రమేష్ బట్టల షాప్
ఉపోద్ఘాతం!
విధి ఎంత బలీయమైనదో మనం పురాణాల్లో, భారత- భాగవతాల్లో చదివాము- మనం చూస్తూనేఉన్నాం కూడా-ఎంతటి వాళ్లకైనా ఇది తప్పదేమో-“ఓడలు బళ్ళు- బళ్ళు ఓడలు అవుతాయి” అన్నట్టుగా!
ఈ కలియుగంలో కూడా ఇలాంటి వ్యక్తుల్ని మనకు తెలిసినవాళ్ళకి జరగడం,మన కళ్ళతోనే చూసిఉంటాం, మరి కొంతమంది గురించి వార్తల్లోగానీ చదివి ఉంటాం.అదే సమయంలో “విధివంచితులు” అయిన కొందరు గడ్డుపరిస్థితులు ఎదుర్కొని విధికి ఎదురొడ్డి, నిలబడిన జయించిన వ్యక్తుల జీవితాలను కూడా అప్పుడప్పుడు విని ఉంటాం.
నా ఆప్తమిత్రుల్లో ఒకరి జీవిత గాథ మీకు చెప్పబోతున్నాఅతని జీవితంలో జరిగిన యదార్ధసంఘటనలు-మనం ఎవ్వరం నమ్మం మన కళ్ళముందు మనవాళ్లకి జరిగిందీ అంటే.నన్ను మానసికంగా బాగా కదిలించివేసింది- అతనితో పరిచయం 1977 నుంచి!
ఇలాంటివాళ్ళు మనందరికీ స్ఫూర్తిదాయకం- మరీముఖ్యంగా భగవంతుడు అన్నీ ఇచ్చినా- ఇచ్చిన వాటికి సంతృప్తిపడకుండా, ఇంకా జీవితంలో ఏదోలేదు అని వగచే మనుషులని కూడా మన మధ్యన- సమాజంలో నిత్యం చూస్తూ ఉంటాం కూడా.
కాకపోతే నాస్నేహితుడి పేరు అందరి పాత్రల పేర్లు మార్చి రాస్తున్నాను- అతని ఉనికి బయట పెట్టడం ఇష్టం లేక-ఎందుకంటే, నా వ్యాసాలూ, కధలు, జ్ఞాపకాలు పబ్లిక్ డొమైన్ లో పోస్ట్ చేస్తా కాబట్టి.
నేను తన కధ రాద్దామని నా మనసుకి అనిపించింది, ఈ రోజుల్లో చాలామంది చిన్న చిన్న కష్టాలకి, జరిగే సంఘటనలకు తల్లడిల్లి పోవడం చూస్తున్నాం.నా స్నేహితుని కధ రాయడంలో నా ఉద్దేశం- డబ్బుకి లోపం లేకుండా చక్కగా దర్జాగా వ్యాపారం చేస్తున్న వ్యక్తి జీవితం తల్లకిందులై పోయిన వృత్తాంతం తెలియచేయడం కోసమే-అందరం నేర్చుకోవాల్సింది ఎంతోఉంది.అతని మానసిక పరిస్థితి, కష్టాలు ఎలా ఎదుర్కొన్నాడు -అనేవి తెలియచెప్పాలని అనిపించింది.
ఇది కధ కాదు- ఓ వ్యక్తి జీవిత యదార్ధ గాధ!
అందరూ మీ సమయం వెచ్చించి ఈ కధని తప్పక చదవాలని కోరుతున్నా;
ఖచ్చితంగా మీ కంట నీరు రాక మానదు, మీ హృదయాన్ని తట్టకుండా ఉండదు -జీవితంలో ఊహించని కష్టాలుపడి, ఢక్కామొక్కీలు తిని నిలబడ్డాడు- కుటుంబాన్ని నిలబెట్టాడు.నా స్నేహితుడిఅనుమతి తీసుకుని ఇది రాస్తున్నాను!
కథలోకి వెళ్తాను...
