రాధా గోపాళం
(“బాపూ రమణల” మీద ఉన్న అభిమానంతో వాళ్ళు నామకరణం చేసిన, అచ్చంగా వాళ్ళ సొంతం అయిన ఈ పేరు నామొదటి కథకు/కధానికకు వాడుకున్నా-పై నుంచి కోప్పడరని ధైర్యంతో)
రాధా-గొపాల్ చక్కటి యువ జంట,అందునా కొత్తగా పెళ్ళైన జంట-కొత్తగా పెళ్ళైన జంటలు ఎలాఉంటారో వాళ్ళుకూడా అలాగే కాలం గడిపేస్తున్నారు.జామ్ జామ్ముగా “శ్రీకాంత్ స్నేహ”లాగా (అదేమిటి వీళ్ళిద్దరూ వచ్చారు మధ్యలోఅనుకుంటున్నారా వీళ్ళిద్దరే కదండీ“రాధా గోపాళం”సినిమాలో నాయికా నాయకులు) చిలిపి తగాదాలు సరాగాలు ఆడుతూ, సరససల్లాపాలతో రోజులు గడుపుతున్నారు ఈ రాధా- గోపాల్ కూడా!
ఇద్దరూ ఉద్యోగస్తులు అవడం మూలాన ఆఫీస్ నుంచి రాగానే చెట్టాపట్టాలేసుకొని రాత్రి భోజనానికి ఏ హొటల్ కో వుడాయిస్తారు,తీరుబడిఉంటే వంటచేసుకుంటారు.
కొత్త జంట అవడం మూలాన స్నేహితులు, చుట్టాలు ఆదివారాలు పండగరోజుల్లో వీళ్ళను భోజనాలకి పిలిచేవాళ్ళు “దీర్ఘ కాలపు వారాంతపు సెలవలు” వస్తే (ఇవి ఏమైనా కొత్తగా పెళ్లి అయినవాళ్ళకి ఇచ్చే సెలవలు అనుకుంటున్నారా;ఇలా ఇస్తే బావుండని కూడా పెళ్లి కావాల్సినవాళ్ళు, కొత్తగా పెళ్లి అయినవాళ్ళు అనుకున్నా అత్యాశ కాదు లేండి“లాంగ్ వీక్ ఎండ్స్” అంటే అర్థం అవుతుంది వీజీగామీకు) ఎంచక్కా చుట్టుపక్కల చూడదగ్గ ప్రదేశాలకు చెక్కేసేవాళ్ళు-అలా కాలం గడుస్తోంది!
ఈ కొద్దిసంవత్సరాలలో వాళ్లకు ఇద్దరు మగ పిల్లలు,ఒక ఆడపిల్ల కలిగారు,కాలం దూసుకుపోతోంది.రాధా- గోపాల్ పూర్తిగా కుటుంబబాధ్యతలతో బిజీ అయిపోయారు ఉద్యోగంతో బాటు-తలములకలయిపోయారు!
ఉన్నతతరగతికి చెందినవాళ్ళు అవడంవల్ల ఆర్ధికఇబ్బందులు ఏమీ లేవు-ఇద్దరూ మంచి ఉద్యోగాల్లో ఉండి నిండు సంపాదనతో ఉన్నారు.పిల్లలకు కావాల్సిన,అవసరం అయినవన్నీసౌకర్యాలు అమర్చారు-అడిగింది కాదనకుండా.పిల్లలు కూడా చాలా మంచివాళ్లు మరియు మెరికల్లాంటి వాళ్ళుఅవడం మూలాన చదువుల్లో కూడా భేషుగ్గా పైకి రాగలిగారు.ఇద్దరబ్బాయిల మధ్య అమ్మాయి అవడంతో ఆడపిల్ల చాలా గారాబంగా పెరిగింది-పెంకిగా అవకుండా.ఇంటికి లక్ష్మీదేవిలా చూసేవారు ఇంటి ఆడపడుచు అని.ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉండటంవల్ల అటు అన్నయ్య ఇటు తమ్ముడు కూడా ప్రేమగా చూసేవాళ్ళు.
