పెళ్లి సందడి!!!
అది 1936 వ సంవత్సరం-పశ్చిమగోదావరి జిల్లాలోని ఒక పట్టణం,ఒక ఉన్నత తరగతి కుటుంబం.ఆ తల్లితండ్రులకు ఐదుగురు సంతానం, ముగ్గురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు.ఇంటికి పెద్ద మగపిల్లాడు,రెండో బిడ్డ ఆడపిల్ల,ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి సంబంధాలు వెతుకుతున్నారు.ఆ రోజుల్లో బందువుల్లోనో, మేనరికాల్లోనో సంబంధాలు కలుపుకునేవాళ్ళు ఆడపిల్ల బాగోగుల దృష్ట్యా,దూరా భారం కూడా లేకుండా ఉంటుందని -పెళ్లి అయినతర్వాత రాకపోకలకు.
మహా అయితే తెలిసినవాళ్ళ ద్వారా వచ్చిన,నచ్చిన సంబంధాలు చూసేవాళ్ళు, చుట్టుపక్కల గ్రామాల వరకు,మరీ కాకపోతే,తప్పక పోతే పక్క జిల్లాలకు వెళ్లే వాళ్ళు.అంతకు దాటి దూరాలు వెళ్లేవాళ్ళు కాదు. దీనికి అనేక కారణాలు అందులో కొన్ని...
పెరిగిన పద్ధతి,కట్టుబాట్లు,ఆచార వ్యవహారాలు,పద్ధతులు,ఆహారపు అలవాట్లు, వంటకాలు చేసే విధానం,భాష మాట్లాడే తీరు,వాతావరణంలో కొద్ది కొద్దిగా తేడాలు ఉండేవి సహజంగానే.ఆహారపు అలవాట్లు అక్కడ దొరికే, పండే పంటలని బట్టి ఉండేవి. అదీకాక తాగే నీటితీరుని బట్టి,జీర్ణం అయ్యే విధానాన్నిబట్టికూడా అక్కడ వంటకాలు చేసే విధానం ఉండేది-ఇది అన్ని ప్రాంతాలకు సంబందించిన విషయం దాదాపుగా ఆ రోజుల్లో- ఇప్పటి లాగా ప్రపంచీకరణ కాలేదుగా ఆరోజుల్లో!!! అందునా తెల్లదొరల పరిపాలనా సమయం,స్వాతంత్య్రం రాక మునుపు కూడా నాయే.,అందునా పట్టణ మాయే.కొద్దిగా పద్ధతుల్లో సడలింపులు ఉంటాయి- పల్లెలతో పోలిస్తే!!
అప్పుడు వాళ్ళకి వాళ్ళ బంధువుల ద్వారా ఎక్కడో “కృష్ణా జిల్లాలో” ఉన్న ఒక పల్లెటూరునుంచి పెళ్లి సంబంధం తెలిసింది.అబ్బాయి,వాళ్ళ పక్క పట్నంలో SSLC వరకు చదువుకున్నాడని(కాలేజీ లేదు వాళ్ళకి దగ్గర ఉన్న పట్నంలో), స్థితిమంతులని,పెద్ద వ్యవసాయం ఉందని,తోబుట్టువులు చాలామంది ఉన్న కుటుంబంలో మధ్యవాడైనా సమర్థుడని విన్నారు.అంత దూరం పిల్లనివ్వడం అంటే తటపటాయింపు సహజమే అని నా పై వర్ణనని బట్టి మీకు అర్ధం అయ్యిఉంటుంది.
గోదావరి జిల్లాకి,కృష్ణా జిల్లాకి బోలెడు తేడాలు అన్నిట్లో-గోదావరమ్మ కి కృష్ణమ్మకి ఉన్నంత తేడా!
కుటుంబ సభ్యులు ఆ విషయమై చర్చించుకుంటున్నారు.తర్జనభర్జనలలో ఎవరి సందిగ్దతలు వాళ్ళు ఏకరువు పెడుతున్నారు.ఇది పట్నం అని-అమ్మాయి ఇక్కడ పెరిగినపిల్ల అనీ, పిల్లాడు పల్లె అనీ, చదువుకున్నా కూడా అమ్మాయి పట్నంలో పెరిగి, పల్లెలో ఎలా ఇమడగలదని (మడి కట్టుకుని వండటం అలవాటు అయిన పిల్ల అయినా కూడా)
ఇంతలో పిల్ల మేనమామ,ఆయుర్వేద వైద్యుడు-“ఆ కృష్ణా జిల్లావాళ్ళకి, గోదావరి జిల్లా వాళ్ళకి అన్నీతేడాలే”.ఈయన కొంచెం హాస్యచతురుడు కూడానూ.