కామేశ్వరరావుగారు ఆయన జీవితాన్ని ఓ బట్టల షాప్ ఏజెన్సీ లో పనిచేస్తూ మొదలు పెట్టారు.వ్యాపారనిమిత్తం- అమ్మకాలకోసం బోలెడు ఊళ్ళు తిరుగుతూ
ఆఊళ్లలో ఉన్న అన్ని ముఖ్యమైన షాపులకు వెళ్లేవారు.స్వతహాగా నెమ్మదస్తుడు, మంచివ్యక్తి అవటంతో మంచిపేరు కూడా తెచ్చుకున్నారు- వ్యాపార అభివృద్ధితో బాటు.
క్రమేపి అంచెలంచెలుగా తాను పనిచేసేచోట బాధ్యతలు -ఆదాయం కూడా పెరిగాయి.చాలా కష్టపడిన తర్వాత కొన్నేళ్ళకు తన సొంతగా వ్యాపారం పెట్టుకునే స్థాయికి ఎదిగారు.ఒక రోజున తానూ సొంతగా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నాడు- పిల్లలు ఎదగడంతో.తన మనసులో మాటలని తాను పనిచేసే చోట యజమానితో చేప్పాడు. కామేశ్వరరావు వెళితే తన వ్యాపారానికి చాలా ఇబ్బంది అని తెలిసినా పెద్దమనసుతో అలాగే అన్నాడు అయిష్టంగానే- అంత మంచి మనిషిని వదులుకోవడం ఇష్టం లేకపోయినా!
అలా కామేశ్వరరావు సొంతగా వ్యాపారం మొదలు పెట్టాడు-రేయింబవళ్లు చాలా కష్టపడి వ్యాపారాన్ని కొద్దికాలంలోనే అభివృద్ధి చేసాడు.
ఆయనకు ఇద్దరు పిల్లలు- పెద్దవాడు కామేష్, చిన్నవాడు రమేష్-ఇద్దరూ చదువుకున్నవాళ్ళు.పెద్ద అతను డిగ్రీ వరకు చదువుకున్నాడు, రమేష్ కి చదువు మీద పెద్దగా ఆసక్తి లేకపోవడం వల్ల ఇంటర్మీడియట్ అవగానే చదువు ఆపేసాడు.
ఇంక అక్కడా ఇక్కడా ఎందుకని తనకు చేదోడుగా ఉంటాడని తనతోబాటు ఊళ్ళకి తీసుకెళ్లేవారు వ్యాపార నిమిత్తం.కుర్రవాడు అవడం, అందునా మాటకారి కూడా అవటం మూలాన వ్యాపార మెళకువలు తొందరగా పట్టేసాడు.కొన్నేళ్ల తర్వాత వాళ్ళ నాన్నతో మాట్లాడి ఒక బట్టల షాప్ పెట్టాడు మంచి వ్యాపార కూడలిలో.
కామేశ్వరరావుగారి పెద్ద అబ్బాయి కామేష్ తన డిగ్రీ అయిన తర్వాత వాళ్ల నాన్నతో పాటు తిరుగుతూ కొన్ని ఇతర కంపెనీల ఏజెన్సీలు సంపాందించాడు- ఉన్న ఏజెన్సీలతో బాటు.
ఎలాగూ చిన్నవాడు షాప్ పెట్టడం జరిగింది కాబట్టి,ఉన్న ఏజెన్సీలు ఇద్దరి కొడుకులకి సమంగా పంచాడు.
కామేష్ తాను సొంతగా ఏజెన్సీలు చూసుకునేవాడు,కామేశ్వరరావుగారు వయసు మీద పడటంతో రమేష్ ని ఏజెన్సీల పనిమీద పంపేవారు, ఆ సమయంలో ఆయన షాప్ లో కూర్చునేవారు;నెలలో ఓ వారం పదిరోజులే ఏజెన్సీ పని ఉండేది.కొడుకుకి చేయూతగా అప్పుడప్పుడు ఆయన ఏజెన్సీ పనిమీద ఊళ్లకు వెళ్లేవారు కూడా.
