బెజవాడ-నా జ్ఞాపకాల దొంతరలు!!!
(ఆత్మ కథ- స్వచరిత్ర్ర- తెలుగు నిఘంటువు ప్రకారం)
ఆ దొంతర్లలో నామదిలో ఈరోజు దొర్లినవి!!
అనగా అనగా, అవి 1977 లో నేను బెజవాడలో ఉన్న రోజులు, లబ్బీ పేటలో మా పిన్నిగారింట్లో ఉండేవాడిని-ఉద్యోగ ప్రయత్నాల కోసం (మాది అసలు కృష్ణా జిల్లాలోని నందిగామ లెండి)
ఎందుకు బెజవాడ అంటే, మాకు దగ్గరా, అందునా ఆత్మీయ బంధువులు వున్నారు ఆశ్రయం ఇవ్వటానికి - నా ఉద్యోగ ప్రయత్నాలకు. అదీ కాకుండా రాజధాని హైద్రాబాద్ చాలా దూరాభారం మారోజుల్లో-అవకాశాలు ఎక్కువగా వున్నా!
ఎదో చిన్నో చితకో ఉద్యోగం చేసే వాణ్ణి అనుకోండి (చిరుద్యోగి నన్నమాట- ఉద్యోగికి తక్కువ, నిరుద్యోగికి ఎక్కువ) ఆ రోజుల్లో చాలా మంది లాగా!
సర్కారీ పరీక్షలు, బ్యాంకింగ్ పరీక్షలు, సర్వీస్ కమిషన్ పరీక్షలు రాస్తుండేవాళ్ళం-ఎక్కడా అదృష్టం మనల్ని లాగికొట్టింది లేదు.ఏం చేస్తాం అదృష్టానికి అదృష్టం లేక మన దగ్గరకి రాలేక పోయింది, పాపం దాని దురదృష్టం!
అందునా నాకు రిజర్వేషన్, రికమండేషన్, మరియు ప్రలోభాలు ఇచ్చే స్థోమత లేదు మరి.చదువు ఒకటే చాలదుకదా ఉద్యోగం రావటానికి మా రోజుల్లో!
మా పిన్నిగారి అబ్బాయి,వాడి స్నేహితులు అందరం కలిసి సాయంత్రం వేళ అలా బిసెంట్ రోడ్ కి వెళ్లే వాళ్ళం లబ్బిపేట్ నుంచి (నడకేనండి మరి!) ముందు నవరంగ్ సినిమా హాల్ కి వెళ్లేవాళ్ళం రోజూ- సినిమాకి కాదండోయ్.
ఆ రోజుల్లో నవరంగ్ టీ, సమోసా ప్రఖ్యాతం,చాలా రుచిగా ఉండేవి (అద్భుతః) ఆ సినిమా హాల్ ఓనర్ (భూపాల్ ప్రసాద్ గారు) చాలా స్ట్రిక్ట్- వాళ్ల స్టాఫ్ తక్కువనుకున్నారా? సినిమా చూస్తూ ఈలవేసినా వార్నింగ్ ఇచ్చేవారు వాళ్ళ స్టాఫ్, మన సీట్ దగ్గిరకి వచ్చి మరీనూ! బెజవాడలో వేరే సినిమా హాళ్లలో ఎక్కడా లేదు ఆ రోజుల్లో!
అలాంటిది, మరి టీ కి, సమోసా కి అంత వీజీగా వదుల్తారా కాంటీన్ కి, అదీ సినిమా మొదలు పెట్టిన తర్వాత!గేట్ దగ్గర సిపాయి - నోటిమీద వేలు వేసి చూపించేవాడు!మేము బుద్ధిమంతుళ్ళలా వెళ్ళే వాళ్లం (మాములుగా మేము అలాంటివాళ్లం కాదండోయ్) అవసరం మనదికదా, అందునా వెధవ జిహ్వ చాపల్యం కూడానూ! రోజూ చూసే మొహాలు కాబట్టి కొద్ది రిలేషన్ తగులడ్డాదిలెండి క్రమేపీ!
అక్కడ నుంచి ఇక బిసెంట్ రోడ్ డ్యూటీ (అంత సీరియస్ గా చేసే వాళ్ళం మరి) అక్కడ కామధేను టెక్స్టైల్స్ అనే దుకాణం వుండేది (ఇప్పుడు ఉందో లేదో?) ఎదురుగా రూపమ్స్ షోరూమ్. అక్కడ నుంచోని మెడను, "ఉషా ఫాన్" లాగా అటూఇటూ తిప్పుతూ వచ్చేపోయే వాళ్ళని చూడటం (వాళ్ళేదో ఇంటికి వెళ్లి బాధ పడతారేమో అని- మేము చూడకపోతే, ఒట్టు అండి నిజ్జం. నమ్మాలి మరి.) వేరే ఉద్దేశాలు లేవు మేము వాళ్ళని చూడటంలో, అయినా మేము అందర్నీ చూసే వాళ్లం కాదు సుమా- అందాల్ని మాత్రమే!!
అనుకుంటారు గాని ఇది ఎంతైనా శ్రమతో కూడుకున్న పని కదండీ…. అందులోనూ బ్రహ్మచారులం కూడాను!మా లాంటి బ్యాచ్ లు ఇంకా తిరుగుతూ వుండేవారు(వాళ్ళు కుర్రకారు లేండి-మాలాగా బాదరాయణ, భాద్యతలు, భవసాగరాలు వాళ్ళకి లేవు) అయినా మాతో కుర్ర కారుకి పోటీ ఏమిటి?
బెజవాడ విశేషాలు, బెజవాడ రాజకీయాలు, దేశంలో, ప్రపంచంలో ఉన్న సంగతులన్నీ మాట్లాడుకునేవాళ్ళం.మంచి విజ్ఞానం పంచే వాళ్ళం, పెంచుకునేవాళ్ళం కూడానూ మామధ్యలో!
ఆరోజుల్లోనే కొద్దిగా హిందీ కూడా నేర్చుకున్నా లేండి!(అన్నీ, మరియు కొన్ని కొత్త విషయాలు నేర్చుకునే వయసాయే!)
కాసేపు అయిన తర్వాత, కొంచెం విశ్రాంతి కోసం, అదే రోడ్డులో ఉన్న మోడరన్ కేఫ్ కి ఆడుగులు పడేవి.ఫలహారాలకి కాదులెండి (అంత బొమ్మలేదు లెండి) త్రీ బై సిక్స్ కాఫీ కోసం! (చిరుద్యోగులం మరియు కొందరు నిరుద్యోగులం కదండీ)
జంధ్యాల గారు ఓ సారి చమత్కరించారు...
ఓ మనిషి కాఫీ తాగుతూ ఏడుస్తున్నాడట, పక్కనున్న వాడు అడిగాడట “కాఫీ తాగుతూ ఎందుకు ఏడుస్తున్నావ్” అని “నా ఆప్తమిత్రుడు పోయాడండి “వన్ బై టూ కాఫీ” అదృష్టం కోల్పాయా” అన్నాడట .ఆ అడిగినవాడు బిక్క చచ్చి పోవడమో, పరారీ అయిపోవడమో చేసి ఉంటాడు లెండి- అది వేరే విషయం. “వన్ బై టూ అనేది అసలు విషయం”!
అక్కడ కూడా మనం ఆస్థానఅతిధులం కాబట్టి ఒకరు ఇద్దరు సప్లయర్స్ నవ్వే వారు మమ్మల్ని చూసి పలకరింపుగా, కొద్ది జాలి జోడించి మరీను!-పబ్లిక్ రిలేషన్ (ప్రజా సంబంధాలు) అప్పటినుంచే అవపొసన పట్టాం అన్నమాట!
ఆరు అర కప్పుల కాఫీ తో బంగాళాదుంపల చిప్స్ ఉచితంగా ఇచ్చేవాడు లెండి “వాసు” అనే సప్లయర్.కాఫీలు కూడా- ఆరు కప్పుల్లో "అర కంటే ఎక్కువే" ఇచ్చేవాడు కూడా. ఏదో ప్రేమా అభిమానం మామీద- జాలితో మాత్రం కాదండోయ్!
అదిగో, అప్పటి నుంచి ఈ టిప్పులు ఇవ్వడం అలవాటు అయ్యింది.ఫలహారాల కోసం, ఆత్మా రాముడు కోసం (అసలు విషయం- ఫ్రీ చిప్స్ మరియు అర కప్పు కంటే ఎక్కువగా కాఫీ ఇచ్చేవాడుగా, అందుకని) ఏది ఏమైనా బ్రతుకు తెరువు నేర్వడానికి అంకురార్పణ జరిగే వయస్సు, నేర్పరి తనం కూడా వచ్చే వయస్సు కదా అది!
ఇక అందరి ఓపికలు అయ్యాక, కళ్లు నెప్పులు పుట్టాక, ఇది అసలు పచ్చి నిజం.మరొటేటంటే, రోడ్ మీద జనంకూడా పలచన అయ్యేవారు.అప్పుడు పదకొండవ నంబర్ (నడక) బస్సులో ఇంటికి చేరేవి ఈ శరీరాలు (ఇంకో విషయం ఏమిటంటే ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు మేము ఎందుకు వెళ్తామో అని. అందుకనే, వాళ్ళుఅప్పుడప్పుడు అడిగేవారు నవ్వుతో- బీసెంట్ రోడ్ విశేషాలు ఏమిట్రా అని!
చాలా శ్రమపడి నడిచివెళ్లి మళ్ళీ నడిచి వచ్చేవాళ్ళమేమో (డ్యూటీ శ్రమ కూడా ఉండనే ఉందిగా) శుభ్రంగా, పూటుగా తిని పడుకునే వాళ్ళం-చదవక్కర్లేదుగా మరి!
ఇదీ రోజు వారి సాయంత్రపు దిన చర్య- దాదాపుగా!
అన్నట్టు ఒక ముఖ్య మైన విషయం చెప్పడం మరిచి పోయా అప్పట్లో నా వాహనం “హంబర్ సైకిల్”, సస్పెన్షన్ స్ప్రింగ్ సీట్ మరియు ఫ్రంట్ లైట్తో -హై ఎండ్ మోడల్ లెండి!
మా పెద్ద మేనమామ కొని ఇచ్చారు- అది నా మొదటి వాహనం!!!
నేనూ, మా బ్రదర్ ఫ్రెండ్స్, మా దర్జీ, సినిమాలు!!!
గవర్నర్ పేట సెంటర్లో నటరాజ్ హోటల్ కి ఎదురుగా “లూనా టైలర్స్” వుండేది, మా దుస్తులు అక్కడే కుట్టిచ్చుకునేవాళ్లం, అక్కడ పరిచయం షేక్ సుభాని.ఆ షాపులో అతను కట్టర్ (జేబులు ఒకటే కాదండి) దుస్తులు కత్తిరించడం అతని పని; బాగా పరిచయం అయ్యాడు, ఆప్తుడు అయ్యాడు, చాలా మంచి హృదయం కలవాడు!
మా స్నేహితుల బృందాన్నికూడా పరిచయం చేశాను, వాళ్లంతా అక్కడ ఖాతాదారులయ్యారు, ఒకరోజు నాతో తన మనసులోమాట చెప్పాడు, సొంతగా షాప్ పెడతా అని- నేను అలాగే అనటం తరువాయి, కొద్ది రోజుల్లోనే “లియో టైలర్స్” అనే షాప్ పెట్టడం జరిగి పొయింది, కాంగ్రెస్ ఆఫీస్ రోడ్డులో.
షాప్ బాగా అభివృద్ధి చెందింది అనతి కాలంలోనే,సాయంత్రానికి అన్ని రకాల స్నేహితులు అక్కడ కలిసేవారు, పిచ్చాపాటికి, "సుభాని షాప్" ముచ్చట్లు డాట్ కామ్ అయ్యింది,ఎవరన్నా కలవాలన్నా అది అడ్డాగా మారి పోయింది, అతను అందరితో ప్రేమగా మంచి పలకరింపుతో ఉండేవాడు.
(అతను స్వర్గస్థుడై పది సంవత్సరాలు అవుతోంది)
అతనితోనో, స్నేహితులతోనో నవరంగ్ సినిమా హాల్ కి ట్రిప్ ఉండేది ప్రతీ రోజూ, దాదాపుగా-సమోసా మరియు టీ కోసం.అక్కడ ఇంకో స్పెషల్ ఐటమ్ ఉండేది, చెప్పడం మరిచా- దిల్ఖుష్ అని- చాలా రుచిగా ఉండేది తియ్యగా; ఒక్కో సారి అందరం షేర్ చేసు కొనేవాళ్లం, డబ్బులు దండిగా ఉన్నరోజున ఫుల్లుగా తినే వాళ్లం అనుకోండి.
ఇప్పుడుకూడా చాలా బేకరీల్లో దొరుకుతుంది-కానీ నవరంగ్ కాంటీన్ లోలా రుచి ఉండదు, ఆ రుచే వేరు- నభూతో నభవిష్యతి!!
నా వసతి మ్యూజియం రోడ్డులో (బెస్ట్ ప్రెస్-ప్రింటింగ్ ప్రెస్) వెనకాల రూంలో వుండే వాడ్ని, అతని షాప్ కి దగ్గర( బెస్ట్ ప్రెస్ వసతి గురించి, దాని కమామీషు ఇంకో సారి వివరంగా చెపుతా నండి. ఆదో పెద్ద కధ లేండి - రాజమౌళి బాహుబలి కంటే!) మూడో, నాలుగో ఎపిసోడ్స్ రాయచ్చు. వేచి చూడండి!
క్లూ ఇస్తున్నా!
(అందులో బాపూ గారి తమ్ముడు-సత్తిరాజు రామనారాయణ గారు- లీడ్ రోల్, బాపు రమణలు, ప్రయాగ రామకృష్ణ. కీర్తిశేషులు విశ్వనాధ పావన శాస్త్రి (కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారి అబ్బాయి) అతిధి నటులు!!! వీళ్ళందరి ప్రస్తావన ఉంటుంది)
ఇక అప్రస్తుత విషయం నుంచి ప్రస్తుత విషయంలోకి వద్దాం!!
మధ్య మధ్యలో “ట్రాక్ మార్చడం” అలవాటు అయింది- "హాస్య బ్రహ్మ జంధ్యాల" గారి ప్రభావం కాబోలు, ఎంతయినా వారి స్వస్థలం కదా ఇది!
నెలలో మేముఇద్దరం కలిసి సగటున పది సినిమాలన్నా చూసేవాళ్ళం-సెకండ్ షో; అప్పట్లో నవరంగ్ థియేటర్ లో ఇంగ్లీష్ సినిమాలు కూడా వచ్చేవి-తెలుగు సినిమాలతో పాటు.లీలా మహాల్లో మాత్రం ఇంగ్లీష్ సినిమాలు మాత్రమే వచ్చేవి- అది పాత బస్ స్టాండ్ కి ఎదురుగా ఉండేది, ఇప్పుడు ఉందో లేదో తెలియదు.
ఇక అసలు విషయానికి వస్తే, ఇంగ్లీష్ సినిమాలు పూర్తిగా అర్ధం అయ్యేవి కాదు- మీకో రహస్యం చెప్పనా- అప్పట్లో అందరికీ ఈ విషయం చెప్పే వాణ్ని కాదు, మీరూ ఇప్పుడు ఎవరికి చెప్పకండి- మదర్ ప్రామిస్ మరి!
ఇప్పుడు కూడా పెద్దగా తేడా లేదనుకోండి, అర్ధం అయినట్టు నటించడం వచ్చింది-అదీ మెరుగు!
అందుకని ఏక్షన్ ఫిల్మ్స్ ఎక్కువగా చూసేవాళ్ళం,మిగిలిన మంచి ఇంగ్లీష్ సినిమాలు చూస్తున్నప్పుడు మాత్రం, జనం నవ్వినప్పుడు మేమూ నవ్వే వాళ్ళం, ఆ అనుభవమే వేరు.
ఇక్కడ ఇంకో విషయం ప్రత్యేకంగా ఉటంకించాలి, సుభాని రక రకాల స్టైల్స్ తో షర్ట్స్ కుట్టే వాడు-ఆ రోజుల్లో ట్రెండ్ ని బట్టి-నా వార్డ్రోబ్ లో పదిహేను నుంచి ఇరవయి జతల బట్టలు ఎప్పుడు ఉండేవి (వార్డ్రోబ్ అంటే వార్డ్రోబ్ కాదు- అల్మారాలో, హంగేర్స్ కి వుండేవి)
అప్పుడు నాసంపాదన నెలకు ఐదువందల రూపాయల లోపే నండి, దర్జాగా బతికే వాణ్ని, మధ్యలో నందిగామ కూడా వెళ్లి వచ్చే వాణ్ణి (1977)
ఫ్రెండ్స్ తో వెళ్లినప్పుడు మాత్రం నేను- క్లెమెంట్ డొమినిక్ అనే ఆంగ్లో ఇండియన్ ఫ్రెండ్ పక్కనే కూచ్చునే వాణ్ని.ఆతను మధ్య మధ్యలో చెవుతుండే వాడు నాకు అర్థం కాని చోట! మా వాడికి సమీప స్నేహితుల్లో ఒకడు మరి! అదీ కాకుండా ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడేవాడు మరి -క్రిస్మస్ రోజు ప్రతీ ఏడు వాళ్ళ ఇంటిదగ్గర చర్చ్ కి, వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్లం కూడా! మా బ్రదర్ ధర్మమా అని బోలెడుమంది మంచి ఫ్రెండ్స్ దొరికారు అందరూ చాలా చాలా మంచి వాళ్ళు-నిజ్జంగా...
మీమీద ఒట్టు!!
అప్పుడే కాస్త ఇంగ్లీష్ మేగజైన్స్, ఇంగ్లీష్ బుక్స్ చదవడం అలవాటు చేసుకున్నా!
గోపాలరెడ్డి రోడ్డులో “ప్రబోధ బుక్ సెంటర్” ఉండేది, ఎరిక్ బేజెండ్ అనే స్విట్జర్లాండ్ ఆయన ఇంఛార్జిగా ఉండేవారు, ఎప్పుడూ నవ్వు మొహంతో,అందులో మా బ్రదర్ మెంబర్. అక్కడ కాస్త గార్డియన్, మరియు ఇతర ఇంగ్లిష్ మేగజైన్స్ చదవడం అలవాటు చేసుకున్నా మావాడి ధర్మమా అని. వాళ్ళు ఇంటికి బుక్స్ తీసుకోని వెళ్ళనిచ్చే వారు (లైబ్రరీ లాగా)
ఇంట్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆసాంతం చదవడం అలవాటు అయింది, 1977 లో కుర్రకారు అంతా జయప్రకాష్ నారాయణ్ ప్రభావంలో వుండే వాళ్లం, అవి ఎమర్జెన్సీ రోజులు కదా.గురుమూర్తి ప్రత్యేక కధనాలు, ఫూన్ఖాను ఫూన్ఖాలుగా, అరుణ్ శౌరీ కాలమ్స్ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వచ్చేవి.
దాంతో బుర్రలో కొత్త విషయాలు చేరడం ఆరంభం అయ్యింది,రాజకీయాలు చర్చించుకునేవాళ్లం- వీటి తాలూకూ క్రెడిట్ అంతా మావాడి ఖాతాలోనే నూటికి నూరు శాతం.
ఇంతకీ వాడి పేరు చెప్ప లేదు కదూ, సుబ్రహ్మణ్య శర్మ. షార్ట్ కట్ గా శర్మ అని;శర్మగా, ఒరే శర్మ అని పిలిచే వాళ్ళం- అందరూ కాదులెండి, సన్నిహితుల వరకే. ఆంధ్రా లొయోలా కాలేజ్ లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుండేవాడు.ఇప్పుడు వాడు నైరోబీ లో ఉంటున్నాడు,ఈ మధ్యే హైద్రాబాద్ లో కలిసాడు కూడా.
