పండుటాకులు!!!

ఒక రోజు నాన్న పోయినట్టు కబురు వచ్చింది,ఆవార్త విని దుఃఖం పొంగుకొచ్చింది, నా భార్య ఇందిరకి ఆ విషయం చెప్పడంతో ఓదార్పుగా నాదగ్గర కూర్చుంది.

కొంతసేపటికి ఇందిర అంది"ఏమండి అత్తయ్యగార్ని మన దగ్గరకు తీసుకు వచ్చేద్దాం కార్యక్రమాలు అన్నీ అయిన తర్వాత,మన దగ్గరే ఉండిపోతారు ఎప్పటికీ”!

చెప్పొద్దూ నా కళ్లలో నీళ్లు చిప్పిల్లాయి ఇందిర మాటలకి.ఇందిరకి,మా పిల్లలకి అమ్మన్నా, నాన్నన్నా చాలా ప్రేమ-ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుణ్ణి.అంత బాధలోనూ ఇందిర మాటలు చాలా ఉపశమనాన్ని ఇచ్చాయి.

కాస్తంత స్థిమితపడ్డ తర్వాత ప్రయాణానికి ఏర్పాట్లు చేసే ప్రయత్నంలో పడిపోయాను.ఫ్లైట్ టిక్కెట్లు ఆన్ లైన్ లో కొనేసి బట్టలు సర్దుకుని ఎయిర్ పోర్ట్ కి ఇందిరా నేను బయలు దేరాం-దారి పొడుగునా పాత జ్ఞాపకాలే.

అమ్మా నాన్నా ఇద్దరూ ఎంత చెప్పినా వినకుండా పల్లెటూరులోనే ఉండిపోయారు వార్ధక్యం ముంచుకొస్తున్నా.నాన్న పుట్టిన ఊరు అవడం వాళ్ళ దైనందిన జీవితం సాఫీగా గడిచిపోతుంది- ఇరుగుపొరుగు బోలెడుమంది వాళ్లకి కావాల్సిన సహాయం చేయడానికి. అమ్మా నాన్న ఇద్దరూ విశ్రాంతజీవితం హాయిగా గడుపుతున్నారు-ఒకరికొకరు తోడుగా.ఇప్పుడు నాన్నఈ గ్రహాన్నే వదిలేసి ఎవరికీ అందనంత దూరం వెళ్లి పోయారు;ఈ పరిస్థితుల్లో అమ్మకి మరీ కష్టం-ముఖ్యంగా ఈ వయసులో-వార్ధక్యం మనిషికి శాపమేనేమో-ముఖ్యంగా వంటరిగా వుండేవాళ్లకి!

మా కుటుంబంలో ఇంతమందిమి తోబుట్టువులు ఉండటంవల్ల ఎవరి దగ్గరైనా ఉండమని మరీమరీ అడిగాం అందరం.వాళ్లకి ఆ వూరుమీద ఉన్న ప్రేమతో కదలటానికి ఏమాత్రం ఇష్టపడలా ఇద్దరు-“ఇక్కడే రాలి పోవాలర్రా మేము అనేవాళ్ళు ఎప్పుడూ” నవ్వుతూ!

మాది పెద్ద కుటుంబం- అప్ప చెల్లెళ్ళు అన్నదమ్ములతో; తోబుట్టువులు అందరూ ఎక్కడెక్కడో స్థిరపడి పోయారు.వాళ్ళ పిల్లలు మనవరాళ్లతో కొంతమంది-వాళ్లకి తోడుగా-పిల్లల దగ్గరే ఉండిపోయారు.ఎవరి కుటుంబాలు వాళ్లకి-ఎవరికీ తీరుబడి లేని రోజులాయె.అప్పటికి ఎవరి వీలునిబట్టి వాళ్ళు వూరికి వెళ్లి అమ్మనాన్నల్ని చూసి వస్తుండేవాళ్ళం.

కొంతమంది వేరేదేశాల్లో ఉన్నవాళ్ళ పిల్లల దగ్గరకి వెళ్లి వస్తూవుంటారు తరచూ; ఏదైనా ప్రత్యేక సందర్భాలు వస్తే మాత్రం సాధ్యమైనంతమంది ఒక్కసారే కలవడానికి ప్రయత్నం చేసేవాళ్ళం-మాపల్లెకు వెళ్లేవాళ్ళం-ఆ వంకనైనా అందరూ కలుస్తారు అని.అమ్మా నాన్నా కూడా సంతోషపడేవారు పిల్లల్ని వాళ్ల మనవల్ని, మనవరాళ్లని చూడటంతో, వాళ్లకి ఆ నాలుగు రోజులు ఆనందంగా గడిచిపోయేవి ఇల్లంతా సందడిగా పండగవాతావరణంతో;పిల్లలు అలా అప్పుడప్పుడు పల్లెటూరు చూడటంవల్లా అమ్మానాన్నల్ని కలవడంవల్లా వాళ్ళు కూడా ఆనందంగా గడిపేవాళ్లు ఉన్న నాలుగు రోజులూనూ.