అలా ఇద్దరు కొడుకులు ఎవరి వ్యాపారాలు వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు.ఇద్దరి కొడుకులకు పెళ్లిళ్లు అయిపోయినాయి, రోజులు గడుస్తున్నాయి సాఫీగా.కామేష్ కు ఇద్దరు కొడుకులు, రమేష్ కు ముగ్గురు కొడుకులు కలిగారు.
రమేష్ ముగ్గురు పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు, తాను చదువు మధ్యలోనే మానేయడంవల్ల పిల్లల చదువుమీద చాలా శ్రద్ధ పెట్టేవాడు.పిల్లల భవిష్యత్తు దృష్ట్యా కొద్దిగా కష్టమైనా వేరే ఊళ్ళో హాస్టల్ లో పెట్టి చదివించేవాడు. ఒకపక్క వ్యాపార అభివృద్ధికి ఎప్పటికప్పుడు తన కస్టమర్లకి కానుకలు ఇవ్వడం,కస్టమర్ల పిల్లల పుట్టిన రోజులకి శుభాకాంక్షలతో కార్డులు పంపడం ఆ సమయంలో వారికి స్పెషల్ గా ధరలు తగ్గించి ఇవ్వడం చేసేవాడు- ఇవన్నీ ఆ రోజుల్లో ప్రత్యేకతలు, ఏ షాప్ వాళ్ళు చేసేవాళ్ళు కాదు!
వార్తాపత్రికల్లో ప్రచారం చేసేవాడు,దీనితో పెట్టుబడి కూడా పెంచవలసివచ్చేది- దానితో అక్కడా ఇక్కడా చేబదుళ్ళు తెచ్చేవాడు వడ్డీకి.కొద్దిగా ఎక్కువగా ఏజెన్సీ పనుల మీద తిరుగుతూ వ్యాపారాన్ని పెంచే ప్రయత్నం చేసేవాడు.
కాలంలో మార్ఫుతో బాటు వ్యాపారాల్లోనూ మార్పులు సంభవించడం మొదలు పెట్టాయి-ఆ ఊళ్ళో పెద్ద పెద్ద అంగళ్ళు (మాల్స్) రావడం మొదలు అయింది.జనం కూడా మాల్స్ కి వెళ్ళడానికే ఎగబడేవాళ్లు-దానితో తన కస్టమర్లు కూడా మెల్లిగా రమేష్ షాప్ కి రావడం తగ్గించారు;ఈ మార్పుతో వ్యాపారంలో ఊహించనంత మార్పు వచ్చింది.
ఆదాయం తగ్గడం మొదలయింది-ఖర్చులు, వడ్డీలు కట్టడం ఆపలేడు కదా-అదే క్రమేపీ గుదిబండ అయిపొయింది.తాను దర్జాగా బతుకుతూ షాప్ లో వాళ్లకి ఆధారం కల్పిస్తున్న వ్యక్తి ఒక్కసారే గడ్డు రోజులు ఎదుర్కోవడం మొదలు పెట్టాడు.ఎన్నాళ్ళు తప్పించుకోగలడు అప్పులవాళ్ళనుంచి.అదే సమయంలో గత ముప్పయి ఏళ్లుగా తాను వ్యాపారం చేస్తున్న కంపెనీవాళ్ళు ఇంకోళ్ళకి కూడా ఏజెన్సీ ఇచ్చారు వాళ్ళ బట్టలకి.
దానితో పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది-ఏం చేయాలో పాలుపోలేదు!
ఆ సమయంలో తన దగ్గర సహాయం పొందినవాళ్ళు మొహం చాటేశారు,డబ్బులు రావాల్సినవాళ్లు కోర్ట్ కి వెళ్లారు.ఇంక ఒకరోజు రమేష్ ఒక నిర్ణయానికి వచ్చాడు. తాను,భార్య- ముగ్గురు పిల్లల్ని తీసుకుని రైల్ కిందపడి చనిపోవాలని నిర్ణయానికి వచ్చారు.