హిందీ సినిమాలు అప్పుడు నూన్ షోస్ లో-ఊర్వశి థియేటర్ కాంప్లెక్స్ లో వచ్చేవి (రంభ, ఊర్వశి, మేనక అని, మూడు థియేటర్స్ ఆ కాంప్లెక్లో ఉండేవి) అక్కడా నవరంగ్ కాంటీన్ వాళ్ళ టీ, సమోసా ఉండేదండోయి.“అమితాబ్ బచ్చన్” సినిమా ఆడేటప్పుడు జనాన్ని విరామ సమయంలో (ఇంటర్వెల్) చూడాలి- ప్రతీవాళ్లు టీ కప్పు ఎడమచేతితో పట్టుకొని తాగుతుండేవారు (అమితాబ్ ప్రభావం అంత ఉండేది జనంపై!!!)
ఫ్రెండ్స్ తో శనివారం కానీ, ఆదివారం కానీ వెళ్ళే వాళ్ళం; అప్పుడు ఖలీల్ అనే ఫ్రెండ్ మరియూ మావాడి మధ్యలో కూర్చొనే వాణ్ని! వాళ్ళు చెప్తుండే వారు, నాకు అర్ధం కాని చోటసినిమా మధ్యలో (అబ్బో! మావాడు హిందిలో, ఇంగ్లీష్ లో ఇరగదీసేవాడు- హైదరాబాద్ లో పుట్టి పెరిగాడుగా-మా బాబాయ్ గారి ట్రాన్స్ఫర్ మీద కొన్నాళ్లకు బెజవాడ వచ్చారు)
(ఖలీల్ ప్రస్తావన వచ్చింది కాబట్టి: ఆయన మాకంటే కొద్దిగా పెద్ద వారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థలో పనిచేస్తూ ఉండే వారు- అంటే ఉద్యోగి అన్నమాట!) ప్రతీ యేడాది రంజాన్ టైంలో వాళ్ళ ఇంటికి వెళ్లేవాళ్లం, ఖీర్ అద్భుతంగా ఉండేది, అది మాత్రమే తినేవాణ్ణి-మిగతావి తిననుగా, ఇప్పుడు కూడా అంతే, ఏమిటో!!!
ఆ విధంగా ఇంగ్లీష్ మరియు హిందీ సినిమాలు అలవాటు అయ్యాయి, అర్థం కూడా చేసుకోవడం మొదలయ్యింది.అందునా “బెజవాడ వాళ్లకి కూసంత సినిమా పిచ్చ ఎక్కువే” అనే నానుడి ఉండనే ఉందిగా! మూకుమ్మడిగా "ఆంధ్రా వాళ్ళకి" అనే వారు కూడా- అది ఆంధ్రుల “కళా పోషణ” అని అర్థం చేసుకోలేని మనుషుల అభిప్రాయం, మేము ఎప్పుడూ ఖాతరు చేసిందే లేదు “కలాపోసన లేకుంటే మడిసికి, గొడ్డుకి తేడా ఏవుంటుంది” అని "ముత్యాలముగ్గు" సినిమాలో,”ముళ్ళపూడి”తో రాయించి “రావుగోపాలరావు”తో అనిపించలా “బాపు”!!!
అందుకని విపరీతంగా సినిమాలు చూసే వాళ్లం.ఈ విషయం గ్రహించక మమ్మల్ని హేళన చేయడం!
ఏంటోకానీ,రెండురోజులకి ఒక సినిమా చూస్తేగాని నిద్ర వచ్చిచచ్చేది కూడా కాదు, సరిగా నిద్ర పట్టక పొతే ఆరోగ్యం ఏమయితుంది? ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు కదండీ మన పెద్దవాళ్ళు, వాళ్ళని గౌరవించే జాతి మాదండి!
నేను బెజవాడలో మాపిన్ని గారింటికి వచ్చి సుమారుగా యేడాది అవుతోంది, మా బాబాయ్ గారికి, హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయి, వాళ్ళు షిప్ట్ అయిపోయారు- వాళ్ళ పెద్దమ్మాయి (మా అక్క) వాళ్లు కూడా అప్పుడు బెజవాడలో ఉండేవారు,వాళ్లుకూడా హైదరాబాద్ నుంచి వచ్చినవాళ్లే; నామకాం వాళ్ళింటికి షిప్ట్ అయింది. అక్కా, బావ-వాళ్ల ఇద్దరి పిల్లలత బాటు- నేను జత అయ్యాను,వాళ్ళుకూడా లబ్బిపేటలొనే ఉండేవారు.
మాకు ఒక ఆస్థాన “గూడు రిక్షా” అతను వుండేవాడు, పేరు వెంకటాద్రి, అతని రోజువారీ దినచర్య- స్కూల్ పిల్లల్ని స్కూల్లో దింపడం మళ్లీ తిరిగి తేవడం; (స్కూల్ పిల్లల్ని స్కూల్లోకాక కాలేజీలో దింపుతారా అని వెటకారం చెయ్యకండి)
మా అక్కా వాళ్లకు బాగా పరిచయం, అందునా చాలా నెమ్మదస్తుడు, మంచివాడు కూడా.ఆ రోజుల్లో గూడురిక్షా చాలాగొప్ప-చాలా తక్కువమందికి ఉండే “ప్రత్యేక సౌకర్యం”-కొంతమందికి సొంత గూడురిక్షాలు ఉండేవి;రిక్షాలే కనుమరుగైన ఈరోజుల్లో వాటిగురించి ఏమిచెప్పినా ఇప్పటివారికి బోధపడదు.
మేము ఎప్పుడు సినిమాకి వెళ్లాలన్నా, అతన్ని పిలిచేవాళ్లం, అతని రిక్షాని వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అని పిలిచే వాళ్లం; “వెంకటాద్రి” పెద్ద వాడు, రిక్షా చాలా మెల్లిగా తొక్కే వాడు; వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ కి -ఇతనికి సామ్యం ఏమిటంటే, వెంకటాద్రి మెల్లిగా వెళ్ళేది, మీటర్ గేజ్ పై అప్పుడూ, ఇప్పుడూ కూడా! మా వెంకటాద్రి కూడా మెల్లిగానే వెళతాడు, సందులో అయినా, మైన్ రోడ్ ఆయినా!
అక్కా, నేనూ కానీ, ఒక్కొక్క సారి, పిల్లలతో వెళ్లే వాళ్లం; సినిమా అయ్యేంత వరకు అక్కడే ఉండి మమ్మల్ని ఇంటికి తీసికెళ్లే వాడు-వస్తూవస్తూ బీసెంట్ రోడ్ షాపింగ్ చేసుకొని వచ్చేవాళ్లం “నాడార్స్ కాఫీపొడితో” సహా (ఇప్పటికీ బీసెంట్ రోడ్ లో నాడార్స్ కాఫీ స్టోర్స్ ఉంది)
బీసెంట్ రోడ్డులోనే “గాయత్రీ హోసైరీ సెంటర్” అనే షాప్ ఉండేది (రోజా బనియన్స్) హేమ కుమార్ దాని ఓనర్.మా అక్క- వాళ్ళ కస్టమర్, తనే అతన్నిపరిచయం చేసింది 1977 లో.ఇప్పటికీ మాస్నేహం కొనసాగుతోంది-ఆ షాపు ఇప్పుడు లేదు!
ఎప్పుడైనా మాబావ సినీమాకి వస్తేమాత్రం ఆటోలో వెళ్లేవాళ్ళం-ఆ రోజుల్లో గుర్తున్న ఒక ముచ్చట చెబుతా.అన్నపూర్ణ కాంప్లెక్స్ లో రెండు సినిమాహాళ్లు ఉండేవి అన్నపూర్ణ,శకుంతల-ఇది మినీ థియేటర్.ఈ కాంప్లెక్స్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం.మా పిన్నిపేరు “అన్నపూర్ణ”,మా అమ్మపేరు “శకుంతల”- స్వయానా, సొంత “అప్పాచెల్లెళ్లండి” బాబూ - కొద్దిపాటి “ఎక్కువ” ప్రేమ సహజమేగా!!!
“నాయాల్ది” (నన్ను అపార్థం చేసుకోకండి, ఇది కృష్ణంరాజు డైలాగు) “రెబల్ స్టార్” కృష్ణంరాజు నటించిన “కటకటాల రుద్రయ్య” విడుదల సమయం,ఒక ఆదివారం అందరం ప్రోగ్రాం వేసుకున్నాం.ఎంత ముందువెళ్లినా టిక్కెట్లు అయిపొయాయి.
బావ “బ్లాక్లో” కొందాం అన్నాడు అక్కవారించినా-ఆ టిక్కెట్లతో ఇక్కట్లు వస్తాయి అనుకోలే.స్వర్గంలో ద్వారపాలకుడు లాగా- గేటు దగ్గర ఆపేసాడు.మమ్మల్ని తేరిపారా జాలిగా చూసి, “ఇవి మధ్యాన్నం ఆట టికెట్లు” అన్నాడు.ఏం చేస్తాం, ఈసురోమని, కాళ్ళు ఈడ్చుకుంటూ( పక్కసందే లేండి)మోడరన్ కేఫ్ కి వెళ్ళాం.కనీసం ఏదైనా తిని ఇంటికి చేరుకుందామని.అప్పటి నుంచి బ్లాక్ లో టిక్కెట్లు కొంటే ఒట్టు!!!
బెజవాడలో ఆదివారం సినిమా చూడాలంటే సిఫార్సు గాని,హాలులో తెలిసినవాళ్లుకానీ ఉండితీరాలి టిక్కెట్లు కావాలంటే-“బెజవాడలో ఒక్క సారైనా బ్లాక్ లో టిక్కెట్లుకొని సినిమా చూడని జీవిలేడు” అంటే అతిశయోక్తి అలంకారం కాదండి ఆ రోజుల్లో!!!
తర్వాత రోజుల్లో మా ఫ్రెండ్ “రాజు”ద్వారా “సుబ్రహ్మణ్యం” అనే అతను పరిచయం అయ్యాడు.ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ కంపెనీలో “ప్రతినిధి”గా పనిచేసేవాడు;అప్పటి నుంచీ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ లో మాంచ్చిసినీమావస్తే మాత్రం టిక్కెట్లు గ్యారంటీ అనుకోండి-అతని ధర్మమాఅని “టిక్కెట్ల ఇక్కట్లు” తగ్గాయి!
ఇతర ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా విడుదల అయిన సినిమాలకు కూడా అప్పుడప్పుడు టిక్కెట్లు ఇప్పిచ్చేవాడు.అది ఆ రోజుల్లో ప్రత్యేక సౌకర్యం, సదుపాయం- అందరికీ అందుబాటులో లేనిది.
ఆరోజుల్లో చాలామందికి తెలిసిన విషయం ఇక్కడ ప్రస్తావించాలి-ఇప్పటివాళ్లకి రవంత కూడా ఊహకు అందనిది.తెలుగు సినిమా ఇండస్ట్రీ చెన్నైలో ఉన్నరోజులు అవి.నిర్మాతలు,దర్శకులు,నటీ నటులు,సాంకేతిక వర్గం, పాటల,మాటల రచయితలు,పంపిణీ దారులు,సినిమా హాళ్లయజమానులు-ఒక్కరేమిటి ఆందరూ ఆంధ్రాప్రాంతం వాళ్లే,(ఇప్పుడు ఈమాట అంటే తెలంగాణాప్రాంతం వారికి కోపం వస్తుంది)ఇది ముఖ్యకారణం సినిమాలని కోస్తాంధ్ర ప్రాంతం వాళ్ళు మక్కువతో ఆదరించడానికి.
ఆ రోజుల్లో గాంధీనగర్ లోఉన్నబాబాయ్ హొటల్కి క్రమం తప్పకుండా తరచూ వెళ్లేవాళ్లం,సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చాలామందిని అక్కడే నేను చూసాను.
అక్కినేని, నందమూరి ఎవరు బెజవాడ వచ్చినా హోటల్ మనోరమలో ఎక్కువగా దిగేవారు-ఉదయం “ఇడ్లి, ఉప్మా పెసరట్టు” మాత్రం బాబాయ్ హోటల్ నుండి వెళ్లాల్సిందే.సినిమా పంపిణీదారుల ఆఫీసులు కూడా ఆ ప్రాంతంలోనే ఉండేవి.అది ఒక మరపురాని అద్భుతమైన అనుభవం.
నందమూరి, అక్కినేని కూడా చాలారోజులు-పూర్తిగా పాపులర్ అవకముందు అయ్యుంటుంది బహుశా-బాబాయ్ హోటల్ కి వెళ్ళేవారుట- ఉదయ అల్పాహారానికి,మిగిలిన సినిమా ఇండస్ట్రీ పక్షులు సైతం.బెజవాడలో అందర్నీ “బాబాయ్” అనే ఆప్యాయంగా పిలిచే మాట,బాబాయ్ హోటల్ వల్లే వచ్చి ఉంటుందని ఘంటా పథంగా చెప్పగలను- ఎలాంటి శషభిషలు లేకుండా!
మాకూ “పూర్ణ బాబాయ్” అని ఉన్నాడు (వాడు మాకు వరసకి బాబాయ్ అవుతాడు,మా కంటే చిన్నవాడైనా) మమ్మల్ని చూసి అందరూ నందిగామలో ఊరు ఊరంతా వాణ్ని పూర్ణబాబాయ్ అనేవారు,ఇప్పుడు వాడు బెజవాడలోనే ఉంటున్నాడు.
“జంధ్యాల” బెజవాడ అవటంవల్ల ఆ ప్రేమతో “బాబాయ్ హొటల్” అనే సినీమాయే తీసాడు.ఇప్పటికీ బెజవాడ వెళ్తే ఉదయం బాబాయ్ హోటల్ కి వెళ్లడం ఆనవాయితీ.సుమారు నాలుగేళ్ళ క్రితం అనుకుంటా,బెజవాడ వెళ్లినప్పుడు వెళ్ళాను, పాతతరం అభిమానం,పీకుడుతో!
క్షమించాలి, మిమ్మల్ని అన్నపూర్ణ థియేటర్ దగ్గర వదిలేసి,నేను బెజవాడ కబుర్లతో చుట్ట పెట్టేసాను.ఇక వర్తమానంలోకి వద్దాం(గతంలో వర్తమానం అండీ, 2020 లోకి కాదు)
క్యూలో నిలబడి టిక్కెట్ దొరికితే జీవితంలో ఏదో సాదించామన్న ఫీలింగ్ కలిగేది.ఆ ఫీలింగే వేరు-అమర్ధం (అర్ధం అడక్కండి ఈ పదానికి!!!) నా భావం అర్ధం అయితే చాలు.జంధ్యాల సినిమాలో “సుత్తి వీరభద్రరావు” వాడే డైలాగు లాంటిదన్న మాట.
రాత్రి భోజనాలు అయ్యాక కూర్చోని కబుర్లు చెప్పుకొనే వాళ్ళం, ఎదో ఒక పండుతింటూ!
ఇక్కడ ఒక్క చిన్న తమాషా ఉంది!
ఆరంజ్ తినేటప్పుడు ఎవరి పండులో తొనలు అన్నీ ఎవరికి వాళ్లం, మొత్తం తినేవాళ్లం- ఎందుకంటే కొందరు చెప్పేవాళ్ళు, దానిలో ఒక “అదృష్ట తొన” ఉంటుంది, ఎవరికైనా ఒక తొన ఇచ్చినా మన అదృష్టం పోతుందని.దానికి మా బావ "ఏమీలేదయ్యా, ఎవడో కక్కుర్తి గాడు ఎవరికీ షేర్ చెయ్యడం ఇష్టంలేక ఈ సిద్ధాంతం పుట్టించి ఉంటాడు అని!" ఎప్పుడయినా ఒక తొన అడిగితే, ఇంకో పండు ఇచ్చి, ఆది తినవయ్యా, లేక పొతే నా అదృష్టం నీకు వచ్చేస్తుందని అనేవాడు!
మా అక్క ఎప్పుడయినా అడుగుతూ ఉండేది- ఒరే,బందరు లడ్డు చేద్దామా అని; నేను సరే అనేవాణ్ని-ఇద్దరం కలిసి గబగబా చేసి పడేసే వాళ్ళం;మాకు బందరు లడ్డు చెయ్యడం అంటే చిటికలమీద పని, అంతే! వేరే వాళ్ళయితే, నానాయాతనపడతారు, ఏంచేతంటే వేరే వాళ్ళకి పెద్ద పిండి వంటకమాయే మరి (చిన్నప్పటి నించి ఆ పనీ, ఈపనీ అని కాకుండా ఆందరూ అన్ని పనులూ చెయ్యాలని మాఅమ్మ మా అందరికీ నేర్పింది’ అది మా కుటుంబాల్లో అందరికీ అలవాటుగా మారింది).
అన్నట్టు ఇంకో విషయం- మొట్టమొదట సారి తిరుపతి వెళ్లడం, అక్కా బావా, పిల్లలతోనే- శ్రీవారి దర్శనం తిరుమలలో గర్భగుడిలో అద్భుతంగా జరిగింది; ఒక నిమిషం పైన అక్కడే నుంచున్నాం కూడా! ఎవ్వరూ మమ్మల్ని నెట్టా లేదు,తొయ్యాలేదు! ఆ విధంగా కొన్ని నెలలు గడిచాయి- మా బావకు హైదరాబాద్ బదిలీ అయ్యింది.అప్పుడు మా బావ వాళ్ల ఫ్రెండ్ తో మాట్లాడాడు నా రూం గురించి! నేను కూడా నారూమ్ అన్వేషణలో పడి, వేట మొదలుపెట్టా, మిత్ర బృందం ద్వారా!
సరిగ్గా అప్పుడు మాబావ ఫ్రెండ్(మాబావా వాళ్లు ఉండే ఇంటి ఓనర్, ఆయన పేరు కరణంగారు,పేరే కరణం,తమాషాగా లేదూ!) వచ్చి మ్యూజియం రోడ్లో ఒక రూమ్ ఉందని, అదీ ఆయన సన్నిహితు లైన మిత్రుడుది అని, అద్దె కూడా లేదుఅని (పూర్తిగా ఉచితంగా అన్నమాట ఈ కలికాలంలోఎవరో పేద్దహృదయం ఉన్నవాళ్ళు తప్ప ఇలా ఫ్రీ ఆఫర్ ఎవరిస్తారండి. ఎప్పటికీ జీవితంలో మర్చిపోను రామనారాయణ గారిని!!!)నేను అక్కడ ఉండచ్చని చల్లని వార్త చెప్పారు, నాకు నిజ్జంగా నమ్మబుద్ది కాలేదు! అప్పుడు అనుకున్నా,అదృష్టం అంటే ఇదే అని!
ఇంకో కొస మెరుపు ఏమిటంటే, అది “ప్రింటింగ్ ప్రెస్” అని,దాని వెనకాల రూంలో నేను ఉండచ్చని,అది స్వయానా“బాపూ గారి సొంత (అచ్చంగాఅంటారే,అలాగన్నమాట) తమ్ముడు- సత్తిరాజు రామనారాయణ గారిది” అని- మనస్సులో ఎగిరి గంతు వేసాను. తంతే గారెలబుట్టలో పడటం అంటే ఇదే మరి!!! అదీ “తన్నించుకోకుండానే” మరి!!రెట్టింపు అదృష్టం అంటే ఇదేనేమో!