కళ్ళ ముందు తన బాల్యం గుర్తుకొచ్చింది శంకరానికి,వాళ్ళది సగటు మధ్య తరగతి కుటుంబం, బతికి చెడినవాళ్ళు అనేక కారణాలవల్ల!అంత కుటుంబ భారం మోయడం అంటే మామూలు మాటలు కాదు ఆ రోజుల్లో.నాన్న చాలా కష్ట పడేవారు- ఏటికి ఎదురీతలాగా.కానీ ఎప్పుడు కూడా బాధ పడేవారే కాదు మా ముందు-ఆ విషయంలో!

నాన్న స్నేహితులకి మాత్రం నాన్నంటే అమితగౌరవం, వాళ్ళే అనేవాళ్ళు“మీరు పిల్లలురా ఏం తెలుస్తుంది మీకు ఇప్పుడు -మోసే వాడికి తెలుస్తుంది కాడి బరువు" అని “వాడు చాలా కష్టపడుతున్నాడు.వాడు “సిరిసంపదలతో” ఉన్నరోజుల్లో మేము కట్టుబట్టలతో వచ్చాం వేరే ఊళ్ళనుంచి” అనేవాళ్ళు!

స్కూల్ ఫీజు కట్టాలన్నా కొత్త పుస్తకాలు కొనాలన్నా అన్నిటికి తడుముకోవడమే మరి.కుటుంబం పెద్దది అవడం మూలాన,నాన్న సంపాదన ఒక్కటే ఆధారం అవడం వల్లా నాన్నా అమ్మా చాలా కష్టపడేవాళ్ళు.

ఒక సారి స్కూల్ నోటీసు బోర్డుపై ఫీజు కట్టనివాళ్ళ పేర్లు వేసి వారంలో ఫీజు కట్టకపోతే స్కూల్ లోంచి తీసేస్తాం అన్నారు; దానితో నాన్నతో ఈ విషయం చెప్పా ఏడుస్తూ “ఒరేయ్ హెడ్ మాస్టర్ నాకు తెలిసిన ఆయనే,నేను రేపు వచ్చి చెపుతా ఆయనకు,డబ్బులు అటూ ఇటూగా కట్టేస్తా అని, నువ్వేం బెంగ పడకు" అని.

మరునాడు హెడ్ మాస్టర్ నుంచి క్లాస్ లో ఉన్న నాకు కబురు వచ్చింది క్లాసులో పిల్లలు అందరూ- మాష్టారితో సహా చకితులై చూసారు నా వైపు- వీణ్ణి ఎందుకు పిలిచి ఉంటారో అని (హెడ్ మాస్టర్ గారి దగ్గర్నించి ఎవరికి పిలుపు వచ్చినా క్లాసులో అదే పరిస్థితి ఎప్పుడూను)నేను హెడ్ మాస్టర్ రూమ్ కి వెళ్లాను.హెడ్ మాస్టర్ నుంచి కబురు వచ్చింది అంటే భయమే ఎందుకు పిల్చారో అని.ఆయన రూమ్ లో “నాన్న”- అన్నట్టుగానే స్కూల్ కి రావడం జరిగింది.

హెడ్ మాస్టర్ నాతో "ఒరేయ్ శంకరం బాగా చదువుకోరా, మీ నాన్న కష్టపడి చదివిస్తున్నాడు, నీకు ఏదైనా అర్ధం కాకపొతే నన్నొచ్చి అడుగు, నేను చెపుతా మా ఇంటికి వస్తే" అని అన్నారు.విషయం అర్ధమైంది- వాళ్ళిద్దరిలో ఎవరూ ఏది చెప్పకపోయినా- నాన్నమాత్రం నవ్వుతో పలకరింపుగా చూసారు “నేను చెప్పాను కదరా” అన్న భావనతో- అలాగే అని తలఊపి క్లాస్ కి వెళ్ళిపోయాను.