“కృష్ణా జిల్లా ఆడవాళ్లకు పనస తొనలిస్తే వాసన చూసి కొప్పులో పెట్టుకునే రకాలు అని”అన్నాడుట హాస్యంగా.అందునా ఆయన వైద్యంలొనే కాక వంటలు, పిండి వంటల్లో కూడా దిట్టాయే మరి.ఏదైతేనే సుధీర్ఘ చర్చల అనంతరం పిల్లాడి తరఫువాళ్లకు కబురుపెడదాం “మాఅమ్మాయి ఉంది” అని నిర్ణయించేశారు. ఇప్పట్లో లాగా ఒక ఫోన్ కొట్టేసి, మాట్లాడి,పిల్లా పిల్లాడి ఫోటోలు “వాట్సాప్” లో పంపేసి, “స్కైప్ లో” ఇరువురు చూసేసి (విదేశాల్లో ఉంటే) ఇండియాలో ఉంటే, కాఫీ కో,సినిమాకో వెళ్లి “పిల్లా- పిల్లాడు” చూసుకోవడం, బాగుంటే “ఓకే” అనేసుకోవడం, ముహూర్తాలు,పెళ్లి టకటకా వారంలో అయ్యేరోజులు కాదుగా మరీ!
వాళ్ళ బంధువుల ద్వారా కబురు పెట్టారు,ఆ తర్వాత పద్ధతి ప్రకారం ఉత్తరం రాసారు ఆ అబ్బాయి తల్లిదండ్రులకు.అటు వాళ్లనుంచి అనుకూలంగా తిరుగులేఖ అందింది. “తీరుబడి చేసుకుని మావాళ్ళు వచ్చి చూసివెళతారని” అన్నట్టుగా,పిల్లాడి అన్నయ్య (వరసకి)చూడటానికి వచ్చాడు -ముందుగా పిల్లని చూడటానికి.
పెళ్ళకూతురి తండ్రిగారి వదినగారికి-పెళ్ళికొడుకు వరుసకు అన్నయ్య (అక్క చెల్లెళ్ళ పిల్లలు) అయ్యే ఆయన వదిన గారికి బంధుత్వం!!!
పిల్లవైపు బంధువులు ఉన్నారని చెప్పాగదా పిల్లాడి వైపు,ఆయనే ఈయన అన్న మాట.వచ్చిన పెద్దాయనికి పిల్లా,ఇంట్లో వాళ్ళ “తీరు తెన్నూ నచ్చినట్టుంది. సానుకూల ధోరణితో చెప్పీ చెప్పనట్టు,అనీ అననట్టు” పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అలాగన్నమాట-అలాచేసి, అనేసి వెళ్లారు.
దగ్గరా దాపా, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కృష్ణా జిల్లా అంటే-బహు దూరం కూడా “ఆ జిల్లాకి ఈ జిల్లాకి ఇండియాకి- అమెరికాకి ఉన్నంత దూరం మరి ఆరోజుల్లో”! ఏదైతేనేం మరి కొన్నాళ్ళకి పెళ్ళికొడుకు,తరఫు వాళ్ళు రానూ వచ్చారు, సరే అనడం, పెళ్ళి నిశ్చయం అవడం జరిగిపోయాయి-దమ్మిడీ కట్నంలేకుండా, లాంఛనాలు కూడా లేకుండా
(ఈ రోజుల్లో లాగా కాదులేండి,కట్నం వద్దంటారు,లాంఛనాలు చాలు,పెళ్ళి మాత్రం బాగా చెయ్యాలి అని చెప్తారు.అక్కడికేదో పిల్ల తల్లిదండ్రులకు ఉన్నంతలో ఉన్నతంగా, పెళ్లి ఘనంగా చెయ్యాలని ఉండదు అన్నట్లు,ఏమిటో ఈ లౌక్యపు మాటలు చేష్టలూనూ)
ఇది ఇలా ఉంచి 1936 లోకి వెళ్దాం 2020నుంచి...
లగ్గాలు పెట్టుకోవడం అయిపోయింది.ఇక ఎక్కడలేని హడావుడి,పెళ్ళికూతురు ఇంట్లో పెళ్లి సందడి మొదలయింది.
సరుకుల లిస్ట్!!!
పెట్రో మాక్స్ లైట్లు వాళ్ళకి పురమాయించడం!
మేళ గాళ్ళకి పురమాయించడం!