అలా, మాబావ ధర్మమా అని ఆ రూమ్ దొరికింది! బెజవాడలో అప్పటికే ఏన్నర్ధం గడిచి పోయింది, ఇంటి తిండికి ఇబ్బంది లేకుండా; పిన్ని బాబాయ్ మరియూ అక్కాబావా ధర్మమా అని! వాళ్ళు హైదరాబాద్ వెళ్ళటం, నేను బెస్ట్ ప్రెస్ రూంలో అడుగు పెట్టడం చక చకా జరిగి పోయాయి!
అక్కడ నాకు అద్భుతమైన అనుభవాలు ఉంటాయి అని కలలో కూడా ఊహించ లేదు!!!
నా షార్ట్ హాండ్, టైపింగ్!!!!
పిన్నిగారి ఇంట్లో ఉన్నప్పుడు షార్ట్ హాండ్ నేర్చుకోవాలి అనుకున్నా.నేను అప్పటికే ఇంగ్లీష్ టైప్ రైటింగ్, లోవర్ పాస్ అయ్యి ఉన్నా (నందిగామలో చేశాలెండి)ఆ రోజుల్లో బెజవాడలో షార్ట్ హ్యాండ్ ఆంటే “టాగోర్ టైప్ ఇనిస్టిట్యూట్”, పటమటలో ఉండేది, నేను ఉండేది లబ్బిపేట్.మూడు కిలోమీటర్లలోపే దూరం.అక్కడ చాలా స్ట్రిక్టు అని, బాగా నేర్చుకోవాలి అని, అరుస్తారని,నాగాలు పెట్టటానికి అస్సలు కుదరదు అని మా లబ్బిపేట్ బ్యాచ్ భయపెట్టారు.అయినా మనలాంటి పెద్డవాళ్ళని అరవడం ఏమిటి గురూ వొద్దు అన్నారు.
“గురూ”, “బాబాయ్” అనేవి అక్కడి “ఊతపదాలు”-విపరీతపదాలు కావండి; అలా పిలుచుకొని ఆప్యాయం వ్యక్తంచేసేవాళ్లం కూడా (ఈరోజుల్లో ఆ ఆప్యాయతలు ఎక్కడ ఉన్నాయి లేండి, ఉన్నా,ఎక్కువగా నటనే సుమండీ)నాకు ఎందుకో షార్ట్ హ్యాండ్ మీద మక్కువ,ఏదయితే అదే అవుతుందని, “జై అంజనేయా” అనుకుంటూ ఒక రోజు అక్కడికి వెళ్ళాను.మాస్టారు క్లాస్ లో వున్నారు.వాళ్ళ ఇంఛార్జితో నా “ప్రవర” చెప్పుకున్నా(శ్రీనివాస రావు గారు)
మాస్టారి క్లాసు అయ్యేంతవరకు కూచోమన్నారు,ధైర్యంగా వున్నా ఏదో తెలియని “ఆతృత”,కాదుకానీ,ఇంతకంటే బాగా తగ్గ పదం నాకు స్ఫురించలా!”అన్ఈజినెస్” -అది భయంకాదు!
ఆ సమయం రానేవచ్చింది,ఆయనకు కూడా నా “ప్రవర” చెప్పాను.డిగ్రీ, ఇంగ్లీష్ టైపురైటింగ్ అయి “చిరుద్యోగంకూడా” చేస్తున్నాఅనీ- అవి అన్నీవిని కొంతవరకు సానుకూలంగా మొహం పెట్టారు.అమ్మయ్య అని మనసులో అనుకున్నా;అప్పుడు మాష్టారు- “అంతా బానేవుంది కానీ,మీ లబ్బిపేట్ వాళ్లు బుద్ధిమంతులు కాదయ్యా” అన్నారు.
నేను లబ్బిపేటలో ఉంటున్నాగానీ-నేను అలాంటి వాడ్నికాదనీ చెప్పాను,(ఎలాంటి వాణ్ణి కాదని???)
ఇక్కడో చిన్నగమనిక:
“ప్రవర” అనే పదం రెండుమార్లు వాడాను.అర్ధం కాకపోతే, “సుందర్ పిచాయ్”ని అడగండి-అమెరికాలో ఉన్న ప్రఖ్యాత భారతీయుల్లో ఆయన మీదు మిక్కిలి ముఖ్యుడు.ఆయన తోడు లేకుండా పొద్దురాదు, పొద్దు కుంకదు ఎవరికీ ఈభూమ్మీద-ఒక్క చైనా వాళ్ళకి తప్ప!! మినీ ఇంటర్వ్యూ అయిన తర్వాత,బానే మాట్లాడారు- నాతో ఓకే అన్నారు.
ఎదో నా గొప్ప చెప్పుకోవడం కాదు గానీ-ఇక్కడ నా టాలెంట్ కూడా మీకు తెలియాలి, కొద్దిగా వాక్చాతుర్యం, వినోదభరితంగా మాట్లాడడం నాకు కొద్దిగా ఎక్కువగా వచ్చు (అతిగాకాదు లేండి) కొద్దిగా దానితో కూడా ఇంప్రెస్ అయ్యారని నాఖచ్చితమైన నమ్మిక!
శ్రీనివాసరావు గారు,“డూస్ మరియు డోంట్స్” చెప్పారు-షార్ట్ హ్యాండ్ లోవర్, ఇంగ్లీష్ టైపు రైటింగ్ హయ్యర్ కి చేరిపోయా.
పిన్నివాళ్ళు, అక్కావాళ్ళు వెళ్లిపోయిన తర్వాత మ్యూజియం రోడ్డుకి షిఫ్ట్ అయ్యానని చెప్పాకదా మీతో.అక్కడ నుంచి సుమారుగా నాలుగు కిలోమీటర్ల పైనే ఉండేది- దూరం-రొజూ ఉదయం ఏడుగంటలకల్లా అక్కడ ఉండాలి.షార్ట్ హాండ్,దాని తర్వాత టైపు మళ్ళీ రూముకి సైకిల్తొక్కుకుంటూ వెనక్కి రావడం,ఆత్మారాముడికి నివేదన, చిరుద్యోగానికి పరుగు (చిన్నప్పటినుండి సైకిల్ స్పీడుగా,బాగా తొక్కడం అలవాటువల్ల శ్రమ అనిపించేదికాదు-అందునా హంబర్ సైకిల్ఆయే-పైగా"హైఎండ్"
మోడల్ కూడా!! ఆరోజుల్లో హంబర్ మరియు ర్యాలీ సైకిల్స్ “ఫేమస్”,మరియు గొప్ప కూడానూ-వాటి గొప్పచెప్పటం కోసంగానీ ఎదో నాగొప్ప ఒలకబోయడానికి కాదండీ బాబూ!చిన్న సాహసం కూడా మీ చెవిలో వేస్తా!!!
(సైకిల్ తొక్కడం అంటే గుర్తు కొచ్చింది.నేను బెజవాడ వచ్చిన ఏడాది తర్వాత అనుకుంటా.నేను, క్లెమెంట్ డొమినిక్ అతని ఫ్రెండ్ టెరెన్సు, ముగ్గురం సైకిళ్లమీద బెజవాడ నుంచి నందిగామవెళ్ళి, మళ్ళీ రాత్రికల్లా బెజవాడ వెనక్కి వచ్చాం.
రానూ పోనూ 104 కిలోమీటర్ల దూరం (మా స్వగ్రామం,నందిగామ-52 కిలోమీటర్లు ఉంటుంది.)
ఆ రోజుల్లో మానాన్నగారు సైకిల్ పై నందిగామనుండి గుంటూరుకి వెళ్ళి మరునాడు తిరిగి వచ్చారు,ఒక్కరే 168 కిలోమీటర్ల దూరం రానూపోనూ- ఆయన శక్తి ముందు నేనెంత?అప్రస్తుత ప్రసంగం ఎక్కువ అయింది అనుకుంటా, సరే ఆసలు విషయానికి వచ్చేస్తా!!!
మధ్యాహ్నం రూముకివచ్చి వంటచేసుకునేవాణ్ణి(జీవితంలో “వంట అరంగేట్రం” బెస్ట్ ప్రెస్ లో జరిగింది అన్నమాట!!దానికి తొలి ప్రేక్షకుడు, బాధితుడు రామనారాయణ గారే!
ఈ కథలో ఒక చిన్న పిట్టకధ ఉంది, చదవండి మరి!!!
ఒక సారి నా ఫ్రెండ్ హేమకుమార్- గాయత్రీ హోజైరి సెంటర్ ఓనర్ (గతభాగంలో ఈ పాత్ర ప్రస్తావన తెచ్చినట్టు గుర్తు) “మోషన్స్” అవుతున్నాయి అంటే, బయట భోజనం వద్దు అని నా రూముకి రమ్మన్నా.చారు తింటే మంచిదని ప్రత్యేకంగా చాలా చారు అన్నం తినిపించా అతనితో.మధ్యలో అతను నాతో అన్నాడు “చారు అన్నం తినకూడదు అనుకుంటానమ్మా”అని,ఏం లేదు హేమా తిను అన్నా.ఇకచూసుకోండి పాపం బాత్రూంలో సెటిల్ అయిపోయాడు-ఎదో పొరపాటుగా తెలిసీ తెలియని వైద్యం చేశా అతనికి!
“బెస్ట్ ప్రెస్” బాపూగారి తమ్ముడు- రామనారాయణ గారిది,అని ఇదివరకే చెప్పానుగా.ఆయన చాలా సరదాగా ఉండేవారు, హాస్యం పాళ్లు చాలా ఎక్కువ,పంచ్ లు వేయటం, కనపడీ కనపడని సునిశిత వెటకారం.విపరీతంగా జోక్స్, సంగతులు, అనుభవాలు రంగరించి చెప్పేవారు,ఆయన అశ్రయం,సాంగత్యం దొరకటం నాఅదృష్టం.
ఆయన,నేను కలిసి లంచ్ చేసేవాళ్లం.ఆయన ఇంటినించి భోజనం తెచ్చు కొనేవారు. ఇద్దరం కలిసి నారూంలో కిందకూర్చుని తినేవారం.ఆయన తెచ్చిన పదార్ధాలు నాకు ఇచ్చేవారు, నేను వండినవి ఆయన రుచి చూసేవారు.పాపం నా ప్రయోగాల వంటలకే "భేషుగ్గా ఉన్నాయండి అనే వారు" నన్ను ఉత్సాహపరచడానికి!!
ఇద్దరి భోజనాలు అయిన తర్వాత,కూసంత “పవర్ నాప్” ఉండేది.ఆయన రూంలో- చాలా చల్లగా ఉండేది- ఎయిర్ కండీషనర్ కానీ కూలర్ కానీ లేకుండానే-అందునా "బ్లేజ్వాడ" ఎండలకి!!!ఆయన ఇంటినించి ఓపెద్ద ఫ్లాస్క్ లో టీ తెచ్చేవారు.లక్క పిడతల్లాంటి కప్పులు ఉండేవి,అందులో టీ తాగే వాళ్లం.
షార్ట్ హ్యాండ్ క్లాసులో మాష్టారు చెప్పేటప్పుడు టేప్ రికార్డర్లో పాఠం రికార్డు చేసేవాణ్ణి, అది సాయంత్రం, లేదా రాత్రిలోపు షార్ట్ హ్యాండ్ లో ప్రాక్టీస్ చేసేవాణ్ణి ప్రతీ రోజూనూ!
ఎప్పుడైనా మాఫ్రెండ్ వెంకట్రావు వచ్చేవాడు రూముకి,నేను ఒక పది నిమిషాలు ఇంగ్లీష్ లో ఎక్సర్ సైజ్ చదివేవాణ్ని.అతను షార్ట్ హ్యాండ్ లో రాస్తే కరెక్ట్ చేసే వాణ్ని;తర్వాత నావంతు రాయడం- చెప్పడం అతని వొంతు.బాగా ప్రాక్టీస్ చేసేవాళ్లం,అదిఎంత ముదిరింది అంటే మేము ఇద్దరం అప్పుడప్పుడు షార్ట్ హ్యాండ్లో మాట్లాడుకొనేవాళ్ళం.షార్ట్ హ్యాండ్ లోవర్,ఇంగ్లిష్ టైపు రైటింగ్ హయ్యర్ ఎగ్జాంస్ లో మేము ఇద్దరం పాస్ అయ్యాము.షార్ట్ హ్యాండ్ హయ్యర్ కు క్లాస్లు మొదలుపెట్టారు కూడా-వెంటనే!
ఈ మధ్యలో చాలా కంపెనీ ల ఇంటర్వ్యూ లు అటెండ్ అయ్యే వాణ్ని-ఇక్కడ ఇంకో పిట్ట కధ ఉంది!
ఆ రోజుల్లో “మెడికల్ రెప్రజెంటేటివ్” ఉద్యోగాలు విరివిగాఉండేవి,ఆకర్షణీయంగానూ ఉండేవి.సాధారణంగా వాళ్ళు సైన్స్ గ్రాడ్యుయేట్ లనే తీసుకునే వారు.నేను కామర్స్ గ్రాడ్యుయేట్ అవటం మూలాన నిరుత్సాహ పడకుండా, “జైవీరాంజనేయా” అనుకుంటూ నేనుకూడా ఉద్యోగాలకు దరఖాస్తు చేసేవాణ్ని,చేసిందగ్గరనుంచీ ఎదురు చూడటం-పిలుపు కోసం.
కొన్ని కంపెనీలు ఇంటర్వ్యూ కి పిలిచేవి,గ్రూపు డిస్కషన్స్ దాకా వెళ్ళేవాణ్ని.అక్కడ తెల్లమొహం వేసేవాడిని కాదనుకోండి- నా మొహం తెల్లగానే ఉండేది అప్పుడు, "బ్లేజ్వాడ" ఎండల్లో కూడా”- డింకీ కొట్టే వాణ్ని, ఎదో డిస్కషన్ నడిపించే వాణ్ని అనుకోండి-తెలిసిన టాపిక్ అయితే.చివరలో "థాంక్ యూ మిస్టర్ మూర్తీ, ఉయ్ విల్ కం బ్యాక్ టూ యూ” అనేవాళ్లు" ఏదో లాంఛనంగా మర్యాదకి!
"వాళ్ళు కమ్ము కారని, బ్యాకే అని" వాళ్ళకూ తెలుసు నాకూతెలుసు అనుకోండి అసలు విషయం చెప్పడం మరిచా, ఇంటర్వ్యూకి- “షూ” మరియూ “టైతో” వెళ్లాలాయే,నా దగ్గర అంత సీనూలేదూ, మనకి వాటితో అవసరం లేదు నేను చేసే చిరుద్యోగానికి.ఇంగ్లీష్ సినిమాలు చూసేటప్పుడు ఆదుకునే "క్లెమెంట్ డామినికే" ఇప్పుడూ ఆపద్బాంధవుడయ్యాడు.అతనే ఇచ్చేవాడు,షూ మరియూ టై -మొత్తం రెండు ఇంటర్వ్యూలేలేండి (తర్వాత నా ప్రయత్నాలు విరమించాను-ఫార్మా కంపెనీలలో ఉద్యోగాలకు)
మొదటి సారి, షూ, టై వేసుకోవడం బాగా గుర్తు,అదే గెటప్ లో మానందిగామ “మా బాలాజీ స్టూడియోలో”ఫొటో కూడా తీయించుకున్నా “దేవత వెంకట రమణరావుగారు” దాని ఓనర్ “మా” అని ఎందుకన్నానో "నందిగామ జ్ఞాపకాల శీర్షిక"లో వివరంగా చెపుతా!
(ఓహో వీడెవడో మనల్ని బెజవాడతో వదిలేలాలేడు. వీడు తిరిగిన ఊళ్లు, వీడి జ్ఞాపకాలతో మనల్ని ఉదరకొట్టి, విసిగిస్తానికి నిశ్చయించుకున్నట్టు ఉన్నాడు మహానుభావుడు- అనుకుంటున్నారు కదూ మీ అంతరంగాల్లో-ఆ తరంగాలు నాకు తగులుతున్నాయి)
ఉన్నది చిరుద్యోగం కదా-సినిమాలు, నవరంగ్ టీ, సమోసాలు,ముచ్చట్లు డాట్ కామ్-సుభాని షాప్ దగ్గరా, షరా మాములుగా నడుస్తున్నాయి. వీటితోపాటు, మొహం చాటేసిన అదృష్టం ఎప్పుడు తలుపులు తీస్తుందా అని ఎదురు చూపులతో!
రోజులు అలా ఆనందంగా గడుస్తున్నాయి- “మూడు టీలు - ఆరుసమోసాలుగా”!!!
మాసానికి ఓ పదో, పదిహేనో సినేమాలతోసహా-మరేం లేదండి,కళాపోషణ, ఆయ్-కాదాండి!
మా షార్ట్ హ్యాండ్ మాష్టారు
ఈరోజు మా షార్ట్ హ్యాండ్ మాష్టారు గురించి కొద్దిఎక్కువగా చెప్పాలి, ఆయన ఉండేది “యనమలకుదురు” పటమట నుంచి షుమారుగా మూడు కిలోమీటర్లు ఉండచ్చు, కొద్దిగా ఎక్కువేనేమో కూడా;ఆయన రోజూ ఉదయం ఏడుగంటలకల్లా సైకిల్పై పటమట ఇన్స్టిట్యూట్ కి వచ్చేవారు.ఆయన పిల్లలు- టూ వీలర్,అప్పుడప్పుడు కార్ వాడేవారు, నాకు కొద్దిగా వింతగా ఉండేది,అయినా అడిగే ధైర్యం ఉండేది కాదు.
ఆ ఏరియావాళ్ళు క్లాసుకి వచ్చేవారు, ఆయన అంతే అని చెప్పేవారు వాళ్ళని అడిగితే!
ఆయన కొద్దిగా సీరియస్ గా ఉంటారు,అందుకని అందరికీ భయం మరి- అందునా ఎవరికీ మాట్లాడే చనువు ఇవ్వరుట కూడా మరీనూ!నేనూ కొన్నాళ్ళు గమ్మున ఉన్నాను, కానీ మనసులో కుతూహలం మాత్రం ఉండేది.
మా బ్యాచ్ లో వెంకట్రావ్ ఉండేవాడు,బాగా పరిచయం అయ్యాడు- తర్వాత చాలా సన్నిహితుడు అయ్యాడు.మునుపు ఒకసారి అతని ప్రస్తావన తెచ్చినట్టు గుర్తు-అతనిది కూడా యనమలకుదురే;ఇంకేముంది, వెదకపోయే తీగ కాలికి తగిలింది మరిన్ని వివరాలు తెలిశాయి.
మాష్టారు వాళ్లు శ్రీ మంతులు అని, వాళ్ళకు ఒక ఫ్యాక్టరీ కూడా ఉందని, ప్రతీ యేడాది శివరాత్రి ఉత్సవాలకి వారే పెద్దరికం వహిస్తారని! ఇన్నిఉన్నా, ఆయన “సామాన్యంగా” ఉండటానికే ఇష్ట పడతారని తెలిసింది.షార్ట్ హ్యాండ్ క్లాస్లు అయిన తర్వాత ఫ్యాక్టరీకి కార్లో వెళతారని తెలిసింది (బహుశా దూరం అవడంవల్ల అయి ఉండొచ్చు) ఆయనకి షార్ట్ హ్యాండ్ మీద ప్రేమ, అభిలాష ఉండటంవల్ల రోజూ ఇన్స్టిట్యూట్ కి వచ్చి వెళ్తారుట. మనసులోనే ఆయనని మెచ్చుకున్నాను.గౌరవం ఇంకా పెరిగింది, బెరుకు తగ్గింది, చనువు పెంచుకోవాలి అనే కుతూహలం ఇంకా పెరిగింది.
