేగా” అన్నా,అప్పుడు వాడు మొహం వెలిగే మతాబులా పెట్టాడు.

“ఒరేయ్ మనిద్దరిమధ్య రహస్యాలు, దాపరికాలు లేవు, ఈ విషయం నా దగ్గర దాచావెందుకురా” అన్నా-వాడు కొద్దిగా గిల్టీ గా ఫీల్ అవుతూ చెప్పడం మొదలుపెట్టాడు!

“జ్యోత్స్న మనసులో ఏముందో నాకు తెలియదు, అదీకాకుండా నీకు తనమీద ఇష్టం ఉండివుంటే- అదీ తెలియదు.మనిద్దరిమధ్యా జ్యోత్స్న ప్రస్తావనే రాలేదు, అదొక సందేహం, వీటన్నిటితో బాటు, అమ్మా-నాన్న ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు అదో భయం” అన్నాడు.

అప్పుడు వాణ్ని దగ్గరకి తీసుకొని అలాంటి అనుమానాలు ఏమీ వద్దు,జ్యోత్స్నా నేను మంచి ఆప్త మిత్రులం అంతవరకే, మా ఇద్దరికీ ఆ అభిప్రాయం లేదు మొదట నుంచి.ఇక మీఇంట్లో వాళ్ళంటావా-వాళ్ళతో మాట్లాడి- ఖాయం చేసే పూచీ నాది అన్నాను;దానితో వాడి సంతోషానికి అవధుల్లేవు.

నేనే వాణ్ని దగ్గరకు తీసుకుని “నాకు చాలా సంతోషంగా ఉందిరా- జ్యోత్స్న చాలా మంచి అమ్మాయి, వాళ్ళ ఇంట్లోవాళ్ళు తనతో పెళ్లి మాటలు తెచ్చిన విషయం నాతో అన్నప్పుడు నిన్ను చేసుకోవచ్చుగా అన్నానురా.ఏదైతేనేం కథ గాడిలో పడ్డది, భగవంతుడిమీద భారంతో బాటు నామీద కూడా వెయ్యి, కథని సుఖాంతం చెయ్యమని” వాడితో నవ్వుతూ అన్నా.

వెంటనే జ్యోత్స్నకి వీడియో కాల్ చేసి కంగ్రాట్స్ చెప్పాను, ప్రదీప్ ని చూసి మొదటిసారి సిగ్గు పడిపోయింది- ఇద్దరూ నాకు థాంక్స్ చెప్పారు!

“పెళ్ళికి ఒప్పించే పూచీ నాది,కానీ మీ ఇద్దరు మాత్రం నాకు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వాలి అన్నాను,వీలు చూసుకుని నే ఒక్కడినే ఊరికి వెళ్లి వాళ్ళ ఇంట్లో మాట్లాడతా” అని చెప్పాను.

జ్యోత్స్నకి ప్రదీప్ కి ఇది కూడా చేప్పాను, ముందుగా జ్యోత్స్నావాళ్ళ ఇంట్లో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం కనుక్కుని గానీ ఈ ప్రస్తావన ప్రదీప్ వాళ్ళ ఇంట్లో తేనని. జ్యోత్స్న కొద్దిగా టెన్షన్ పడ్డది- వాళ్ళ అమ్మా-నాన్న ఏమనుకుంటారో అని, వాళ్ళకి చెప్పకుండా తనతో చెప్పినందుకు “అలాంటి టెన్షన్ పెట్టుకోకు, నాకు తెలుసు మీవాళ్ళతో ఎలా మాట్లాడాలో” అని నవ్వుతూ అన్నాను.

మర్నాడు ఉదయానికల్లా తిరిగి వెనక్కి వెళ్ళిపోయాను,బాస్ తో మాట్లాడి ఓ రెండు రోజులు సెలవు తీసుకొని, వీకెండ్ కి కలుపుకుని ఊరు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నా. రోజుకి మూడు సార్లు ఇద్దరూ ఫోన్ చేయడమే, ఒకటే ఆదుర్దా వాళ్ళ ఇళ్లల్లో ఏమంటారో అని.నేను మాత్రం శ్రీకృష్ణుడి లెవెల్లో ఇద్దరికీ అభయహస్తం ఇస్తూనే ఉన్నా-వాళ్ళ టెన్షన్ కి నవ్వుకుంటూ!

ఊరు బయలుదేరేముందు ప్రదీప్ కి, జ్యోత్స్నకి ఫోన్ చేశా, ఊళ్ళో అమ్మకి ఫోన్ చేసి చెప్పాను ఓ నాలుగు రోజుల కోసం కార్ లో వస్తున్నా అని- ఎందుకూ అని అడగలా సహజంగానే!

ఊరుచేరిన తర్వాత, విశ్రాంతి అయినతరువాత ఊళ్లోకి ఓ రౌండ్ వెళ్లాను,ఫ్రెండ్స్ ఎవరైనా కనపడతారేమో అని, తెలిసిన మొహాలు బోలెడు కనపడతాయి ఎలాగూనూ.సాయంత్రం అమ్మకి విషయం అంతా చెప్పి రాత్రి జ్యోత్స్నా వాళ్ళ నాన్న- అమ్మగారితో మాట్లాడతా అని చెప్పాను, నా మీద నాకే కాదు, మా అమ్మకు కూడా ధైర్యమే, వ్యవహారాలు బానే చక్కపెట్టగలనని.

జ్యోత్స్నావాళ్ళ నాన్నగారు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు చూసి పలకరించారు; “ఇంటికి రా” అన్నారు, “రాత్రికి కలుస్తాను అంకుల్” అన్నాను, రాఖీని చూసి పలకరించాను, కాసేపు కాలేజీ కబుర్లు చెప్పింది, మా ఆఫీస్ కబుర్లు అవీ మాట్లాడుకున్నాం.

divider

మరునాడు ఉదయాన్నే కాలేజీవైపు వెళ్ళాను,లెక్చరర్లని , ప్రిన్సిపాల్ ని, కొంతమంది ఫ్రెండ్స్ ని కలిసాను.కాంటీన్ లో లత కలిసింది, తనకు నిన్న ఫోన్ లో చెప్పాను నేను వచ్చిన సంగతి,ఇంటికి వస్తాను అని కూడా చెప్పాను.కాసేపు కాఫీ తాగుతూ కబుర్లు చెప్పి ఇంటికి వెళ్లిపోయాను.

