పండు –రావిచెట్టు
“పండు” ఎప్పటిలాగే బూట్ పోలిష్ సరంజామా పెట్టుకొని రావిచెట్టుకింద కూచ్చున్నాడు.వాడు ఒక అనాధ -పేరు ఎవరు పెట్టారోగానీ అదృష్టవంతుడు కనీసం ఆ మంచిపేరుతో పిలుస్తున్నారు అందరూ.లేకపొతే బూట్ పాలిష్ చేసే కుర్రాణ్ణి ప్రజలు ఎలా సంభోదిస్తారో మనందరం చూస్తూనే ఉన్నాం దైనందిన జీవితంలో-అందులో పండు అనాధ కూడా.
పండు ఎప్పుడూ నవ్వుతూ హుషారుగా కబుర్లు చెప్తూ ఉంటాడు కస్టమర్లతో- పాలిష్ చేస్తూ కూడా.వచ్చేవాళ్లలో కొంతమంది వాడికి కొంత ఎక్కువ డబ్బే ముట్ట చెపుతారు-వాడి వైఖరి (ఆటిట్యూడ్) నచ్చి,కొంతమంది పెద్దవాళ్ళు మాత్రం ఆప్యాయంగా “ఒరే పండుగా” అని పిలుస్తారు-వాడు కూడా అంత ఆనందంగానే ఉంటాడు అందరితో.
ఆ రావిచెట్టే వాడి సామ్రాజ్యం,వచ్చే మనుషులే వాడి బంధువులు;పాలిష్ సరంజామా అంతా వాడి కుటుంబ సభ్యులు, అవన్నీ కూడా వాడు చెప్పిన మాట వింటూ వాడి కబుర్లలో మమేకమైపోతాయి ప్రతీరోజూ.అవి కూడా రోజూ ఎదురు చూస్తుంటాయి వాడి రాకకోసం, డబ్బాలోంచి పండు చేతుల్తో ఎప్పుడు తమని బయటకి తీస్తాడా అని, వాటన్నంటిని వాడి చేతులతో ఎప్పుడు తాకుతాడా అని- వాటికి మాత్రం ఎవరున్నారు -లాలనగా, ఆప్యాయంగా తల నిమరటానికి ప్రతినిత్యం- పండు తప్ప!
ఇలాంటి వాళ్లందరికి వండిపెట్టే (డబ్బులకే) ఓ పూటకూళ్ళమ్మ-యాదమ్మ- ఉంటుంది ఆ ప్రాంతంలో.ఆమె కూడా తన జీవనాధారం వంటే అవడంతో- చాలా తక్కువ డబ్బుకే ఇలాంటి పిల్లలందరికీ భోజనం అమ్ముతూ ఉంటుంది- లాభాపేక్ష లేకుండా.అదృష్టంలో అదృష్టం ఏమిటంటే ఈ పండుగాడు ఆ యాదమ్మ ఇంట్లోని వసారాలో పడుకుంటాడు- అక్కడే నిద్రా బసానూ.
వాడికి చదువుమీద ఉండే ఆపేక్షవల్ల రాత్రిపూట ఆ యాదమ్మదగ్గరే నాలుగు అక్షరాలూ, చదవడం రాయడం నేర్చుకున్నాడు (యాదమ్మవానాకాలం చదువు చదవడం వల్ల కొద్దో గొప్పో చదవడం రాయడం,నాలుగు మంచి మాటలు చెప్పడం నేర్చుకుంది)
పండు ఇంగ్లీష్ రాయడం చదవడం కూడా నేర్చుకున్నాడు- తన దగ్గరకి వచ్చే ఖాతాదారుల మాటలు జాగ్రత్తగా వింటూ అవి పట్టేసేవాడు.ఆ వచ్చే ఖాతాదారుల్లోనే ఒకళ్ళిద్దరు వాడి ఆసక్తి చూసి ఆంగ్లం నేర్చుకునే పుస్తకాలు అవీ ఇచ్చే వారు (లోకంలో ఇంకా మంచితనం ఉందిగా కలియుగమైనా-డిజిటల్ జనమైనా)రాత్రి సమయం వృధా చేయకుండా రాయడం చదవడం నేర్చుకున్నాడు.కానీ ఎప్పుడూ ఎవరి దగ్గరా బయట పడేవాడు కాదు-తనకు ఆంగ్లం కూడా వచ్చని.
వాడు పనిచేసే రావిచెట్టు ప్రాంతంలోనే పాతపుస్తకాలు అమ్మేవాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మంచిగా ఉంటంవల్ల వాళ్ళదగ్గరనుంచి ఒక్కో పుస్తకం తెచ్చుకొని రాత్రి పూట చదివేవాడు-దానితో వాడికి లోకజ్ఞానం బాగా అబ్బింది.ఆ దెబ్బతో వాడికి ఆత్మ స్తైర్యం తనమీద నమ్మకం బాగా పెరుగుతున్నాయి రోజులు గడిచిన కొద్దీ! కాకపొతే వాడికి కూడా జీవితాంతం బూట్ పాలిష్ చేసుకొని బతకాలని లేదు, భవిష్యత్తు మీద ఆశ బాగా ఉంది, వాడిమీద వాడికున్న నమ్మకంతో పాటు!
ఒక రోజు-రోజూలాగానే వాడి దినచర్య మొదలైంది, ఒక కుర్రాడు బూట్ పాలిష్ చేయించుకుని డబ్బులిచ్చి వెళ్ళిపోయాడు.పండు కూడా ఇంకో కస్టమర్ షూ పాలిష్ చేస్తున్నాడు.అప్పుడు గమనించాడు ఒక ఫైల్ వాడి పక్కన ఉండటం.
వాడికి గుర్తుకొచ్చింది అది అంతకు ముందు వచ్చిన కుర్రాడి చేతిలో చూసినట్టు, వెంటనే ఫైల్ తెరచి చూస్తే అన్నీ సర్టిఫికెట్స్.అదృష్ట వశాత్తు అక్కడ ఆ కుర్రాడి పేరు (సూర్యం) ఫోన్ నెంబర్ ఉండటంతో అక్కడ కస్టమర్ ఫోన్ తీసుకుని ఆ కుర్రాడికి ఫోన్ చేసాడు.సూర్యానికి అప్పటి దాకా స్పృహే లేదు చేతులో ఉండాల్సిన రెండో ఫైల్ సంగతి- అది చేతిలో లేదని.
అప్పుడు చాలా కంగారు, ఆందోళనకి గురి అయ్యాడు-ఎందుకంటే అతను వుద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు.వెనక్కి వచ్చి,పండుకి కృతజ్నతలు చెప్పి వాణ్ని కావులించుకుని కళ్ళనీళ్ల పర్యంతం అయ్యాడు.
“నువ్వు ఫోన్ చేయకపోతే ఇంటర్వ్యూ కి అలాగే వెళ్లిపోయేవాణ్నిఈ సర్టిఫికెట్స్ లేకుండానే- అప్పుడు నా పరిస్థితి ఏమిటి”అని పండుతో అన్నాడు
“అన్నా నీకు మంచి జరుగుతుంది కాబట్టే సర్టిఫికెట్స్ నాకళ్ళపడ్డాయి సమయానికి నువ్వు రాగలిగావు”అన్నాడు సూర్యం సంతోషంగా ఇంటర్వ్యూకి వెళ్ళిపోయాడు-ఆ కుర్రాడి ప్రతిభతోబాటు-పండు గాడి ఆశీర్వాదఫలమో ఏమోగాని అంతమంది అభ్యర్థులు అక్కడ ఉన్నా ఉద్యోగం అతన్నే వరించింది-సూర్యం తిన్నగా పండు దగ్గరకి వచ్చి ఆ శుభవార్త పంచుకున్నాడు.
అప్పటినుంచి సూర్యానికి ఎందుకో పండు అంటే ఒక రకమైన అభిమానం కలిగింది తరచూ కలుస్తూ ఉండేవాడు కూడా.ఎందుకో పండులో ప్రతిభ అలా రావిచెట్టుకింద బూట్ పోలిష్ తో అంతం కాకూడదు తాను సహాయంచేసి వాణ్ణి చదివించాలి అని నిశ్చయించుకున్నాడు.
దానికి రెండు కారణాలు-ఒకటి తానూ చాలా కష్టపడి చదువుకున్నాడు-వేరొకళ్ళకి సహాయం చేసే అవకాశం భగవంతుడు ఇచ్చాడు ఇప్పుడు.రెండవ కారణం ఆ రోజు పండు సర్టిఫికెట్స్ ఫైల్ ఇవ్వకపోతే తన జీవితం ఏమై పోయిండోదే అని తలచుకుంటేనే భయం వేస్తుంది, భగవంతుడు వాడి రూపేణా తనకు సాయం చేసాడు “దైవం మానుష రూపేణా” అంటారు కదా!