చిన్నతనంలో ఇంట్లో ఇబ్బందులు అవీ అర్ధం అయ్యేవికాదు తనకి,ప్రతీ దానికి మంకుపట్టు పట్టేవాణ్ని నాకు ఏది కావాలన్నా.అంచేత పండగలప్పుడు కూడా కొత్తబట్టల కోసం గొడవ చేసేవాణ్ణి.మిగిలినవాళ్ళు తనకంటే పెద్దవాళ్ళు అవడం మూలాన,నేను మధ్యవాణ్ణి అవటం మూలంగానూ నాకంటే చిన్నవాళ్ళు కూడా-సర్దుబాటు చేసుకొని తనకి మాత్రం కొత్త బట్టలు కుట్టించేవాళ్ళు-ఇవి అన్నీ అర్ధం చేసుకునే వయసు కాదు నాది మరి-అది తల్చుకున్నప్పుడల్లా ఇప్పుడు చాలా సిగ్గేస్తుంది నాకు .కొత్త బట్టల్తో నా అనందానికి హద్దులు ఉండేవి కావు,అది చూసే ఇంట్లోవాళ్ళు కూడా సంబరపడి పోయేవారు.

వంటలు-పిండివంటలు మాత్రం లోటు లేకుండా పండగవరకు బాగా చేసుకునే వాళ్ళం ఇంటిల్ల పాది.మధ్యతరగతి కుటుంబం అవడం వల్ల ఇరుగుపొరుగు కష్ట సుఖాల్లో కాస్త ఒకళ్ళని ఒకళ్ళు ఆదుకునేవాళ్ళు ఇబ్బందులు ఎవరికి వచ్చినా చేదోడు వాదోడుగా.నాకు బాగా గుర్తు మాకు ఉన్నంతలోనే అమ్మ మాత్రం మూడో కంటికి తెలియకుండా లేమితో ఎవరైనా వచ్చినా వాళ్లకి సహాయం చేసేది.

చుట్టుపక్కల ఆడవాళ్లు సాయంత్రానికి మా ఇంటికి వచ్చేవాళ్ళు, అమ్మ కాస్తంత పురాణపఠనం చేసేది వాళ్లకోసం.నాన్న కూడా ధర్మాన్నే నమ్ముకున్న మనిషి, రెండు పూట్లా సంధ్యా వందనం చేసేవారు, దైవభక్తి మెండు.ఆయన ఉద్యోగం ఆయన గొడవే ఎప్పుడూ,చాలా శ్రద్దగా చేసేవారు,స్వభావ రీత్యా- అదే జీవనాధారం కూడానాయె.

నా ఆలోచనలకూ అంతరాయం కలిగింది ఫ్లైట్ ఎయిర్ పోర్టుకి చేరడంతో;ఇందిర నన్ను కుదిపింది "ఏంటండీ నిద్ర పోతున్నారా" అని-కాదని తలకాయ ఊపాను.

అక్కణ్ణించి ఓ గంట ప్రయాణం మా వూరికి.ఎయిర్ పోర్ట్ లో టాక్సీ మాట్లాడుకొని ఊరికి బయలుదేరాం.తోబుట్టువులం అందరం చేరాం ఒక్క మా చిన్నతమ్ముడు తప్ప, వాడు వాడిభార్య వాళ్ళ పిల్లల దగ్గరకు కెనడా వెళ్లారు కొన్నాళ్ళు ఉందామని. సమయం తక్కువ అవడం మూలాన వాళ్ళు చేరలేక పోయారు;రాలేక పోయినందుకు చాలా బాధపడ్డాడు నాకు ఫోన్ చేసి.మేం ఇంటికి చేరేసరికి దాదాపు అందరు వచ్చారు, ఒకళ్ళు ఇద్దరు దగ్గర బంధువులు తప్ప.ఆ రోజు ఎలాగూ సూర్యాస్తమయం అయిపోవచ్చింది,అందుచేత కార్యక్రమాలన్నీ మరునాటికి పెట్టుకున్నాం.

చెట్టున మగ్గిన ప్రతీ పండు నేలకి చేరాల్సిందే.అదృష్టవశాత్తు నాన్న వృద్ధాప్యం వరకూ ఆరోగ్యంగా నే ఉన్నారు.వయసు పై పడిన మూలాన వార్ధక్యం రావడం వల్లా ఆయన గుండె మారాం చేసి మూగపోయింది-ఇంక నేను పని చేయలేనని- నాన్నకు కూడా విశ్రాంతి ఇవ్వాలని కాబోలు బహుశా!

అమ్మ నిర్వికారంగా కూర్చుంది,నేను ఇందిరా అమ్మదగ్గరకి వెళ్ళాం; పలకరించడానికి బంధువులు కాదుగా-జన్మ ఇచ్చిన అమ్మ,కాస్సేపు మేము మూగవాళ్ళం అయిపోయాం.కాస్త తేరుకున్నాక అమ్మ అంది“వయసు మీద పడ్డా ఒకళ్ళకిఒకళ్ళం తోడుగా ఉన్నాం రా శంకరం,తోడు తోడే- ఆయన పడుకునే మంచం ఇక నుంచి ఎప్పుడూ ఖాళీగా ఉంటుంది-అదే ఖాళీ నాలోపల కూడాను నేబతికినన్నాళ్ళూ"అని ఉండబట్టలేక ఏడ్చేసింది.