ప్రదీప్ ఇంటికి ఆరోజు సాయంత్రం వెళ్ళాను, అప్పటికి అంటీ ఒక్కరే ఉన్నారు, కాఫీ తాగుతూ కబుర్లు చెపుతున్నాను “నీకు తెలుసుగా అంకుల్ కాసేపట్లో పొలం నుంచి వచ్చే సమయం అవుతోంది” అన్నారు- నవ్వుతూ తలఊపాను.ఈ లోపులో అంటీ చెవిలో ముందుగా ఈ విషయం వేస్తే మంచిదనిపించింది నాకు.

జ్యోత్స్న తనతో మొదలు పెట్టిన సంభాషణ నుంచి పూసగుచ్చి అంతా చెప్పాను- జ్యోత్స్నా వాళ్ళ నాన్న- అమ్మల అభిప్రాయాల గురించి కూడా.అంటీ అంతా విని “అంకుల్ ఏమంటారో” అడిగిచూడు అంది. “నీకు మా సంగతి తెలుసుగా సూరి, నువ్వు ఇంట్లోవాడివే, జ్యోత్స్న కుటుంబం మంచిది; వాళ్ళ అమ్మ-నాన్నగారు కూడా మర్యాదస్తులు, అలా పెరిగినపిల్ల మనఇంటికి రావడం సంతోషమే, అందునా మావాడు ఇష్టపడ్డాడు, అంతకంటే నాకేం కావాలి” అంది.దానితో నా భుజంమీద బరువు పూర్తిగా తగ్గిపోయినట్లయింది ఆంటీ మాటలతో-ఇక పని అయిపోయినట్లే అనుకున్నా మనసులో.

ఆంటీతో అప్పుడు అన్నా“అంకుల్ వచ్చిన తర్వాత మాట్లాడతాను,అప్పుడు మీరు తెలిసినట్టు ఉండబోకండి, మిమ్మల్ని కూడా మీ అభిప్రాయం అడుగుతా” అన్నా.

అప్పుడు లత కాలేజీనుంచి రావడంతో అంటీ “మీరు కబుర్లు చెప్పుకుంటూ ఉండండి అంకుల్ వచ్చేలోపు, నాకు లోపల పని ఉంది” అని చెప్పేసి వెళ్ళిపోయింది; ఒకందుకు ఇదీ మంచిదే అనుకున్నా అంకుల్ వచ్చే సమయానికి, లతా నేను మాట్లాడుకుంటం చూస్తే తర్వాత నేను మాట్లాడబోయే విషయంలో అంటీమీద అంకుల్ కి అనుమానంకూడా రాదు.

తాను కాలేజీ కబుర్లు అవి చెప్తోంది,ఇంతలో అంకుల్ పొలం నుంచి వచ్చారు, వస్తూనే, “ఆ… ఎలా ఉన్నావు” అంటూ నవ్వుతూ పలకరించి “ఇప్పుడే వస్తా”

అని చెప్పి లోపలకు వెళ్లారు!

అంకుల్ వచ్చేవరకూ లత- తాను కెమెరాలో తీసిన కొత్త ఫోటోలు,ఆల్బమ్స్ చూపించింది.అంకుల్ వచ్చి కాసేపు కూచున్న తర్వాత లత లొపలకి వెళ్ళింది మళ్ళీ వస్తా అని చెప్పి!

“ఆ…ఏంటి సూరి, ఆఫీస్ ఎలాఉంది, పనీ అదీ ఎక్కువగా ఉంటోందా, అంతా సౌకర్యంగానే ఉందా” అని అడిగారు.అలా ఊరు కబుర్లు కూడా చెప్పుకొచ్చారు అంకుల్, కాసేపు పొలం కబుర్లు, ఊళ్ళో రాజకీయాలు ముచ్చటించుకున్నాం. ఇంతలో అంటీ కాఫీ తీసుకొచ్చింది మా ముగ్గురికీ,మాకు కాఫీఇచ్చి అక్కడే మాతోబాటే కూచుండిపోయింది!

వాళ్ళిద్దరి వైపు చూస్తూ “అంకుల్ మీ ఇద్దరితో మాట్లాడదామని ప్రత్యేకంగా వచ్చాను ఈసారి మన ఊరికి”అన్నా అంకుల్ “ఏమిటోయ్ అంత ప్రత్యేకం” అని నవ్వుతూ అన్నారు “ప్రదీప్ పెళ్లి విషయం అంకుల్” అన్నా, అటునుంచి నరుక్కొద్దామని (జ్యోత్స్న పేరు ముందుగా బయటపెట్టడం ఎందుకు అని-ఎంతైనా వాళ్ళ అబ్బాయి కదా)

“ఆ….అప్పుడే వాడికి పెళ్లా, అలాగయితే నువ్వు కూడా చేసుకో- ఇద్దరూ ఆప్తమిత్రులు కదా, నీదికూడా వాడి వయసే- నువ్వు ఈ ఇంట్లోలాంటివాడివేకదా” అన్నారు.

“అలాకాదు అంకుల్,వాడు జ్యోత్స్న అంటే ఇష్టపడుతున్నాడు, మీకు చెప్పాలంటే సంశయిస్తున్నాడు, బెరుకుతో”

“మీ దగ్గర ఎంత చనువు ఉన్నా ఈ విషయం నాతో చెప్పాడు,మీ అభిప్రాయం ప్రకారమే వాడు ముందుకువెళతా అన్నాడు, అది కూడా అమ్మా-నాన్నలకి నచ్చితేనే” అని.

జ్యోత్స్న ఆక్సిడెంట్ విషయం అడ్డంగా వాడేద్దామని అనుకున్నాం సెంటిమెంట్ తో వర్క్ అవుట్ అవుతుందని.జ్యోత్స్నకి ఆక్సిడెంట్ అవడం మేమిద్దరం వెళ్లడం, జ్యోత్స్న డిశ్చార్జ్ అయ్యేవరకూ ప్రదీప్ తనను చూసుకోవడం,ఈ విషయం జ్యోత్స్నా వాళ్ళ ఇంట్లో కూడా చెప్పలేదని, మీకే మొదలు చెబుతున్నా అని అన్నాను.

నా పాచిక పారింది- ఇద్దరు ఆ మాట వింటూనే నన్ను- ప్రేమతోనే కోప్పడ్డారు, “ఆ అమ్మాయికి అంత జరిగితే మా ఎవ్వరికీ, అందునా వాళ్ళఇంట్లో కూడా చెప్పకుండా ఎలా ఉండగలిగారు మీరు,తప్పు కదూ” అన్నారు.