అందుచేత పండుని కూడా జీవితంలో పైకి తీసుకెళ్ళాలి,వాడి జీవితం రావిచెట్టు కింద ఒక అనాధగా,బూట్ పాలిష్ తో తెల్లారకూడదు అని అనుకున్నాడు.
ఒక రోజు పండుతో "పండూ నువ్వు ఎన్నాళ్ళు ఇలా పనిచేస్తావు, చదువుకొని, నాలాగా ఉద్యోగం చేయాలనే కోరిక లేదా, ఇకనుంచి ఈ పని మానెయ్,నాకూ ఎవరూ లేరు ఈ నగరంలో;మా అమ్మా-నాన్నా మా పల్లెలో ఉన్న కొద్ది పొలంలో వ్యవసాయం చేసుకు బతుకుతున్నారు.నువ్వు నాతో బాటే ఉండు,నేను చదివిస్తా” అన్నాడు సూర్యం.
పండుకి ఎగిరి గంతు వేయాలనిపించింది మనసులో- కానీ తన ఉత్సాహాన్ని మనసులోనే అదుపు చేసుకొని "వద్దులే అన్నా, నాకీ పని బానే ఉందిగా- బతకడానికి ఇబ్బంది లేదు,నాకెవరూ లేరు అని అసలు అనిపించదు,నా దగ్గరకు వచ్చేవాళ్ళు అందరూ ప్రేమగా ఆప్యాయంగా చూస్తారు,వీళ్లందరినీ వదులుకోలేను" అన్నాడు.
ఎవరో కొత్త వ్యక్తి అడగంగానే తను తలకాయ ఎలా ఊపుతాడు-పైగా సూర్యానికి తను చేసిన మేలు ఏమీలేదు, అతనికి భారం అవడం ఇష్టం లేదు ఆ ఫైల్ ఎవరికీ కనపడినా ఇచ్చేవాళ్ళు- దానిలో తను చేసిన గొప్పేమీ లేదే అని మనసులో అనుకున్నాడు.
సూర్యం వాణ్ని అడగగానే పండు కళ్ళలో క్షణకాలం మెరుపు మెరవడం సూర్యం దృష్టినుంచి తప్పించుకోలేదు. సూర్యం ఎంత బతిమాలినా పండు వినలేదు,అప్పటికి సూర్యం ఇంకా ఒత్తిడి చెయ్యలేదు.మనసులో మాత్రం సూర్యానికి నమ్మకం ఏర్పడింది ఏదో ఒక రోజున పండుని ఒప్పించగలనని- మనసులోనే ఓపధకం రూపుదిద్దుకుంది.
రోజులు గడుస్తున్నాయి-సూర్యం కూడా కొత్త ఉద్యోగంలో తీరక లేకుండా అయి పోయాడు,ఉద్యోగంలో కష్టపడి పనిచేస్తుండటం, కొత్త విషయాలు అట్టే పట్టేయడం వల్ల ఆఫీసులో అందరికీ ఇష్టమైనవ్యక్తిగా మారిపోయాడు.అయినా తీరిక దొరికినప్పుడల్లా పండుని కలిసి పలకరించి వస్తున్నాడు.పండుకి పుస్తకాలు చదివే అలవాటు ఉండటం వల్ల- కొన్ని మంచిపుస్తకాలు కొత్తవి కొని ఇస్తున్నాడు -ఆంగ్ల పుస్తకాలు కూడా-అప్పుడప్పుడు- వాటిల్లో గొప్ప వాళ్ళ ఆత్మ కధలు(స్వీయ చరిత్ర)(ఆటోబయోగ్రఫీ) కూడా ఉండేవి.
తన ఫైల్ మీద పేరు చదివి పండు ఫోన్ చేసిన సంఘటన సూర్యానికి గుర్తుంది.తన పేరులో ఆంగ్లంలో ఉంది.అది తనకు గుర్తుంది కాబట్టే వాడికి ఆంగ్ల పుస్తకాలు కూడా ఇవ్వడం మొదలు పెట్టాడు- వాణ్ని చదివించే పధకంలో నాందీ ప్రస్తావనగా.
క్రమేపీ పండులో ఆత్మవిశ్వాసం పెరిగింది, తాను కూడా చదివి పైకి రావాలనే భావం రోజురోజుకీ పెరిగిపోయింది;కానీ సూర్యం అన్నని అడగటానికి మొహమాటం, సిగ్గూ అడ్డం వచ్చేవి.
ఎప్పుడైతే పండు తాను ఇచ్చిన పుస్తకాలు ఆసక్తిగా చదువుతున్నాడో- సూర్యానికి అర్ధమైంది.పండు దగ్గర మళ్ళీ చదువు విషయం కదిపే సమయం వచ్చిందని.వాణ్ని ఇన్నాళ్లు పరిశీలన చేసినప్పుడు కూడా అర్ధమైంది పండు చాలా స్వాభిమానం కలవాడని-అందుకే సూర్యం పండు దగ్గర చదువు గురించి కదిపాడు మళ్ళీ! ఈసారి పండు మొహమాట పడుతూనే,చదువుకి ఒప్పుకున్నాడు- కానీ అలా అని ఇన్నాళ్లు తనకు అన్నం పెట్టిన పనిని వదిలి పూర్తిగా ఎవరి మీదో ఆధారపడటం ఇష్టం లేకపోయింది-సూర్యంతో తన మనసులో మాట చెప్పాడు.
దానికి సూర్యం “ఇలా నువ్వు ఈ పని చేస్తూ చదువు సాగించడం కష్టం- అదీ కాకుండా నీకు స్కూల్ నేపధ్యం లేదు కాబట్టి- ఏడాదిపాటు చదివించి స్కూల్ లో ప్రవేశ పరీక్ష రాయించి చేర్పించాలి,అందుకని నా దగ్గరకు వచ్చేయి” అన్నాడు.
“అన్నా నీకు పూర్తిగా భారం అవడం నాకు ఇష్టం లేదు,అదీ కాకుండా ఇంతమంది ఆత్మీయత కోల్పోతాను”అన్నాడు.
దానికి సూర్యం “దానిదేముంది,కష్టపడి చదువుకుంటూ నువ్వు పైకి వచ్చిన తర్వాత ఇదే చోటుకు రా-నీకంటే వాళ్ళు ఎక్కువ సంతోషిస్తారు ప్రయోజకుడవై నందుకు” అన్నాడు
పండుకు తానూ పైకి రావాలనే బలమైన కోరిక ఉండటం వల్ల కూడా ఇంక ఏ మాత్రం కాదనలేకపోయాడు “సరే అన్నా రేపు మాత్రం చివరిసారిగా ఇక్కడకు వచ్చి పనిచేసి అందరికీ చెప్పి వెళ్తాను,ఇలా ఒక్క సారే నేను కనపడకుండా వెళ్ళిపోతే వాళ్లంతా నాగురించి అనుకుంటారు, నాకు కూడా వాళ్ళని కలవాలనిఉంది కొంతమందినైనా” అన్నాడు పండు.
దానికి సూర్యం నవ్వుతూ,పండు తలనిమిరుతూ “తప్పకుండా అలా చెయ్యి” అని మనసులోనే మెచ్చుకున్నాడు వాణ్ని.
పండు యాదమ్మ దగ్గరకు సూర్యంని తీసుకెళ్లి విషయం చెప్పాడు,యాదమ్మ చాలా సంతోషించింది.సూర్యంతో అంది,“బాబూ నిన్ను దేవుడు చల్లగా చూస్తాడు ఇంత మంచిపని చేస్తున్నందుకు- అయినా నిన్నుదేవుడే పంపించివుంటాడులే వీడి కోసం,ఇవి ఎవరికివారే యమునా తీరుగా ఉంటున్న రోజులు, ఎవరయ్యా ఇలా చేయగలరు-అదీ కాకుండా ఓ అనాధని ”అని సూర్యాన్ని మెచ్చుకుంది.
అలాగే పండుతో అంది-“ఒరేయ్ అప్పుడప్పుడు ఈ ముసలిదాన్ని చూడటానికి వస్తూ ఉండూ” అంది కళ్ళ నీళ్లు పెట్టుకుని- పండు యాదమ్మని కౌగలించుకుని “నాకు అమ్మా-నాన్న నువ్వేనమ్మా ఇంకెవరున్నారు” అని.