స్వతహాగా నాది కలుపుగోలు మనస్తత్వం అవడంవల్ల,మెల్లిగా క్లాసు అయిన తర్వాత ఆయనతో కాస్త మాట్లాడం మొదలు పెట్టా!!! క్లాసుమధ్యలో సందర్బోచితంగా డయలాగులు వెయ్యడం మొదలుపెట్టా, దైర్యం చేసి - సానుకూలంగానే ఉండేవారు!
అలా కొద్దిగా చనువు పెరిగింది ఆయనతో,చనువు ఇస్తే చంకఎక్కే రకం నేను.నాతో అప్పుడప్పుడు కబుర్లు చెప్పే స్థాయికి వచ్చారు.ఒకటి,రెండుసార్లు “శివరాత్రి ఉత్సవాలకి” వాళ్ళ ఊరు,వాళ్ల ఇంటికి కూడా వెళ్లాను-ఉత్సవాలు అద్భుతంగా జరిగేవి.
అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఆ ఊళ్లో “గులాబీ తోటలు” బాగా ఉండేవి,దసరా సమయంలో మాఊరు వెళ్ళేవాణ్ణి- మాఊరు వెళ్ళేరోజు తెల్లవారుఝామునే -ఆ ఊరు వెళ్లి గులాబీలు తీసుకునేవాణ్ణి, మమ్మల్నే కోసుకో నిచ్చేవారు.”వంద గులాబీలు పది రూపాయలు”,అందునా “ఎఱ్ఱ గులాబీలు”,నాటువి,మంచి సువాసన వచ్చేవి.అప్పుడప్పుడు వెంకట్రావు పొద్దున్నపూట గులాబీలు తెచ్చి ఇచ్చేవాడు కూడా!!!
మా మాష్టారు గురించి, ఆ రోజుల్లో చాలా తక్కువమందికి,ఈ రోజుల్లో ఎవరికీ తెలియని విషయం ఒకటుంది.బెజవాడలో-అదేనండి విజయవాడలో “డీ.వీ.మానర్” హోటల్ తెలియనివాళ్ళు ఉండరు.ఆ హోటల్ పేరులో రహస్యం చెప్తా మీకు,ఇంత వరకు మామాష్టారు పేరు మీకు చెప్పలా-ఆయన పూర్తి పేరు “ధనేకుల వీర రాఘవయ్యగారు”. ఆయన వాళ్ళ అన్నదమ్ములో పెద్ద.ఈ హోటల్ వెనకాలే “టాగోర్ గారి రైస్ మిల్” ఉండేది (ఇప్పుడు ఉందో లేదో తెలియదు)ఠాగూర్ గారు మా మాష్టారుగారి తమ్ముడు-మా మాస్టారుగారి పేరులో అక్షరాలే “డీ.వీ”!!!
వాళ్ళపిల్లలు భవాని, బుజ్జి,చిన్నబుజ్జి అని ఉండేవారు.సహజంగానే వాళ్ళకి నేను గుర్తుండే అవకాశం లేదు-ఎంతో మంది స్టూడెంట్స్ లో నేనూ వక్కణ్ణి కనుక!
చాలా ఏళ్లతర్వాత మాస్టారుగారిని ఒక్కసారి అనుకోకుండా అదేహోటల్లో కలిసా;
వాళ్ళ చిన్నతమ్ముడు “నాగేంద్ర” హోటల్ వ్యవహారాలు చూసేది!
గత స్మృతులు తలుచుకుంటే కలిగే ఆనందమే వేరు- అవి మీతో పంచుకుంటూ, పెంచుకుంటున్నాఆ ఆనందాన్ని!
“బెస్ట్ ప్రెస్లో”ఉన్నరోజుల్లోనెలకు పదో,పదిహేనో సినీమాలు చూసేవాణ్ణని మీకు చెప్పాగా.ఎప్పటి లాగానే,ఒక రోజు రెండవఆటకి వెళ్లి రూంకి వచ్చాను.సాధారణంగా ఆరు బయట-(బిల్డింగ్ వెనుక వైపు)రోజూ పడుకుంటా.
ఆరోజు పడుకున్న కాసేపటికి ఎదో చప్పుడు అయింది.కళ్లు తెరిచి చూస్తే,దొంగ గోడదూకి వచ్చాడు.నేను అలాగే కదలకుండా పడుకున్నా; వీధిదీపం వెలుతురు తక్కువ అవడంవల్ల, చాపమీద కింద పడుకున్న నన్ను వాడు చూడలేదు. మెల్లిగా నా రూమ్ వైపు వెళ్ళాడు (నా రూం బిల్డింగ్ వెనకాల ఉంటుంది)బహుశా తొంగిచూసి ఉంటాడు-చువ్వల కిటికీలోంచి-నా దగ్గిర ఏముంటుంది కొట్టేయడానికి (బ్రహ్మచారి దగ్గర) అదీకాకుండా అది ప్రింటింగ్ ప్రెస్ ఆయే.ఇల్లులా ఉండే బిల్డింగ్ అవటంవల్ల,వాడు ఇల్లు అనుకోని ఉంటాడు,వచ్చిన దారినే వాడు వెళ్లిపోయాడు.
“బుఱ్ఱ” స్పృహలో ఉండటంవల్లా,నేను కదలకుండా ఉండటం వల్ల,చీకటి కూడా తోడు అవటంవల్లా, నా అదృష్టంవల్లా వాడి కళ్ళపడలా.నేను కొద్దిగా కదిలినా,వాడు అలికిడి విన్నా నాబుర్ర పగలకొట్టడం ఖాయం.
వాడు వెళ్లిన తక్షణం రూంలోకి వెళ్లిపోయా, మర్నాడు రామనారాయణ గారికి ఈ విషయం చెప్పా.ఆయన నన్ను ఇకనుండి బయట పడుకోవద్దన్నారు.ప్రెస్ హాల్ లో ఫ్యాన్ వేసుకుని పడుకోమన్నారు.
నందిగామ ఫ్రెండ్స్ బెజవాడ వచ్చినప్పుడు టైం ఉంటే నన్ను కలిసి వెళ్లేవారు-వీలైతే వాళ్ళతో సినిమాకి వెళ్లేవాణ్ని(బెజవాడలో అంతకంటే కాలక్షేపం ఏముందిఆరోజుల్లో)
ఆ ఊళ్ళో వేరే ఊరునుంచి బంధువులు వచ్చినా వాళ్ళని సినిమాకి తీసుకెళ్లడం ఆఊరు వారికి ఆనవాయితీ ఫణి అని నా “కాలేజ్ మేట్”,మాఅన్నయ్య గోపి అప్పుడప్పుడు బెజవాడ వచ్చినప్పుడు నారూముకి వచ్చేవారు. వీలైతే “రెండు సినిమాలు చూసి - మూడు టీలు తాగి- ఆరు సమోసాలు తిని”వెళ్లేవారు.అప్పుడప్పుడు ఆటవిడుపుగా, మార్పుకు కూడా అనుకోండి“చినార్ రెస్టారెంట్”, (కాంగ్రెస్ ఆఫీస్ రోడ్డులో ఉండేది) “రాజ్ దర్బార్” రెస్టారెంట్ కి (నటరాజ్ హోటల్ దగ్గర ఉండేది)వెళ్లేవాళ్లం,నార్త్ ఇండియన్ ఫుడ్డుకి. రోటీలు,కర్రీలు సలాడ్లు- ఉప్పూ, మిరియాల పొడి, “ఉల్లిపాయ ముక్కలు”, ఎక్స్ట్రా అడిగేవాళ్ళం లేండి.చాలా అద్భుతంగా ఉండేవి లేండి ఆ రుచులు, అనుభవాలూను.
ఆనంద్ అని నాకు చాలా సన్నిహితుడు (ఇప్పుడు లేడు, తొందరపడి దేవుడి దగ్గరకి వెళ్లి పోయాడు) మొదటసారి నారూంకి వచ్చినప్పుడు,సినిమా చూసిన తర్వాత అక్కడే పడుకున్నాడు.రూంలో ఫాన్ లేక పోవడంతో(ప్రెస్ హాల్ లో ఫ్యాన్ తో నేను గడిపేవాణ్ని)నెక్స్ట్ ట్రిప్ లో రాగానే ఒక పెడస్టల్ ఫ్యాన్ కొన్నాడు(ర్యాలీ కంపెనీది)అప్పటినుండీ నారూంలోనే పడుకునే వాణ్ని- ఎవరు వచ్చినా ఇబ్బంది ఉండేది కాదు-గాలికి!
చెప్పలేదు కదా నారూం నవరంగ్ థియేటర్ కి వెనకే ఉందని.ఎప్పుడన్నా రాత్రి వంటకి బద్దకిస్తే, నవరంగ్ కి వెళ్లడం, ఒక దిల్ఖుష్, నాలుగు సమోసాలు,పాలు తాగడం-ఆ దెబ్బకి ఆత్మారాముడు గమ్మున పడుకునేవాడు.
బెస్ట్ ప్రెస్ ముచ్చట్లు-ఈవారం అచ్చంగా బెస్ట్ ప్రెస్ ముచ్చట్లే చెబుతా!!!
“మేరీస్ స్టెల్లా కాలేజ్” బస్స్టాప్ మా ప్రెస్ ముందే ఉండేది,అక్కడ ఒక లెక్చరర్ బస్ ఎక్కేవారు.బస్, ప్రెస్ దగ్గరకు రాగానే “మూర్తి గారు,బస్ వచ్చింది” అని బయట గుమ్మం దగ్గర నుంచి అరిచేవారు.మొదట్లో ఏ బస్సో తెలియక గబగబా బయటికి వెళ్ళా.నేను గుమ్మం దగ్గరికి వెళ్లడం ఆ బస్సు ఆగడం, బస్సులో ఉన్న అమ్మాయిలు అందరూ ఆయన వైపు, నా వైపు చూసి నవ్వేవాళ్లు. నిజ్జం చెప్పొద్దూ,కొద్దిగా సిగ్గుపడి కొద్దిగా నవ్వా -నేను కూడా.
“ఏమిటి సర్ అలా పిలిచారు అని అడిగా” తర్వాత. “కుర్రాళ్ళు కదండీ, ఎదో బస్సు చూస్తారని పిలిచా” అనేవారు.ఆ రోజు నుంచీ, “బస్సు మా ప్రెస్” ముందు ఆగినప్పుడు, యాదృచ్చికంగా నేను ఆ సమయంలో కనపడితే వాళ్లు నవ్వేవాళ్లు కూడా.అక్కడ బస్సు ఎక్కే లెక్చరర్ మాత్రం తీవ్రంగా (“కోపంగా కాదు సీరియస్”గా అన్నమాట) చూసేది ఆయన వంకా, నావంకా -ఆయన మాత్రం అప్పుడప్పుడు పిలవడం మాత్రం మానేవారు కాదు,అదో సరదా!!!
ఆయన విపరీతమైన హాస్యచతురతతో మాట్లాడేవాళ్ళు సాధారణంగాకూడా; అక్కడికి తరచుగా వచ్చేవారిలో “ప్రయాగ రామకృష్ణ గారు”,కీర్తిశేషులు. మహాకవి సామ్రాట్ “విశ్వనాధ సత్య నారాయణగారి” అబ్బాయి “విశ్వనాధ పావనశాస్త్రిగారు” వుండేవారు (ఇప్పుడు ఈయన కీర్తిశేషులు) చక్కటి విషయాలతో సత్సంగం నడిచేది-నేను శ్రోతనే, ప్రేక్షకుడినే సాధారణంగా- పెద్దవాళ్ళ ముందు కుప్పిగంతులు వేయకూడదుగా మరి!!!
ప్రముఖులు ఎవరు వచ్చినా,నన్ను ఆయన ఆఫీస్ రూముకి పిలిచి పరిచయం చేసేవారు.అందరితో నా గురించి బాగా చెప్పేవారు.పైగా ప్రతీవారితో,ఈకుర్రాడు బాగా కష్టపడతాడండి అని కూడా చెప్పేవారు.వాళ్ళందరూ మెప్పుకోలుగా చూసి నవ్వేవారు.నాకు మాత్రం కొద్దిగా ఇబ్బందిగా ఉండేది,సంతోషంగా ఉన్నా.
అదే ఆయనని అడిగేవాణ్ణి, “ఎందుకు సర్ అందరితో అలా చెబుతారు” అని - “వాస్తవమే కదండీ, కష్ట పడుతున్నారు, వచ్చేవాళ్ళు,నాహితులు, సన్నిహితులు కూడా..వాళ్ళు సంతోషిస్తారు కష్టపడేవాళ్ళని చూసి, మరియూ వారి ఆశీర్వాదాలు కూడా మీకు ఉండాలి” అని-”బహుదొడ్డమనసు” ఆయనది.చాలా తక్కువమందికి ఉండేది ఆరోజుల్లో కూడా, ఇహ ఈరోజుల్లో మనుషులగురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిదిలేండి.
మనసులో మాత్రం “బాపూ రమణలు” (వాళ్ళిద్దరిని విడతీయడం కుదరదు కనుక, ఇద్దరి మధ్యా కామా కూడా పెట్టలేదు) ఎప్పుడు బెజవాడ ఎప్పుడు వస్తారు, ఇక్కడికి వస్తారా అని ఉండేది.ఒక రోజు సాయంత్రం నాతో అన్నారు“మూర్తి గారు బాపూ రమణలు రేపు ఇక్కడికి వస్తున్నారని”,నా ఆనందానికి అవధుల్లేవు. వాళ్ళు వచ్చే టైమ్ చెప్పారు,కాకపోతే “ముందు సూచనగా” ముందే చెప్పారు.
“ఏవండీ, మావాడు మాట్లాడడు (అది జగద్విఖ్యాతం అనుకోండి).మీరు ఏమీ అనుకోకండి పరిచయం చేసినప్పుడు, రమణ మాత్రం ఒకటో ఆరో పదం మాట్లాడుతాడులేండి” అన్నారు.వాళ్ళని అంత సమీపంలోఅందునా స్వయంగా రామనారాయణగారి సోదరుడాయే, ఏదో “బంపర్ ఆఫర్” లాగా ఇద్దరు, విడతీయలేని ప్రాణమిత్రుల్ని ఆవిధంగా కలవడం- ఆ అనుభవమే వేరు!
ఇక్కడ రమణగారి ప్రఖ్యాతమయిన ఒక కొటేషన్ స్ఫురణకి వచ్చింది “సృష్టిలో తీయనిది స్నేహమేనోయ్”- అనేది నానుడి-దానికి ఆయన “మేము తీసామోయ్”అని సమాధానంగా రాసారు!
మరుసటి రోజు రానేవచ్చింది,వాళ్ళు వచ్చే సమయమూ వచ్చింది.వాళ్ళు రావడం బయటి వాకిలిలోంచి చూసి,నేను నా రూములోకి వెళ్లిపోయా-వాళ్ళ కళ్ళకనపడ కుండా! కొద్దిసేపు అయిన తర్వాత రామనారాయణగారు నన్ను ఆయన రూముకి రమ్మని కబురు చేశారు.వాళ్ళని అంత సమీపంగా కలవ పోతున్నందుకు-“గుండె నోట్లోకి వచ్చినంత” పని అయింది ఆనందంతో- ఎక్కువ సేపు గుండె అక్కడే ఉంటే “చచ్చి చావం”, అందుకే గుండెని యధాస్థానానికి పంపి నేను వాళ్ళు ఉన్న స్థానానికి చేరాను.
పరిచయాలు అయిన తర్వాత కూర్చున్నా,రామనారాయణగారు అలవాటుగా,
నా మీద ఉన్న ప్రేమాభిమానాలతో నాగురించి చెప్పడం మొదలుపెట్టారు- బాపూ గారు, చిరునవ్వుతోనే, “ఆహా అలాగే”, “ఓహో అలాగా”, “బహు మంచిది”, “సంతోషం” అనే పలు అర్ధాలు వచ్చేవిధంగా హావభావాలు ప్రదర్శించారు- నోరు మెదపకుండా, ఒక్క మాట కూడా రాకుండా- అయినా నేను ఏమీ అనుకోలేదు.రమణగారు మాత్రం బాపూగారి హావభావాలనే నోటితో పలికారు-అదే “వేనవేలు”.
బాపూ రమణలు ఒకే ప్రాణం అంటారుగా-అదే ప్రత్యక్షంగా చూసా-ఆయన మాట్లాడక పోయినా, ఈయన రెండు ముక్కలుమాట్లాడినా; ఇరువురిది అదేభావం, ఆప్యాయంతో కూడిన భావాలు-అంతకంటే ఇంకేంకావాలి!
“చతుర్వేదుల” ఇంటిపేరు కొద్ధిగా ప్రఖ్యాతంలేండిఆ రోజుల్లో,రమణగారు మాత్రం “ఓహో చతుర్వేదుల వారా” అని మెప్పుకోలుగా అన్నారు (పైకి నవ్వినా లోన కొద్దిగానే లేండి- సిగ్గుపడ్డా. పేరులోనే చతుర్వేదాలు, వాటి పేర్లు తెలుసు తప్ప,వేదాలు నేచదవలేదు కనుక)
అదే ఆయనని అడిగేవాణ్ణి, “ఎందుకు సర్ అందరితో అలా చెబుతారు” అని - “వాస్తవమే కదండీ, కష్ట పడుతున్నారు, వచ్చేవాళ్ళు,నాహితులు, సన్నిహితులు కూడా..వాళ్ళు సంతోషిస్తారు కష్టపడేవాళ్ళని చూసి, మరియూ వారి ఆశీర్వాదాలు కూడా మీకు ఉండాలి” అని-”బహుదొడ్డమనసు” ఆయనది.చాలా తక్కువమందికి ఉండేది ఆరోజుల్లో కూడా, ఇహ ఈరోజుల్లో మనుషులగురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిదిలేండి.
మనసులో మాత్రం “బాపూ రమణలు” (వాళ్ళిద్దరిని విడతీయడం కుదరదు కనుక, ఇద్దరి మధ్యా కామా కూడా పెట్టలేదు) ఎప్పుడు బెజవాడ ఎప్పుడు వస్తారు, ఇక్కడికి వస్తారా అని ఉండేది.ఒక రోజు సాయంత్రం నాతో అన్నారు“మూర్తి గారు బాపూ రమణలు రేపు ఇక్కడికి వస్తున్నారని”,నా ఆనందానికి అవధుల్లేవు. వాళ్ళు వచ్చే టైమ్ చెప్పారు,కాకపోతే “ముందు సూచనగా” ముందే చెప్పారు.
“ఏవండీ, మావాడు మాట్లాడడు (అది జగద్విఖ్యాతం అనుకోండి).మీరు ఏమీ అనుకోకండి పరిచయం చేసినప్పుడు, రమణ మాత్రం ఒకటో ఆరో పదం మాట్లాడుతాడులేండి” అన్నారు.వాళ్ళని అంత సమీపంలోఅందునా స్వయంగా రామనారాయణగారి సోదరుడాయే, ఏదో “బంపర్ ఆఫర్” లాగా ఇద్దరు, విడతీయలేని ప్రాణమిత్రుల్ని ఆవిధంగా కలవడం- ఆ అనుభవమే వేరు!
ఇక్కడ రమణగారి ప్రఖ్యాతమయిన ఒక కొటేషన్ స్ఫురణకి వచ్చింది “సృష్టిలో తీయనిది స్నేహమేనోయ్”- అనేది నానుడి-దానికి ఆయన “మేము తీసామోయ్”అని సమాధానంగా రాసారు!