“ఏమో అంకుల్ నేనే అన్నాను ఈ విషయం మన ముగ్గురు దగ్గరే పెట్టుకుందాం, సందర్భం వచ్చినప్పుడు మన ఇళ్లల్లో చెప్పొచ్చు అని”

“భలేవాళ్ళు మీ ముగ్గురూనూ అని నవ్వేశారు - “మీరుమాత్రం జ్యోత్స్నవాళ్ళ ఇంట్లో చెప్పకండి- వాళ్ళు ఫీల్ అవుతారు” అని ఇంకో సెంటిమెంట్ వాడాను “మేము చూస్తున్నాం కదా ఆ అమ్మాయిని ఇన్నేళ్ళుగా, మంచిపిల్ల, ఆయన నిజాయితీకి చొక్కా వేసినట్టు ఉంటాడు, మంచి కుటుంబం కూడానూ” అని అంకుల్ చెప్పుకుంటూ పోతున్నారు.

మనసులో ఓ నమ్మకం సుఖాంతం అవుతుందని!

“మావాడి విషయంలో మా అభిప్రాయం చెప్పేలోపు నిన్ను కూడా ఓ విషయం అడుగుదామనుకుంటున్నా”అన్నారు అంకుల్!

“నువ్వు ఇంట్లోవాడివి అనుకుంటే నువ్వు ఏమిటి మా లత విషయంలో ఇలా చేసావు” అన్నారు హఠాత్తుగా!

చెప్పొద్దూ నా కాళ్ళకింద భూమి జరిగిపోయినట్టయి బిక్క మొహం పెట్టా - “నేనేం చేసాను” అన్నట్టు.

divider

“నువ్వు మా లతని చేసుకోవచ్చుగా” అన్నారు- షాక్ మీద షాక్ కు గురిఅవడం నావంతయింది ఈ హఠాత్పరిణామానికి -ఉరుమురిమి మంగళంమీద పడ్డట్టు!

“అదేంటి అంకుల్ సడన్ గా” అన్నాను- ఏమనాలో తెలియక!

“ఏం లత నచ్చలేదా, అదంటే ఇష్టం లేదా” ఆంటీ అడిగింది ఈసారి “అలా కాదు ఆంటీ, హఠాత్తుగా…:” అని మాటలు నాంచాను, ఏం మాట్లాడాలో తెలియక.

“లేదు సూరి- లత నీమీద ఇష్టం ఉన్నట్టు వాళ్ళఅమ్మతో చెప్పిందిట, మావరకు నువ్వు మాఇంట్లోవాడివే, మాకు అభ్యంతరం ఏముంటుంది- ఆనందం తప్ప. కాకపోతే నీకు ఇష్టమో కాదో తెలియాలి కదా” అని అంకుల్ అన్నారు.

ఓ నిమిషం మనసులోనే ఓ పెద్ద నిట్టూర్పు విడిచి ఆశ్చర్యపోతూ అడిగాను “మరి లత ఒక్కసారి కూడా ఆ విషయం నాతో అనలేదే” అన్నాను, నాతో ఆసక్తిగా మాట్లాడినా అలవాటు కాబట్టి అనుకున్నాగానీ తన మనసులో నేను ఉన్నా అనే సంగతే అనుకోలేదు” అన్నాను, కాస్త వాళ్ళ మాటలకు తేరుకుని.

మనసులోనే అనుకున్నా “ఆంటీ మీరు “పెద్ద తోపు”- ఈ విషయం తెలిసీ, తెలివిగా ఊరకుండిపోయారు,అంకుల్ చేత అడిగించారు” ఆవిడ వైపు ఓచూపు చూసాను అంకుల్ చూడకుండా-ఓ ముసిముసినవ్వు నవ్వారు, “నేనేమీ నీకంటే తక్కువ దాన్ని కాదు” అన్నట్టు కనురెప్పలు ఎగరేస్తూ.

ఈ వాతావరణాన్ని వాడుకుని ప్రదీప్ గాడి పెళ్లి ఖాయం చేయాలని-వెంటనే అన్నాను,మాటమార్చి “నా సంగతి తర్వాత, ముందుగా ప్రదీప్ -జ్యోత్స్నని ఇష్టపడటం గురించి మీ అభిప్రాయం చెప్పండి”

నవ్వు మొహంపెట్టి- “జ్యోత్స్నా వాళ్ళ తల్లితండ్రుల అభిప్రాయలు కనుక్కుని వాళ్ళకి ఓకే అయితే ప్రదీప్- జ్యోత్స్నలకి, మీ ఇంట్లోవాళ్లకి నచ్చితే లతతో నీకూ, రెండు పెళ్లిళ్లు మన ఊళ్ళోనే పదికాలాలు చెప్పుకునేట్టు ఘనంగా చేసేద్దాం” అన్నారు.

ఆంటీ అంకుల్ ఇన్నేళ్ళలో ఆనందం పట్టలేక ఇలా మాట్లాడటం, చూడటం ఇదే మొదటసారి!

నేను తలవంచుకుని “అలాగే” అన్నాను, అంకుల్ లేచి వచ్చి దగ్గరకి తీసుకుని, “సూరి, నువ్వు మాకు ప్రదీప్ లాగానే, నువ్వు నీ స్నేహితుడి పెళ్లి కుదర్చటానికి పెద్దరికం తీసుకోవడం కూడా మాకు నచ్చింది, మీది నిఖార్సయిన స్నేహం అంటూ గుండెలకి హత్తుకున్నారు.

నాకు ఆనందంతో కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి “రేపే వచ్చి మీ అమ్మా-నాన్నలతో మాట్లాడతాం” అన్నారు నేనూ అన్నాను “జ్యోత్స్నా అమ్మా-నాన్నలని రేపు మీ దగ్గరికి తీసుకొస్తా” అని వెళ్లేముందు ఓసారి లతని కలిసి వెళ్తా అని అంకుల్ కి ఆంటీకి చెప్పి ఇంటిలోపలకి, లత గదికి వెళ్లాను లతకి మేము బయటమాట్లాడుకునే విషయం తెలిసే అవకాశం లేదు కాబట్టి, చొరవగా లత చేయిని దగ్గరకు తీసుకున్నాను.నేను ఏమీ చెప్పకుండానే లతకి విషయం అర్ధం అయినట్టుంది, నేను తనచేయి పట్టుకున్న విధానానికి,నాతీరుకి.

తనతో అన్నా “నువ్వు ఒక్కసారికూడా నీ మనసులో మాట నాతో అనలేదు” కొద్దిగా సిగ్గుపడుతూ అంది, “నీ మనసులో ఏమి ఉందో, ఎక్కడ నువ్వు కాదు అని చెప్తావో,నువ్వు ఏమంటావో అని మనసులో ఉన్నా నీతోగాని, అన్నతోగాని ఎప్పుడు అనలేదు- టెన్షన్ పడుతున్నా,ఇప్పుడు సంతోషంగా ఉంది” అంది.