పండు వాడి సామాను సర్దుతున్నప్పుడు సూర్యం యాదమ్మని అడిగాడు కుతూహలంగా...
"పండు నీ దగ్గరకి ఎలా వచ్చాడు"
దానికి సమాధానంగా యాదమ్మ...
"ఇక్కడకి దగ్గరలోనే ఓ అనాధఆశ్రమం ఉంది బాబూ, ఎక్కువగా నాదగ్గర భోజనానికి చిన్నపిల్లలే వస్తుంటారు- ఏవో చిన్న పనులు- కూలి నాలి చేసుకుని.నేనా ఏకాకిని, ఇల్లు ఉంది-అందుకని వాళ్లకి భోజనం పెట్టి తృప్తి పడతాను- నాకూ ఇదే ఉపాధి-ఉచితంగా ఇవ్వలేను, అందుకని నాకు ఖర్చు అయ్యేదాన్ని బట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటా” అన్నది.
“అప్పుడప్పుడు అనాధ ఆశ్రమానికి వెళ్లడం నాకు అలవాటు-నాకు వేరే వ్యాపకం లేదుగా- కాసేపు పిల్లలతో సమయం గడిపి వస్తాను.అప్పుడు పండు నన్ను ఆకర్షించాడు వాడి చురుకుదనంతో - అక్కడ అధికారులతో మాట్లాడి వాడిని నాదగ్గరకు తెచ్చాను- గాలివాటంలా తిరుగుతాడేమో అని నేనే బూట్ పోలిష్ సామాను కొనిఇచ్చా”!
ఆ రావిచెట్టు దగ్గర చాలా ఆఫీస్ లు,కాలేజీలు ఉండటంవల్ల వాడు అక్కడ కూర్చుంటాడు;రాత్రికల్లా ఇక్కడకు వచ్చేస్తాడు ఇక్కడే బస, నిద్ర అన్నీను.
సంపాదిస్తున్నాడు కాబట్టి, వద్దన్నా డబ్బులు ఇస్తాడు,మిగిలిన డబ్బులు దాచుకోవడం కూడా నాదగ్గరే- నాకు ఎవరు ఉన్నారు అమ్మాఅంటాడు. వాడు చక్కటి తెలివితేటలు ఉన్న పిల్లాడు, చెడు అలవాట్లు ఏమీలేవు కూడా- ఏదైనా డబ్బున్న మారాజు ఇంట్లో పుట్టిఉంటే చాలా పైకివచ్చేవాడు”- అని యాదమ్మ నిట్టూర్చింది!
“నువ్వు మాత్రం ఎవరూ చేయని పని చేస్తున్నావు బాబు,వాడు భవిష్యత్తులో చాలా ఎదగగలడు-తోడు, సహాయం ఉంటే.వాడి అదృష్టం, నీ దయ వల్ల భగవంతుడు నీ రూపంలో వచ్చాడు వాడికోసం” అంది.
“వాడి తాలూకు వివరాలు ఏమైనా కావాలంటే వాళ్ళ దగ్గర ఉంటాయి,నాకేమీ అవి ఉపయోగంలేదు కాబట్టి నేను అడగలా అంది”!
అక్కడ తనకు ఉన్న కొద్దీ సరంజామా-బూట్ పాలిష్ సామానుతోసహా తీసుకుని యాదమ్మ ఆశీర్వాదం తీసుకుని సూర్యం ఇంటికి బయలు దేరాడు!
సూర్యం కూడా యాదమ్మ దగ్గర సెలవు తీసుకునేముందు “వీలు చిక్కినప్పుడు కనపడతుంటానమ్మా” అని యాదమ్మతో అన్నాడు!
ఆ అడుగు తాను ఊహించని జీవితానికి నుడికారం చుడుతుందని పండుకి గాని- తాను చేసే ఈ సాయం పండు జీవితాన్నిమారుస్తుందని, తన జీవితం కూడా అద్భుతంగా ఉంటుందని- సూర్యానికి గాని ఊహకు అందని విషయం.
రావి చెట్టు మీద త్రిమూర్తులు ఉంటారని గాని,వాళ్ళు పండుగాణ్ణి ఆశీర్వదిస్తున్నారని గాని ఎవరికీ తెలియని మరో విషయం! మన పురాణాల ప్రకారం-బ్రహ్మ రావి చెట్టు వేళ్ళలోనూ, మహా విష్ణువు చెట్టు బోదెలోనూ, పరమశివుడు చెట్ల ఆకుల్లోనూ ఉంటారని నమ్మకం!
పండు తన సరంజామాతో సూర్య ఇంటికి మకాం మార్చేశాడు, సూర్యం పండుకి ఒక గది కేటాయించాడు-పండు ఆ గదిలో ఉన్న మంచం, బల్ల, కుర్చీ, పుస్తకాల అల్మైరా అన్నీ అమర్చివుండటంతో ఆశ్చర్య పోయాడు. "అన్నా- ఇవన్నీ" అని పండు అనే లోపే సూర్యం "నువ్వు ఏదో రోజు వస్తావని నమ్మకం ఉండటంతో అన్ని ఏర్పాట్లు ముందే చేసాను" అన్నాడు పండు ఆనందంతో కళ్ళ నీళ్లు కారుస్తూ "అన్నా నేను నీకు ఏం అవుతానని ఇంత సాయం చేస్తున్నావు, నేను ఒక అనాధని" అని అన్నాడు!
"నువ్వు అనాధవి ఎలా అవుతావు, ప్రతీరోజూ నీదగ్గరకు వచ్చేవాళ్లలో చాలామంది ఆప్యాయంగా చూసేవాళ్ళు, నీ కడుపు చూసుకోవటానికి, నీ తలకి గూడు ఇవ్వటానికి యాదమ్మ ఉంది,ఇప్పుడు నేను ఉన్నాను.ఈ రోజు నుండి నువ్వు అనాధవి అనే భావనని నీ మనసులోంచి చెరిపేయి" అన్నాడు సూర్యం. పండు మౌనంగానే తలవూపాడు, ఆనందంతో మాటలు రాక-ఇది తాను కలలో ఊహించుకోవడానికి కూడా సాహసం చేయలేనిది!
తన సామాను అంతా ఆ గదిలో సర్దేసుకున్నాడు,ఇద్దరూ నిద్రకి ఉపక్రమించారు. ఈరోజు ఇద్దరూ యాదమ్మ ఇంట్లో భోజనంచేసి రావడంతో!
సూర్యం ఈలోపే పండు చదువు గురించి, అన్నీ వాకబు చేసి ఉంచాడు; ఒక ఏడాది చదివితే పదవ తరగతి ప్రైవేట్ గా వ్యక్తిగతంగా రాయొచ్చు అని, దానికి వాడికి శిక్షణ ఇచ్చే ఒక శిక్షణాలయంలో మాట్లాడి ఉంచాడు.
మరునాడు పండు సూర్యానికి చెప్పినట్టుగా తన పాలిష్ సరంజామాతో బయలు దేరాడు; అది చూసి సూర్యం "అదేంటి పండు మళ్ళీ”, అన్నాడు ఆశ్చర్యంగా చూస్తూ (వాడు చెప్పింది గుర్తు ఉన్నా)
అందుకు పండు“లేదన్నా ఈ రోజు చివరసారిగా ఆ రావి చెట్టు కింద కూచ్చోని పని చేస్తాను నా తృప్తికోసం”అన్నాడు,సూర్యం పండుని మెచ్చుకోలుగా చూసాడు.
పండు తన మాటలు కొనసాగిస్తూ… "వచ్చిన వాళ్లందరికీ చెప్తాను ఇక పని చేయట్లేదని,నువ్వు నన్ను చేరదీసి చదివిస్తున్నావని చెప్తాను" అన్నాడు.సూర్యం అలాగే అని చెప్పి తాను ఆఫీస్ కి వెళ్లి పోయాడు-ఇంటి తాళం చెవి ఒకటి పండుకి ఇచ్చి.
పండు యధాప్రకారం రావిచెట్టుకిందకి చేరి తన బూట్ పాలిష్ డబ్బాలో ఉన్న ఒక్కొక్క సామానుని ఆప్యాయంగా తాకాడు-అవి నోటితో చెప్పలేకపోయినా వాడి మనసులో భావాల్ని అర్ధం చేసుకుని అవి కూడా భావోద్వేగానికి గురిఅయ్యాయి- ఇది అతిశయోక్తిగా అనిపించవచ్చు కానీ పండుమాత్రం వాటి భావాలు తనకు తెలిసినట్టుగా కొద్దిగా ఉద్వేగానికి లోనయ్యాడు.