మరుసటి రోజు రానేవచ్చింది,వాళ్ళు వచ్చే సమయమూ వచ్చింది.వాళ్ళు రావడం బయటి వాకిలిలోంచి చూసి,నేను నా రూములోకి వెళ్లిపోయా-వాళ్ళ కళ్ళకనపడ కుండా! కొద్దిసేపు అయిన తర్వాత రామనారాయణగారు నన్ను ఆయన రూముకి రమ్మని కబురు చేశారు.వాళ్ళని అంత సమీపంగా కలవ పోతున్నందుకు-“గుండె నోట్లోకి వచ్చినంత” పని అయింది ఆనందంతో- ఎక్కువ సేపు గుండె అక్కడే ఉంటే “చచ్చి చావం”, అందుకే గుండెని యధాస్థానానికి పంపి నేను వాళ్ళు ఉన్న స్థానానికి చేరాను.
పరిచయాలు అయిన తర్వాత కూర్చున్నా,రామనారాయణగారు అలవాటుగా,
నా మీద ఉన్న ప్రేమాభిమానాలతో నాగురించి చెప్పడం మొదలుపెట్టారు- బాపూ గారు, చిరునవ్వుతోనే, “ఆహా అలాగే”, “ఓహో అలాగా”, “బహు మంచిది”, “సంతోషం” అనే పలు అర్ధాలు వచ్చేవిధంగా హావభావాలు ప్రదర్శించారు- నోరు మెదపకుండా, ఒక్క మాట కూడా రాకుండా- అయినా నేను ఏమీ అనుకోలేదు.రమణగారు మాత్రం బాపూగారి హావభావాలనే నోటితో పలికారు-అదే “వేనవేలు”.
బాపూ రమణలు ఒకే ప్రాణం అంటారుగా-అదే ప్రత్యక్షంగా చూసా-ఆయన మాట్లాడక పోయినా, ఈయన రెండు ముక్కలుమాట్లాడినా; ఇరువురిది అదేభావం, ఆప్యాయంతో కూడిన భావాలు-అంతకంటే ఇంకేంకావాలి!
“చతుర్వేదుల” ఇంటిపేరు కొద్ధిగా ప్రఖ్యాతంలేండిఆ రోజుల్లో,రమణగారు మాత్రం “ఓహో చతుర్వేదుల వారా” అని మెప్పుకోలుగా అన్నారు (పైకి నవ్వినా లోన కొద్దిగానే లేండి- సిగ్గుపడ్డా. పేరులోనే చతుర్వేదాలు, వాటి పేర్లు తెలుసు తప్ప,వేదాలు నేచదవలేదు కనుక)
కాసేపు మౌనంసామ్రాజ్యం చేసింది ఆ గదిలో, తర్వాత కాస్త “టీ” వారితో తాగి,అక్కడ నుంచి నిష్క్రమించా,వారి ఆశీస్సులతో-జీవితంలో మరపురాని అనుభవాల్లో ఇది మరీ ఒకటి.
ఇలా ఎంతోమంది ఆశీర్వాదాలు నాకు లభించడం నాఅదృష్టం!
సత్తిపండుగారు ఎంత సాధారణంగా ఉండేవారంటే-సినిమాలకి వెళ్లినా లైన్లో నిలబడే వారు టికెట్లకు.కొంతమంది హాల్ వాళ్ళు గుర్తుపట్టి దగ్గరకు వచ్చి పక్కకు తీసికెళ్లి టికెట్స్ ఇచ్చేవారు.
రామనారాయణగారు రకరకాల ముచ్చట్లు చెపుతుండే వారు,నరసాపురం అనుభవాలు,మద్రాసు అనుభవాలతో సహా. సత్కాలక్షేపం,విజ్ఞానానికి విజ్ఞానం, వినోదానికి వినోదం.కొదవే లేదు ఆ హాస్య సామ్రాజ్యపు ప్రాంగణంలో!
ఒక చిన్న“మచ్చుతునక”-అదేదో మీరూ ఆస్వాదించండి మరి!!!
ఆయన స్నేహితుల్లో ఒకతనికి ఓ “ఊతపదం“బూతుపదం” కాదండీ బాబూ ఉండేదిట “వాడుకొని ఇవ్వు” అని ఈయన అతనితో ఒక రోజు బయటికి వెళ్ళినప్పుడు ఇంకో స్నేహితుడు కలిసాడుట,అతని భార్యతో.అతని పెళ్లికి “ఇతగాడు” వెళ్లలేదుట వీలు కుదరక.ఇతడు, అతడి పెళ్లికి రాలేదు కనుక వాళ్ళావిణ్ణి పరిచయం చేస్తూ “ఒరేయ్ ఈమె మాఆవిడరా”అన్నాడుట!
ఇతగాడు అలవాటుకొద్దీ, ఏమరుపాటుతో “వాడుకొని ఇవ్వు” అన్నాడుట,
ఈఆసన్నివేశాన్ని,అక్కడ వాళ్ళ హావభావాలని మీఊహకే వదిలేస్తున్నా,
ఆకొత్తగా పెళ్లిఅయిన“ప్రాణి” ప్రాణం ఏమయిఉంటుందో ఊహాతీతం!!!
హతోస్మి!!!
కొత్తగా పెళ్ళిఅయిన ఫ్రెండ్ జంట ఖంగుతిని, మొహాలు మాడ్చుకొని ఇంటిబాట పట్టారు.వాళ్ళ నిష్క్రమణతో-రామనారాయణగారు ఇతగాణ్ణి అడిగారుట! “అదేంటిరా అలా అనేశావ్”అని “ఏదోఅలవాటులో పొరపాటు సత్తిపండు అన్నాడుట “తెర వెనక”-అతగాడి ఇంట్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా పేలిందిట.తర్వాత ఇతగాడు,అతగాడి ఇంటికి వెళ్లి,ఫ్రెండ్ భార్యని కాళ్ళావేళ్ళా బతిమాలి, లెంపలేసుకుని క్షమించమన్నాడుట.చిన్నదైనా,పెద్ద మనసుతో క్షమించి పారేసింది ఇతగాడిని ఆ “మహాఇల్లాలు”.
తర్వాత వారి స్నేహం“పాండీ బజార్, పనగల్ పార్క్” లాగా సాగిపోయాయి అనేది తర్వాత విషయం-ఏంచేతంటే ఇది జరిగింది “మద్రాస్ లో” కాబట్టి!!!
రామనారాయణగారి ముద్దుపేరు “సత్తి పండు”,మీకు చెప్పనేలేదుగా.అది “స్నేహితులు,చుట్ట పక్కాలు” మాత్రమే పిలవడానికి హక్కు ఉన్నది.
నేను అందులో “ఏతరగతికి చెందిన వాణ్ని కాదుగా” మరి,కానీ అలా పిలవాలని “కుతి” ఉండేది!
(కుతి అనే పదం అసలు సక్రమమైన అర్థంతో ఉన్న పదం-“గరికపాటి”వారు కూడా ఇదే విషయం చాలాసార్లు చెప్పేవారు.“బాషా దౌర్భాగ్యం” మూలాన దానికి నానార్ధాలు చేర్చి పెడర్ధాలు ఇచ్చారు, ఆ పదాన్ని వాడుకభాషలో చొరవగా వాడుకోవడానికి లేకుండా చేశారు)
ఒక్కసారి మాత్రం సత్తిపండుకి,గారు జోడించి “సత్తిపండుగారు” అని అన్నట్టు లీలగా గుర్తు ఈ “లీల” ఎవరూ అని కూపీ తీయకండే!
“అడ్డరోడ్డులో”నా అనుభవాలు!!!!
ఈమారు బెజవాడకి“కూత వేటు” దూరం కాకపోయినా “అరుపు వేటు”దూరం కాకపోయినా-పదినిమిషాల ప్రయాణం అనుకోండి.బెజవాడ అంధకారంలోకి వెళ్లకుండా వెలుగులు చిమ్ముతూ ఉండటానికి కారణమైన ముఖ్యప్రదేశం.
ఇంకా అర్ధంకాలా!!!
ఇబ్రహీంపట్నం-అదేనండి “అడ్డరోడ్డులో”ఉన్న“విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్- కాలనీ” అనుభవాలు ముచ్చటిస్తా మాస్వగ్రామం “నందిగామ”అని మునుపే చెప్పేసాగా,నందిగామనుండి బస్సులో బెజవాడకి వచ్చేటప్పుడు అడ్డరోడ్డు వచ్చేది,ఇప్పుడు కూడా వస్తుందనుకోండి.
ఆ ఊరేమీ జరగలేదుగా,రాకుండా ఉంటుందా అని మీరు ముక్కులమీద, ముక్కుల్లో వేళ్లు వేసుకోకండి నేనేదో విడ్డూరంగా మాట్లాడుతున్నానని.
హైవేలు వెడల్పు చేసినప్పుడు ఎన్ని ఊళ్లు పక్కకి జరగలేదండి- కదా మరి!
చిన్నప్పుడు ప్రయాణం చేసినప్పుడల్లా అడ్డరోడ్డుకోసం ఎదురుచూసేవాళ్లం జామకాయల కోసం,పెద్దగా, తియ్యగా,ఎక్కువ గుజ్జుతో,తక్కువ గింజలతో, బహు రుచిగా ఉండేవి.కిటికీలచుట్టూ జాంపళ్ల బుట్టల వాళ్లే;జనం ఎగబడి కోనేవాళ్లం- బస్సు ఆగిన తక్షణం- బెల్లంచుట్టూ ఈగల్లాగా!
ఈ ఉపమానం “అటుది ఇటుగా -ఇటుది అటుగా” మార్చండి-ఈగలమైన మేము బస్సు దిగలేము కనుక బెల్లం మాదగ్గర కొచ్చిందన్నమాట. అంతేగానీ “అమ్మేవాళ్ళు ఈగలు” అని నాఅభిమతం కాదు.ఇలా ఉపమానంతో వ్యాఖ్యానిస్తే మీకు ఆజామకాయలగురించి బాగా బోధపడుతుందని నా తాపత్రయం.అంతేకానీ, ఏదో నాబాషాప్రదర్శన కోసం మాత్రం కాదండోయ్.
ఏదో ఎర్రబస్సులు వాడేవాళ్లం, మట్టిరోడ్డున చిన్నతనంలో చెప్పులు కూడా లేకుండా ఆ భూదేవిని తాకుతూ పెరిగినవాళ్ళం స్కూలుకి వెళ్లేవరకు. ఎంతైనా ఈ భూమి బిడ్డలం కదండీ-మీరు కూడా ఇప్పుడైనా, అప్పుడప్పుడుచెప్పులు లేకుండా భూమాతని పలకరించండి,పులకరించిపోతుంది.
పప్పు చెక్కలు, వేరుశెనగ ఉండలు, నువ్వుండలు,నూజీళ్ళు,మిఠాయి కొమ్ములు, కరకజ్జం తినే మమ్మల్ని ఆక్షేపించారు-నోళ్లు వెళ్ళబెట్టుకుని, చిన్నచూపు చూసేవాళ్ళు.అలాంటిది ఇప్పుడు బస్తీవాళ్ళుకూడా,ఆనోళ్ళతో నోరారా అవే స్టయిల్ గా తింటున్నారు,ఆరోగ్యం అని ఊదరకొట్టేస్తున్నారు.
చెప్పులు లేకుండా నడవటం నామోషీ కాదండి- మీలాగా పట్నాల్లో, బస్తీల్లో, పెద్ద పెద్ద నగరాల్లోపుట్టిన వాళ్లం కాదండోయ్.ఆరోగ్యం అని “గూగులు” గాడు చెపితే ఏదైనా చేసేస్తారు, కిందపడి “డేకేవాళ్ళు” ఉన్నరోజులాయే మరి.
మాఊరునుంచి బెజవాడ దగ్గరఅవటం మూలాన తరుచూ వెళుతువుండేవాళ్ళం ఏదో పనిమీద.నేను ఎక్కువగా వెళ్ళేవాణ్ణి,ఎందుకంటే ఇంటర్ మీడియట్ చదువుతున్నప్పుడు కూడా,లాగూ వేసుకొని “హాఫ్ టిక్కెట్టుతో” బెజవాడ వెళ్ళేవాణ్ణి.రైలుప్రయాణం చేయాలన్నాబెజవాడలోనే ఎక్కాలిగా మరి,అప్పుడు-ఇప్పుడు కూడా అనుకోండి.
“వి.టీ.పి.ఎస్” కట్టిన తర్వాత అక్కడ ఉద్యోగులకోసం కాలనీలు వెలిసాయి, బాగుండేవికూడా-మరీ ముఖ్యంగా “హిల్ టాప్ గెస్ట్ హౌస్”ఇందిరాగాంధీ ఆరంభించింది;స్వర్గీయ “నార్ల తాతారావుగారు” చేశారు ఈ ప్రాజెక్ట్ అని అందరూ చెప్పుకునేవారు.
కాలనీ గురించి వినేవాళ్లం,ఎందుకంటే అవి అడ్డరోడ్డునుంచి కొండపల్లికి వెళ్లే దారిలోఉండేవి-ఒకసారి అదేపనిగా వెళ్లి చూశాం. చాలా బాగుండేవి క్వార్టర్స్, విశాలంగా,గుడి, హిల్ టాప్ గెస్ట్ హౌస్,వాకింగ్ స్పేస్, పెద్ద రోడ్లు,ఆడిటోరియం వగైరా,ఇందులో ఉంటే ఎంత బాగుండునో అని అనిపించేది.
కొన్నేళ్ళకి అనుకోకుండా మాకోరిక తీరింది,గట్టిగా అనుకుంటే అయిపోతాయి అనుకోకుండా కొన్ని జీవితంలో (సంకల్ప బలం).ఏమిటో నాజీవితంలో చాలావరకు “సంకల్పం” చేస్తే అయిపోయేవి- “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమాలో అంజలి అంటుంది చూడండి “ఏమో నాకు అన్నీ తెల్సి పోతాయి” అని, అలాగన్నమాట!
మా పెద్దబావకు హైదరాబాద్ నుంచి “వి.టీ.పి.ఎస్.కు” అయింది,ఆయన “ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థ ఉద్యోగి”-ఆ సమయంలో “మింట్ కాంపౌండ్” ఆఫీస్ లో పనిచేసేవారు.
వాళ్ళు హైద్రాబాద్ నుంచి రావడం,వాళ్ళకి పెద్ద క్వార్టర్స్ దొరకడం జరిగింది;నేను అప్పుడు బెజవాడలోనే ఉండేవాడిని.వారానికి,రెండు వారాలకి ఒకసారో అక్కావాళ్ల ఇంటికి వెళ్ళేవాడిని- సాధారణంగా వారాంతాలలో.అప్పుడు,1992 అనుకుంటా; మాపెద్ద మేనల్లుడు అమెరికాలో“ఎం.ఎస్”చెయ్యడానికి వెళ్లేప్రయత్నాల్లో ఉన్నాడు ఈ రోజుల్లో “జీ.ఆర్.ఈ” రాయడానికి స్టడీ మెటీరియల్, కోచింగ్ సెంటర్లు, గైడెన్సు, కన్సల్టెంట్స్ ఇలా అన్ని సౌకర్యాలు ఉన్నాయి-అరచేతిలో ఉసిరికలా;ఆరోజుల్లో అలాకాదు, “ఎం.ఎస్”కి తయారవడం కష్టం,వెళ్లే గలిగేవాళ్లు,వెళ్ళేవాళ్లు బహు అరుదు.వాడు “కృతనిశ్చయంతో,ఏకాగ్రతతో” ప్రిపేర్ అయ్యేవాడు.“బ్రిలియంట్ అకాడమీ-మద్రాస్” నుంచి “స్టడీ మెటీరియల్” తెప్పించుకునేవాడు,వాళ్లకు ప్రెస్క్రైబ్డ్ ఫీ కడితే పంపించేవారు.ఇంగ్లీష్ పై “పట్టుకోసం”,ఇంగ్లీష్ వార్తలు చూడటం,ఇంగ్లీష్ సినిమాలు చూడటం (టి. వి లో)-రేడియోలో ఇంగ్లీష్ వార్తలు వినడం చేసేవాడు.
నేను వారాంతాలలో వెళ్ళినప్పుడు కొద్దిగా వాడికి డిస్ట్రబెన్స్ ఉండేది.కానీ వాడికి ఆటవిడుపుగా ఉండేది అనుకోండి కొద్దిగా.అప్పుడు నాకు సుమారుగా 34, 35 ఏళ్ల వయసు ఉండేది,మంచిగా అరిగించుకునే శక్తి ఉండేది.మా అక్కేమో రెండురకాల టిఫిన్లు చేసి పెట్టేది. “ఒరేయ్ ఇంకా ఆకలిగా ఉంటే బయటకు వెళ్లి తినండి” అనేది,మేనల్లుడు,నేను కలిసి అడ్డరోడ్డులో హొటల్ కి వెళ్లేవాళ్లం.
తినడానికి, అరిగించుకోవడానికి కష్టపడింది ఎప్పుడూ లేదు,చులాగ్గా, సులభంగా జరిగి పోయేవి రెండూనూ.“రాళ్లు అరిగించుకునే వయసు”,జీర్ణశక్తి ఉన్నా“రాళ్లు మాత్రం” ఎప్పుడూ ట్రై చేయలా-ఏదో అది సామెతవరకే వాడాను.
ఇంటికివచ్చి చిక్కటి గేదెపాలు పోసేవాళ్ళు,కాఫీ పొడి “నాడార్స్ కాఫీ పౌడర్ బెజవాడ” నుండి, ఇంక ఫిల్టర్ కాఫీ రుచి వాసనా ఊహించుకోండి.కాఫీ సేవనం ఎక్కువగా ఉండేది ఆ రోజుల్లో- మిగిలిన సేవనాలు అలవాటు లేదుగా మరి అపుడూ- ఇపుడూనూ!!!అక్కావాళ్ల ఇంట్లో, అందునా చిక్కటిపాలాయే మరి!
బెజవాడనుంచి ఎప్పుడు అక్కావాళ్ళ ఇంటికి వెళ్లినా,వెళ్లేముందు ఫోన్ చేసి “నాడార్స్ కాఫీ పొడి తేవాలా” అని అడిగేవాణ్ణి. “కాఫీగత ప్రాణం” కదా మరి “అన్నగతప్రాణంలా!నిజ్జం చెప్పొద్దూ, వాళ్ళింట్లో సగం కాఫీపొడి నాకే ఖర్చు అయ్యేది.
వాడు కష్టపడ్డ ఫలితం “వోహాయో విశ్వవిద్యాలయం” లోఎం.ఎస్ లో ప్రవేశం దొరికింది.ఇది ఎప్పటి సంగతి 1992 లో అనుకుంటా.మేమందరం,అంటే చాలా చాలామంది హైద్రాబాద్, బేగంపేట విమానాశ్రయానికి వెళ్ళాం వాడికి వీడ్కోలు పలకటానికి.మా కుటుంబంలో “పై చదువుకి” వెళ్లిన మొట్టమొదటి వాడాయే మరి; గొప్ప ఆనందం అందరికి,ఇప్పుడు వాడు “ఫిలడెల్ఫియా” లో స్థిరపడ్డాడు.
“పవర్ ప్లాంట్” కూడా రెండుసార్లు చూసాను మా బావతో- ఒకసారి పగలు, రెండోసారి రాత్రిపూట వెలుగులలో.రెండవసారి చూసినప్పుడు మా చిన్నబావ కూడా మాతో ఉన్నారు.ప్లాంట్ అంతా చూసిన తర్వాత “రాముడు,మీరు తయారుచేసే విద్యుత్ మీ ప్లాంటులో లైట్లకే సరిపోయేట్టు ఉందే”అన్నారు అన్ని లైట్లు చూసి!
మీకు చెప్పనేలేదు కదూ,మా పెద్దబావ పేరు రామమూర్తి-పెద్ద బావా,రెండో బావా వరసకి అన్నాతమ్ములులేండి.
మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి ఇక్కడ!