లత చాలా ఆనందపడిపోయి హఠాత్తుగా నన్ను దగ్గరకి తీసుకుంది!

అప్పుడు తనతో ప్రదీప్- జ్యోత్స్నల గురించి అంకుల్,అంటీ ఒప్పుకోవడం గురించి చెప్పాను.

ఒక్కసారి ఎగిరి గంతేసి "అయితే డబుల్ ధమాకా అన్నమాట- వాడి పెళ్లిగురించి మాట్లాడటానికి వస్తే- నీపెళ్లి కూడా ఖాయం అయిపొయింది చూడు" కొంటెగా, కన్నుగీటుతూ అంది "ఇప్పటికీ ఇది నమ్మబుద్ధి కావడం లేదు" అన్నాను, లతతో తన్మయత్వంతో; కాలం, గాలి స్తంభించిపోయాయి ఆ ప్రదేశంలో కొన్నిక్షణాలపాటు!

కొద్ది క్షణాల్లోనే తేరుకుని లత గదినుంచి బయటకు వచ్చి, అంకుల్ ని కలిసాను, ఆంటీని లతని కూడా బయటకు పిలిచి "ఈ విషయం జ్యోత్స్నా ప్రదీప్ లకి ఏమాత్రం చెప్పొద్దూ, రేపు మన మూడు కుటుంబాలు కలిసిన తర్వాత వాళ్ళిద్దరిని ఏమీ చెప్పకుండా ఇక్కడికి వెంటనే వచ్చేయమని చెప్తా.మాతోటలో పెద్ద సర్ ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేద్దాం, అక్కడ అన్ని విషయాలు వాళ్ళకి చెబుదాం అన్నా, వాళ్ళు ముగ్గురూ నే చెప్పినదానికి ఓకే చెప్పేసారు.

నేను ఇంటికి వెళ్ళినతర్వాత, అమ్మా-నాన్నల్ని కూచోబెట్టి జరిగినదంతా చెప్పాను, వాళ్ళు చాలా సంతోషించారు, మా కుటుంబాల మధ్య ఉన్న స్నేహం ఈ విధంగా బాంధవ్యంగా మారబోతున్నందుకు.

అంత రాత్రిలోనూ అంటీని, అంకుల్ ని, రాఖీని నిద్ర లేపి మరీ ఈ రెండు శుభవార్తలు చెప్పాను, వాళ్ళ ఆనందానికీ పట్టపగ్గాలు లేవు, రాఖీ చాలా సంతోషించింది తన స్నేహితురాలు లతా నేను పెళ్లి చేసుకోబోవడం, వాళ్ళ అక్కతో నా ప్రాణస్నేహితుడు ప్రదీప్ పెళ్ళికి, ప్రదీప్ తల్లితండ్రులు సంతోషంగా ఒప్పుకోవడం.

ప్రదీప్ ఇంట్లో చెప్పినట్టే వీళ్లకీ చెప్పాను ఈ విషయం రహస్యంగా ఉంచాలని, ప్రదీప్ జ్యోత్స్నలతో నేను ఉదయాన్నే మాట్లాడతా అని; అలా అక్కడ ఉండగానే ప్రదీప్ నుంచి, జ్యోత్స్ననుంచి ఫోన్ లు వచ్చాయి.

ప్రదీప్ ఇంట్లోవాళ్ళని కలిసినట్టు వాళ్ళు కొద్ది సమయం అడిగినట్టు ఇద్దరికీ చెప్పాను- ఉత్కంఠ పెంచటం కోసం.అవసరమైతే నేను మీఇద్దరికీ ఫోన్ చేస్తాను మీరు వెంటనే వచ్చేయాలి- సెలవ దొరికినా- దొరకకపోయినా కూడా, ఎంచేతంటే ఇది ఇరువురికీ జీవిత సమస్య అని, ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం చూసుకోవచ్చని కాస్త డ్రామాతో చెప్పాను.జ్యోత్స్న ఇంట్లోవాళ్ళు నవ్వుకుంటూ నా వైపు చూస్తున్నారు నేను ఫోన్ లో మాట్లాడుతున్నంత సేపూ...

ఫోన్ మాట్లాడటం అవగానే, “ఏమో అనుకున్నాం గానీ నువ్వు కనపడేంత అమాయకుడివి కాదు, కాలాంతకుడివి, పెద్ద వ్యవహారవేత్తవీనూ” అని అంకుల్ అంటీ అన్నారు- రాఖీ కూడా నా వంక ప్రశంసాపూర్వకంగా చూసింది.

అంత రాత్రి అంటీని అడిగి మరీ కాఫీ కల్పించుకు తాగాను, అలా మధ్యరాత్రి దాకా కబుర్లు చెప్పుకున్నాం.అంకుల్ రెండేళ్లలో రిటైర్ అయిపోతారని, మొదట అనుకున్నట్టే ఇక్కడ కొన్న పొలంలో ఓ ఇల్లు కట్టుకుంటాం అని అన్నారు మాటల మధ్య.ఇప్పుడు ఈ బాంధవ్యంవల్ల ఇంత మందీ మార్బలం దొరికిందని, మీ ఇల్లు- మీ ఊరు అచ్చి వచ్చిందని అన్నారు నాతో.

"వి అల్ అర్ డిస్టయిన్డ్, ప్రాబబిలీ ఇట్స్ యువర్ డెస్టినీ అంకుల్" అన్నాను నవ్వుతూ.కాసేపటికి అమ్మ కిందనుంచి పిలవడంతో ఇంటికి వెళ్ళిపోయాను - మంచి నిద్రలోకి- ఈసారి మెరుపుకలలతో!

మరునాడు ఉదయాన్నేప్రదీప్ నాన్నగారు నాకు ఫోన్ చేసి వాళ్ళఇంటికి రమ్మన్నారు; అంత అర్జెంటు ఏమిటా అని ఊరుకుపరుగులతో (కార్ లోనే అనుకోండి) చేరిపోయాను-అక్కడ దిమ్మతిరిగిపోయే ప్లాన్ చేశారు అంకుల్.