పండు ఒక బోర్డు తయారు చేసి పెట్టాడు జనం వచ్చేలోపే- తన పక్కనే-అందరికీ కనపడేట్టుగా...
"ఈ రోజుతో నా ఈ బూట్ పాలిష్ పనికి ఆఖరిరోజు"అని!
అది చూసినవాళ్ళు అడగటం మొదలు పెట్టారు-కొత్తగా వచ్చినవాళ్లకి పరిచయం లేదు కాబట్టి-కొంతమంది అడిగారు, మరికొంతమంది అడగనూ లేదు.పండుకి బాగా పరిచయం ఉన్నవాళ్ళు మాత్రం విషయం తెలిసి సంతోషించినా పండు రోజూ కనపడడూ అనే ఆలోచనకే బాధపడిపోయారు.ఇన్నేళ్ళుగా పండు అందరికీ అలవాటు అయ్యాడు- ఒక ఆత్మీయుడుగా మారిపోయాడు.కొంతమంది అయితే వాళ్ళ రోజువారి దినచర్యలో వాడి దగ్గర ఆగి పలకరించడం దాకా చేసే వాళ్ళూ ఉన్నారు.
ఒకళ్ళు ఇద్దరు వాడి అడ్రస్,సూర్యం ఫోన్ నెంబర్ తీసుకున్నారు,కొందరైతే వీలు కుదిరినప్పుడు ఇటువైపు వచ్చిపోతూ ఉండమన్నారు.ఇక పండు దగ్గర అలవాటుపడ్డవాళ్ళు రేపటి నుంచి వేరే బూట్ పాలిష్ చేసేచోటుకి వెళ్ళాలి అని అనుకున్నారు.
ఇద్దరు, ముగ్గురు మాత్రం, సాయంత్రం వాళ్ళు ఇళ్ళకి వెళ్లేసమయానికి పండు దగ్గరకి వచ్చి,స్వీట్ బాక్స్,పెన్ ఇచ్చి- వాడికి శుభాకాంక్షలు చెప్పి జాగ్రత్తగా చదువుకొని వృద్ధిలోకిరా అని వాళ్ళ దీవెనలు కూడా ఇచ్చారు- లోకంలో మంచితనం లేదని ఎవరన్నారు!
పండుకి మాత్రం దుఃఖం ఆగలా వాళ్ళ ప్రేమని చూసి-ఏడ్చేశాడు కరువుతీరా: చుట్టుపక్కల పుస్తకాల దుకాణాల వాళ్ళు,టీ షాప్ వాళ్లకి కూడా పండు విషయం తెలిసి, వాళ్ళుకూడా పండు దగ్గరకి వచ్చి మెచ్చుకున్నారు-అందరికీ కృతజ్ఞతలతో నమస్కారం చేసాడు.
సాయంత్రం అయ్యేటప్పటికల్లా తన సరంజామా అంతా డబ్బాలో వేసుకొని తనకి బతుకు తెరువునిచ్చిన ఆ “స్థలానికి-రావి చెట్టుకి” దండం పెట్టి భారమైన హృదయంతో ఇంటికి బయలుదేరాడు-సరికొత్త జీవితంలోకి!
ఇక మరునాడునుంచి వాడికి చదువు మొదలయింది-పొద్దున్నే కోచింగ్ సెంటర్ కి వెళ్లడం-సాయంత్రం రావడం.కాస్త విశ్రాంతి తర్వాత సూర్యం ఇంటికి వచ్చేవేళ అయ్యేది,కాస్త కబుర్లు చెప్తూ వంటకానిచ్చేవారు.పండుకి చదువులో ఏమైనా అనుమానాలు అవీ ఉంటే సూర్యం దగ్గర నివృత్తి చేసుకునేవాడు.భోజనాలు అయిన తర్వాత పండు తన చదువులో పడిపోయేవాడు.
సూర్యం అప్పుడప్పుడు తన ఆఫీస్ ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తూ ఉండేవాడు సెలవరోజుల్లో.నెలకో రెణ్ణెల్లకో పండూ, సూర్యంతో-అదీ బలవంతం మీద బయటకు వెళ్లడం కానీ, సినిమాకో, హోటల్ కో వెళ్ళేవాడు.
సూర్యం రెండు మూడు నెలలకి ఒకసారి తన పల్లెకు వెళ్ళేవాడు-అమ్మానాన్నల దగ్గరకు.ఒక సారి పండుని కూడా అక్కడకు తీసుకెళ్లాడు,సూర్యం తల్లి తండ్రులు వాణ్నిచూసి సంబరపడిపోయారు- వాడు కూడా తమ కొడుకు లాగానే అనుకున్నారు-తమ కొడుకు సూర్యం చేసిన పనికి చాలా మెచ్చుకున్నారు, సంతోషించారు కూడా.
పండుకి మాత్రం తనకు జరిగేది అంతా కలా నిజమా అని అనుకునేవాడు.ఏ మాత్రం తన జీవితంలో ఊహించనిది, తనకూ ఒక కుటుంబం దొరుకుతుందని, తన అదృష్టానికి మనసులో దేవుడికి ఎప్పుడూ దండం పెట్టుకుంటూనే ఉండేవాడు.
తాను ఎంత చదువులోఉన్నా వీలుచిక్కినప్పుడు యాదమ్మనిపలకరించి వచ్చేవాడు,అలాగే రావిచెట్టు దగ్గరకు కూడా.ఎప్పుడైనా తెలిసినవాళ్ళు అక్కడ కనపడి పలకరించేవాళ్ళు పండుని.వీడు చదువుకుంటున్నాడని తెలుసుకాబట్టి పాతపుస్తకాల షాపుల వాళ్ళు పండుకి ఏవైనా పుస్తకాలు కావాలంటే ఇస్తూ ఉండేవాళ్ళు.అలా పాతచోటుకి వెళ్తూ తెలిసిన మనుషుల్ని కలుస్తూ చదువుకుంటూ ఉండేవాడు.
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు దగ్గర పడుతున్నాయి- అనుకునే లోపే పరీక్షలు రానే వచ్చాయి,పండు పరీక్షలు బాగా రాసాడు.ఫలితాలు రావటానికి ఇంకా సమయం పడుతుంది కాబట్టి సమయం వృధా చేయడం ఇష్టం లేక చిన్న చిన్న కోర్సుల్లో, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులకి వెళ్ళేవాడు.ఆ వయసులో కుర్రాళ్ళకి ఉండే ఆకర్షణలు పండుకి లేవు- తాను పెరిగిన నేపధ్యం వల్ల కావచ్చు- పూర్వజన్మ సుకృతం అంటే ఇదేనేమో!
పరీక్షా ఫలితాలు రానే వచ్చాయి-పండు తాను అనుకున్నట్టే,సూర్యానికి ఉన్న అంచనాల లాగే డిస్టింక్షన్ లో టెన్త్ పాస్ అయ్యాడు
ఆ దెబ్బతో వాడికి ఇంటర్మీడియట్ లో సీట్ ఉచితంగా దొరికింది.సూర్యం ఎప్పుడూ పండుతో అంటూ ఉండేవాడు, “నువ్వు చాలా తెలివి, కసి ఉన్నవాడివిరా, నాలా ఏదో ఉద్యొగం కాదు, నాకంటే ఇంకా పైకి చదివి బాగా ఎదగాలి” అని -పండుకి మాత్రం కళ్ళవెంట నీళ్లు వచ్చేవి- సూర్యం అన్న చూపిస్తున్న ప్రేమకి, ఆదరణకు, ప్రోత్సాహానికి. అలా చూస్తూ చూస్తూ ఉండగానే ఇంటర్మీడియట్ తో బాటు,ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ కూడా రాసాడు.వాడికున్న తెలివితేటలకు పెద్దగా కష్టపడకుండానే వెయ్యి రాంకుల లోపే సాధించాడు.దానితో వాడికి నగరంలో ఉన్న పేరున్న కాలేజీలో ప్రవేశం దొరికింది.
ఇటు సూర్యానికి తన ఆఫీస్ లో ప్రమోషన్ కూడా వచ్చింది-ఆఫీస్ సహోద్యోగులతో కూడా కలిసిమెలిసి ఉండేవాడు.పండుని తన దగ్గర ఉంచుకుని చదివించడం, ఆ విషయాలు తెలియడం వల్ల ఆఫీస్ లో వాళ్ళకి కూడా సూర్యం అంటే ఒక ప్రత్యేక గౌరవం అభిమానం ఉండేది.అతని వ్యక్తిత్వం నచ్చి సూర్యం ఆఫీస్ లో పనిచేసే లలిత అతనంటే ఇష్ట పడేది రెండు ఏళ్లనుంచి.