బహుశా ప్రతీ ఆంధ్రునికి తెలుసు “కొండపల్లి” ఎక్కడ ఉందో, బొమ్మలకు ప్రఖ్యాతి అని,ఆ సమయంలో చాలా సందర్భాలలో మేము కొండపల్లి బొమ్మలనే కానుకలుగాఇచ్చేవాళ్లం.
బొమ్మలుచేసే కళాకారుల ఇండ్లకి వెళ్ళి ముందుగా ఆర్డర్లు ఇచ్చేవాళ్లం,బొమ్మల తయారీ కూడా చూసేవాళ్ళం.ఆదరణలేక వాళ్ళు జీవితాల్నినెట్టుకొస్తున్నారు. మీరూ బెజవాడ వెళ్లినప్పుడు అటువెళ్లికొ న్ని బొమ్మల్ని కొనండి మీకు తోచినన్ని - వాళ్ళుపడే కష్టం, కళలపై వాళ్ళకి ఉన్నప్రావీణ్యం, అనాదిగా వాళ్ళ పూర్వీకులనుండి వస్తున్న ఆ కళని బతికించుకోవాలనే వాళ్ళ తాపత్రయం కళ్ళకి కనపడతాయి ప్రత్యక్షంగా-వైజాగ్ దగ్గర ఉన్న “ఏటికొప్పాక” బొమ్మల కళాకారుల లాగా!
అలా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అడ్డరోడ్డు తగులుతుంది కదా,జామకాయలు తినడం మరువకండి.అప్పటి రుచి ఉండదంటారా-అయినా సరే!ఆ రోజుల్లో మనసులు,రుచులు-అభిరుచులు ఇప్పుడు మనుషుల్లోనే మారినప్పుడు,ఇప్పటి జామకాయల రుచి మారదా మరి.
ఇక్కడ ఒక సంఘటన వివరిస్తాను నాకు బాగా గుర్తు ఉన్నది! ఎప్పటిలాగానే ఒకరోజు సాయంత్రం కాలనీకి వెళ్ళా-అక్కావాళ్ళ ఇల్లు తాళంవేసి ఉంది.పక్కవాళ్లు చెప్పారు, కాలనీలో ఏదో సాంస్కృతిక కార్యక్రమాలు అవుతుంటే అక్కడకి వెళ్లారన“మీరు ఎందుకు వెళ్ళలేదు” అని అడుగుదామనుకుని విరమించుకున్నా, మనసు మార్చుకుని “మేము కూడా వెళ్తే మీకు ఈ సమాధానం చెప్పేవాళ్ళు ఉండరని”,అని అంటారని, కొద్దిగా “హాస్యంతోకూడిన వెటకారంతో”-వాళ్ళు“తూగోజి” వాళ్లండిబాబు.
ఇక సభాస్థలికి వెళ్ళా,అంతమంది జనంలో వీళ్ళని పట్టుకోవడం ఎవరితరం కాదు.
అలాఅని గమ్మున నేనూ కార్యక్ర మాలు చూద్దాం అంటే అవి ఎప్పటికి “తెములుతాయో” అని భయం-“డి.వి.సుబ్బారావు హరిశ్చంద్ర నాటకంలా”!!!
అక్కడ ఉన్న ఆర్గనైజర్ తో మైక్ లో అనౌన్స్ చేయించా,జరుగుతున్న ఒక కార్యక్రమం అయిన తర్వాత.
“రామమూర్తి గారు- మీరు ఎక్కడఉన్నా సభావేదిక దగ్గరకి రావాలని,మీ బావ మరిది ఇక్కడ ఉన్నాడని”. అంతే- కథ సుఖాంతం!మేము కాస్సేపు తర్వాత ఇంటి బాటపట్టాం,అందరి కళ్ళు ఆ రామమూర్తి గారి మీదా నా మీదే మరి!!
“ఉపాయం లేని వాణ్ణి ఊరునుంచి తరిమేయమని”ఒక సామెత ఉండనే ఉందిగా; అదృష్టం ఏమిటోగానీ నేను ఏ ఊరు వెళ్లినా నన్ను ఎవరూ తరమలా-దేవుడి దయ అలాగుంది!
మా మేనమామ సూరి రామకృష్ణ శాస్త్రి గారి గురించి...
ఈ వారం 1948 లో బెజవాడ విశేషాలు,అదీ మా మేనమామ గురించి...
మాతరంలో ఉన్న బెజవాడలో ఉన్నవాళ్ళకి కూడా చాలామందికి తెలియదు, తెలియకపోవచ్చు కూడా!
మా పెద్ద మేనమామ“సూరి.రామకృష్ణశాస్త్రి” 1941 నుంచి 1946 వరకూ బొంబాయిలో (ఇప్పుడు ముంబాయి గానీ, అప్పుడు బొంబాయే)టామ్కోలో పనిచేసేవారు- టాటా ఆయిల్ మిల్ కంపెనీ (TOMCO)
చెన్నైలో ఇల్లూ అదీ ఉంది, ఇప్పటికీ కూడా;బెజవాడలో సోప్ ఫ్యాక్టరీ పెట్టే ఉద్దేశ్యంతో ఉద్యోగానికి రాజీనామా చేసి బెజవాడ, పోరంకిలో 1948 లో నాలుగు ఎకరాలు కొన్నారు-ఎకరం ఖరీదు “అక్షరాల ఆరువేల రూపాయలు”.ఆతర్వాత ఇంటికోసం 1952 లో ఇంకో రెండు ఎకరాలు కొన్నారు-“ఎకరం పదివేల రూపాయలకి”.
నాలుగేళ్లలో 3500 రూపాయలు ఎకరానికి పెరిగింది-కామయ్యతోపు తర్వాత, పోరంకి ఊరు మొదలులో,మైన్ రోడ్డుమీద.
1951 లో ప్రొడక్షన్ మొదలుపెట్టారు,పేరు వసంత్ సోప్ వర్క్స్ -మా అత్తయ్య పేరు వసంత.డేటర్జెంట్ సోప్ పౌడర్,సోప్ బార్, బాడీ సోప్ (పిఎర్స్-pears సోప్ లాగానే) ఉండేది.
ఆ ప్రాంతంలో మొట్టమొదటి ఫోన్ వాళ్లదే, మొట్టమొదటి “సబ్ పోస్ట్ ఆఫీస్” అక్కడే ఉండేది,వాళ్ళ ప్రాంగణంలో-వసంత్ నగర్ పోస్ట్ అనేవారు.ఇప్పుడు ఆ పేరు మార్చిఉండాలి,బస్సులవాళ్ళు“సబ్బుల ఫ్యాక్టరీస్టాప్”గా పిలిచేవారు.ఆ రోజుల్లో కార్లు తక్కువ ఉండేవి,మామయ్యావాళ్ళకి ఆస్టిన్, స్టాండర్డ్ మరియు ఫియట్ కార్లు ఉండేవి.ఇప్పటికీ 1963 లో కొన్నఫియట్ కార్ వాళ్ళ బెంగళూరు (మారమణ బావ)ఇంట్లో ఉంది గుర్తుగా.
ఫ్యాక్టరీ ఫోటోలు,ఇంటి ఫొటో,మా మామయ్య ఫోటోలు కూడా పోస్ట్ చేస్తున్నా.
ఆ రోజుల్లో మామయ్యకు ఇద్దరు ఆప్తమిత్రులు ఉండేవారు-ఒకరు “క్రాంప్టన్ కంపెనీ సత్యనారాయణ” గారు,రెండోవారు “రావుల రాఘవరావు” గారు.వీరికి “మనోరమ హోటల్” ఎదురుగుండా “రావ్ సన్స్” అనే పెట్రోలు బంక్ ఉండేదిట.దాని పక్కనే ట్రావెల్ ఏజెన్సీ కూడా ఆయనకే ఉండేదిట. ఇప్పటి “అప్సరసినిమా” హాల్ పక్కన కాక,పక్కన ఇల్లు “లాయర్ చక్రవర్తి” గారిది, మామయ్యవాళ్లకు ఆప్తమిత్రులు వారి కుటుంబం అంతా.
(ఆ రోజుల్లో ఊహించడానికి అవకాశం లేని విషయం,భవిష్యత్తులో సత్యనారాయణ గారి మనవరాలితో మా మామయ్య పెద్దమనవడితో వివాహం జరుగుతుందని-అది జరిగింది 2006 లో-మా పెద్దబావ రమణ పెద్దకొడుకు వినోద్ కి, సత్యనారాయణగారి మనవరాలు సంధ్యతో.అందరికంటే అమితంగా సంతోషించింది మా అత్తయ్యే-ఏంచేతంటే సత్యనారాయణ గారిభార్య మా అత్తయ్య ప్రాణస్నేహితురాలు మరి)
కొన్నిఏళ్లు ఫ్యాక్టరీ బాగానే నడిచింది,క్రమేపీ వివిధకారణాలవల్ల డేటర్జెంట్ పౌడర్ కే
పరిమితమయ్యారు.ఆరోజుల్లో నాకు గుర్తున్నంతవరకూ “బె స్టో డ్రై క్లీ నర్స్ షాప్” మోంటెసోరి కాలేజ్ సందు మొదట్లో, “ఆకాశవాణి” కేంద్రానికి ఎదురుగా మైన్ రోడ్డులో ఉండేది;వాళ్ళు, హొటల్ మనోరమ, హోటల్ మమత,వెల్కమ్ హోటల్-గాంధీనగర్.కొన్నాళ్ళు హోటల్ ఎస్కిమో కూడా ఉండేది వీళ్లు పెద్ద కస్టమ ర్లు. (ఇన్స్టిట్యూషన్ కస్టమర్లు)
1974 ఆ ప్రాంతంలో మా బావ “సూరి వెంకటరమణ”, ఆయన భార్య ఆ వ్యవహారాలు చూసేవారు;సుమారుగా రెండో,మూడో సంవత్సరాలు ఉన్నారు.వాళ్ళు సినిమాలు చూడాలంటే పటమట దగ్గర. వాళ్ళు ఎక్కువగా “మోహన్ దాస్ చిత్ర మందిర్” సినిమాహాల్లో ఎక్కువగా చూడటానికి ఇష్టపడేవాళ్ళు,హాలు చాలా విశాలంగా ఉండటం మూలాన.బాల్కనీ టికెట్ రెండు రూపాయల ముప్పయి పైసలు. (రూ.2.30 పైసా) కొత్త సినిమాలకి టౌన్ కి వచ్చివెళ్లేవాళ్లు.అప్పుడప్పుడు లబ్బిపేటలో ఉన్న మా పిన్నిగారింటికి వచ్చేవారు,మేమూ పోరంకి వెళ్తుండేవాళ్ళం.
మెయిన్ రోడ్ నుంచి ఎంట్రన్స్ ఉండేది ఇంటికి,ముందుగా మామిడిచెట్లు, పెద్ద పూలతోట ఉండేది,కొబ్బరి మామిడికాయ చెట్టుకాయ తీయగా,పెద్దగా- చెట్టు చిన్నదిగా ఉండేది,ఇల్లు రెల్లుతో కప్పిఉండేది, ఆశ్రమ వాతావరణం అనిపించేది.
ఇంటివెనకాల వరిపొలం ఉండేది-ఇల్లు-పొలం కలిపి రెండు ఎకరాల్లో ఉండేది-ఇల్లు చాలా విశాలంగా ఉండేది!
మద్రాస్లో మా మామయ్యకు ఇల్లు ఉంది అని చెప్పాగా, చాలామందికి తెలియని ఒక విషయం ఇక్కడ ప్రస్తావిస్తా...
ఎన్టీఆర్ మద్రాస్ వెళ్లి సినిమాల్లో వేషాలు వేస్తున్న కొత్తల్లో ఆయన,ఇంటి నంబర్ పదకొండు విజయరాఘవాచారి రోడ్డులో అందులో ఒకవాటాలో అద్దెకు ఉండేవారు.ఆ భవంతి పేరు రిపబ్లిక్ గార్డెన్స్-టి.నగర్ లో ఉంది అది-మామయ్యగారి పక్క ఇల్లే.ఇప్పుడు రిపబ్లిక్ గార్డెన్స్ బిల్డింగ్ లేదు,ఆ వీధిలో మాత్రం మార్పు లేకుండా చెక్కు చెదరకుండా ఉన్న భవంతి ఇప్పటికీ అదే మమయ్యా వాళ్ళ ఇల్లు.
ఆ రోజుల్లో విజయరాఘవాచారి రోడ్డు అనేవారు,కొన్నేళ్ల క్రితం విజయరాఘవ రోడ్డుగా మార్చారు, ఇంటి నంబర్లతో సహా.
ఆయనకి (NTRకి) బయటవాళ్లు ముఖ్యమైన ఫోన్లు చేయాలంటే మా మామయ్యావాళ్ళ నెంబర్ కి ఫోన్ చేసేవారు.మామయ్యావాళ్ళు ఎన్టీఆర్ కి కబురుపెట్టి ఆయన వచ్చే సమయానికి మళ్ళీ వాళ్ళు ఫొన్ చేసేవారు - అవతలవాళ్ళు;క్రమేపీ ఆయనచిత్రసీమలో ఎదిగిన తర్వాత అదే వీధిలో సొంతగా ఇల్లు కట్టుకున్నారు- కాంతారావు కూడా అదే వీధిలో ఉండేవారు.
ఇంకో విషయం-ఎన్టీఆర్ వివాహం,మా మామయ్య వివాహం ఒకేరోజు జరిగాయి.
మమయ్యావాళ్ళ పెళ్ళి శుభలేఖ దొరకలేదు గానీ,ఎన్టీఆర్ పెళ్లి శుభలేఖ చిక్కింది.
పోస్ట్ చేస్తున్నా!
అదే పదకొండవ నంబర్ ఇంట్లో.శ్రీ రంజని, ఎస్వీ రంగారావు, తర్వాత దశకాల్లో చిరంజీవి,వాళ్ల ఇద్దరు మిత్రులతో అదే రిపబ్లిక్ గార్డెన్స్ లోఅద్దెకు ఉన్న సంగతి చాలామందికి తెలుసు.
అత్తయ్య- మామయ్య షష్టిపూర్తి కి సుముఖత చూపించక పోవడంవల్ల వాళ్ళ పిల్లలు వాళ్ల “ఇంటికి షష్టిపూర్తి” చేద్దామని కొత్త ఆలోచనతో 2012 లో మద్రాస్ లో ఉన్న ఇంటికి వేడుక చేశారు.ఇది ఎవరికి రాని ఆలోచన, చాలామంది మెచ్చుకొన్నారు.
బి.ఎన్ రెడ్డి గారు, ఆయన సోదరులు అదేవీధిలో మమయ్యావాళ్ళతో ఇళ్ళు కట్టుకోవడం జరిగింది.బి.ఎన్ రెడ్డి గారి కుటుంబం మామయ్యగారి కుటుంబాలు బాగా చిరపరిచయస్తులే,ఇరువురి పిల్లలు పాఠశాలల్లోకలిసి చదువుకున్నారు. ఇప్పటికీ కొంతమందితో సాన్నిహిత్యం గా ఉంటారుట కూడా!
ఇక మళ్ళీ పోరంకి,బెజవాడ కబుర్ల లోకి వస్తా.
1969 ప్రాంతంలో వసంత్ సోప్ తయారు ఆపేశారు;ఫ్యాక్టరీని “మహికో సీడ్స్కి” అద్దెకి ఇచ్చారు,1980 ప్రాంతంలో ఫ్యాక్టరీని అమ్మేశారు.ఇల్లు,పొలం కలిపిన రెండు ఎకరాలు 1990 వరకు ఉన్నాయి-అక్కడే డేటర్జెంట్ తయారీ అయ్యేవి.ఫ్యాక్టరీ స్థలం,ఇల్లు పొలం స్థలం అన్నీ సిద్ధార్థ విద్యా సంస్థల వారికే అమ్మేశారు.
1980 ప్రాంతంలో “స్టేన్స్ టైర్స్” కోయంబత్తూరు వాళ్ళు అనుకుంటా, టైర్స్ రిట్రీడింగ్ ప్లాంట్ పెడదాం అని ప్రయత్నాలు కూడా చేశారు ఏంచేతనో అది పడలా.దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఉన్న ఫ్యాక్టరీ స్థలం అమ్మేయాలంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది.
కాలం ఆగదు కదా మనకోసం గబగబా పరుగెడుతూ 2020లో పడేసింది.మామయ్య 2014 ప్రాంతంలో స్వర్గస్థులయ్యారు.ఇప్పుడు అత్తయ్యతోపాటు మద్రాసు ఇంట్లో మా పెద్దబావ తోడుగా ఉంటున్నాడు.రెండవ బావ ముంబాయి నుంచి,మా మామయ్య గారి అమ్మాయి-మా వదిన- అమెరికానుంచి వచ్చివెళ్తూ ఉంటారు క్రమం తప్పకుండా. మావదిన అమెరికాలో (1971 నుంచి) ఎప్పుడో స్థిరపడి పోయారు.ఏదో హైద్రాబాద్ బెజవాడ మధ్య తిరిగినట్టు మూడు నెలలకో, మహా అయితే ఆరు నెలలకోసారి మద్రాసు వచ్చివెళుతుంది- ఇప్పుడు కూడానూ.
మా మామయ్య వాకింగ్ ఎన్సైక్లోపీడీయా, చాలా విషయాలు,సంగతులు తెలుసు.
నేను ఉద్యోగరీత్యా మద్రాస్ లో మూడేళ్లు ఉన్నాను.వారంలో కనీసం రెండు రోజులన్నా కలిసేవాణ్ని.ఎన్నో తెలియని విషయాలు ఆయన దగ్గర నుంచే తెలుసుకున్నా,ఆయనకు తెలియని విషయం ఉండేది కాదు. పుస్తకాలు బాగా చదివేవారు కూడా.విషయ పరిజ్ఞానం,ఇతరులకు చెప్పే విధానం అద్భుతం-నిఘంటువు లాంటి వారు, జ్ఞాపక శక్తి అమోఘం-స్వాతంత్య్రం ముందు మనిషి అవడం మూలానా, మద్రాస్ లో ఉండటంవల్లా.
ఆయన పుట్టిన ఊరు నిడదవోలు అవటం మూలాన,ఆ రోజుల్లో “నిడదవోలు సంగతులు, ఆయన జ్ఞాపకాలు” అని ఓ పుస్తకం చేతితో రాశారు.అచ్చు వొత్తలేదు ఇప్పటికీ, ఎదో ఆయన తృప్తికి రాశారు పుట్టిన ఊరు మీద ఉన్న ప్రేమ అభిమానంతో!!
ఒక్క సంఘటన ఆయన చెప్పిన వాటిల్లో ఇక్కడ ఉదాహరిస్తా ను...
ఒక సారి కోయంబత్తూరునుంచి మద్రాస్ వెళ్లే రైలు,బయలు దేరే టైం అయినా స్టేషన్ నుంచి బయలుదేరలా.అందులో కూర్చున్న ఇద్దరు బ్రిటిష్ అధికారులు అది గమనించి రైల్వేఅధికారుల్ని కారణం అడిగారు;ఆ రైల్వే అధికారి సమాధానంగా “ప్రకాశం పంతులు గారు వస్తున్నారు అందుకనే రైలుని ఆపాము” అని.
ఆ సమాధానం విని ఆ బ్రిటిష్ అధికారులు మారు మాట్లాడకుండా తిరిగివెళ్లి పోయారట.అది ప్రకాశం పంతులుగారి మీద-బ్రిటిష్ ప్రభుత్వానికి, అధికారులకు, సిబ్బందికి ఉన్న గౌరవానికి ఓ మచ్చు తునక-మనం అయితే ఆయన ఎవరో మర్చేపోయాం!