రేపు సాయంత్రం వాళ్ళ తోటలో రెండు నిశ్చితార్థాలు చేసేద్దామని,చుట్టుపక్కల ఉన్న బంధువుల్ని, ఊళ్లోఉన్న ముఖ్యమైనవాళ్ళకి కబుర్లు చేయిస్తానని అన్నారు.ఇంకా ఫార్మాలిటీస్ ఏమీ పెట్టుకోవద్దని, మా ఇంటికి- అంటీ- అంకుల్ లతని తీసుకొని వస్తామని,అక్కడే జ్యోత్స్నావాళ్ళ తల్లితండ్రుల్ని కలుద్దామని, నువ్వు ఇప్పటికే మా అభిప్రాయం చెప్పావు కాబట్టి, మీ ఇంటోనే అందర్నీ కలుద్దామని అన్నారు.

జ్యోత్స్నా-ప్రదీప్లకి ఈవిషయం చెప్పకుండా, అసలు విషయం ఏమీ చెప్పకుండా, నువ్వే ఏదో చెప్పేసి ఉన్నపళాన ఊరికి వచ్చేయమని నన్ను ఫోన్ చేసి చెప్పమన్నారు!

“వ్యవధి తక్కువ కదా అంకుల్” అన్నాను “ఏమీ పర్వాలేదు అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను, మీ ఇంట్లో, జ్యోత్స్నఇంట్లో మేం వస్తున్నామని చెప్పు” అన్నారు “లేడికి లేచిందే పరుగు” అంటే ఇదేనేమో అని మనసులోనే అనుకున్నా-మళ్ళీ వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోనని!

“ఇదంతా ప్రదీప్, జ్యోత్స్నలకి సర్ప్రైజ్ చేద్దామని, మామూలుగా అయితే వాళ్లకి థ్రిల్ ఏముంటుంది సూరి” అన్నారు

“మీరు మామూలోళ్లు కాదు అంకుల్” అన్నా పక్కనే, కథానాయకురాలు,నాహీరోయిన్ నవ్వుతూ నుంచుంది పిచ్చ ఎక్సయిట్ మెంట్ తో. అలాగే అని కాఫీతాగి నవ్వుతూ వెంటనే ఇంటికి వెళ్ళిపోయాను;దారినుంచే ప్రదీప్ గాడికి, జ్యోత్స్నకి ఫోన్ చేసి వెంటనే వచ్చేయమని, ఇక్కడ విషయం కొద్దిగా సీరియస్ అవుతోందని, మీరిద్దరూ వస్తే నేను ఏదో విధంగా సర్దిచెప్పి కధ సుఖాంతం అయేట్టు చేస్తా అని బిల్డ్ అప్ ఇచ్చాను.వచ్చిన, ఇచ్చిన ఛాన్స్ ను వదులుకోవడం హీరోయిజం లక్షణాలు కాదుగా మరి- సిట్యుయేషన్ ని ఫుల్లుగా వాడుకున్నా.

ఎంతయినా నా ఈకధలో హీరోని నేనే కదా-కాకపోతే ఏమిటి, వీసమంత కష్టపడకుండా నన్ను ప్రేమించిన అమ్మాయి, అదీ నాకు తెలియకుండా, నన్ను పెళ్ళిచేసుకోవాలని అనుకోవడం,అదీ వాళ్ళ అమ్మా-నాన్నల ని ఒప్పించి, వాళ్ళ చేతే అడిగించి మరీను- కూతురు కదా అని కాదనలేకపోయారా, నా మీద ప్రేమ కూడా అయి ఉంటుంది అనుకున్నా!

అలా అని కాదుగానీ,నిజంగానే ఓ మంచిపని చేయాలని అనుకున్న వాళ్ళిద్దరికీ, బహుశా దేవుడు నా సంగతి అయన భుజాన వేసుకున్నట్టున్నాడు.

divider

అలాగే అంకుల్ కి,నాన్నకి ఫోన్ చేసి ఇంట్లోనే ఉండమని ఆఫీస్ కి,పొలానికి వెళ్ళద్దని ఇద్దరికీ చెప్పి ఇంటికిచేరి విషయం అంతా రెండుఇళ్లల్లో వాళ్లకి చెప్పేసాను.రాఖీ, నేనూ పళ్ళూ, పూలు, తేవడానికి బజార్ కి వెళ్ళాం,ఫలహారాలు, కాఫీలు జ్యోత్స్నా వాళ్ళ అమ్మగారు చేస్తా అన్నారు- అందరం కలవడం మాత్రం మాఇంట్లోనే అని చెప్పాను.

అలాగే ఈ విషయం, రేపు ఫంక్షన్ విషయం ప్రదీప్, జ్యోత్స్నలకి చెప్పకూడదని ఆంక్షలు పెట్టాను “మనం చెప్పకపోతే ప్రదీప్ వాళ్ళ బంధువులకి ఈ విషయం చెప్పి ఫోన్ చేయచ్చు కదా” అని ఆంటీ అన్నారు, అప్పుడు అన్నా “అంకుల్ అంత ఆలోచించరా ఏంటి, చుట్టాలకి అసలు విషయం చెప్పకుండా వాళ్ళ తోటలో ఫంక్షన్ ఉంది, అందరూ రండి అని మాత్రమే చెప్పబోతున్నారు అందరికీ.

మన మూడు కుటుంబాలకి తప్ప -ఇంక ఎవరికీ ఈ ఫంక్షన్ అంకుల్ ఎందుకు చేస్తున్నారో తెలియదు- రాబోయే వాళ్ళకీ సస్పెన్సే- గొప్ప థ్రిల్ వచ్చేవాళ్ళకి కూడానూ అంత పకడ్బందీ ప్లాన్ మరి” అన్నా “ఇదంతా ప్రదీప్ కి జ్యోత్స్నకి మంచి సర్ప్రైజ్ ఇద్దామని, ఏదైనా అంకుల్ ఆలోచనకి మెచ్చుకోకుండా ఉండలేం కూడా” అన్నాను.

అందరూ అవునన్నట్టు మెచ్చుకోలుగా చూసారు నేనూ-అమ్మా రాఖీ- అంటీ గబగబా చేతనైంతలో వాళ్ళ, మాఇంట్లో పూలదండలు, మామిడితోరణాలు కట్టేసాం -లోపల మాత్రం- “వీధిలో వెళ్ళేవాళ్ళకి ఉప్పందకూడదుగా” ఏమాత్రం.సాయంత్రానికల్లా అంకుల్-అంటీ, లతా వచ్చారు ఇంటికి-లత మాత్రం స్పెషల్ గా తయారయి వచ్చింది, అప్పటికే రాఖీ-వాళ్ళ నాన్నా అమ్మా మాఇంట్లోనే వచ్చి కూచున్నారు.

