తొండి!!!!8 mins Read
లంకె బిందెలు అంటే ఏమిటి!18 mins Read
ఈ రోజుకి ఇంతే-"కథ కంచికి మనమింటికి"!18 mins Read
ఆఘమేఘాలపై18 mins Read
అక్షతలు లేదా అక్షింతలు18 mins Read
నీలాపనిందలు...18 mins Read
తిలోదకాలు 18 mins Read
దీక్షా వస్త్రాలు - వస్త్ర ధారణ18 mins Read
గొల్లభామ18 mins Read
వానాకాలం చదువులు18 mins Read
కౌపీనము!!!8 mins Read
ముక్కు పుటాలు ఎగరేయడం-ముక్కు పుటాలు ఆదరటం18 mins Read
గోరుచుట్టు లేవడం18 mins Read
గంజి వార్చడం!!!!18 mins Read
రంధి, రంధి, రంధి, రంధి!!!18 mins Read
వెదవ- వెధవ!!!18 mins Read
కలుపు మొక్కలు!!!18 mins Read
వాతాపి- ఇల్వళుడు18 mins Read
సొడ్డు పెట్టడం!!!18 mins Read
గోరోజనం!!!18 mins Read
మా చిన్నప్పుడు ఆటల్లో తొండి అనే పదం విపరీతంగా వాడేవాళ్లం పిల్లలందరం,
ఇప్పటి వాళ్ళకి ఏమాత్రం అర్ధంకాని,పూర్వపు వాళ్ళకి మాత్రమే అర్ధం అయ్యే పదాలలో ఇది ఒకటి. ఆటల్లో ఎవరైనా నిబంధన (రూల్) ప్రకారం ఆడకపోయినా, దబాయించి ఆటలో పాయింట్స్ పెంచుకున్నా, ఔట్ అయినా ఓడలేదని రెట్టించినా, మోసంచేసి “గెలిచాం” అని చెప్పినా ఈపదం మాకు చటుక్కున వచ్చేది-ఇది నోటి చివరే ఉండేది కాబట్టి, ముఖ్యంగా ఆటలు ఆడుతున్నప్పుడు అనుకోండి అలాగే చెప్పింది కాకుండా ఇంకోటి చేసినా,చూపిస్తానని ఒక దానికి మాట ఇచ్చి వేరొకటి చూపించినా ఈ సందర్భాల్లోతొండి పదం వాడేవాళ్లం.
“మోసానికి పర్యాయ పదం తొండి”, ఆటల్లో తొండి అనే మాటలో ఉన్న అందం ఆనందం మోసం అన్న పదంలో లేదు.మోసం అనేది కొద్దిగా నేరం కిందకి వస్తుందని కాబోలు తొండి అనే పదాన్ని చిన్నతనంలో ఎక్కువగా వాడేవాళ్లం.చిన్నపిల్లల సంభాషణల్లో కూడా ఈ పదం బాగా వాడుకలో ఉండేది.
ఈ రోజుల్లో ఇంగ్లీష్ చదువులు అందునా “e- చదువులు” ఎక్కువై పోయాయి ఈ మధ్య మరీనూ.అందుకే తొండి స్థానంలోచీటింగ్ అనే ఇంగ్లీష్ పదం చోటు చేసుకుని- తొండి అనేపదాన్ని సామాన్యజన వాడుకలోనుంచి నిష్క్రమింపచేసింది!
చీటింగ్ అనే పదం బావుందో- తొండి బావుందో -ముందు, మీరే చెప్పండి-తొండి లేకుండా!!!
లంకె బిందెలు అనేవి నమ్మటమో,నమ్మకపోవటమో లాంటిది కాదు- పూర్వపు రోజుల్లో-ఇంకా చెప్పాలంటే పురాతనకాలంలో. రాజులూ, రాజ్యాలూ ఉన్న రోజుల్లో.