ఇలాంటి ఎన్నో విషయాలు మామయ్య కబుర్లలో దొర్లేవి,అందుకని చాలా ఇష్టంగా వెళ్లేవాడిని.మామయ్య సాధారణంగా వసారాలో ఉండేవారు-ఎప్పుడూనూ.ఆయన్ని చేయిపట్టి పలకరించినప్పుడు ఆత్మీయంగా దగ్గరకు తీసుకునేవాడు;ఆత్మీయులతో నాకూ ఆ అలవాటు ఉండటంవల్ల ఆ స్పర్శలో ఒకరికి ఒకరం ఆ విధంగా ప్రేమ పంచుకునేవాళ్లం. ఏమో మామయ్య నుంచే ఆ అలవాటుగా- మారిందోమో నాకు!!!
తర్వాత లోపలకు వెళ్ళి అత్తయ్యని చేయిపట్టి పలకరించేవాడిని-ఆవిడ పూజలో లేకుండా ఉంటే.పూజగదిలో ఉంటే పలకరింపుగా నవ్వేసి,దేవుడికి ఓ దండం పెట్టేసి వసారాలో మామయ్యతో “ముచ్చట్లు డాట్ కామ్లో” పడిపోయేవాళ్లం.క్షణాల్లో కాఫీవచ్చి చేతిలోవాలేది- అత్తయ్య సూచన మేరకు.మళ్లీ అక్కడనుంచి వెళ్లేలోపు “ఏరా ఇంకో కాఫీ తాగుతావా అని అడిగేది”.నేను “అవును” అని చెప్పే లోపే ఇంకో కాఫీకి వంటవాడికి పురమాయించేది.ఉట్టి కాఫీ కాదుగా-ప్రేమా ఆప్యాయతలతో నిండిఉండేది- కప్పు నిండా-గుండెలనుండి అది కప్పులోకి వచ్చేది!
నేను ఎప్పుడు ఆఫీస్ పనిమీద మద్రాస్ వెళ్లినా రైల్వేస్టేషన్ నుంచి మాకంపెనీ అతిధి గృహంలో బస.మొహం కడుక్కోవడం అక్కడ,కాఫీకి మమయ్యావాళ్ళింటికి వెళ్లడం రివాజు-మామయ్యావాళ్ళ ఇల్లు అక్కడనుంచి ఐదు,ఆరు ఇళ్ల అవతల,మద్రాస్ ఆఫీస్ లో చాలామందికి ఆఇల్లు తెలుసు.ఒక్కోసారి మద్రాసు ఆఫీస్ కి పనిమీద ఫోన్ చేసినప్పుడు వాళ్ళు అంటుండేవారు-“ఈరోజు అటువేపుగా వెళ్ళాం,మీ మమయ్యావాళ్ళు వసారాలో కనిపించారు అని”
పర్యవేక్షకుడు (కేర్ టేకర్) అడిగేవాడు “చాయ్ బనానా, మామా కా ఘర్ జాయేగా కాఫీ కే లియే”అనేవాడు.నేను నవ్వి తల ఊపేవాణ్ని“నాష్టాకో ఆయేగా” అనేవాడు “హా” అని వెళ్లేవాడిని,అత్తయ్య టిఫిన్ చెయ్యమని ఎప్పుడు అడిగినా ఇదే చెప్పేవాణ్ని-ఒక్కొక్క సారి టిఫిన్ తినేవాణ్ని అక్కడ.
మా అత్తయ్య గత 34 ఏళ్లుగా “శార్వాణి సంగీత సభ” అనే సాంస్కృతిక సంస్థని దిగ్విజయంగా నడుపుతోంది.ప్రతిఏడాది పెద్ద దిగ్గజాలు, గాయకులు,నాట్య కళా కారులు,సంగీత విద్వాంసులు, కచేరీలు చేసే వారు.వాళ్ళకి సన్మానాలు జరిగేవి.
ఒక ముఖ్యమైన విషయం...
సాక్షాత్తు పరమశివుని అంశగా భావించే “అరుణాచల శ్రీరమణ మహర్షి” ప్రధమ శిష్యురాలు,భక్తురాలు శ్రీమతి సూరినాగమ్మగారు స్వయానా మా ఈఅత్తయ్యకి మేనత్త.
ఇల్లు తాజా ఫోటో పోస్ట్ చేస్తున్నా,ఆ రోజుల్లో విజయ రాఘవా చారి రోడ్డు అనేవారు. కొన్నేళ్ల క్రితం విజయ రాఘవ రోడ్డుగా మార్చారు,ఇంటి నంబర్లతో సహా.
నాకు తెలియని వివరాలు, విశేషాలు, ఫోటోలు మాబావ రమణ ఇవ్వడం జరిగింది నా ఈ జ్ఞాపకాలను మీ ముందు ఉంచడానికి, తనకి కృతజ్ఞతలు-క్రెడిట్ తనకే మరీ!
ఉంటా మరి,మళ్లీ రవివారం కొత్త విశేషాలతో మీ ముందుకు వస్తా.అంతవరకు నా ఈ జ్ఞాపకాలకు విరామం.ఈ లోపల నా బుఱ్ఱకు, మనసుకు తోచింది వారం మధ్యలో చెబుతుంటా ఎప్పటి లాగే- షరా మామూలే.
మిమ్మల్ని విసిగించడం మాత్రం ఖాయం నా రాతలతో.ఇదెక్కడి మా తలరాత అనుకుంటే గమ్మున మీ “చరవాణిలోని తపాలాడబ్బాలో” పడగానే “తొలగించు” అనే “బొత్తామ్ ని” నొక్కండి (మీకు తప్ప నాకు తెలియదుగా) నారాతలు మాయం అవుతాయి క్షణంలో.-అమృతాంజన్ రాసుకుంటే నెప్పి క్షణాల్లో మాయం అయినట్టు
(అమృతాంజన్ ఖర్చు మీదే నండి-నా సూచన గమనించక పొరపాటున మీరు చదివితే మాత్రం)
బెజవాడ ఫుడ్డు-సినిమాలు!!
బెజవాడ ఫుడ్డుకి- భోజనాలకి- శాఖాహారం, మాంసాహారం కూడా, టిఫిన్లకి సినిమాలకి,రాజకీయాలకి ప్రసిద్ధి; ప్రపంచంలో ఉన్న తెలుగువాడికి బెజవాడ తెలియకుండా ఉండదు ఇప్పటికికూడా.
“ఎస్.ఆర్.ఆర్.కాలేజ్” దగ్గర,మాచవరం డౌన్ లో ఉన్న “పేరయ్య మెస్” గురించి చెప్పకపోతే చాలా మిస్ అయిపోయినట్టే ,సంపూర్ణం కానట్టే, బెజవాడ జ్ఞాపకాలు.
గడ్డపెరుగు- కమ్మనిది, పచ్చళ్ళు,ఊరగాయలు,చిక్కటి నెయ్యి,కొసరి కొసరి అడిగి మరీ వడ్డించేవారు.వేసవికాలం ఊరగాయరోజుల్లో “కొత్త ఆవకాయ” నూనెవోడుతూ ఉండేది ఇరగదీసేవాళ్లం;మామూలు రోజుల్లో “రోటి పచ్చళ్ళు” “పొడులు”మామూలే.
కానీ “కొత్త ఆవకాయ”ముందు వీటిని కొద్దిగా చిన్నచూపు చూసేవాళ్లం.“ఎన్నాళ్ళు ఈ బడాయి, ఆవకాయ పాతపడగానే మేమే గతి అన్నట్టు ధీమాగా చూసేవి, తగ్గేది లేదు” అన్నట్టు!!
ఒక్కొక్కసారి నేను “హోండా మోటార్ సైకిల్ పై” పొద్దున్నేటూర్ కి బయలుదేరేవాణ్ని.హీరో హోండా ప్రవేశపెట్టిన రెండూ మూడు నెలల్లో- వెయ్యి రూపాయిల ప్రీమియంతో కొన్నది,అక్షరాలా పదిహేడువేల రూపాయలు.అంచేత ఆగిన ప్రతీచోటా, ప్రతీఊళ్ళో బండిచుట్టూ జనం చేరేవారు.
తాడేపల్లి గూడెంలో ఆగటం, ఉదయం టిఫిన్ అక్కడ కానివ్వడం, డీలర్ ని కలవడం వ్యాపార వ్యవహారాలు,లోకాభి రామాయణం,స్థానికవిశేషాలు,రాజకీయాలు, అమ్మకాలు వగైరా ప్రతీ చోటా ఇదే పని.తర్వాత తణుకు వెళ్లడం,డీలర్ ని కలవడం వగైరా, భోజనం చేయడం- అమలపురానికి ప్రయాణం.
అక్కడ డీలర్ దగ్గర వ్యాపారవ్యవహారాలు అయిన తర్వాత లాంచీపై గోదావరి అవతలి ఒడ్డుకు నేను మోటార్ సైకిల్ తో.అద్భుతమైన అనుభవం ఆ లాంచీ మీద మనుషులు, సంభాషణలు.నా గురించి వాకబు నాతో చొరవగా, ఆప్యాయతతో.ఆవలిఒడ్డు దిగి ద్రాక్షారామం మీదుగా కాకినాడ చేరడం;బస హోటల్ దశపల్ల. ఇది రాకముందు ఒక ఉడిపి హోటల్ లో బస.రూము,భోజనం బాగుండేవి.వైజాగ్ దశపల్ల హోటల్ వాళ్లు నడిపేవాళ్ళు దీన్ని.
పొద్దున్నే అల్పాహారం, కాఫీ అయిన తర్వాత డీలర్ ని కలవడం, మిగతా షాపులవాళ్ళ దగ్గర అమ్మకాలు ఎలా ఉన్నాయో కనుక్కోవడం వాళ్ళదగ్గరకి వెళ్లి మధ్యాహ్నం సుబ్బయ్య హోటల్లో భోజనం, బయలుదేరే ముందు కోటయ్య కాజాలు రెండు నోట్లో, కొన్ని (పార్సెల్) పొట్లంలో కట్టించుకుని రాజమహేంద్రవరానికి జయ్యిమని ప్రయాణం,కోటగుమ్మం దగ్గర తిన్నగా వాలిపోవడం.డీలర్ దగ్గర వ్యాపారలావాదేవీలు చూసుకోవడం,దగ్గర్లో ఉన్నవేరే షాపులవాళ్ళని కలవడం “ఆఘ మేఘాలమీద” (విమానంలో కాదండి) హోండా మీదే,బెజవాడ చేరడం, అదృష్టవశాత్తు రాత్రి పదిలోపు చేరితే దారిలో పేరయ్యమెస్ దగ్గర ఆగడం!
నన్ను, నాబండి, లగేజీ చూసి ప్రేమగా అరిచేవారు “బండి మీద ఎందుకండీ అంత దూరాలు, రైల్లోనో బస్సులోనో వెళ్లొచ్చుగా” అనేవారు.టూర్ విశేషాలు అడుగుతూ వడ్డించేవారు.ఆ సమయానికి ఒకళ్ళు ఇద్దరు వుండేవారు.ఒక్కొక్క సారి “కూర, పెరుగే ఉన్నాయి తింటారా” అని అడిగేవారు-ఆకలి పొట్ట ఎరిగిన మనిషి,అదే అమృతంలా తినేవాణ్ని-అలాంటి మనిషిని జీవితంలోమళ్ళీ ఇంతవరకు చూడలా.
“తిరిగి తిరిగి ఉద్యోగాలు చేసేవాళ్ళు బాగా తినకపోతే ఎలాగ” అని మరీమరీ అడిగి వడ్డించేవారు.ఆ చల్లని ఆప్యాయత ముందు “ఆ పూరిల్లు” చల్లదనం వెలవెలబోయేది;దాదాపుగా ప్రతీ రోజు మధ్యాహ్నభోజనం అక్కడే అయ్యేది.లేదంటే “రామయ్యగారి”మెస్ లో,ఎప్పుడైనా మార్పుకి హోటల్ కి వెళ్లేవాళ్లం.
అలాగే “రామయ్యమెస్” సూర్యాపేట ఏరియాలో రామయ్యగారు మొదలు పెట్టినప్పటినుంచి కొన్ని సంవత్సరాలు ఆయనచేతి (ఆయన వండుతారు అని కాదు నా ఉద్దేశ్యం) కమ్మనైన భోజనం తిన్నవాళ్ళం.ఆయన మొదలు పెట్టినప్పుడు ఫుల్ భోజనం “అక్షరాలా ఐదు రూపాయలు”-అరటి ఆకులో,ప్లేట్లు స్టెరిలైజేషన్ మొదలు పెట్టింది రామయ్య మెస్స్ మొట్టమొదటిసారిగా.
ఆయన, ఆయన పార్టనర్ ఒకరు ఉండేవారు,కొన్ని కారణాలవల్ల-వేరేవాళ్లకు అమ్మి ఆయన హైద్రాబాద్కు మారిపోయారని విన్నాం,తర్వాత కలిసిందిలేదు.
కడుపారా, కమ్మనైన ఆప్యాయతతో అన్నంపెట్టిన వాళ్ళని మరచిపోలేం కదా!
కాలగమనంలో కాలంలో కనుమరుగు అయినవాళ్ళు కొందరు,కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు కొందరు.
అలాగే “హోటల్ ఎస్కిమో”గాంధీనగర్ లో ఉండేది.న్యూ ఇండియా హోటల్ సెంటర్ తర్వాత.సాధారణంగా ఆదివారం వెళ్ళేవాళ్లం అక్కడకి, కొన్ని ప్రత్యేక మైన ఆధరువులు ఉండేవి; గుండ్రని పెద్ద కంచంలో ఆధరువులు చిన్నచిన్న కప్పుల్లో నింపి ఇచ్చేవారు;ఏదన్నా కావాలంటే ఇంకో కప్పు తయారు.టేబుల్ అంతా కప్పులతో నిండి పోయేది.బ్రహ్మ చారులం, అందునా ఆదివారం పూటుగా లాగించే వాళ్లం పీకల వరకు.సాధారణంగా ఇద్దరమో ముగ్గురమో వెళ్లేవాళ్లం.ఒక వయసు మీరిన పెద్దాయన ఒ క్కొక్కసారి తగిలేవాడు-సప్లయర్.
కప్పులు అందించలేక పక్కకు వెళ్లి విసుక్కునే వాడు,ఒకసారి “ఎన్ని కప్పులూ చాలవు వీళ్లకి” అని ఎవరితో అంటుంటేవిన్నాం.మాకు వినపడాలని ఉద్దేశ్యంతో అన్నాడో, ఏమరుపాటుతో ఉండి మాకు వినపడదు అనుకున్నాడో.ఏది అయితే మాకు ఎందుకూ ఇలా ఇవన్నీ పట్టించుకుంటే బెజవాడ హోటళ్లలో భోజనాలు ఎలా చేయగలుగుతాం.
అలాగే (టూర్) ఆఫీస్ పనిమీద ఏదైనా ఊరు వెళ్లివచ్చేటప్పటికి రాత్రి అయిపోతే ఏలూరు రోడ్డులోబృందావన్ హోటల్ లో వేడివేడి ఇడ్లి ఇచ్చేవాళ్ళు.తాజాగా ఉండేవి పుల్ల ఇడ్లీలు కాదు-తెల్లవార్లు తెరిచే ఉండేది (బెజవాడలో ఒకసారి బాగా గొడవల సమయంలోపోలీస్ S. P. వ్యాస్ నియంత్రణ పెట్టేసారు అన్ని హోటళ్ల పై-రాత్రి పదకొండు గంటల కల్లా మూసివేయాలని) బయటకి వచ్చి హోటల్ పక్కన కిళ్లీ షాపులో రెండు చక్కెరకేళీలుతినే వాళ్లం,అప్పటికి ఆత్మారాముడు పూజ పూర్తిగా అయినట్టు సంకేతం ఇచ్చేవాడు శాంతించా అని!
అలాగే బీసెంట్ రోడ్డు చివరలో ఒక పక్క “పెన్ కార్నర్” మరో పక్క “రవీంద్ర కూల్ డ్రింక్స్” షాపులు ఉండేవి- ఏలూరు రోడ్డు వైపుకి.పెన్ కార్నర్ కి ఎదురుగా ఏలూరు రోడ్డుపై “అజంతా హోటల్” ఉండేది, అక్కడా పలహారాలు బాగుండేవి.
బస్సులో దిగాం అనుకోండి పది లోపు,పాత బస్సు స్టాండ్ కి ఎదురుగా “మమత హోటల్”- శీతల సౌకర్యంతో” భోజనం చాలా బాగుండేది;”దుర్గా భవన్- శీతల సౌకర్యం లేకుండా” ఇక్కడ సాంబారు రుచి మాత్రం అదరహ.
అలాగే “పిన్నమనేని పాలిక్లినిక్” రోడ్డులో ఇడ్లి హోటల్ ఉండేది చాలా రుచిగా ఉండేవి;వేడి వేడిగా ఇచ్చేవాళ్ళు.
ఇన్ని హోటల్స్ గురించి మాట్లాడి “బాబాయ్ హోటల్” ప్రస్తావన రాలేదని మీరు అనుకుంటూ ఉండొచ్చు.ఎప్పుడైనా బాబాయ్ హొటల్ కి వెళ్లాలంటే పొద్దున్నే వెళ్ళాలి,ఎక్కువరద్దీ ఉండదు.కంగారు లేకుండా, ప్రశాంతంగా, తీరుబడిగా కూచ్చోని తినొచ్చు.వెళ్లడం,ఖాళీ దొరికేంత వరకువేచి ఉండటం, దొరగ్గానే కూచ్చోవడం.
అంతవరకే, ఏమి కావాలి అని అడగటంలాంటిది లేదు.కాస్సేపటికి ఇడ్లీ వస్తుంది మనవంతు రాగానే.నెయ్యి, పప్పు చట్నీ, అల్లం పచ్చడి, కారప్పొడి, గోరుముద్దలాగా వెన్నతో లాగించడం రెండో ప్లేట్ ఆడిగేయడం-ఇడ్లీలు రుచితోబాటు పల్చగా ఉంటాయి-ఆ తర్వాత పెసరట్టు తెచ్చేస్తాడు అడగకుండానే!
కొత్తగా వెళ్లినవాళ్ళకి కొద్దిగా కష్టం,పెసరట్టులో ఉప్మా కావాలంటే ముందే చెప్పాలి.దానితో ఈ టిఫిన్ కార్యక్రమం పూర్తి అవుతుంది.మినప దోసెలు ఉంటాయిగాని పెద్దగా జనం అది తినరు,కాఫీ అంత రుచిగా ఉండేది కాదు. కానీ అంత సుష్టుగా తిన్నతర్వాత కాఫీ తాగాలని అనిపిస్తుంది కదా అది ఎలా ఉన్నా.బరువు గా బయటకు వచ్చేవాళ్లం,మెల్లిగా కాయాన్ని ఇంటికి చేర్చేవాళ్లం.మీరు అనుకున్నంత “వీజీ కాదు” బాబాయ్ హోటల్ లో పూటుగాతినడం అంటే ఆ రోజుల్లో!
ఎప్పుడైనా ఆఫీస్ పనిపై బెజవాడ వెళ్ళినప్పుడు “హోటల్ ఐలాపురం”లో దిగినప్పుడు మాత్రం (సాధారణంగా హోటల్ కృష్ణ రెసిడెన్సీ లో దిగేవాణ్ణి) అప్పుడుమాత్రం పొద్దున్నే టిఫిన్ మాత్రం బాబాయ్ హోటలే-కూత వేటు దూరం అక్కడ నుంచి
పూర్వపు రుచి ఉండేది కాదు సహజంగానే,ముప్పై నలభై ఏళ్లలోఅన్నీ మారిపోలా, మనం కూడా.అలాగే ఇడ్లి రుచి కూడా; “పాత జ్ఞాపకాలు” అక్కడ కూర్చున్నప్పుడు రుచిలేని లోటు తీర్చేవి.పూర్వపు రుచులు తలుచుకుంటూ తినేవాళ్ళమేమో ఈరుచి అంతగా తెలిసేదికాదు.