మూడు కుటుంబాల్లో అరమరికలు లేని చనువు ఉన్నా,వాళ్ళు వచ్చిన సందర్భం ప్రత్యేకం కాబట్టి, అందరూ ఎప్పటిలాగా ఫ్రీగా ఉండలేకపోయారు కాస్సేపటివరకూ. అంకులే చనువుతీసుకుని, నవ్వుతూ వాతావరణాన్ని మార్చడానికోసం అన్నట్టు మా అమ్మా -నాన్నలతో అన్నారు.

“మా అమ్మాయి లతని మీ ఇంటికోడలిగా చేసుకోమని అడగటానికి వచ్చామండి బావగారూ” అని అంటూనే, జ్యోత్స్నా వాళ్ళ తల్లితండ్రులతో "మా అబ్బాయిని మీ అమ్మాయికి ఇద్దామనుకుంటున్నాం బావగారూ, మీరెవరికీ అభ్యంతరం లేదనుకుంటా” అని నవ్వుతూ వరసలు కలుపుతూ అన్నారు- ఇబ్బంది పడటం జ్యోత్స్నా వాళ్ళ తల్లితండ్రుల వంతు అయింది.

అది చూసి మళ్ళీ అంకులే "ఫ్రీగా, ఉంటుందనే మేమువచ్చాం, ఇదివరకు మన మూడు కుటుంబాలు ఎంత ఫ్రీగా ఉండేవాళ్ళమో అలాగే ఉండమని చెప్పడమేనా ఉద్దేశం.మూడుకుటుంబాల మధ్య- పిల్లలవల్ల ఇప్పుడు బంధుత్వం ఏర్పడుతోంది.మాకు ఈతేడాలు లేవు” అని చెప్పినతర్వాత అప్పటిదాకా వాతావరణంలో ఉన్న గంభీరత పోయింది-అందరం సరదాగా కబుర్లు చెప్పుకున్నాం!

అప్పుడు అంకులే అన్నారు, “మీకు సూరి చెప్పివుంటాడు, రేపు నిశ్చితార్థానికి ఏర్పాట్లపై పురమాయింపులు కూడా అయిపోయినాయి; మీకు చెప్పకుండా స్వతంత్రించి నిర్ణయం తీసుకున్నందుకు ఏమీ అనుకోకండి”

“పిల్లలు చొరవ చేశారు కాబట్టి- వాళ్లకి కొద్దిగా సర్ప్రైజ్ ఇద్దామని వెంటనే చేద్దామని అనుకున్నా, వాళ్ళతో ఆడేనాటకం సూరి ఆడేస్తాడు-ఎంతైనా దీనికి సూత్రధారి మా అల్లుడే కదా”అన్నారు, చెప్పొద్దూ ఇంతమంది ముందు అంకుల్ ఆ మాటలంటుంటే కొద్దిగా,నిజంగానే సిగ్గు పడ్డాను.

వెంటనే లత వాళ్ళ అమ్మగారు, “సూరీ, సిగ్గుపడాల్సింది మాఅమ్మాయిగానీ నువ్వు కాదు” అంది, దాంతో అందరూ గట్టిగా నవ్వారు-నా హీరోయిన్ తో సహా.మళ్ళీ ఆంటీ రాఖీ వైపు చూసి, “మరి నీ స్నేహితురాలు గుట్టుచప్పుడు కాకుండా మొగుణ్ణి వెతుక్కుంది-మరి నువ్వు కూడా ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పేయ్, పనిలో పని నీ సంగతి కూడా తేల్చేద్దామ్” అంది నవ్వుతూ.

రాఖీ సిగ్గుపడుతూ “అలాంటిదేమీ లేదు ఆంటీ” అంది “ఉంటే గింటే సూరి చెవిలో వేసేయి, అబ్బాయి తల్లితండ్రుల దగ్గరకు వెళ్లి సాధించుకొస్తాడు” అంది ఫలహారాలు, కాఫీలు అయినతరువాత రేపు సాయంత్రం వాళ్ళ తోటలో కలుద్దామని, నన్ను పక్కకు పిలిచి ప్రదీప్ ని, జ్యొత్స్నని తోటకి ఎలా తేవాలో-ప్లాన్ ఏంటో అడిగారు.నేను వాళ్ళిద్దరినీ తిన్నగా ఎలా తెచ్చేది వివరించాను, నవ్వుతూ భుజం తట్టి, గుడ్ అన్నారు.

ఇంకా వెళ్తాము అన్నారు,అమ్మ తన మెళ్ళో ఉన్న గొలుసుతీసి లత మెడలో వేసింది- తానే అంది. “అన్నీ హఠాత్తుగా, వ్యవధే లేకుండా అయిపోతున్నాయి, మొదటిసారి కాబోయే కోడలు మా ఇంటికి వచ్చింది కాబట్టి ఇలా చేసాను, పెళ్లి టైంకి తనకి నచ్చినవి తీసుకుంటాం" ఇంకా ఎవరూ మాట్లాడటానికి అవకాశమే లేకపోయింది.

నాకు మాత్రం అర్ధమైంది, అమ్మ ఎప్పుడూ ఒక గొలుసు వేసుకుంటుంది, బీరువాలో ఉన్న ఓ కొత్తగొలుసు లతకి ఇచ్చే ఉద్దేశంతో ఈరోజు అది కూడా మెడలో వేసుకున్నట్టుంది, అది నేను, నాన్నా గ్రహించాం- అమ్మ సమయస్ఫూర్తికి నాన్న మెచ్చుకోలుగా చూసారు అమ్మని.

ఈరోజు మామూడు కుటుంబాలవారు జీవితాంతం గుర్తు ఉంచుకునే రోజు!!!

నేను చేసిన హడావుడికి, నా మాటలకి, ప్రదీప్ ఫోన్ చేసి చెప్పాడు, తనకి దూరం అయినా, తాను కార్ తీసుకొని జ్యొత్స దగ్గరకు వెళ్లి ఇద్దరం కలిసి రేపు సాయంత్రానికి ఊరు చేరుకుంటాం అని “ఈ సమయంలో అదే మంచిపని, జ్యోత్స్నని ఒక్కదాన్నే విడిగా రమ్మనకుండా” అని అన్నాను, ఊర్లోకి వచ్చే టైంకి ఫోన్ చేస్తే నేను వాళ్ళిద్దరినీ అక్కడ కలుస్తా అని చెప్పాను.టెన్షన్ పడొద్దని వాడికి ధైర్యం చెప్పాను, జ్యొత్స్నకు కూడా అదే చెప్పాను.