వివిధ కారణాల వల్ల బంగారు నగలూ, అప్పటి కాలంలో చలామణిలోవున్న నాణాలూ బిందెల్లో వేసి వారు ఉండే ప్రాంతములో ఉన్న ఇంటివద్దో, వాళ్ళ పొలంలోనే పాతిపెట్టేవారు.అవి వాళ్ళ వారసులకు చేరతాయని ఆశ అయివుండొచ్చు,లేదా వీళ్ళ సంపదకు ఇతరులనుంచి ముప్పు ఏర్పడుతునేమో అనే భయం వల్లా అయివుండొచ్చు.
అలా కాక ఏ దొంగో తాను దొంగిలించిన సంపదని సురక్షతిమైన స్థలంలో అప్పటికి దాచి ఉంచి- పరిస్థితులు చక్కపడ్డ తర్వాత తీసుకుందామనే ఉద్దేశంలో పాతి పెట్టి ఉండొచ్చు, అతను ఈ రహస్యాన్ని ఎవరికీ చెప్పకుండా చనిపోయి ఉండొచ్చు.
అలాగే శత్రురాజులు తమ రాజ్యంపై దాడిచేస్తారేమో అనే అనుమానంతో అది వారికి చిక్కకూడదనే ఉద్దేశంతో కొంతమంది రాజులు ఆకాలంలో భూమిలో దాచిపెట్టేవారు; రాజుల కాలంలో చాలా రాజ్యాలు సిరిసంపదలతో తులతూగేవి, అలాగే కొందరు రాజులు దేవాలయాలు కట్టించి మాన్యాలు ఇచ్చేవారు- ఆ దేవాలయం చిరంతరం నడవటానికి.ఆ సందర్భంలో కూడా దేవుని గుడికోసం మని మాణిక్యాలు, బంగారు నగలు, బంగారు నాణాలు,వజ్రాలు గుడికి చెందాలనే ఉద్దేశంతో గుడి సమీపంలోనే, ప్రాంగాణంలోనో రహస్యంగా నిక్షిప్తం చేసేవారు.
అలా భారీగా నేలమాళిగలో బయట పడ్డవే “తిరువనంతపురంలోని పద్మనాభ స్వామి ఆలయంలోని అపారసంపద”! ఇలా లంకెబిందెలు దాచటం అనేది ఆ రోజుల్లో రివాజు కాబట్టి,ప్రజల్లో కొంతమంది వాటి అన్వేషణ చేసే పనిలోనే ఉండేవారు-అలాగే వజ్రాలు కూడా బయటపడ్డ వార్తలు అడపాదడపా వింటూ ఉంటాం.
కారణాలు ఏవైనా-ఇతర దేశాల్లో కూడా ఇలాంటి సంపద కొన్నివందల ఏళ్ల తర్వాత బయటపడ్డ సంఘటనలూ మనం అప్పుడప్పుడు వింటూనేవుంటాం; మా చిన్నతనంలో మాఊరు-నందిగామ పక్కన ఉన్న పరిటాలలో వజ్రాల కోసం ప్రజలు విపరీతంగా వెతికేవారు-కొందరికి దొరికాయి అని కూడా చెప్పుకునేవారు! ఈ కాలంలో అవి ఉన్నా లేకపోయినా ఈ లంకెబిందెలు అనే పదం మాత్రం ఇంకా వాడుకలోనే ఉంది!
చివరగా-అత్యంత దురదృష్టవంతుడు-కర్మచేత అన్నివైపులనుంచి తన్నించుకునేవాడు ఎవడూ అంటే – “లంకెబిందెల మీద కూర్చుని అడుక్కునేవాడు”కొద్దిమంది పొలాల్లో దొరికాయని విని- తర్వాత రోజుల్లో ఆ పొలాలని లంకె బిందెలు దొరుకుతాయని ఆశతో వాళ్ళ పొలాలు కొనేవారని కూడా చిన్నప్పుడు వినేవాళ్ళం. అలాగే మీ పొలాల్లో లంకె బిందెలు దొరుకుతాయి అని పూజలు, పునస్కారాల పేరుతో డబ్బులు కొట్టేసే దొంగ స్వాములు, బాబాలు కూడా ఈ రోజుల్లో ఉన్నారు అంటే ఏ మాత్రం ఆశ్చర్యం లేదు; అవతలవాళ్ళకి అత్యాశలు కలిగించడమే వీళ్ళకి పెట్టుబడి మరి.