భార్యతో కూడా చర్చించాడు,గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ దిక్కూ తోచక భార్య కూడా ఒప్పుకుంది.అతను చేసిన మంచిపనులవల్లో, భగవంతుడి నిర్ణయం వేరే రకంగా ఉందో రమేష్ కి ఆ రోజురాత్రి మళ్ళీ ఆలోచన వచ్చింది.పొరపాటున రైలు కింద తానూ భార్య మాత్రమే చనిపోయి పిల్లలు బతికిపోతే వాళ్ళ జీవితాలు తల్చుకుంటే భయం వేసింది- పిల్లలు ఏ దిక్కూ లేని అనాధలవుతారని అనిపించింది.
తక్షణమే ఆత్మహత్యలు చేసుకోవాలనే ఆలోచన విరమించుకున్నారు.అప్పుల వాళ్ళ బాధ పడలేక సమాధానం చెప్పలేక సతమతమైపోయాడు రమేష్.
ఏం చేయాలో తోచలేదు, కళ్ళముందు అన్నీ సమస్యలే దాంతో భార్య పిల్లల్ని వాళ్ళ సొంతఇంట్లో ఉంచి-రమేష్ అమ్మా-నాన్నలు అతనితోనే ఉండేవాళ్ళు-తాను ఎక్కడికో వెళిపోయాడు ఇంట్లో వాళ్లకి కూడా చెప్పకుండా.తన విషయాలు అన్నీ తెలిసిన ఆప్తమిత్రుల్లో ఒకతని సహాయం తీసుకొని రాష్ట్రం పొలిమేరల్లో ఉన్న ఓ చిన్న పట్నానికి వెళ్ళాడు-అక్కడ ఒక ట్రాన్స్ పోర్ట్ కంపెనీలో పనికి కుదిరాడు.
విధి ఎంత బలీయమైనదో అతని విషయంలో-అంత బతుకు బతికి ఏ మనిషి కూడా ఊహించని దయనీయస్థితికి చేరుకున్నాడు. ట్రాన్స్ పోర్ట్ కంపెనీలో పడుకునేవాడు,వాళ్ళు రోజు భోజనం పెట్టి 100 రూపాయలు ఇచ్చేవారు ప్రతీరోజు.
ఆ డబ్బులు అసలు ఖర్చుపెట్టుకోకుండా దాయటం మొదలుపెట్టాడు.
కామేశ్వర రావుగారి పెద్ద కొడుకు కామేష్- తన కొడుకు వివాహంచేసి వాళ్ళ అమ్మానాన్నల్ని కూడా పిలవలేదు.తర్వాత చుట్టాలు అడిగినప్పుడు “మేము వచ్చాం చివర్లో కూర్చున్నాం” అని చెప్పారు- పెద్ద కొడుకుని బయటపెట్టడం ఇష్టం లేక- అదీ తల్లితండ్రులంటే. కన్నతల్లితండ్రులన్న కనీస జ్ఞానం,కృతజ్ఞతలేని కొడుకుని కన్నారు.
ఈలోపల తన ఊర్లో అప్పులవాళ్ళు-తన ద్వారా అంతకుముందు సహాయం పొందిన మిత్రులే గతాన్ని మర్చి కోర్ట్ లో కేసు వేశారు.దానితో వాళ్ళ సొంతఇల్లు అమ్మాల్సి వచ్చింది చాలా తక్కువ ధరకే.దానితో నిలువనీడ లేకుండా అయిపొయింది.ఇది జరిగిన కొద్దీ రోజులకే రమేష్ అమ్మా నాన్న ఇద్దరూ చనిపోయారు.
రమేష్ కుటుంబానికి నిలువ నీడలేకుండా పోయింది,అటు కామేష్ కానీ,రమేష్ భార్య కుటుంబం వైపు గానీ ఏ మాత్రం సహాయం అందకపోగా వాళ్ళు మొహం చాటేశారు. ఈలోపల అక్కడ కష్టాలు పడుతున్న రమేష్ అక్కడినుంచి తన ఊళ్ళో ఉన్న ఒక స్నేహితుని కి తన పరిస్థితి వివరించి ఏదో విధంగా సహాయం చేయమన్నాడు, అప్పుడు అతను రమేష్ ని కేరళ వెళ్ళమన్నాడు.