మనసులో ఓ పక్కన వాళ్ళీద్దిరిని అనవసరంగా టెన్షన్ పెడుతున్నామేమో అనిపించింది, అయితే అయిందిలే, ఒక్కరోజేగా, ఇక్కడకి వాళ్ళు చేరగానే ఆ టెన్షన్ వాళ్ళు ఊహించలేని ఆనందంగా మారుతుంది,లతకీ నాకు పెళ్లి అని తెలిస్తే వాడి ఆనందానికి హద్దు ఉండదు అనుకున్నా.ఏదైనా ఇది థ్రిల్ ఇచ్చేందుకే గా అంకుల్ చేసేది, నేను నాటకం ఆడినా అనుకున్నాను.

divider

పొద్దున్నే ఫలహారాలు అవగానే “అమ్మా- నాన్న”, “రాఖీ,ఆంటీ, అంకుల్”ని ప్రదీప్ వాళ్ళ తోటకి తీసుకెళ్ళాను.అటునుంచి, అంకుల్, అంటీ కూడా అక్కడకు చేరుకున్నారు. ఓ పాతికమంది యుద్ధప్రాతిపదికమీద భారీ ఏర్పాట్లు చేస్తున్నారు, వేదిక,డెకరేషన్లు కడుతున్నారు, లైటింగులవాడు తోటమొత్తం చెట్లకి, పుట్లకి లైట్లు చుట్టేస్తున్నాడు. కాస్త సమయంలో ఇన్ని ఏర్పాట్లు చేయగలిగారు అంటే అంకుల్ కున్న కాంటాక్ట్స్,పలుకుబడివల్లే ;కొడుకూ, కూతురు పెళ్లి నిశ్చితార్థం అంటే మాటలా.

ప్రదీప్ ఫోన్ చేసాడు జ్యోత్స్న దగ్గరకు వెళ్లి తనని తీసుకొని బయలుదేరాం అని, ప్రశాంతంగా డ్రైవ్ చేయమని చెప్పాను వాడికి, మధ్యమధ్యలో ఫోన్ చేస్తూ ఉండమని జ్యోత్స్నకి చెప్పాను-అన్నీ సర్దుకుంటాయి- గాబరా పడకు, వాడికి కూడా ధైర్యం చెప్పు అన్నాను తనతో.

నేనూ కాస్సేపు అక్కడే ఉన్నాను దగ్గరుండి పనులు చేయిస్తూ, లంచ్ టైం కి లతను తీసుకురావడానికి వాళ్ళ ఇంటికి వెళ్లి తనని తీసుకొచ్చాను.భోజనాలు అయినతరువాత, పనులన్నీ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత అందరం ఇళ్ళకి బయలుదేరాం, ఫంక్షన్ కి రెడీ అయి రావచ్చని.లతా వాళ్ళు వచ్చేటప్పుడు ప్రదీప్ బట్టలు, అలాగే రాఖీవాళ్ళు వచ్చేటప్పుడు జ్యోత్న బట్టలు తీసుకురావాలని అనుకున్నాం;నేను మాత్రం ఇంటి దగ్గరే ఉండి వాళ్ళు ఊళ్లోకి చేరగానే తిన్నగా ఇక్కడ కి తేవడం, ఇదీ మా ప్లాన్.

అనుకున్నప్రకారం నేను ఇంటిదగ్గరే ఉండిపోయాను, తతిమ్మావాళ్ళు తోటకి వెళ్లిపోయారు, చేరంగానే లత ఫోన్ చేసి చెప్పింది.తోట, పొలంలో ఇల్లూ అదీ సౌకర్యం ఉంటుంది కాబట్టి వాళ్ళ విశ్రాంతికి, వాటికి ఇబ్బంది లేదు.

సరిగ్గా ఐదు ఆ ప్రాంతాల్లో ఊరిలోకి ఎంటర్ అయేముందు జ్యోత్స్న ఫోన్ చేసింది, నేను కార్ లో వాళ్ళని కలవడానికి బయలుదేరాను, దారినుంచే అంకుల్ కి ఫోన్ చేసి చెప్పాను కాసేపట్లో వాళ్ళు వస్తున్నారని,వాళ్ళని కలిసి తోటకి బయలుదేరేముందు మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పాను- అంతా ప్లాన్ ప్రకారమే జరిగిపోతోంది.

వాళ్ళు ఊలోకి రాగానే “కాఫీ కెఫె డే” లో వెళ్లి కూచున్నాం, ఇద్దరూ చాలా టెన్షన్ తో ఉన్నారు “మీ ఇద్దరి ఇళ్లలోవిషయం చెప్పడం జరిగింది”, జ్యోత్స్న వైపు చూస్త్తూ “మీ ఇంట్లో అభ్యంతరం ఏమీ లేదు”, ప్రదీప్ వైపు చూస్తూ, “మీ నాన్నగారే అలోచించి చెప్తా అన్నారు, మీ అమ్మ ఏమీ మాట్లాడలేదు” అని చిన్న బ్రీఫింగ్ ఇచ్చాను,మనసులో నవ్వుకుంటూ.

నా కార్ అక్కడే వదిలేసి వాడి కార్ లో ఇంటికివెళ్దాం అన్నాను “ఇప్పటిదాకా నువ్వు డ్రైవ్ చేసి టైర్డ్ అయి ఉంటావు,నేను చేస్తా” అని డ్రైవింగ్ తీసుకున్నాను.

డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళ పొలం వైపు తీసుకెళ్తున్నా, “అదేంటి, ఇంటికి వెళ్లకుండా ఇటు వైపు తీసుకెళ్తున్నావ్ అన్నారు” ఇద్దరూ కంగారుగా “మీనాన్న మిమ్మల్ని ఇక్కడికే తెమ్మన్నారు” అని ప్రదీప్ వైపు చూస్తూ అన్నాను- దాంతో వాళ్ళ కంగారు ఇంకాపెరిగింది.

పొలం దగ్గరపడుతూనే,తోటలో హడావుడి కనపడింది వాళ్ళిద్దరికీ, కార్ తోట మొదట్లో ఆపేసి లోపలకి నడుద్దాం పదండి అన్నా.