తన మనసులో ఉన్నమాటని మొదటిసారిగా సూర్యంతో చెప్పింది ఒక రోజు “నీకు ఇష్టమైతే మనం పెళ్లి చేసుకుందాం” అని! సూర్యానికి అభ్యంతర పెట్టడానికి కారణాలు ఏవీ కనపడలా-కాకపొతే తన కుటుంబ నేపధ్యం అదీ చెప్పాడు- ఎందుకంటే లలిత ఎగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి-తన తల్లితండ్రులు మంచి ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు.
లలితతో అదే మాట అన్నాడు-“మీ తల్లి తండ్రుల ఇష్టంతో చేసుకుందాం.మీ వాళ్లకి ఏదైనా అభ్యంతరం ఉంటే మాత్రం మనం ఈ విషయంలో ముందుకు వెళ్లొద్దు, ఈ విషయం మన మధ్యనే ఉండిపోవాలి”-అతని సంస్కారానికి, సహృదయతకి లలిత ఇంకా ఆకర్షితురాలయింది.
అలాగే అని సూర్యానికి చెప్పింది- సమయం చూసుకుని ఇంట్లో ఈ ప్రస్తావన తెచ్చింది తల్లితండ్రుల దగ్గర.ఏమీ దాచకుండా సూర్యం నేపధ్యం, అనాధ అయిన పండూని తన దగ్గర ఉంచుకుని చదివించడం గురించి కూడా చెప్పింది.సమాజంలో తరగతుల తేడా- అంతరం ఉండటంవల్ల లలిత తల్లి తండ్రులు సుముఖత చూపలేదు.
లలిత అప్పటికి ఆ ప్రస్తావన ఆపి కొన్నాళ్లతర్వాత తల్లితండ్రుల్నిఒక్కసారి సూర్యాన్ని కలవమని కోరింది.లలితకు నమ్మకం- సూర్యాన్ని చూస్తే ఖచ్చితంగా అతని వ్యక్తిత్వానికి తల్లితండ్రులు మెచ్చుకోకుండా ఉండలేరని- వాళ్ళ మనసు మార్చుకుంటారని.
సూర్యాన్ని,పండూని కూడా ఒకరోజు వాళ్ల ఇంటికి భోజనానికి పిలవమని లలితకి వాళ్ల నాన్న చెప్పాడు-ఒక ఆదివారం వాళ్ళిద్దరినీ తమ ఇంటికి ఆహ్వానించింది లలిత.
లలిత తల్లితండ్రులు పరిచయస్తులలాగే వీళ్ళతో ప్రవర్తించారు-సూర్యం తన నేపధ్యం,పండూ పరిచయం అయిన విధానం వాడి నేపధ్యం కూడా లలిత తల్లితండ్రులకు వివరించాడు.
సూర్యం, పండూ వెళ్ళిపోయినతర్వాత-లలిత తల్లితండ్రులు సూర్యం వ్యక్తిత్వానికి బాగా ముచ్చటపడ్డారు.ఎవరో అనాధని చేరదీసి, తనదగ్గర పెట్టుకుని సొంత తమ్ముడిలాగా చూసుకోవడం మామూలు విషయం కాదు.అందునా తన పెళ్లి అయిన తర్వాత కూడా పండూ తన దగ్గరే ఉంటాడని అతను అనడం, తమ కూతురు దానికి హృదయ పూర్వకంగా ఒప్పుకోవడం.
ఇద్దరి అభిప్రాయాలు ఆలోచనలు ఎంత దగ్గరగా ఉన్నాయి, తమకయినా ఇంతకన్నా గర్వం ఏముంది.సంబంధాలు వెతికితే మాత్రం ఇలా దొరుకుతారా- “స్థాయి అనేది సిరి సంపదలలో కాదు ఆలోచనలలో ఉండాలి”- “అతని పరిస్థితుల్లో మనం ఉన్నా సూర్యంలాగా ఆలోచించలేము” అని అనుకున్నారు.
ఇవన్నిటికీ తోడు “మన సమ్మతం లేకుండా లలిత కోరిన కోరిక విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయను” అన్నాడు- దానికి వాళ్ళు మరీ ముచ్చటపడ్డారు- సూర్యం సంస్కారానికి!
లలితతో ఆనందంగా చెప్పారు తమకి ఈ పెళ్ళికి ఏ మాత్రం అభ్యంతరం లేదు పైపెచ్చు సంతోషం అన్నారు.లలిత ఆనందానికి అవధులులేవు- తన ఓపికకి, సహనానికి ఆశించిన ఫలితం లభించింది అనుకుంది మనసులో-తల్లి తండ్రులిద్దర్నీ సంతోషంతో కౌగిలించుకుంది!
లలిత ఈవిషయం సూర్యానికి మరునాడు చెప్పడానికి తహతహలాడుతూ రాత్రి ఆనందంగా పడుకుంది- ఓ పట్టాన నిద్ర పట్టలేదు!
మరునాడు ఆఫీస్ కి వెళ్ళినప్పుడు సూర్యానికి ఆ శుభవార్త చెప్పింది, సూర్యం కూడా చాలా సంతోషించాడు లలిత తల్లితండ్రులు ఒప్పుకున్నందుకు మరియూ లలిత తాను ఈ విషయాన్ని సహనంతో, పరిపక్వతతో వ్యవహరించి సాధించిన విధానానికి.
ఆరోజు ఇద్దరూ లంచ్ బయటకి వెళ్లి హోటల్ లో చేశారు, ఆఫీస్ లో అప్పుడే ఆ విషయం చెప్పకుండా ఒక సర్ ప్రైజ్ గా చెప్పుదామని అనుకున్నారు.సాయంత్రం ఆఫీస్ అయిన తర్వాత లలిత కూడా సూర్యం ఇంటికి వస్తానని చెప్పింది- పండుతో ఈ కబురు తాను చెప్పాలని, సూర్యం దానికి సంతోషంగా ఒప్పుకున్నాడు.పండుకి ఈ కబురు లలిత చెప్పగానే చాలా సంబరపడిపోయాడు.తన అదృష్టానికి కూడా- ఒక అనాధగా ఉండేవాడికి తన జీవితంలో జరిగే ఈసంఘటనల్నినమ్మలేకపొతున్నాడు-అదృష్టం అనేది చాలా చిన్న పదంగా అనిపించింది వాడికి.
దీన్నే అంటారేమో- "వెన్ లక్ బిగిన్స్ టు కిక్, నోబడీ కెన్ చెక్" అని!!!
మరుసటి రోజు ఆఫీస్ వాళ్లకి మార్నింగ్ కాఫీ- స్నాక్ అందరి టేబుల్స్ దగ్గరకి పంపించారు- సర్ ప్రైజ్ కింద- “ఫ్రమ్ లలితా-సూర్యం అని ఒక కార్డుతో” ఈ విషయం ఎవరికీ ఊహలో కూడా లేదు- లలిత ఎప్పుడూ ఎవరితో అనలేదు తన సన్నిహితుల దగ్గరా బయట పడలేదు కూడా.నిజంగా ఈ వార్త అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది- అందరూ వెళ్లి వాళ్ళిద్దరికీ శుభాకాంక్షలు చెప్పారు మనస్ఫూర్తిగా.
లలితా- సూర్యంలో ఎవరు ఎవరికి మొదట ప్రపోజ్ చేశారు అనేది కూడా తెలియదు, అందరి బలవంతం మీద లలిత చెప్పింది జరిగిన విషయం మొత్తం.దానికి లలితని సూర్యాన్ని కూడా అభినందించారు- "ఐడియల్ కపుల్- ఆదర్శమైన జంట" అని!
సూర్యం, లలిత ఇంటికి వెళ్లి లలిత తల్లితండ్రులకి తన కృతజ్ఞతలు తెలియచేసాడు- వాళ్ళ సమ్మతితో లలితని ఒకరోజు వాళ్ళ ఊరు తీసుకువెళ్లి తన అమ్మా-నాన్నలకి చూపించి విషయం చెప్తా అన్నారు.లలిత తండ్రి వాళ్ళ కార్ ని- డ్రైవర్ ని తీసుకొని వెళ్లమన్నారు.ఓ ఆదివారం సూర్యం లలితతో వాళ్ళ వూరికి వెళ్ళాడు- సూర్యం తల్లి తండ్రులు చాలా సంబరపడ్డారు.