తనకు తెలిసినవాళ్ళ ద్వారా అక్కడ ఒకళ్ళకి ఇతని పరిస్థితి వివరించి రమేష్ ని కేరళ పంపించాడు!
కొత్త ఊరు,కొత్త రాష్ట్రం అలాగే వెళ్ళాడు కొచ్చిన్ కి,అది ఒక ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ.చాలా కంపెనీలకి లారీలు సరఫరా చేస్తుంటారు.అక్కడ పనికి కుదిరి-భార్య పిల్లల్ని కొచ్చిన్ వచ్చేయమన్నాడు-ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నాడు.
ఇక్కడ ఒక విషయం మనం మాట్లాడుకోవాలి,రమేష్ విషయంలో జరిగిన ఈ సంఘటనలు కలలో కూడా ఊహించనవి.మొదట్లో ఆత్మహత్యలకు పాలు పడదామనుకున్న మనిషి-దైవానుగ్రహం వల్ల ఈరోజున అందరూ ప్రాణాలతో ఉన్నారు.అలాగే అంత దర్జాగా జీవితాన్ని కొనసాగించిన రమేష్ అతని కుటుంబం ఆ పరిస్థితిలో బతకడం.
మామూలుగా పరిస్థితులు జీర్ణించుకుని బతకడం అంత సులువుకాదు-రోజూ గతజీవితం గుర్తుకొస్తూ ఉంటుంది.కానీ రమేష్ మొక్కవోని ధైర్యంతో ఇది భగవంతుడి నిర్ణయం అనుకుని పరాయిరాష్ట్రంలో కుటుంబంతో తలదాచుకున్నాడు-అందరికీ దూరంగా. అక్కడ నుంచి అతను చాలా కష్టపడాల్సి వచ్చేది-భార్య, ముగ్గురు పిల్లలు, పిల్లల్ని అక్కడే స్కూల్ లో చేర్పించాడు.భాష ఏ మాత్రం రాదు,అయినా పిల్లలు కష్టపడి చదువుకున్నారు, భాషా నేర్చుకున్నారు.
రమేష్ పనిచేసే కంపెనీ యజమాని చాలా మంచివాడు-కష్టసుఖాలు తెలిసిన మనిషి.తన ఊర్లో ఉన్న ప్రపపంచానికి తెలియదు రమేష్ కుటుంబం ఏమయిపోయారో అని; తోబుట్టువులు పట్టించుకోనప్పుడు చుట్టాలు స్నేహితులు ఎందుకు పట్టించుకుంటారు; ఒకళ్ళిద్దరు చిన్ననాటి స్నేహితులకి ఫోన్ చేసి సహాయం అడిగాడు,వాళ్ళూ మొహం చాటేశారు,దానితో రమేష్ మానసికంగా చాలా మదనపడ్డాడు- స్నేహితుల ప్రవర్తనతో.
భార్యా భర్తలు ఒకళ్ళని మరొకళ్ళు ఓదార్చుకుంటూ జీవితాల్ని దేశంకాని దేశంలో సాగిస్తున్నారు-పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు.రమేష్ కంపెనీ యజమాని చాలా మంచివాడు అని ముందే చెప్పాను గదా- యజమాని కొడుకు కూడా వ్యాపారంలోకి వచ్చాడు. రమేష్ తండ్రి కామేశ్వర రావుగారి రక్తం కదా,ఒక రోజున రమేష్ తన యజమాని దగ్గర తాను కూడా సొంతగా ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్స్ చేద్దామనుకుంటాన్నని దానికి ఆయన ఆశీర్వాదం కావాలని చెప్పాడు.