(వ్యవధి తక్కువైనాముఖ్యులైన ఆప్తులు, చుట్టుపక్కల ఉన్న బంధువులూ చాలా జనమే వచ్చారు, వాళ్ళకీ అర్ధం కాలేదు, ఫంక్షన్ జరగోబోతోందని మాత్రం చూసినవాళ్లు ఎవరైనా ఊహించుకోగలరు-అదే అసలు ఆ ఫంక్షన్ ఏమిటి అనేదే అందర్నీ తొలుస్తున్న ప్రశ్న)

దిగిచూస్తే వాళ్లకి ఏమీ పాలుపోలేదు, అక్కడ ఏర్పాట్లు చూసి, “ఏంటి ఇది, ఇదంతా ఏంటి, ఏం జరుగుతోంది అని అడిగారు” నన్ను.నేను సమాధానం చెప్పేలోపే లత కనపడ్డది వాళ్ళకి “బాగా అలంకరించుకుని”, ఇక వాళ్ళ పరిస్థితి చూడాలి, “అన్నయ్యా” అంటూ వాడి దగ్గరకి వచ్చింది, జ్యోత్స్నని పలకరించింది-వాళ్ళ మొహాలనిండా ఆశ్చర్యమే.లతని అడగబోయి ఎందుకులే అనుకున్నారో ఏమో మౌనంగా నడవడం మొదలు పెట్టారు.

దూరంగా స్టేజిపై అంకుల్- ఆంటీ నుంచొని ఉన్నారు-మమ్మల్ని దూరంగానే చూస్తూ, అంకుల్ గొంతు సవరించుకొని మాట్లాడటం మొదలు పెట్టారు అక్కడకు వచ్చిన వాళ్ళని అందర్నీ ఉద్దేశిస్తూ, అందరూ కూడా పరీక్షా ఫలితాలకోసం ఎదురుచూసే వాళ్ళలాగా మొహాలు చాచి మరీ చూస్తున్నారు అంకుల్ వైపు.

“మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలవడానికి కారణం” అని ఒక సెకండ్ ఆపి, “మా అబ్బాయి ప్రదీప్ కి” మళ్ళీ ఆపి, జ్యోత్స్నావాళ్ళ తల్లితండ్రుల్ని స్టేజిపైకి రమ్మని సైగ చేసి- “ఇదిగో వీళ్ళ అమ్మాయి జ్యోత్స్నతో పెళ్లి చేద్దాం అని నిశ్చయించాం” అన్నారు.

ప్రదీప్, జ్యోత్స్నా నిశ్చేష్టులై ఉండిపోయారు నోటమాటరాక, ఇద్దరూ ఆ సర్ప్రైజ్ కి, ఆనందానికి తట్టుకోలేక నన్ను దగ్గరకి తీసుకుని ఏడ్చేశారు.వాడైతే “దృతరాష్ట్రుడి కౌగిలి లెవెల్లో” నన్ను వత్తిపట్టి నవ్వుతూ ఏడ్చేశాడు.క్షణాల్లో తేరుకుని ఇద్దరూ వేగంగా స్టేజి దగ్గరికి వెళ్లారు.ప్రదీప్, అంకుల్ ని-ఆంటీని పట్టుకుని ఆనందంతో ఏడ్చేశాడు.అంకుల్- ఆంటీ జ్యోత్స్నని దగ్గరకు తీసుకున్నారు.వెంటనే జ్యోత్స్న నాన్నా అమ్మా వీళ్ళిద్దరిని నవ్వుతూ దగ్గరకి తీసుకున్నారు.

వీళ్ళకి అప్పటికీ నోటివెంట మాటరావడం లేదు- ఆశ్చర్యం, సంతోషం, ఏడుపు కలగలిసిపోయి! వచ్చినవాళ్లలో కొందరు చప్పట్లు కొట్టడం జరిగింది సస్పెన్స్ విడిపోయినందుకు! అంకుల్ మంచి ఆర్టిస్ట్ అని అర్ధం అయింది నాకు- ఆయనలోఉన్న మరోకోణం చూడటం జరిగింది ఈ విధంగా అనుకున్నా “ఇదేకాదు” అంటూ “మా అమ్మాయి “లతని”, ఇదిగో- మావాడి ప్రాణస్నేహితుడు సూరికి ఇచ్చి పెళ్లి చెయ్యడానికి సూరి తల్లితండ్రులు ఆనందంతో అంగీకరించినందుకు వాళ్లకు ముందుగా కృతజ్నతలు” అన్నారు అంకుల్ ప్రదీప్, జ్యోత్స్నాల మొహాలు చూడాలి,వెయ్యి మతాబుల వెలుగులు వాళ్ళ మొహాల్లో వచ్చాయి ఆశ్చర్యంతో, ఆనందంతో,వాళ్ళిద్దరికీ షాకులమీద షాకులు. “ఎప్పుడన్నా మీ ఇద్దరికీ స్థిమితంగా, వివరాలు చెప్తాను, ముందు వెళ్లి బట్టలు మార్చుకుని రండి,నేనూ రెడీ అవ్వాలిగా మీ చెల్లాయి చేయి అందుకోవడానికి” అన్నాను నవ్వుతూ.

మరి కాసపేపట్లో శాస్త్రోక్తంగా రెండు నిశ్చితార్థాలు జరిగినాయి,దండల మార్పిడితోనే -ఉంగరాలు మార్చుకోకుండానే-వ్యవధిలేదుగా మరి-మిగతాది మీరు ఈస్టమన్ కలర్ లో ఊహించుకోవచ్చు సులభంగానే!

అదండీ, మాఊరు- మామూడు కుటుంబాల కధ- నేను నా కధ చెప్పడం మొదలుపెట్టినప్పుడు, కధనం నడిపాగానీ, చివరికి వచ్చేసరికి నా కధకి నేనే హీరో అవుతా అనుకోలేదు-ఇలా మా జీవితాల్లో ఇన్ని మలుపులు తిరుగుతాయని ఊహామాత్రం కూడా రాలేదు.ముహూర్తాలు పెట్టగానే మీ అందరికి చెప్తాను, మీరందరూ తప్పకుండా మాఊరువచ్చి మా రెండుజంటల్ని ఆశీర్వదించమని కోరుతున్నా!

శుభం

ప్రేమతో మీ సూరి

ఓపిగ్గా ఈ కధని ఇన్నిరోజులూ విన్నందుకు-సారీ-చదివినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు!

మీ ఫీడ్ బ్యాక్ ఇస్తే బాగుంటుంది-ఏదో "జీవన్ టోన్" తాగినట్టు ఫీల్ అయితే ఇంకో కధకి ఏమన్నా ప్లాటు దొరుకుతుందేమో! ప్రస్తుతానికయితే బుర్ర ఖాళి ఇంకోకథ విషయంలో! లేదూ మీరే ఏదైనా ఓ క్లూ ఇచ్చిన అల్లుకుపోడానికి ట్రై చేస్తా!

మీ మూర్తి

divider

Share your thoughts with Author!!

Spread the words out!!!