ఇంటికి వెల్లవేసే వాళ్ళకి పురమాయించడం!
పాల వాడికి ఏ రోజున ఎన్నిసేర్లు (ఆ రోజుల్లో లీటర్లు లేవు) కావాలో చెప్పిపెట్టడం! కూరల షాపుల వారికి పనస కాయల కోసం ముందే చెప్పి ఉంచడం- పనస పొట్టు కూర ఆవపెట్టి చెయ్యడానికి!
అరటి గెలలూ-అరటి ఆకులు (అరటి ఆకుల్లో భోజనాలు)-బంధువుల వాళ్ళ పొలంలో నుంచి వచ్చేవి.
వంట వాళ్ళకి కబురు పెట్టి ఖాయం చేసుకోవడం! వసతి గృహాలు, పెళ్లి వాళ్ళ విడిది!
వంట సామగ్రి!
సంబారాలు!
గాడి పొయ్యిలు,పేడతో అలకటాలు,ముగ్గులు!
పిండివంటలు-రోజుల తరబడి “స్వగృహంలోనే స్వగృహ ఫుడ్స్”చుట్టుపక్కలవాళ్లే తలోచేయి వేసేవాళ్ళు.బియ్యం దంపడాలు-అరిసెలకి, చలిమిడికి-సారెలోకి కావాలిగా!
అరిసెలు, జంతికలు, మినప సున్ని ఉండలు,జంతికలు, కాజాలు, కారపు బూందీ, పంచదార లడ్లు-చిన్న సైజ్, పెద్ద సైజ్- పెళ్లి వాళ్ళకి ఇవ్వటానికి,పిల్ల సారెలోకి!
అప్పడాలు,గుమ్మిడి వడియాలు,మినప పప్పు వడియాలు,చల్ల మిరపకాయలు!
పొడుల సంగతి సరే సరి-కంది పొడి, కారప్పొడి!
పెళ్లి తంతులో కావాల్సిన సరంజామా! పురోహితుడి దగ్గర వివాహ కార్యక్రమంలో కావాల్సిన సరుకుల జాబితా పైపెచ్చు ఐదురోజుల పెళ్ళాయే!
టెంట్ హౌస్లు లేవుగా-తాటాకు పందిళ్లు,పెళ్లి మంటపం- కొబ్బరి ఆకులతో నేసింది-వేసే వాళ్ళకి పురమాయించడం జరిగి పోయింది మిగతా కావాల్సిన వస్తువులు జాబితా తయారు చేశారు.ఏవి ఎవరి ఇళ్లల్లో ఉంటాయో తెలుసుకాబట్టి ముందుగా వాళ్ళకి చెప్పేయడం వీళ్ళ ఇంట్లోలేనివి! పెళ్లి అంటే మామూలు కాదుగా-ఎంతటి వాళ్ళైనా ఆ రోజుల్లో బింకాలు, బేషజం లేకుండా అక్కడా ఇక్కడా ముందుగా చెప్పిపెట్టేవారు, పెళ్లికి కావాల్సిన కొన్ని వస్తువులు.
ఇక ముఖ్యమైన ఇబ్బంది పెట్టే అంశం-మడి వంట,మడి బట్టలు ఆరేసుకోవడానికి తాళ్ళు,దండేలు, పిల్లలు వచ్చి బట్టలు ముట్టుకోకుండా తగిన ఏర్పాట్లు!
స్వహస్తం వాళ్ళకి ఏర్పాట్లు- ఎవరి వంట వాళ్లే చేసుకునే వాళ్లు కొంతమంది ఐదు రోజుల పెళ్లిల్లాయే ఆ రోజుల్లో!వాళ్ల వంటలకి కావాల్సిన సరుకు- సరంజామా జాబితా ఏర్పాట్లు.
ఎవరు ఏపనులు చెయ్యాలి,ఎవరు అజమాయిషీ వహించాలో అంతా పకడ్బందీగా జరిగి పోయాయి.
పెళ్లి కొడుకు వాళ్ళది పెద్ద కుటుంబం,బంధుగణం బాగా ఉండటం మూలాన ఏర్పాట్లు దానికి తగ్గట్టుగానే విస్తృతంగా,భారీగానే చేశారు-ఎక్కడా లోటురాకుండా.
పెళ్లి ఏర్పాట్లు పనులు అయిపోయాయి-పెళ్లి వాళ్ళు రావడం మినహా!!!