ఆ రోజు రాత్రి తోబుట్టువులందరికీ ఇందిరే చెప్పింది తన కోరికని,నిర్ణయాన్ని; అన్నయ్యలు కూడావాళ్ళ దగ్గరికి అమ్మని తీసుకెళతాం అన్నారు-ఇందిర పట్టుపట్టింది అమ్మ మాతోనే రావాలని;అమ్మకు కూడా ఇందిర అలవాటు ఉండటం వల్ల అమ్మకూడా అభ్యంతరం పెట్టలా.

ఇల్లు వాకిలీ వూళ్ళో తెలిసిన బంధువులకి అప్పచెప్పాము చూసుకుంటూ ఉండమని,తర్వాత మళ్ళీ మాలో ఎవరో ఒకళ్ళం వస్తామని చెప్పాము.కార్యక్రమాలు అన్నీ అయినతరువాత అమ్మని తీసుకుని మా వూరు ప్రయాణం అయ్యాం.మిగతా వాళ్లంతా ఎవరి ఊళ్ళకి వాళ్లకు ప్రయాణం అయ్యారు.

మేము ఇంటికి చేరిన తర్వాత అమ్మ ఒక మాట అంది మా ఇద్దరితో “పండుటాకులు ఎప్పుడైనా నేలకి రాలవలసిందే, రెక్కలొచ్చిన పక్షి ఎగరవలసిందే” “చివరవరకు మీ నాన్నకు తోడుగా ఉండగలిగాను, నా వరకూ వచ్చేసరికి నా అందరు పిల్లలూ పోటీపడ్డారు నన్ను తీసుకెళ్ల టానికి వాళ్ళతో,అంతకంటే కావాల్సింది ఏముందిరా, ఈ వయసులో ; కానీ నా బెంగల్లా మీ పిల్లలిద్దరూ వేరే దేశాలకి వెళ్లిపోయారు, మీరు ఒంటరి అయితే మిమ్మల్ని ఎవరు చూస్తార్రా.ఎప్పటికయినా మీరు మీ పిల్లల దగ్గరకి వెళ్లిపోండి నా తదనంతరం”అని!

అప్పుడు అమ్మతో అన్నా"నిన్నూనాన్ననీ వదిలేసి మేమంతా ఎగిరిపోలా;అలాగే మా పిల్లలూ,అప్పటికీ ఇప్పటికీ తేడా ఏముందమ్మా,ఎవరి జీవితాలు వాళ్ళవి కాదా,ఆ… కాకపొతే ఒక తేడా ఉండొచ్చు, మాతరం ఈ దేశంలో తర్వాత తరం విదేశాల్లో అంతే" అన్నా నవ్వుతూ-అమ్మ వేదాంతిలా నవ్వేసి ఊరుకుంది.

నాన్న పోయిన ఐదు ఏళ్ళకి అమ్మకూడా మాగృహం నుంచి,ఈగ్రహం నుంచే శాశ్వతంగా వెళ్లి పోయింది.అమ్మ పోయికూడా ఇప్పటికి ఐదేళ్లు అయింది.ఇప్పటికీ అమ్మ చెప్పిన మాటలే (“పండుటాకులు ఎప్పుడైనా నేలకి రాలవలసిందే, రెక్కలొచ్చిన పక్షి ఎగరవలసిందే”) చెవుల్లో రింగుమంటూ ఉంటాయి.మా వృద్ధాప్యం గురించి ఏమాత్రం బెంగలేకుండా భగవంతుడి మీద భారంవేసి రోజులు వెళ్లబుచ్చుతున్నాం -నారు పోసినవాడు నీరు పోయకుండా ఉండడు కదా!!

మానవ జీవన పరిణామంలో జరిగే మార్పులకు సిద్ధపడ్డ మాలాంటి దంపతులకి కొదవేలేదు మనదేశంలో ఇప్పుడు- అలాంటప్పుడు ఇది సమస్య ఎలా అవుతుంది- నిత్యం సమాజంలో జరిగే సహజమైన మార్పు- అంతేగాని-దీన్నివేరే రకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు, అగత్యం అంతకన్నా లేదు.ఇంచుమించుగా అందరికీ ఇదే “జీవిత చక్రం” పుట్టిన ప్రతీ మనిషికి చివరి అంకం చేరేవరకూ- అదే సృష్టి ధర్మం!

ఉన్నంతవరకూ, ఉన్నంతలో, హాయిగా సంతోషంగా బతికేస్తున్నాం

- నేను ఇందిరానూ!

divider

Share your thoughts with Author!!

Spread the words out!!!