పెద్దాయన చాలా సంతోషంగా అంగీకరించాడు.దానితో రమేష్ సొంత వ్యాపారం మొదలు పెట్టాడు రెండవసారి జీవితంలో -
రమేష్ తన ఇల్లు అమ్మి కొన్ని అప్పులు తీర్చాడు-కానీ మరి కొంతమందికి బాకీ ఉన్నాడు- “పదమూడు ఏళ్ల క్రితం” రాసుకున్న ఆ కాగితం తన దగ్గర భద్రంగా ఉంది! ఏదో రోజున తన సొంతఊరు వెళ్లి ఆ అప్పులన్నీ కూడా తీర్చేయాలి అని తీర్మానించుకున్నాడు- సొంత ఊరులో అందరి ముందూ తన పరువు, కుటుంబ పరువుపోయిన చోట తన మోసగాడు కాదు అని చెప్పాలి.
సొంత వ్యాపారం పుంజుకుంది భగవంతుడి దయవల్ల,దానితో తన సొంత ఊరుకు వెళ్లి అందర్నీ పిలిచి బాకీలన్నీ తీర్చాడు.
ఆ అప్పులవాళ్లలో ఓ చిన్న సైజు రౌడీ కూడా ఉన్నాడు,అతనికీ కబురు చేసాడు, రమ్మని.ఆ వ్యక్తికీ మూడు లక్షల రూపాయలు ఇవ్వాలి-మొదటి తడవుగా ఒక లక్షన్నర ఇద్దామని తెచ్చాడు.
అతను రమేష్ హోటల్ రూంకి వచ్చాడు,రమేష్ తాను బల్లమీద పెట్టిన లక్షన్నర ఆ వ్యక్తి చేతికి ఇచ్చాడు-మిగిలినవి కూడా ఇస్తాను త్వరలో అని.
ఆ వ్యక్తి ఆ డబ్బులు తీసుకోకుండా “రమేష్ గారు నేను వచ్చింది డబ్బులకు కాదు; ఈ ఊళ్ళో ఇలా బతికిన మీరు ఇన్ని సంవత్సరాలు ఏమయిపోయారు,ఎక్కడ వున్నారు,ఏం చేస్తున్నారు- అది తెలుసుకోవడానికే వచ్చాను తప్ప డబ్బులకు కాదు” అన్నాడుట.
ఆ మాటలకు రమేష్ కళ్ళలో నీళ్లు తిరిగాయి,తన చిన్ననాటి స్నేహితులు, తన ద్వారా సాయం పొందినవాళ్ళు మొహం చాటేశారు.
రమేష్ తేరుకుని, “వద్దండి, ఇప్పుడు ఈ డబ్బులయినా వున్నాయి కాబట్టి ఇస్తున్నా, తర్వాత ఎలా ఉంటుందో తెలియదు నా పరిస్థితి.రేపు మా పిల్లలు ఈ ఊరు వచ్చినప్పుడు వాళ్లకి అవమానం జరగకూడదు నావల్ల” అన్నాడు “మీరు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు,మళ్ళీ జీవితంలో తేరుకున్నారు అదేచాలు” అన్నాడు ఆ వ్యక్తి.
రమేష్ బలవంతం చేయడంవల్ల ఆడబ్బు తీసుకుని “రమేష్ గారు మీరు మిగతా డబ్బులు ఇవ్వక పోయినా నేను ఏమీ అనుకోను, మీరు ఇవ్వక్కర్లేదు, -నాదగ్గర లెక్కకి మించిన డబ్బు ఉంది-మీఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి” అని చెప్పి వెళ్ళిపోయాడు!