చిన్నపాటి ఇల్లు-చుట్టూ ఉన్న పొలం, ఆ పల్లెటూరు లలితకి ఎంతో నచ్చింది, మునుపు ఒకటి రెండుసార్లు కాలేజీలో చదువుకునే రోజుల్లో ఓ స్నేహితురాలితో వాళ్ళ పల్లెటూరు వెళ్ళినప్పుడు చూసింది ఈ వాతావరణం.తర్వాత ఇప్పుడే పల్లెటూరికి రావడం -అదే మాట సూర్యం తల్లి తండ్రులకి చెప్పింది.
ఆపూట వాళ్లిద్దరూ అక్కడే భోజనం చేసి తిరిగి వెనక్కి వెళ్లిపోయారు! సూర్యం- లలిత ఇళ్ల వేటలో పడ్డారు-కాస్త తిరిగిన తర్వాత త్రీ బెడ్ రూమ్ అపార్ట్మెంట్ దొరికింది-బయానా ఇచ్చారు-మరుసటి నెలలో పెళ్లి ముహుర్తాలు పెట్టారు.లలిత ఇంట్లో అందరూ పెళ్లి హడావుడిలో మునిగిపోయారు, లలిత ఒక్కటే సంతానం అవడం, అందునా సూర్యాన్ని వాళ్ళు ఇష్టపడటం వల్ల కూడా లలిత తల్లితండ్రులు చాలా ఉత్సాహంగా ఉన్నారు.
దగ్గర బంధువులకు సూర్యం గురించి తెలిసి-ఆక్షేపణగా వెనకాల నోరునొక్కుకున్న వాళ్ళు కొందరయితే మరికొందరు హృదయ పూర్వకంగానే సంతోషించారు లలిత ఎంపికకు, తల్లి తండ్రుల పెద్ద మనసుకి-మరో వైపు పండు తన మానాన చదువులో మునిగిపోయాడు.
వారాంతాలలో సూర్యం లలిత పెళ్లి షాపింగ్ చేస్తున్నారు, పెళ్లి ముహూర్తం రానేవచ్చింది-పెళ్లి చాలా ఆర్భాటంగా ఘనంగా చేశారు లలిత తల్లితండ్రులు.నోరు నొక్కుకున్న, ముక్కున వేళ్ళు వేసుకున్న కొంతమంది సూర్యాన్ని, పండుని కూడా చూసిన తర్వాత మెచ్చుకోకుండా ఉండలేకపోయారు.ఒక విధంగా చెప్పాలంటే- అందరి దృష్టి కొత్త దంపతుల మీదే పడింది పెళ్లి సమయంలో-లలిత ఎంపికని అందరూ అభినందించలేకుండా ఉండలేకపోయారు.
ఆఫీస్ వాళ్ళు కానుకతో బాటు ఒక “సర్ ప్రైజ్ గిఫ్ట్” ఇచ్చారు-వీళ్ళ హనీమూన్ కి ఒక వారం పాటు హోటల్ బుకింగ్- రానూ పోనూ ఫ్లైట్ టిక్కెట్లు ఇచ్చారు.పెళ్ళికి వచ్చిన వాళ్ళు అందరూ ఆశ్చర్యపోయారు-లలిత,సూర్యం- లలిత తల్లితండ్రులతో సహా- లలితా-సూర్యం మీద ఎంత ప్రేమా-అభిమానం లేకపోతె ఆఫీస్ సహోద్యుగులు ఇలా మనస్ఫూర్తిగా చేయగలుగుతారు.
కొత్త దంపతులు ఓ రెండురోజులు వెళ్లి సూర్యం వాళ్ళ ఊళ్ళో కూడా ఉండివచ్చారు.ఓ మంచిరోజు చూసుకొని అపార్ట్మెంట్ లో గృహప్రవేశం చేశారు- కొత్త దంపతులు అవడం మూలాన సత్యనారాయణ వ్రతం కూడా చేసుకున్నారు.సూర్యం, లలిత తల్లి తండ్రులు- ఆఫీస్ వాళ్ళని భోజనాలకి పిలిచారు.
కొత్త ఇంట్లోకి కావాల్సిన సామాను లలిత తల్లితండ్రులు అమర్చారు-లలిత తల్లి తండ్రుల బలవంత చేయడం వల్ల సూర్యానికి ఇష్టం లేకపోయినా కాదన లేకపోయాడు-వాళ్ళు బాధపడతారని.
హనీమూన్ ట్రిప్ అయిన తర్వాత ఓ వారం రోజులు సూర్యం -లలితా ఇద్దరూ లలితా వాళ్ళింట్లో ఉన్నారు.వీళ్ళు లేని సమయంలో టిఫిన్ వరకు పండు ఇంట్లో చేసుకునేవాడు, భోజనాలు మాత్రం బయట తినేసేవాడు.లలితా-సూర్యం సెలవులు అయిపోయిన తర్వాత ఆఫీస్ కి వెళ్లడం మొదలుపెట్టారు.
సూర్యానికి, పండూకి వంట చేసే అలవాటు, ఇంట్లో పనులు చేసుకునే అలవాటు ఉండటం వల్లా,వంటఇంట్లో పనుల్లో పండు కూడా ఓ చేయి వెయ్యడంవల్ల లలితకి కూడా పెద్ద ఇబ్బంది ఉండేదికాదు.
కాలం ఎవరికోసం ఆగదు, అలా రెండేళ్లు గడిచిపోయాయి-లలితా-సూర్యం కి ఒక ఆడపిల్ల పుట్టింది- “శ్రావణి” అని పేరు పెట్టారు-ఇంటి మహాలక్ష్మి అని అందరూ సంతోషించారు.పండూ అయితే మరీనూ, ఏ మాత్రం వీలు దొరికినా శ్రావణిని ఆడిస్తూ ఉండేవాడు.
ఇద్దరి జీతాలు పెరగడం వల్లా,సూర్యానికి పదోన్నతి రావడం వల్ల సొంతగా ఒక అపార్ట్మెంట్ కొనాలని అనుకున్నారు.పాప కూడా పుట్టడంతో ఓ త్రీ బెడ్ రూమ్ అపార్ట్మెంట్-ఆఫీస్ కి దగ్గరలో కొన్నారు.పండూకి తాను ఒక అనాధని అనే సంగతే మర్చిపోయాడు.లలితా, ఆమె తల్లితండ్రులు కూడా పండూని వాళ్లలో ఒక మనిషిగానే చూసేవాళ్ళు, పండూ తన అదృష్టానికి చాల ఆనందపడ్డాడు మనసులో. లలిత తల్లి గొడవచేయడం వల్ల- శ్రావణిని- లలితా వాళ్ళు తన అమ్మవాళ్ళ దగ్గర దింపేసి ఆఫీస్ కి వెళ్ళేవాళ్ళు ఇద్దరూ, మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు శ్రావణిని ఇంటికి తీసుకెళ్లేవారు-దీనితో లలిత తల్లితండ్రులకు సంతోషంగా, కాలక్షేపంగా కూడా ఉండేది!
గమనించేలోపే ఇట్టే నాలుగేళ్లు గడిచిపోయాయి,రెండో కానుపులో లలితకి మగ పిల్లాడు పుట్టాడు- “శ్రవణ్” అని పేరు పెట్టారు- అక్కా-తమ్ముళ్ల పేర్లు దగ్గరగా ఉంటాయని.పండూ కూడా ఇంజనీరింగ్ కాలేజీలో టాప్ ర్యాంకర్ గా వచ్చాడు.దానితో కళాశాల ప్రాంగణంలోనే ఓ మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది మంచి జీతంతో బాటుగా.
కాకపొతే ఉద్యోగం వేరే నగరంలో అవడంతో వీళ్లందరినీ ఒదిలేసి వెళ్లిపోవాలంటే మాత్రం చాలా బెంగ పడ్డాడు-అదే మాట సూర్యంతో,లలితతో అన్నాడు.ఉద్యోగం చేరే సమయంలోపే ఓసారి లలితా- సూర్యంతో సూర్యం వాళ్ళ ఊరు వెళ్లి వచ్చాడు,అలాగే యాదమ్మని కూడా చూసి వచ్చాడు.
యాదమ్మ వయసు పైన పడుతోంది-పండూ మనసులో యాదమ్మని తన దగ్గరికి తీసుకెళ్లాలని నిశ్చయించుకున్నాడు- ముందుగా ఈ విషయం సూర్యం, లలితలకు చెప్పాడు, వాళ్లిద్దరూ చాలా సంతోషించి పండూని మెచ్చుకున్నారు ఆ ఆలోచన వచ్చినందుకు-తల్లి లాంటి ఆమెని ఈ పెద్ద వయసులో సుఖపెట్టాలని కృతజ్ఞతా భావంతో.యాదమ్మ, పండూ నోట ఆ మాటవిని చాలా సంబరపడిపోయింది-కానీ తనకి మాత్రం ఆ ఇల్లు తన ఇంటికి వచ్చే పిల్లల్ని వదలాలని లేదు అని చెప్పింది.