పెళ్లివాళ్ళు వాళ్ళ సొంత లారీలో,మరి కొంత మంది బస్సులో వచ్చారు అంత దూరం ప్రయాణం చేసి.ఇంక సందడే సందడి- చుట్టుపక్కల వీధుల్లో,ఆ ఊళ్ళో ఉన్న బంధువుల ఇళ్లల్లో కూడా-ఆప్యాయతలు అలా ఉండేవి.
పెళ్లి కొడుకు వాళ్ళకి ఒక గుఱ్ఱం కూడా ఉండేదిట.ఆనోటా ఈనోటా వినడంతో పిల్లకాయలందరూ పెళ్లికి గుఱ్ఱం కూడా వస్తుందని ఎదురు చూశారు,అంత దూరం రాలేదని తెలియక.కొద్దిగా నిరుత్సాహ పడ్డారు గుఱ్ఱం రాక పోవడంతో.
మేళ తాళాలతో స్వాగతం!!
వాళ్ళ సామానులు కేటాయించిన స్థలాల్లో,విడుదుల్లో సర్దేయడం,కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళు,తువ్వాళ్ళు,మంచి నీళ్ళు, కాఫీ,ఫలహారాలు!ఇక ఐదు రోజులూ ఆ ఇల్లు“డొక్కా సీతమ్మగారి” (పిల్ల తల్లి పేరు కూడా సీతమ్మగారే మరి) ఇల్లులా అయిపోయిందంటే నమ్మండి-ఆఐదు రోజులు సరదాలతో, సందడులతో గడిచిపోయాయి!
ఐదు రోజుల పెళ్ళి అవడం మూలాన మగపెళ్లివాళ్ళకి కాస్త కాలక్షేపం మరియు ఆట విడుపుగా ఉంటుందని ఒక బస్సు ఏర్పాటుచేశారు రాజమండ్రి వెళ్ళడానికి.ఓ పాతిక, ముప్పయిమంది సరదా పడ్డవాళ్ళు బయలుదేరారు.రాజమండ్రి చాలా దగ్గర అవడం మూలాన తొందరగా చేరిపోయారు.ఊరి మొదట్లో రాజమండ్రి బ్రిడ్జి రాగానే అందరూ గోదావరి తల్లి ఒడిలోకి రాగి నాణాలు విసిరేశారు దండం పెట్టు కుంటూ.
కాటన్ దొర మ్యూజియం,ధవళేశ్వరం ఆన కట్ట, గోదాట్లో స్నానాలు,(పుష్కరాల ఘాటు లో) కానిచ్చారు.కాస్త ఫలహారాలు దట్టిచ్చి వేడి వేడి ఫిల్టర్ కాఫీ గొంతులో వేసుకొని తిరుగు ప్రయాణం అయ్యారు-సాయంత్రాని కల్లా వెనక్కి చేరిపోయారు.
ఆవూళ్లో అంతా మంచినీళ్ళు రోజూ కాలవగట్టున పట్టుకొచ్చేవాళ్ళు.,తమంది ఈ సరదా కూడా తీర్చుకున్నారు.బిందెలతో తెచ్చిన నీళ్లలో పటిక కలిపేవారు.
(ఆలమ్)నీళ్లు తేటగా తేరుకోవడానికి. మురికి అంతా బిందె అడుగుకు చేరిపోయి నీళ్లు తేటతెల్లంగా తయారయ్యేవి.పక్క ఊరులోనే ఆలమ్ ఫ్యాక్టరీ కూడా ఉండేది ఆలమ్ వాడకం చాలా ఎక్కువ ఆ ప్రాంతంలో!
అలాగే ఒక రోజు అట్లపాడు రేవునుంచి పడవ ప్రయాణానికి ఏర్పాట్లు చేసారు పడవలో కాస్సేపు అలా తిరిగి వస్తారని,పడవవాడు వాళ్ళని కొంతదూరం తీసుకెళ్లి మళ్లీ వెనక్కీ తెచ్చాడు.
అలాగే పెళ్లికూతురు వాళ్ళ పిన్నీ వాళ్లకు వ్యవసాయం,అరటి తోట(అమృత పాణి,చక్కెర కేళి) చెరువు, చెరుకు వరి ఉండేవి.పెద్ద పెద్ద తాటిచెట్లు పొలం గట్టున ఉండేవి.తాటి గెలలు దింపించి పిల్లలకు తాటిముంజలు తినిపించారు-పెద్దవాళ్ళ కంటపడకుండా -ఏంచేతంటే ఆరోజుల్లో “తాటిముంజలు తినటం అంటే తాటి కల్లు తాగినట్టే”కొంతమంది పెద్దవాళ్ళు కూడా పిల్లలతో కలసి చప్పుడుకాకుండా గుట్టుగా తిన్నారు.