అందరు పిల్లలు డిగ్రీలు పూర్తి చేశారు,పెద్ద కొడుకు ఓ చిన్న ఉద్యోగంలో చేరాడు. రెండో వాడికి “హెయిర్ స్టైల్” రంగంలో ఆసక్తి ఉండటం వల్ల హైదరాబాద్ పంపి కోర్స్ లో చేర్పించాడు-కేరళ లో ఓ పెద్ద బ్యూటీ సెలూన్ (ఆడవాళ్ళకి, మగవాళ్ళకి) ఓ ఏడాదిన్నరక్రితం ఆరంభించాడు.బాగా నడుస్తున్న సమయంలో- కోవిడ్ బాగా వ్యాపారాన్ని దెబ్బకొట్టింది- కొన్ని నెలలుగా పునః ప్రారంభించాడు-మాదిరిగా నడుస్తోంది-కలియుగంలో ధర్మం కుంటిపాదంపై నడుస్తున్నట్టు.తొందర్లో అంతా సర్దుకుంటుందని ఆశిద్దాం;మూడో అతను తనకు వ్యాపారంలో సహాయంగా ఉన్నాడు.
రెండో పిల్లాడు ఎవరో అమ్మాయిని ప్రేమించడంతో పెద్దవాడికి పెళ్ళి చెయ్యకుండానే ఈ అబ్బాయికి పెళ్లి చేసాడు బెంగళూరులో 2018లో -నేనూ నా భార్య కూడా ఆ పెళ్ళికి వెళ్ళాం- పాత మిత్రుల్లో నేను ఒక్కడినే వెళ్ళింది- పిల్చింది నన్నొక్కడినే!
2015 లో అనుకుంటా నాకు పదమూడేళ్ల తర్వాత రమేష్ నుంచి ఫోన్ వచ్చింది; మొదటి మాటలోనే గుర్తు పట్టా,పేరు కూడా చెప్పా “అవును మూర్తి నేనే” అన్నాడు.నాకైతే మాటే రాలేదు నోటి వెంట- ఏడుస్తూనే ఉన్నా కొద్దిసేపు. ఆనందంతో, కాసేపయినా తర్వాత తేరుకొని అడిగా!
“ఏమయిపోయావు ఇన్నేళ్లు,నీ గురించి ఎన్నేళ్లు ఆలోచిస్తూనే ఉన్నా ఏమయి పోయావో అని.చెప్పొద్దూ నీకు ఏమయినా అయిందా, నువ్వు అసలు లేవేమో అనే ఆలోచనలే” అన్నాను అప్పుడు-తాను తన కధ అంతా చెప్పాడు.
“తర్వాత నేను హైదరాబాద్ వచ్చాను మూర్తి, నీకు కూడా 25000 రూపాయలు ఇవ్వాలి (నాకైతే ఏమాత్రం గుర్తు లేదు) నేను అన్నా “పిచ్చి ఎక్కిందా నీకు ఏమైనా- నాకయితే గుర్తే లేదు, అయినా ఇన్నేళ్ల తర్వాత నువ్వు ఉన్నావని తెలిసింది అదే పదివేలు. నాకైతే డబ్బు వద్దు, కానీ నిన్ను మాత్రం చూడాలి వెంటనే అన్నా”
జూబిలీ హిల్స్ లో తాను వుండే హోటల్ పేరు చెప్పి రమ్మన్నాడు, నేను వెంటనే నా కార్ లో అక్కడికి వెళ్లాను.రూములో అతన్ని చూసి కావులించుకుని ఏడ్చేసా- కాస్త తేరుకున్న తర్వాత తన కధ మొత్తం చెప్పాడు.
ఇలాంటి సంఘటనలు సినిమాల్లో చూస్తాం,కధల్లో చదువుతాం, నిజజీవితంలో అందునా ఒక ఆత్మీయుడికి జరగటం చాలా చాలా అరుదు.
రమేష్ కి ఊబకాయం వచ్చింది,అందరూ బాగున్నారని వ్యాపారం కూడా బాగుందని చెప్పాడు, నేను సంతోషంగా మళ్ళీ కలుస్తా అని చెప్పా.
అప్పటి నుంచి తనతో కాంటాక్ట్ లో ఉన్నా, మా తోబుట్టువుల్లో,అందరికీ అతను తెలుసు, అందుకని మా వాళ్లందరికీ ఫోన్ చేసి మరీ చెప్పాను, అందరూ చాలా ఆనందించారు రమేష్ వార్త తెలిసి.