సూర్యం-లలితా కూడా నచ్చ చెప్పారు- “ఇంకా వయసు మీరిన తర్వాత నిన్ను ఎవరు చూస్తారు యాదమ్మ, మేమందరం ఉండికూడా నువ్వు ఇలాగ ఈ వయసులో ఎందుకు ఉండాలి,ఇప్పుడన్నా సుఖపడు పండు దగ్గర” అని.దానితో యాదమ్మ అయిష్టంగానే ఒప్పుకున్నా ఒకందుకు సంతోషించింది- తన జీవితంలోని చివరి రోజుల గురించి ఆలోచించవలసిన పనిలేదు అని.
స్వార్ధం లేకుండా, ఇతరులకు మంచిచేసే స్వభావం ఉన్న వ్యక్తులను భగవంతుడు ఓకంట కనిపెడుతూ ఉంటాడు- సమయం వచ్చినప్పుడు తప్పక వాళ్లకు-వాళ్ళు ఊహించని విధంగా మేలు చేస్తుంటాడు.
పండూ వెళ్ళిపోతాడు తమ దగ్గరనుంచి అని అనుకుంటున్నప్పటినుంచీ సూర్యానికి బాధగా ఉంది లలితకన్నా-సహజంగానే.అదే సమయంలో వాడు యాదమ్మని తనతో తీసుకెళ్తా అనడం చాలా నచ్చింది.రావిచెట్టుకింద ఉండే పండు ఇలా ఎదగడం-సూర్యానికి గర్వంగా కూడా అనిపించింది-ఏదో చెప్పలేని తృప్తి కూడా కలిగింది.
అప్పుడు హఠాత్తుగా యధాలాపంగా యాదమ్మ కొన్నేళ్ల క్రితం అన్న మాటలు గుర్తు కొచ్చాయి- తాను పండూని తన దగ్గరకు తెచ్చుకుంటున్నప్పుడు!
యాదమ్మ, పండూ కూడా తనకు దూరం అయిపోతున్నారు- ఇప్పుడైనా ఆ అనాధ ఆశ్రమానికి వెళ్తే పండు గురించి వివరాలు ఏమైనా తెలుస్తాయి అని ఒక రోజు అక్కడకి వెళ్లి తన ని పరిచయం చేసుకున్నాడు.తాను పండుని కలిసిన విధానం, దాని తార్వాత వాడిని తన దగ్గర ఉంచుకోవడం, చదివించడం వాడు ఉద్యోగస్తుడు అవడం.ఏ యాదమ్మ అయితే పండుని వీళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్ళిందో ఆ యాదమ్మని పండు తనతో తీసుకెళ్లాలని అనుకోవడం వరకూ అన్నీ వివిరంగా చెప్పాడు.
అక్కడ ఉన్న అధికారి ఈ కధ అంతా విని చాలా ఆనందించాడు!
సూర్యం పండు వివరాలు అడిగాడు, అతన్ని ఎవరు ఇక్కడ చేర్పించారు,లేదా ఎవరైనా వదిలేశారా అని.
అప్పుడు ఆ అధికారి సూర్యంతో...
ఓ వ్యక్తి పేరు, వివరాలు, చిరునామా ఇచ్చాడు- వాళ్ళ పుస్తకాలలో ఉన్న వివరాలు చూసి- ఆ వివరాలతో బాటు ఓ ఫోటో కూడా చూపించాడు.అది చూసి సూర్యం నిర్ఘాంతపోయాడు.అతృతతో వివరాలు ఇంకా ఏమైనా ఉంటే చెప్పమన్నాడు. పండుని ఇక్కడ చేర్పించిన మనిషి ఇచ్చి వెళ్లాడని, అంతవరకే తనకు తెలుసు అని మిగతా వివరాలు కావాలంటే ఇక్కడ గత యాభై ఏళ్లుగా ఉంటున్న ఆ అనాధ ఆశ్రమాన్ని పెట్టిన యజమానికి తెలిసివుంటాయని చెప్పాడు ఆ వ్యక్తి! వెంటనే ఆ వ్యక్తి దగ్గర అనుమతి తీసుకుని ఫోటో తీసుకున్నాడు,ఆశ్రమ యజమాని ఇంటి చిరునామా తీసుకున్నాడు-అక్కడనుంచి తిన్నగా ఆ ఇంటికి బయలుదేరాడు ఆయన్ని కలిసి తన పేరు నేపధ్యం చెప్పాడు.
“చిన్నవాడివి అయినా నీకు చేతులెత్తి దండం పెట్టాలి బాబు,నీవు చూపిన ఔదార్యానికి” అన్నాడు- సూర్యం వారిస్తూ, సిగ్గుపడుతూ...
“సర్,మీరు చేసే పనిముందు నేను చేసింది ఎంత- ఎవరో తెలియని అనాధ బాలలకు ఆశ్రయం ఇస్తున్నారు ఐదు దశాబ్దాలుగా” అని ఆయనకు నమస్కరించాడు- రెండు చేతులతో మనస్ఫూర్తిగా!
ఆయన కూడా చాలా ఆనందించాడు పండు వివరాలు తెలుసుకొని,యాదమ్మ కూడా తెలియడం వల్ల ఆమె విషయానికి కూడా చాలా సంతోషించాడు- పండు చేసే పనికి మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు.
సూర్యం తాను వచ్చిన పని చెప్పాడు తాను ఆశ్రమం నుంచి తెచ్చిన ఫోటో చూపించి- అప్పుడు ఆయన ఒక రెండు నిమిషాల సమయం తీసుకుని- చెప్పడం మొదలు పెట్టాడు...
“పండుని తెచ్చిన వ్యక్తి ఓ రోజు బయటకు వెళ్తున్నప్పుడు రోడ్డుమీద ఓ ప్రమాదం జరిగిన సంఘటన చూశాడట.జనం గుమికూడి ఉండటం చూసి తానూ అక్కడకి వెళ్ళాడు.అక్కడ ఓ మధ్య వయస్సు దంపతులు మరణించి ఉన్నారు,పక్కనే ఓ పిల్లాడు ఏడుస్తూ ఉండటం చూశాడట-ఆ స్థలంలో!
పోలీసుల్ని అడిగి ఇంకైనా ఆధారాలు ఉన్నాయేమో అని అడిగాడట, వాళ్ళదగ్గర ఉన్న సంచిలో ఈ ఫోటో ఉంది.ఏదో దారినపోయే దానయ్య లాగానో, బాటసారిలా కాకుండా అతను పోలీసులకి తన పేరు చిరునామా ఇచ్చి ఆ పిల్లాణ్ణి ఏదైనా అనాధ ఆశ్రమంలో చేర్పిస్తాను అన్నాడు.సాధారణంగా పోలీసులు అంత సులువుగా ఒప్పుకోరు-అతన్ని ఉండమని చెప్పి ఇంకో పోలీస్ ని ఇచ్చి అతనితో వెళ్లమన్నారు.
ఆవ్యక్తి,పోలీస్ కలిసి పండుతో మా ఆశ్రమానికి వచ్చారు; రిజిస్టర్ లో వివరాలు రాసుకుని ఈ ఫోటో మా దగ్గర భద్రపరిచాం” అని ఒక నిమిషం చెప్పడం ఆపాడు. “ఆ ఫోటోకి పండూకి సంబంధం ఏదో ఉండిఉండాలి,ఇదొక్కటే వాడి నేపధ్యం తెలియాలంటే ఉన్న ఒక ఆధారం కూడా” అన్నాడు.
సూర్యానికి జలజల కళ్ళ నీళ్లు రాలుతున్నాయి ధారగా- సూర్యం ఎందుకు ఏడుస్తున్నాడో ఆ పెద్ద మనిషికి అర్ధం అవ్వలేదు.అక్కడ నుంచి సూర్యం చెప్పడం మొదలు పెట్టాడు ఆయనతో "పండూ ఎవరో కాదు సర్, నా సొంత తమ్ముడు" అన్నాడు ఆనందంతో ఏడుస్తూ-జరిగిన కధ చెప్పడం మొదలు పెట్టాడు.