బెజవాడ వచ్చిన కొత్తల్లో ఒకసారి సత్యనారాయణపురం- నేను మా అన్నయ్య గోపి వెళ్ళాం ఓ స్నేహితుణ్ణి కలవటానికి.అక్కడ “శివాజి కేఫ్” ప్రత్యేకం ఎవరికైనా గుర్తులు చెప్పడానికి సత్యనారాయణ పురంలో.మేమిద్దరం సత్యనారాయణపురం వెళ్ళాం-కాస్త తిరిగిన తర్వాత ఒక చోట ఆగాం-కొత్త కదా! దారిన పోయే దానయ్యని అడిగాం“దానం కాదు శివాజీ కేఫ్ ఎక్కడ అని”
మమ్మల్ని తేరిపారా చూసాడు“నేనేమైనా వీళ్లకి వెర్రివెధవ లాగాకనపడుతున్నానా” అనే భావన అతని మొహంలో ప్రస్ఫుటం గా కనపడింది.మాకు అనిపించింది “మేమేమీ తప్పుగా మాట్లాడలేదే ఈశాల్తీ ఇలా చూస్తున్నాడు ఏంటి” అని.ఎగాదిగా మమ్మల్ని చూసి “మీరు నుంచుంది దాని ముందే” అని అనేసి విసురుగా వెళ్లి పోయాడు.అప్పుడు అర్థం అయ్యింది “మేమేదో జంధ్యాల సినిమాలో పాత్రలలాగా కావాలని ఆయన్ని ఆటపట్టిస్తున్నాం” అని అనుకొని ఉంటాడని.
బాబాయ్ హోటల్, జంధ్యాల ప్రస్తావన లేకుండా ఉండలేం బెజవాడ అంటే!!!
మేము “సూర్యారావ్ పేటలో” వుండేటప్పుడు నక్కల రోడ్డులో వాణీనికేతన్ దగ్గర మైసూర్ కేఫ్ ఉండేది.టిఫిన్లు రెండు తగ్గకుండా మూడుకి మించకుండా తినేవాళ్లం-మైసూర్ బోండా స్పెషల్ అక్కడ (డాల్ఫిన్ డయాగ్నొస్టిక్ సెంటర్ అని అప్పట్లో వుండేది వాణీ నికేతన్ పక్క)
అలాగే ఏలూరురోడ్డులో తిన్నగా వెళ్తే “విజయా టాకీస్” తర్వాత గోరీలదొడ్డి వస్తుంది.కొద్దిగా ఓ పది అడుగులు ముందుకు వేస్తే ఎడమ వైపు “కెల్వి నేటర్ ఆఫీస్” ఉండేది (శివరామకృష్ణ గారి బిల్డింగ్ అది)ఎదురుగా “కొచ్చిన్ బార్” ఉండేది.మూర్తీకి ఈ అలవాటు ఉందా!మాకు తెలియదే అని ముక్కున వేలేసుకుని అనవసరంగా నాశీలాన్ని శంకించకండి.
బార్ కాదండీ బాబు టీ షాప్,అది మలయాళీ అతనిది,“కేరళవాసి” అవడంవల్ల పేరు అలా పెట్టాడు.మాలయాళీలకి స్పిరిట్స్ అంటే ఎక్కువ ఇష్టం కదా. “స్పిరిచువల్ పీపుల్”కదా ఎంతైనా-ఒక్కఅమృతం తాగి బతికేస్తారు వాళ్ళు ఇప్పటికి కూడా- దేవతల్లాగా;అక్కడ మలై టీ (మీగడ) టీ పైనవేసి ఇచ్చే వాడు- అదో రుచి!
సాధారణంగా సినిమాలకి రెండోఆటకు వెళ్లేవాళ్లం “అలంకార్ సెంటర్ కి” రావడం టిఫిన్ చేసేయడం.బోలెడు టిఫిన్ సెంటర్ లు అక్కడ.ఆ ప్రాంతంలో సుమారుగా పది సినిమాహాళ్లు ఉండేవి.రెండో మూడో సినిమాలు దృష్టిలో పెట్టుకోవడం-బెజవాడలో అనుకున్నసినిమా వెంటనే చూసే అదృష్టం అంత తొందరగా లభ్యం అవదు. ఆ “మూడులో” రెండో మూడో నిర్ణయించుకున్న వాటిల్లో దొరికితే సరే.లేదంటే ఏ హాల్ ఖాళీగా ఉంటే దానికి వెళ్లడం-సినిమా ఏదయినా-భయంకర మైన సినిమా అయితే తప్ప!
అప్సర థియేటర్ లో శంకరాభరణం ఇరవై ఐదు సార్లు చూసిన రోజులు అవి.హాల్ కి వెళ్లి ఆరోజు “హౌస్ ఫుల్” బోర్డ్ పెట్టిన తర్వాతే ఇళ్లకు వెళ్లేవాళ్లం-అంత పిచ్చి ఆ సినిమా అంటే.ఒక నభూతో నభవిష్యతి ఆ చిత్రం-కాశీనాధుని విశ్వనాధవారికి పాదాభివందనం ఆయన తీసిన అద్భుత మైన సినిమాలకి.
నా వరకు జంతుప్రేమికుణ్ణి కాబట్టి మరియూ వెల్లుల్లికి నాకు పెద్దగా పడదు కూడా - అలా అని బద్ధవైరం కాదు,తప్పకపోతే పదార్ధాల్లో దగ్గరికి రానిస్తా-మొదటి ఛాయిస్ “అది లేకుండానే”.అందుకే మిగతా హోటళ్లు ప్రసిద్ధికి ఎక్కినవాటి గురించి రాయలా!!!
అన్నదాతా సుఖీభవ-ఆహారం పండించిన రైతులకు,వండి ఆప్యాయంగా రుచిగా వడ్డించిన అందరికి నమోవాకాలు!
షార్ట్ హాండ్ నేర్చుకోవడానికి చాలా శ్రమపడ్డాను అని మునుపు చెప్పాకదా,అది వృధాకాలేదు;అంత కష్టపడి నేర్చుకున్నందుకు ఆ షార్ట్ హాండ్- ఉద్యోగం తెప్పించింది.నా జీవితంలో పెద్దమలుపు దానితోనే మొదలు అయ్యింది.
“కెల్వినేటర్” ప్రఖ్యాత ఫ్రిజ్ల కంపెనీలో స్టెనోగ్రాఫర్గా ఎంపిక అయ్యాను-బ్రాంచ్ మేనేజర్ కి (రాష్ట్రముఖ్య అధికారి) స్టెనోగా.ఆ రోజుల్లో కెల్వినేటర్ కంపెనీ రాష్ట్ర ముఖ్య కార్యాలయం బెజవాడలో ఉండేది.రాష్ట్రం మొత్తానికి ఇక్కడనుంచే ఫ్రిజ్ లు సరఫరా అయ్యేవి.హైదరాబాద్లో డిపో ఉండేది,తెలంగాణా ప్రాంతానికి అక్కడ నుండి రవాణా అయ్యేవి.
స్టెనో గ్రాఫర్ కోసం చూస్తున్నారని తెలిసి ఇంటర్వ్యూకి వెళ్లి సెలెక్ట్ అయ్యా.అప్పుడు షార్ట్ హాండ్ హయ్యర్ కి ప్రిపేర్ అవుతున్నా-నిమిషానికి 120 పదాలు రాయాలి పరీక్షల్లో-బాగా ప్రాక్టీస్ కూడా చేస్తున్న సమయం అది,సహజంగానే వెంటనే సెలెక్ట్ అయ్యాను.
ఒక్క నెలరోజులు పనిచేసిన తరువాత మేనేజర్ (ఆయన పేరు శ్రీ చిట్టిపెద్ది రాధాకృష్ణ) తన అభిప్రాయం ఇలా చెప్పారు; “నీలో స్పార్క్ (విద్యుత్ కాదులేండి) మెరుపు (అలా అని “లైట్నింగ్” కూడా కాదు;అలా అయితే జనానికి షాకే నన్ను ముట్టుకుంటే, లేదా నేను ముట్టుకున్నా)బాగా మాట్లాడతావు కూడా.అదీకాకుండా స్టెనోగ్రాఫేర్ గా ఉంటే ఎప్పటికీ నువ్వు మేనేజర్ కాలేవు,ఉద్యోగంలో పైకి రాలేవు.
పోనుపోను కంప్యూటర్స్అన్ని చోట్లా వచ్చేస్తాయి.అప్పుడు సెక్రటరీ,స్టెనో గ్రాఫర్ ఉద్యోగాలకు అవకాశం ఉండదు-సేల్స్ లైన్ లోకి వచ్చేయి” అన్నారు.
ఇంతకు మునుపే మీకు చెప్పా“నా పాత జ్ఞాపకాల్లో”-మెడికల్ రెప్రజింటేటివ్ కోసం చేసిన వృధాప్రయత్నాలగురించి “ఓహో అప్పుడు ప్రయత్నంచేస్తే భగవంతుడు ఇక్కడ ఈ విధంగా ఏర్పాటు చేశాడన్నమాట, నాకించిత్తు ప్రయత్నం లేకుండా” అనుకున్నా మనసులో!
ఎప్పటి ప్రయత్నాలు ఇప్పుడు సఫలం అయినాయి-అప్రయత్నంగా!
(మనకు యోగం ఉన్న సమయంలో ఆయనే ఇస్తాడు, మనం అనుకున్నవి అవలేదుకదా అని డీలా పడిపోకూడదు జీవితంలో)
“మీ ఇంట్లోవాళ్ళతో,మీవాళ్ళు ఎవరైనా సేల్స్ లైన్లో ఉంటే వాళ్ళతో చర్చించి నిర్ణయం తీసుకో.నేనైతే గట్టిగా చెబుతున్నా నువ్వు ఆ లైన్లో రాణి స్తావు” అని అన్నారు,సరే అన్నాను-అందరితో మాట్లాడి ఆలోచించి చెబుతా అన్నా.ఎంత దార్శనికత ఆయనకి టెక్నాలజీ విషయంలో, నాకుసలహా ఇవ్వడంలో;జీవితంలోటర్నింగ్ పాయింట్ అన్నమాట.జీవితంలో మలుపు ఇక్కడే తిరిగింది-మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలా.
ఇంట్లోవాళ్ళతో,బంధువులతో,స్నేహితులతో మాట్లాడి సేల్స్ లైన్లోకి మారటానికి నిర్ణయుంచుకున్నా.సేల్స్ లో మెళకువలు,అమ్మకాలు ఎలాచేయాలి,ఏం మాట్లాడాలి,ఏం మాట్లాడకూడదు,ఒకటేమిటి “ఓనమాలు దిద్దించి అక్షరాభ్యాసం” చేయించారు.అలా వేలుపట్టుకుని రెండు మూడు సంవత్సరాలు నడిపించి పదోన్నతిపై హైద్రాబాద్ కి బదిలీచేశారు! బెజవాడలో పనిచేసే సమయంలో వ్యాపారలావాదేవీలు ఆయన చేసేటప్పుడు స్వయంగా చూసినేర్చుకున్నా; ఒక్కొక్కసారి నన్నే మాట్లాడమని సూచనలు, సలహాలు ఇచ్చేవారు.
కోస్తాఆంధ్రా ప్రాంతం అంతా నాతో టూర్ కి వచ్చేవారు;పూర్తి తర్ఫీదు పొంది-ఆయన మెప్పు ఆయన బాస్ మెప్పు పొందటం జరిగింది.బెజవాడ అనుభవంతో హైద్రాబాద్లో ఆఫీస్,అమ్మకాలు చులాగ్గా అయ్యేవి.అక్కడ అనుభవాలు ఇంకా రాటుతేల్చాయి అమ్మకంలో!
నేను చేరిన కొత్తల్లో వేజెండ్ల సత్యనారాయణగారు “ఈ చదువులు మాకొద్దు” అనే సినిమా మొదలుపెట్టారు దర్శకుడుగా.మా డీలర్,ప్రసాద్- డి.యెన్.ఆటో మోటివ్స్,ఏలూరు రోడ్డు రాంమందిరానికి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళ హాల్ కి ఎదురుగుండా ఉండేది.డి.ఎన్.అసోసియేట్స్ అని గుంటూరులో కూడా డీలర్ షిప్ ఉండేది.కెల్వి నేటర్ ఫ్రిజ్ లు, స్కూటర్లు “గరేలి” ఇటాలియన్ కంపెనీవి, మోపెడ్లు అమ్మేవారు.నిర్మాతలుఅతనికి పరిచయస్తులు అవడం మూలాన మా ఆఫీస్ లో ఒకరోజు షూటింగ్ చేశారు.రాజేంద్ర ప్రసాద్ చిత్రసీమకి వచ్చిన కొత్తల్లో- నటుడు విద్యాసాగర్ కూడా అందులో ఉన్నారు.
అలాగే, బకింగ్ హమ్ పేట పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్న రాజ్ కమల్స్-చల్లపల్లి బంగళా దగ్గర ఉన్న-యూనివర్సల్ ఏజెన్సీస్ కూడా మా అధీకృత అమ్మకం దారులే
ఆ రోజుల్లో 1981 ఫ్రిజ్ ల కంపెనీలు ముఖ్యంగా మూడే ఉండేవి.కెల్వి నేటర్, ఆల్విన్,గోద్రెజ్.లియోనార్డ్/ లెనార్డ్,జెమ్,ట్రాపికానా- మూడూ కూడా కెల్వినేటర్ దగ్గర కొని వాళ్ళపేర్లతో అమ్మేవారు.
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ప్రస్తావించడం సందర్బోచితం!
మొదటినుంచి కెల్వినేటర్ ఫ్రిజ్ లు స్పెన్సర్ కంపెనీవాళ్ళు అమ్మేవారు దేశం అంతటానూ-ఏకీకృత విక్రయదారులన్నమాట-1979-1980 ప్రాంతాల్లో!ఈ రెండు కంపెనీలకు చిన్న తగాదా అయింది.కెల్వినేటర్ బ్రాండ్ పేరు విషయంలో వాటి హక్కుల గురించి- చూచాయగా అనేవారు!
కోర్టులో చాలాకాలం కేస్ నడిచింది,ఆ సమయంలో కూడా ఉత్పత్తి ఆగలేదు కర్మాగారంలో,స్పెన్సర్ కేస్ ఓడి కెల్వినేటర్ కంపెనీ గెలిచింది.ఈ సమయంలో దేశంలో అమ్మకాలు పూర్తిగా ఆగిపోయాయి.ఈ అనుభవంతో, కంపెనీ సొంతంగా అమ్మే ప్రయత్నంచేసింది,ఒక కొత్త కంపెనీ అమ్మకాలకోసం ప్రత్యేకంగా ప్రారంభించింది.
కంపెనీ కర్మాగారంలోఅన్ని ఫ్రిజ్ లు నిల్వ ఉండిపోయేసరికి ఆఫ్ సీజన్ డిస్కౌంట్ మొదలు పెట్టింది బాగా ధరలుతగ్గించి;శీతాకాలంలో.ఆ దెబ్బతో ఉన్న స్టాక్ అంతా అయిపోయింది.ఫ్రిజ్ ల ఇండస్ట్రీ లోఅదొక కొత్త ఒరవడికి,శకానికి నాంది పలికింది.
ఆరోజుల్లో ప్రజలు వేసవి కాలంలో తప్ప ఫ్రిజ్ లు కొనేవాళ్ళుకాదు,అతి తక్కువ ధరకు దొరకడంతో శీతాకాలం అయినా జనం కొనేశారు.
అది మొదలు ప్రతీ శీతాకాలం సమయానికి తక్కువ ధరకోసం జనం ఎదురు చూసేవారు.అది మొదలు ఈ డిస్కౌంట్ రివాజు అయిపోయింది ప్రతీ ఏటానూ.నాకు బాగా గుర్తు, మిగిలిన కంపెనీలవాళ్ళు తెగ తిట్టుకునేవాళ్ళు ధరలు తగ్గించి అమ్మడంతో ప్రతీ ఆఫ్ సీజన్ లోనూ-ముఖ్యంగా గోద్రెజ్ వాళ్ళు.
మొదటి కంపెనీలో జరిగిన అక్షరాభ్యాసంతో ఎప్పుడూ వెనక్కిచూసిందే లేదు;ఆగకుండా అదే ఇండస్ట్రీ లో ప్రయాణం కొనసాగింది ఒక దశాబ్దకాలంగా అప్రతిహతంగా.ఫ్రిజ్ ల నుండి ఎయిర్ కండీషనర్ కి మారడం జరిగింది ఆ తర్వాత-కధా కమామీషు ఇంకో సందర్భంల్లో ప్రస్తావిస్తా.
ఆరు ఏడూ సంవత్సరాల క్రితం వరకు- నాకు తొలి అడుగులు నేర్పిన, ఉద్యోగ ప్రస్థానంలో స్థిరంగా నిలబడేట్టుగా ఉండటానికి కారకులు దోహదకారి అయిన రాధాకృష్ణగారి గురించి విన్నా-వాళ్ళ కొడుకుతో ముంబైలో ఉంటున్నారు అని తెలిసింది-తర్వాత ఆయన గురించి కబురు లేదు.
నా ఈ తొలి జ్ఞాపకాలు (ఉద్యోగ పర్వంలోవి) గుర్తుతెచ్చుకున్నందుకు మీతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
పైన నే చెప్పినట్టు పదోన్నతిపై హైద్రాబాద్కు బదిలీ అయ్యాను.ప్రస్తుతం ఈ బెజవాడ జ్ఞాపకాలకి “కామా” మాత్రమే.ఎందుకంటే హైద్రాబాద్లో కొన్నేళ్ళు పనిచేశా,ఆ తర్వాత మళ్ళీ బెజవాడకు వచ్చా.
హైదరాబాద్ లో ఉన్న సమయంలో అక్కడి విశేషాలు గుర్తుకొచ్చినవి కూడా రాద్దామని నా అభిలాష-కాస్త విరామంతో, ఆ తర్వాత మళ్ళీ మన బెజవాడ సంగతులు మళ్లీ చెబుతా “వీడెవడండి బాబు”అని అనుకుంటున్నారా మోహన్ బాబు సినిమాలాగా!
విరామం మాత్రమే- “ఫుల్లు స్టాపు” కాదు!!!
ఈ జ్ఞాపకాలు రాసిన ప్రతీవారం చాలామంది వారివారి బెజవాడ జ్ఞాపకాలు తల్చుకోవడం జరిగింది,మరి కొంతమంది వారివారి పాతజ్ఞాపకాలు నెమరు వేసుకున్నాం అని నాతో చెప్పడం జరిగింది.
జ్ఞాపకాలను నెమరువేసుకోవడం ఎవరికైనా ఆనందమే-పాతజ్ఞాపకాలు ఎప్పుడు గతంలోవే, అవి మధురంగా ఉండాలి అనుకుంటే “మనం వర్తమానంలో సంతోషంగా గడపాలిప్రతీ క్షణాన్ని”-అప్పుడే అవి భవిష్యత్తులోఅందమైన జ్ఞాపకాలుగా అవుతాయి.
ఎన్ని ఇబ్బందులున్నా,చిరాకులు ఉన్నాఅధిగమించి ఆనందంగా జీవితాన్ని గడపండి.అప్పుడు అందరికి ఈ అందమైన వర్తమానం,భవిష్యత్తులో “అందమైన గతం” గా మారుతుంది!