రోజులు,సంవత్సరాలు సాఫీగా గడిచిపోతున్నాయి,కాలం పరుగెడుతోంది మనిషి మనసుకు మల్లే-రాధా గోపాల్,ఇద్దరికీ వయసు మీదపడుతోంది.పిల్లల మధ్య పెద్ద ఎడం లేకపోవడం వల్ల చకచకా ఎదిగిపోయారు ఇట్టే.పెద్ద పిల్లాడు పైచదువుల కోసం అమెరికావెళ్ళాడు.అమ్మాయి చదువు అయిపోవడంతో కళాశాల ప్రాంగణంలో వుండగానే ఉన్న నగరంలోనే మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించింది.
కాలేజీ స్నేహితులతో బాటు ఆఫీస్ లో కొత్తగా పరిచయం అయినవాళ్ళతో సినిమాలతో షికార్లతో కాలం చక్కగా గడిచిపోతోంది.అన్నయ్య అమెరికా వెళ్లడంవల్ల తమ్ముడికి తీరిక ఉన్నప్పుడు సినిమాలకు తీసుకు వెళ్ళేది ఇప్పుడు సంపాదనాపరురాలు కదా!
చుట్టుపక్కలవాళ్ళకి, చుట్ట పక్కాలకి ఈర్ష్య పుట్టేంత సుఖంగా ఉంది ఆ కుటుంబం
ఏ దిష్టి తగలకుండా;చాలా తక్కువమందికి భగవంతుడు ఈ అదృష్టం కలిగిస్తాడు.ఇదేనేమో పూర్వజన్మసుకృతం అంటే!
గోపాల్ కి పదిమందిలో మంచిపేరు ఉండటం వల్లా,అమ్మాయి రూపవతి కూడా అవటం మూలాన చాలా పెళ్లిసంబంధాలు రావడం మొదలు అయ్యాయి.ఎవరో తెలిసినవాళ్ళ ద్వారా ఒక సంబంధం రావడం జరిగింది. పిల్లాడు లండన్ లో మంచి ఉద్యోగంలో ఉన్నాడు,మంచి కుటుంబం అని కూడా మధ్యవర్తులు చెప్పడం మూలాన వెంటనే సంబంధం కుదిరిపోయింది-అబ్బాయి అమ్మాయి ఇరువురు ఇష్టపడి సరే అనడంతో అమ్మాయి కొన్నాళ్ళు ఆగుదామని అన్నా,వాళ్ళకి తగ్గ మంచిసంబందం రావడం వల్ల-అమ్మాయికి కూడా నచ్చడంవల్ల పెళ్లికుదరటం,జరిగిపోవడం చకచకా అయి పోయాయి.ఇంట్లో ఆడపిల్ల ఒక్కతే అవడంవల్ల పెళ్లి అంగరంగవైభవంగా చేసారు.
అందరికీ ఓ తీపి గుర్తుగా నిలబడిపోయేట్టు-“పిల్ల అదృష్ట వంతురాలు” అని వచ్చిన వాళ్లంతా అనుకునేట్టు కూడా!!! అమెరికానుంచి పెద్దబ్బాయి పెళ్లికి వచ్చి వెళ్ళిపోయాడు హడావుడిగా- ఎక్కువ సెలవలు లేకపోవడం మూలాన.అమ్మాయి-అల్లుడూ పెళ్ళితర్వాత ఓ పదిరోజులు ఉండి వాళ్ళు లండన్ వెళ్లి పోయారు.