“మా బాబాయ్ వాళ్లకి పిల్లలు లేరు,ఈ నగరంలో చిన్న ఉద్యోగం చేస్తుండేవాడు, మానాన్న,బాబాయి చాలా అన్యోన్యంగా పెరిగిన అన్నదమ్ములు.తనకి పిల్లలు లేక పోవడంతో- బాబాయ్-పిన్నీ పండూని పెంచుకుంటాం అన్నారు.అమ్మా-నాన్నకి ఇష్టం లేక పోయినా, నాన్నకి బాబాయ్ మీద ఉన్న ప్రేమతో అమ్మని ఒప్పించి పండుని వాళ్ళ చేతుల్లో పెట్టారు.
అలా వాళ్ళు పండూని మాఊరినుంచి ఈ నగరానికి వచ్చినప్పుడు పెద్ద ప్రమాదానికి గురి అయ్యారని, చనిపోయారని తెలిసింది.అనుకోకుండా వాళ్ళశరీరాల్ని హాస్పిటల్ కి తీసుకెళ్లినప్పుడు మా ఊరివాళ్ళు అక్కడ ఉండటంవల్ల బాబయ్య- పిన్నిని గుర్తుపట్టారు.
దురదృష్టవశాత్తూ, వాళ్ళ ఇంట్లోవాళ్ళు ప్రమాదంలో ఉండి చికిత్స పొందుతుండటంతో అమ్మా- నాన్నకి ఈవిషయం తెలిసేసరికి చాలా ఆలస్యం అయింది.తర్వాత ఈ నగరానికి వచ్చి పండు గురించి చాలా వాకబు చేశారు, ఎక్కడా తెలియలేదు మాకు పండు ఏమయిపోయాడో-అప్పటినుంచి ఇంట్లో అందరం పండూ గురించి ఆశలు వదిలేశాం”
“కానీ దేవుడు ఎంత గొప్పవాడు సర్, వాడు మీ దగ్గరకి చేరడం, అనుకోకుండా నేను కలవడం, ఇంతదాకా జరగడం ఓ గొప్ప అద్భుతం,మా అదృష్ష్టం కూడా.ఈ సంగతి తెలిసిన అమ్మ నాన్న సంతోషానికి హద్దే ఉండదు” అన్నాడు.
అసలు అనాధ ఆశ్రమానికి ఇన్నేళ్లూ వెళ్లకుండా ఎందుకున్నా అని తెగ బాధపడిపోయాడు సూర్యం-కళ్లెదురుగానే సొంత తమ్ముణ్ణి పెట్టుకుని తెలుసుకోలేకపోయాను అని అనుకున్నాడు.ఈవిధంగా కలవాలని భగవంతుడు నిర్ణయించడం వల్లే, ఆరోజు ఫైల్ మర్చిపోవడం జరిగింది,ఆ ఫైల్ మర్చిపోకుండా ఉంటే అసలు పండూ తెలిసేవాడే కాదుకదా అని దేవుడికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.
ఈ కధ విన్న ఆయన కళ్ళలో కూడా ధారాపాతంగా నీళ్లు కారాయి సంతోషంతో ఓఅనాధ బాలుడికి ఓ కుటుంబం దొరకడం భగవంతుడి లీల కాక మరేమిటి అనుకున్నాడు!
తన వివరాలు అన్నీ ఆయనకు ఇచ్చి ఆఘమేఘాల మీద ఇంటికి చేరాడు- పండూని దగ్గరకి తీసుకొని ఏడ్చేశాడు సూర్యం, లలితకీ- పండుకీ ఏడుస్తూ జరిగిన విషయం చేప్పాడు.వాళ్ళిద్దరికీ నమ్మశక్యమే కాలేదు సూర్యం మాటలు- పండూకి అసలు నోటమాట రాలేదు.
ఆశ్రమంలో చేర్పించిన వ్యక్తిని కలిసి వస్తామని- ఆ లోపు లలితని ఊరు ప్రయాణానికి సిద్ధం అవమని చెప్పాడు!
తర్వాత పండుని తీసుకొని- పండుని అనాధ ఆశ్రమంలో చేర్పించిన వ్యక్తి ఇంటికి వెళ్ళాడు-ఆవ్యక్తి ఇంట్లో లేకపోయేసరికి అక్కడే అతని కోసం వేచి చూసారు; కాసేపటికి ఆ వ్యక్తి రాగానే- విషయం అంతా చెప్పి సూర్యం అతనికి కృతజ్ఞతా భావంతో కాళ్ళకి నమస్కరించాడు అప్రయత్నంగా- ఆ వ్యక్తి వారిస్తున్నా!
ఆ వ్యక్తి కూడా చాలా సంతోషించి సూర్యాన్ని దగ్గరకు తీసుకున్నాడు- ఇవేమి తెలియని పండు సంభ్రమాశ్చర్యానికి గురి అయ్యాడు- కళ్ళముందు జరుగుతున్నవన్నీ కలో నిజమో నమ్మలేని పరిస్థితి వాడిది-ఆ వ్యక్తి దగ్గర వీడ్కోలు తీసుకుని ఇంటికి బయలుదేరి వెళ్లారు.
వెంటనే లలితా-సూర్యం, పిల్లలు,పండు అప్పటికప్పుడు సూర్యం వాళ్ళ ఊరికి బయలుదేరారు;ప్రయాణం దారిలో- లలిత వాళ్ళ అమ్మా-నాన్నలకి ఫోన్ చేసి విషయం అంతా చెప్పింది-వాళ్ళూ కూడా చాలా ఆనందించారు.
వీళ్ళు అందరు ఊరు చేరారు- హఠాత్తుగా వీళ్ళందరూ రావడంతో సూర్యం తల్లితండ్రులకి విషయం అర్ధం కాలేదు.సూర్యం చెప్పిన విషయం వింటూ వాళ్ళిద్దరి నోటా మాటలు పెగల్లేదు, సంవత్సారాల క్రితం ఏమైపోయాడో తెలియని కొడుకు కళ్ళముందు అంత పెద్దవాడై ఉండటంతో-పట్టరాని ఆనందంతో పండూని దగ్గరకు తీసుకున్నారు!
ఇన్నేళ్ళనుంచి వస్తున్నా,సూర్యంతో ఉన్నా,అందరి కళ్ళముందే ఉంటున్నా తమకు తెలియకపోవడం సంతోషం,బాధ కలిగించింది-ఆ ఇంట పండుగ వాతావరణమే నెలకొంది.
అక్కడ రావిచెట్టు మీద ఉన్న త్రిమూర్తులు నవ్వుకుంటున్నారు!
సమాప్తం!!!
చివరగా...
చూసారు కదా, నిస్వార్ధంగా సూర్యం ఎలాంటి సాయం చేసాడో- దాని స్ఫూర్తిగా తీసుకున్న పండు, తల్లిలాంటి యాదమ్మని తన సొంత తల్లితండ్రుల దగ్గర ఉంచవచ్చు- అలా కాకుండా నిజం తెలిసిన తర్వాత కూడా తన దగ్గరకే తీసుకెళ్ళాలి అని నిశ్చయించుకున్నాడు. పండు తన తర్వాత జీవితంలో సూర్యంలాగే తన చుట్టుపక్కల వాళ్లకి ఖచ్చితంగా సహాయం చేస్తాడని మనం ఊహించుకోవచ్చు!
మనకు ఇతరులకి సాయం చేస్తే వచ్చే ఆనందం అనిర్వచనీయం,అనుభవైకవేద్యం. అదీకాక ఇలా చూసినప్పుడు అవతలవాళ్ళు కూడా ప్రేరణ పొందటానికి చాలా శాతం అవకాశం ఉంది!
ఎప్పుడూ నేను,నా కుటుంబం,నావాళ్ళే అనుకోకుండా మనకు చేతనయినంతలో ఇతరులకు సాయం చేద్దాం;దానిలో ఉన్న ఆనందాన్ని,సంతోషాన్ని సొంతం చేసుకుందాం జీవితం సార్ధకం అవుతుంది.మనం జీవించేది ఒక్క సారే, కానీ బోలెడన్ని గుండెల్లో చిరంజీవుల్లాగా ఉండిపోతాం.
సూర్యం లాంటి అజ్ఞాతవ్యక్తులు మన సమాజంలో చాలామంది ఉన్నారు-ఈ కధ అలాంటి వారందరికీ ప్రేమతో అంకితం.
ఇది పాత ఇతివృత్తమే- నా శైలిలో చెప్పే చిన్ని ప్రయత్నమే ఇది!
మీ అభిప్రాయాలు తెలియచేయండి-అది ఎలాంటిదైనా సరే-భవిష్యత్తులో రాయబోయే నారాతలు సరిద్దుకోడానికి,మెరుగు పరుచుకోవడానికి ఉపయోగపడతాయి!