తన గురించి రాయాలనే తాపత్రయంలో- వరుస క్రమంలో సంఘటనలు రాసినట్టు లేదు! విధి వంచితులయినా- ఆత్మ స్తైర్యంతో జీవితాల్లో నిలదొక్కుకున్నారు-ముఖ్యంగా మా స్నేహితుడి భార్య గురించి చెప్పుకోవాలి- అచ్చమైన సహధర్మచారిణి లాగా- స్వతహాగా స్థితిమంతురాలైనా- పరిస్థితులకు అనుగుణంగా భర్తకు చేదోడు వాదోడుగా ఉంది,పిల్లలు కూడా బుద్ధిమంతులు. ఆమె వైపు గానీ, నా స్నేహితుడి కుటుంబంవైపు గానీ సంబంధాలు లేకుండా ఉండిపోయారు- వీళ్ళ పరిస్థితులకు వాళ్ళ వాళ్ళు దూరంగా వెళ్లిపోయారు- ఎక్కడ సాయం చేయాల్సి వస్తుందో అని- సమాజంలో ఇలాంటివాళ్ళు ఎక్కువమంది ఉన్నారు - నా స్నేహితుడిలాంటి వాళ్ళూ ఉన్నారు.మంచితనంతో బతుకుతూ భగవంతుడి మీద భారం వేయకలిగితే-ఎంత కష్టమైనా జీవితాలు వెళ్లిపోతాయి కొద్ది ఒడిదుడుకులు ఉన్నా కూడా.
నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుంది- ఒక స్థాయిలో ఉన్న మనిషి- కలలో కూడా ఊహించని పరిస్థితుల్లోకి నెట్టబడటం.నిలదొక్కుకోవడం, నిలబడటం, సంసారాన్ని నిలబెట్టడం అనేది అందరివల్లా సాధ్యం అయ్యే పని కాదు.
అలాంటి వాడు నా ఆప్తమిత్రుల్లో ఒకడైనందుకు ఖచ్చితంగా గర్వపడతాను- అతని అనుభవించిన పరిస్థితులకి తల్లడిల్లిపోయినా!
చల్లగా, పదికాలాలపాటు వాళ్ళ కుటుంబం సాగాలని ఆశిస్తూ...
ఎందుకో ఇది మీ అందరితో పంచుకోవాలని అనిపించింది! మనలో మన మాట, నాకు తెలిసిన కొన్ని వందలమందిలోగానీ, సాన్నిహిత్యంగా తెలిసిన కొద్దిమంది సన్నిహితులలోగానీ, నా మిత్రుడు పడ్డ కష్టాల్లో పదిశాతం కంటే ఎక్కువ వారి జీవితాల్లో చవిచూసి ఉండరు- ఒకశాతం అటూ ఇటూగా.ఇలాంటి వాళ్ళ జీవితాలు,వారి అనుభవాలు, దాదాపుగా ఎక్కడో వినివుంటాం గానీ, మనమెవరమూ బాధితులం కాదు- నాకు తెలిసినంతవరకూ.అంటే మనం అందరమూ అదృష్టవంతులము, దేవుడి దీవెనలు ఉన్నవాళ్లమేగా. ఉన్నదానికి, ఉన్నవాటికి, ఉన్నవాళ్ళకి విలువ ఎక్కువ ఇవ్వడం మొదలుపెడదాం మన జీవితాల్లో!
జీవితం అన్నాక కష్టాలు లేకుండానూ, రాకుండానూ ఉండవు “పీత కష్టాలు పీతవి, అంబానీ కష్టాలు అంబానీవి”అలా చెప్పుకుంటే.చిన్నపాటి కష్టమొచ్చినా వగచడం మానేద్దాం, పెద్దకష్టం వచ్చినప్పుడు, ఇలాంటివాళ్ళ గురించి తల్చుకుంటే స్ఫూర్తి కలుగుతుంది.
ఇంతా విన్నందుకు మీ అందరికి నా కృతజ్ఞతలు