అప్పటిదాకా గలగలా సందడిగా ఉన్న ఆ ఇల్లు ఒక్కసారిగా మూగ బోయినట్లు అయింది.పైపెచ్చు చిన్నఅబ్బాయి చదువు ఇంకో ఏడాదిలో అయిపోతుంది.దానితో రాధా-గోపాల్ కి బెంగ మొదలయ్యింది.వీడు కూడా రెక్కలొచ్చి గడపదాటి వెళ్ళిపోతే ఒంటరివాళ్లం అయిపోతాం అని బిక్కుబిక్కుమంటూ ఇద్దరే ఉండాలని.ఈ లోపు పెద్దవాడి చదువు అయిపోవడం అక్కడే ఒకఅమ్మాయిని ఇష్టపడటం జరిగింది;ఇండియాకి వచ్చి పిల్ల తల్లిదండ్రులుకూడా సరే అన్నతర్వాత అబ్బాయి వివాహం కూడా చేసారు
ఈ వంకన ఇల్లు మళ్లీ కాస్త సందడి అయింది చాలారోజుల తర్వాత అమ్మాయి-అల్లుడు రాకతో.పెళ్లి అవగానే అబ్బాయి-కోడలు అమెరికా వెళ్లిపోయారు.అలాగే అమ్మాయి-అల్లుడు లండన్ వెళ్ళి పోయారు-తల్లిదండ్రులను రమ్మని ఆహ్వానించి!
పిల్లలు మంచి చదువులు చదువుకొని ప్రయోజకులు అయి-వారివారి జీవితాల్లో స్థిరపడితే ఏ తల్లిదండ్రులకైనా అంతకన్నా కావాల్సింది ఏముంది!
అంతా సాఫీగా సవ్యంగా సాగుతున్న రాధ-గోపాల్ జీవిత నౌకలో ఓ చిన్న కుదుపు మొదలయ్యింది.కథలో అసలు మలుపు ఇక్కడ మొదలయ్యింది...
ఇంత సాఫీగా సాగుతున్న కథలో రాధ గురించి పాఠకులకి ముందుగా చెప్పడం జరగలేదు-పాఠకుల్ని ఇబ్బందిపెట్టడం ఇష్టంలేక కధ రసకందాయంగా,సాఫీగా గడిచిపోతోంది అని.
రాధ చాలా పద్ధతిగా, క్రమ శిక్షణగా,అతిశుభ్రంగా ఉండే మనిషి.ఇల్లు కూడా ఎప్పుడూ కడిగిన అద్దంలా ఉండేది.పిల్లల స్నేహితులు,గోపాల్ సహాద్యాయులు స్నేహితులు,రాధ స్నేహితులు,బంధువులు,ఇలా ఇంటికి వచ్చిన అందరూ మెచ్చుకునే వాళ్ళుసహజంగానే- అది గర్వంగానే ఉండేది ఇంట్లోవాళ్ళకి అప్పట్లో.
ఇంట్లోవాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉన్నా,కొన్ని విషయాల్లో చిన్నచిన్నసంవాదాలు జరిగేవి.చివరాకరికి ప్రతీసారీ ఆవిడ మనసు కష్టపెట్టడం ఇష్టంలేక పిల్లలూ గోపాల్ సర్దుకుపోయేవారు-అక్కడ వచ్చింది అసలు చిక్కు.
అది పెద్ద సమస్యగా తయారయింది ఇంట్లోఇప్పుడు-ఇన్నాళ్లు సహనం పాటించిన గోపాల్ రాధకి -చిన్నబ్బాయి కూడా వాళ్ళ అమ్మకి కొద్దిగా చెప్పడం మొదలు పెట్టారు,ఘర్షణల దాకా వెళ్ళేది.ఇలా కాలం సాగుతుండగానే చిన్నబ్బాయి చదువు అయిపోవడం ఉద్యోగం వచ్చివేరే ఊరికి వెళ్లి పోవడం జరిగింది.
ఒకప్పటి యువజంట వార్ధక్యంలోకి అడుగుపెట్టారు.మిగిలింది రాధా గోపాల్ అంత ఇంట్లో!విసుగులు,చిరాకులు పెరిగిపోయాయి.మాటామాటా పెరగడం ఎక్కువైంది.
రాధలో ఒక రకమైన ఒంటరితనం మొదలయింది,దానితో సహనం కూడా పోయింది.