అరటి గెలలు వసారాలో వేలాడతీసి కట్టేవాళ్ళు,కూరల బజార్ కి వెళ్లిపోయేవి అమ్మకానికి;ఒకటి రెండుగెలలు పక్వానికి వచ్చినవి మాత్రం ఉంచేవాళ్ళు ఇంట్లో వాళ్ళు తినడానికి-రోజూ కాసినిపళ్ళు పండేవి పండినపళ్ళు పండినట్టే తినేసేవాళ్ళు.
అలాగ పెళ్లికి వచ్చిన పిల్లలు పెద్దలు కూడా ఈ అనుభవాలతో బాగా ఆనందించారు పెళ్లితో బాటు సందడిగా సరదాగా.అందునా అందరికి ఇది ఓ కొత్త అనుభవం ఇవన్నీ వాళ్లకు లేకపోవడం మూలాన.
వేడుకలు అయిపోయిన తర్వాత మర్నాడు పిల్లని తీసుకొని పెళ్లివాళ్ళు తిరుగు ప్రయాణం అయ్యారు వాళ్ళ ఊరికి!
సాధారణంగా పెళ్లి జరిగిన పట్నం నుంచి- రైలు ప్రయాణం బెజవాడ వరకు!
బస్సు ప్రయాణం- బెజవాడ నుంచి పట్నం వరకు! ఎడ్లబండి ప్రయాణం-పట్నం నుంచి పెళ్ళికొడుకు ఊరువరకు!
ఇవన్నీతప్పించుకోవడానికి పెళ్ళివాళ్ళు సొంతలారీలో,ఒక బస్సులో వచ్చి వెళ్లారుట.
ఆ తర్వాత నుంచి కొన్ని ఏళ్ల వరకు ఎడ్లబండి, బస్సు, రైలు మొదలైన ప్రయాణ సాధనాలతోనే ఆపిల్ల పుట్టింటికి వెళ్లినప్పుడల్లా.అదో కొత్త అనుభవం ఆఅమ్మాయికి, వాళ్ళ బంధువులకు!!!
పెళ్లికూతురు వాళ్ళ తల్లితండ్రులు,బంధువులు ఎప్పుడైనా వాళ్ళఅమ్మాయిని చూడటానికి రావాలంటే ఒకఉత్తరం ముక్క రాసి పడేసేవారు.పట్నానికి ఎడ్ల బండి పంపమని.ఆ అనుభవాలు,అనుభూతులు,విశేషాలు-ఇరు పక్షాల బంధువులు చాలాకాలం చెప్పుకొనేవారుట!
శుభం కార్డు పడింది ఇహ లేవచ్చు మీరు.ఆ ఆ ఆగండి నిలబడే ఉండండి,తెరమీద పేర్లు పడుతున్నాయి,అవి కూడా చూసి వెళ్ళండి.
పాత్రల పరిచయాలు:
వధువు: శకుంతల- సూరి వారి ఆడపడుచు- ఊరు నిడదవోలు
వరుడు: మార్కండేయ శాస్త్రి చతుర్వేదుల- స్వగ్రామం మునగాల పల్లి,నందిగామ తాలూకా వధువు: మా అమ్మ. వరుడు మా నాన్న - ఇది మా అమ్మానాన్నల పెళ్లి!!!!!
ఈ కబుర్లు నాకు పునశ్చరణచేసి నాకు మళ్లీ గుర్తు చేసిన మాఇంటికి పెద్దదిక్కు అయిన మాపెద్దక్క “వేదవతికి” ప్రేమతో నమస్కారాలు,కృతజ్ఞతలు కూడానూ.
అమ్మా-నాన్నల పెళ్లి,అందునా మనకు స్వాతంత్ర్యం రాక పూర్వం జరిగిన వేడుక గుర్తుతెచ్చుకోవడం, రాయడం,మీ అందరికీ కూడా తెలియచేయడం సంతోషంగా ఉంది.
ఇప్పటికీ నిడదవోలు,అట్లపాడు రేవు దగ్గర మా మావయ్య గారి అబ్బాయి,మా బావ అదే స్థలంలో కొత్త ఇల్లు కట్టుకొని తన భార్యతో అక్కడ నివసిస్తున్నారు.చెరువు, అరటి తోట,వరి,అలాగే ఉన్నాయి.ఇంటి ముందు పెద్ద మామిడి చెట్లు తోడు అయ్యాయి.రెండేళ్ల క్రితం మేము అక్కడ కు వెళ్లివచ్చాం కూడా.