రాధ ప్రవర్తనతో గోపాల్ కూడా సహనం కోల్పోయి అరవడం మొదలుపెట్టాడు- ఆమె ధోరణితో;మీరు ఊహించుకోవచ్చు భార్యాభర్తల మధ్య కీచులాటలు ఎలా మారతాయో చివరకి. చిలికిచిలికి గాలివానగా రూపందాల్చడం మొదలయ్యింది దాదాపుగా ప్రతీరోజూ-ఇద్దరు “అసహనపు సింహాసనం” మీద కూర్చుంటే సఖ్యత ఎక్కడ ఉంటుంది!
చివరికి ఏస్థాయికి చేరిందంటే ఎవరి గదులు వాళ్ళకి అయిపోయినాయి.గోపాల్ ఇంట్లో మేసిలేటప్పుడు పొరపాటున చేయి తగిలినా, మనిషి తగిలినా రాధ విసుక్కోవడం మొదలయ్యింది “చూసుకొని నడవచ్చు గా” అని.అతని పొడ అంటే గిట్టనట్టు అయింది.అవసరం అయితే తప్ప వాళ్ళమధ్య మాటలు మృగ్యం అయిపోయినాయి.గోపాల్ ఆఫీస్ పనిమీద ఊరువెళితే ఫోన్ లో మాత్రం ప్రేమగా మాట్లాడేది.ఊరునుంచి వచ్చిన తర్వాత మళ్ళీ షరామామూలే.
ఈ వింత మనస్తత్వం,తీరు గోపాల్ కి అంతు చిక్కలే.ఎంత సర్దుకున్నా అయిన దానికి,కాని దానికి గోపాల్ మీద చిరాకుపడటం అతను సర్దుకునే స్థాయి దాటి పోయాడు.పిల్లలతో చూచాయగా ఈ విషయం చెప్పాడు.పిల్లలు ఆడిగినప్పుడు అలా ఏంలేదని ఎప్పటిలాగానే ఉన్నానని చెప్పేది రాధ.తర్వాత గోపాల్ తో ఈ విషయమై ఘర్షణ పడేది. “పిల్లలతో కాకుండాఎవరితో చెప్పుకుంటా నామనసులో మాట” అని గోపాల్ బదులు చెప్పేవాడు”-“అక్కడికేదో మిమ్మల్నికష్టపెడుతున్నట్టు పిల్లలకి చెప్పుకుంటూ,నన్నుచెడ్డదానిగా చేస్తున్నారు పిల్లలముందు” అని కొత్త రాగం మొదలయింది.
ఇక భరించే శక్తి-ఓపిక లేక గోపాల్ ఒకరోజు విషయం తేల్చుకోవాలి అనుకున్నాడు రాధతో-ఒకరోజు రాధతో ఇలా అన్నాడు!
“మనం కలసి జీవించడంలేదు,కలిసి ఒకఇంట్లో ఉంటున్నాం ఏ ప్రేమా ఆప్యాయతలు లేకుండా-యాంత్రికంగా.నా పొడగిట్టట్లేదు, నా మాట పడట్లేదు; అయినదానికి కానిదానికి విసుక్కుంటున్నావ్.ఈ వయసులో ప్రశాంతంగా బతకాల్సిన వాళ్లం.భగవంతుడు మనకు ఏ లోపం చెయ్యలా.
అడగకుండానే అన్నీ ఇచ్చాడు.నాకా వయసు పైపడుతోంది.ఇక నాకు భరించే ఓపిక లేదు.బతికనన్నాళ్లు ఇలాగైతే తట్టుకోలేను.నేను వేరే ఇల్లు తీసుకొని ఉంటా.ఎప్పుడయినా వచ్చివెళ్తుంటా,అదీ నీకు సరే అయితే.ఇరుగు పొరుగు అడుగుతారు అనే సంశయం ఉంటే మన అబ్బాయిల దగ్గరకో,అమ్మాయి దగ్గరకో కొన్నాళ్లకు వెళ్ళా అని చెప్పు.ఈవయసులో విడిపోవడం ఇద్దరికీ మంచిదికాదు-ఇది నా కచ్చితమైన అభిప్రాయం”!
“ఏమో నీకు నేను ఎదురుగా కొన్నాళ్ళు కనపడకుండా ఉంటే నువ్వు స్థిమితంగా ఉంటావేమో,నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు.నా దోవన నేను బతికేస్తా ఎలాగో అలాగ.నేనూ ప్రశాంతంగాఉంటా.నేనేదో వ్యాపకంతో నా సమయం పొద్దుపుచ్చుతా; నీలో మార్పువచ్చి నేనురావాలి అనుకుంటే తప్పకుండా తిరిగివస్తా.అలా కాకుండా ఇలాగే జరిగిపోవాలి అనుకుంటే అది సాధ్య కాదు.ఏంచేతంటే నాకు ఇక ఈ వాతావరణం తట్టుకునే మానసిక శక్తి లేదు.పిల్లలకి కూడా ఈ విషయం చెప్పిఅడుగు బయటికి వేస్తా” అన్నాడు.రాధ ఏమీమాట్లాడలా.
ముభావంగా,స్తబ్దుగా ఉండిపోయింది,ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు.
మరునాడు ఉదయాన గోపాల్ తో రాధ ఈ ఏర్పాటుకు,కొన్నాళ్ళ మార్పుకు సరే అంది.పిల్లలకి చాలా ప్రశాంతంగా ఇద్దరూ చెప్పారు.వినటానికి చాలా బాధగా ఉన్నా పిల్లలు ఈ ఏర్పాటుకి ఒప్పుకున్నారు అయిష్టంగానే.వాళ్ళవద్దకు రమ్మన్నారు- రాధా గోపాల్ ఇష్ట పడలేదు,వాళ్ళ దగ్గరకి వెళ్ళటానికి!
గోపాల్ అడుగు బయటికివేసాడు తను అనుకునే కొత్త జీవితంలోకి-చాలా భారమైన హృదయంతో,రాధ వెనుకనుంచి నిర్వేదంతో చూస్తోంది గోపాల్ వంక-లోలోపల గోపాల్ ని ఆగమని చెప్పాలని ఉన్నా నిశ్శబ్దంగా ఉండిపోయింది-ఇందులో తన తప్పేమీ లేదుకాబట్టి!
తిరిగి వాళ్ళు కలిసిఉంటారా!
అలాగే ఉండిపోతారా...విడివిడిగా!
లేదా విడిపోతారా ఎప్పటికీ!
ఈ నిర్ణయం సరి అయిదేనా!
ఇవన్నిటికీ కాలమే మనకు సమాధానం చెప్పాలి.ఇది సమాజంలో కొత్తగా చోటు చేసుకుంటున్నమార్పు-అలా అని ఈ సమస్యని భూతద్దంలో చూపించే ఉద్దేశమూ నాకు లేదు- రాధని దోషిగా చేసే ఉద్దేశ్యం ఏమాత్రం లేదు.అలా ఎవరైనా అనుకుంటే ఈ కథలో రాధ పాత్ర బదులు గోపాల్ ని ఊహించుకోండి.ఇక్కడ నేను చెప్పదల్చుకున్నది “సర్దుబాటు అనేది భార్య భర్త ఇద్దరికి ఉండాలి అని” వయసుతో నిమిత్తం లేదు.ఇది ఎవరి విషయంలో అయినా జరగొచ్చు భార్యా భర్తల్లో!!!
భార్యా భర్తల్లో ఒక్కళ్ళే జీవితాంతం సర్దుకోవాలి అని ఎవరు అనుకున్నా ఇలా జరగడానికి ప్రస్తుత సమాజంలో అవకాశాలు మెండు.ఎందుకంటే పిల్లలు ఎంత మంది ఉన్నా-తల్లితండ్రులను పట్టించుకునే తీరుబడిలేదు- ఎవరికీ కూడా. అలాగని వాళ్ళ భవిష్యత్ వదులుకొని తల్లిదండ్రులను చూసుకోమని చెప్పడం భావ్యంకాదు- రోజుల్నిబట్టి మరియు లోకం తీరుని బట్టి కూడా!
ఇది ఎలాంటి వయసు అంటే, కాలగర్భంలోకి క్రమంగా దగ్గరగా వెళ్లే వయసు ఏ తల్లిదండ్రులకైనా-ఎందుకంటే ఇది జీవితంలో చివరి అంకం!
చివరికి మిగిలేది ఒక్కరే, అప్పటివరకైనా ఇద్దరూ సర్దుకుని కలసిఉంటే ఇరువురూ సంతోషంగా ఉంటారు చివరి వరకూ.పిల్లలు కూడా ప్రశాంతంగా వాళ్ళ జీవితాలు వాళ్ళు బతికేస్తారు- తల్లితండ్రుల గురించి ఏ బెంగా లేకుండా.తెగేదాకా ఎవరూ, ఏదీ లాగకూడదు, పట్టువిడుపులు ఉండాలి నామాటే నెగ్గాలి అనే స్వభావంతో కాకుండా-మరీ ముఖ్యంగా జీవితం విషయంలో.
ఇంట్లో ఉన్న ఈవాతావరణంలో ఒకవేళ కలసి ఉన్నా ఇద్దరూ సుఖంగా ఉండలేరు మిగిలిన జీవితంలో అంతా నిస్పృహే మిగులుతుంది ఇద్దరికీనూ- రోజూ ఉండే గొడవలతో!!!
రాధ కారణాలు రాధకు ఉండొచ్చు-సముచితంగా.పాఠకులు అనుకోవచ్చు రాధకి మొదట్లోనే గోపాల్, పిల్లలు తన స్వభావం గురించి చెప్పి ఉంటే రాధ- గోపాల్ కి ఈ పరిస్థితి కలిగేది కాదేమో అని.కానీ వాళ్ళ కారణాలు వాళ్ళకీ ఉన్నాయి.వాళ్ళ దృష్ట్యా అది కొద్ది సర్దుబాటు వాళ్ళ తరఫున రాధ యెడల.అదీ కాకుండా రాధ అప్పటి ప్రవర్తనకు (PMS) పీ.ఎం.ఎస్.గానీ,మెనోపాజ్ గానీ తోడు అయిఉండచ్చు అనే అవగాహన వాళ్ళందరికీ ఉంటంవల్ల కావచ్చుకూడా- ఈ కారణాలూ కొట్టి పారేయలేం!
ఇంట్లోని ఈ పరిస్థితి- రాధ తన స్వభావం,ప్రవర్తన మార్చుకోవడానికి అవకాశం లేకుండా చేసింది, పైపెచ్చు బలపడి పోయింది కూడా,తన తప్పేమీలేదు అనే భావనతో.అదీ కాకుండా ఈ వయసులో ఆమెకు మారడం కష్టం అనిపించి ఉండొచ్చు కూడా!!
ఇది పైకి చాలా చిన్నగా కనపడ్డా, చాలా సునిశితమైన విషయం ప్రస్తుత సమాజం ఉన్న పరిస్థితుల్లో.నేను రాసినది ఒకటే పరిష్కారం కాదు.ఇలా జరగడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం,ఈ స్పృశింపు!!!
ఇది కధగానే ఉండాలని,భార్యా భర్తలందరూ తుది మలుపు వరకు జీవితాంతం కలిసి ఉండాలనే నా ఆకాంక్ష.
అదీకాకుండా ప్రతీ మనిషి -ఎవరి కారణాలని వాళ్ళు సమర్దించుకోవడం మానవ సహజం.ఏది ఏమైనా వాళ్ళ భవిష్యత్తు అనుకూలంగానే ఉండాలని సుఖాంతం అవ్వాలని ఆశిద్దాం!!!
“జీవితంలోని అసహనానికి మందు సహనమే”-వేరే మార్గమే లేదు!!