మీకు గాని,మీ చుట్టుపక్కలవాళ్ళకు గానీ ఎక్కడన్నా లంకెబిందెలు దొరికితే నాకు చెప్పడం మాత్రం మరిచిపోకండి- వాటా అడగను- అసలు అవి ఎలా ఉంటాయో చూద్దామనే ఉత్సుకత- అంతే!
రేపటితో ఈ కధా కంచికి చేరుతుంది- మనం మన ఇళ్లలోనే ఉంటాం!
"కథ కంచికి మనమింటికి"
(సామెత అర్ధం వరకూ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారి భాష్యం నుంచి సేకరణ) ఉత్తరాన ఉన్న కాశీనగరం పండితులకు పెట్టిందిపేరు-మహా పండితులు ఉండేవారు; ప్రత్యేకంగా“కాశీ పండితులు” అని కూడా అక్కడ ఉన్న పండితుల గురించి చెప్పేవారు!
అలాగే దక్షిణాన ఉన్న కంచికి అంత పేరూ ఉండేది,గొప్ప పండితోత్తములు ఉండేవారు, మహా గ్రంధాల రచన కూడా జరిగేది.ఎవరైనా ఇతర ప్రదేశాలలో ఉన్న వారు ఏదైనా గ్రంధం రాస్తే దాన్ని కంచి పంపించేవారట. అక్కడ వాళ్ళు దాన్ని చదివి, ఓ ఆమోద ముద్ర వేస్తే దాన్ని “ప్రామాణికంగా” తీసుకునేవాళ్ళు.అలా అక్కడ పండితులు ఆమోద ముద్ర వేసే ఆగ్రంధాలకి సముచితస్థానం కలిగినట్టుగా ప్రజలు భావించి ఆయా గ్రంధాలని ఆదరించేవారట.
ఆ రోజుల్లో దక్షిణాదిలో అది రివాజు అవటం వల్ల“కథ కంచికి, మనమింటికి” అనే నానుడి ప్రజా బాహుళ్యంలో వచ్చింది-ఇప్పటికీ వాడుకలో ఉంది! ఈ రోజుల్లో,ఇంట్లో కధలు చెప్పే పెద్దవాళ్ళూ లేరు, ఓ వేళ ఉన్నా అవి వినే ఉత్సాహం ఉన్న చిన్న పిల్లలూ లేరూ, యుక్త వయస్కులూ లేరు.
పిల్లలే పెద్దవాళ్ళకి కధలు చెప్తున్న రోజులు,పెద్దలు మౌనంగా ఉంటున్న రోజులు ఇవి. ఎవరు కధలు చెప్పితేనేం లెండి-ఇది ఈసామెతకి మూలం-ఈకథ చెప్పడం వరకే నా పని- కానీ ఈ నా కథ, నేరాసిన, రాయబోయే కధలు మాత్రం కంచికి వెళ్లేంత సీనేమీ లేదు!
ఆ రోజుల్లో (సత్యయుగంలో) అందరూ మేఘాల్లోనే ప్రయాణాలు-ఎంచక్కగా ట్రాఫిక్ జామ్స్ ఉండేవికావు-కాణీ, దమ్మిడీ ఖర్చు కూడా ఉండేది కాదు,సామాన్యజనం మాత్రమే రోడ్లు వాడేవారు.వాళ్ళు కూడా ఎప్పుడైనా తొందరగా, అత్యవసరంగా ఎక్కడికైనా వెళ్లాలంటే నారదుని సహాయంకోరేవారు. నారదమహా ముని ఒక్కడే విశ్వమంతా ఉచితంగా తిరిగే “అనుమతిపత్రం”,సదుపాయం ఉన్న“ఏకైకవ్యక్తి”.కాణి ఖర్చు లేకుండా ఉచితంగా తీసుకెళ్లే వాడు-క్షణాల్లో!
పైపెచ్చు, దారిలో విశేషాలు,వింతలు, కబుర్లు చెప్పేవాడు.కాస్త వివేకంఉన్న వ్యక్తులైతే ఆయన సదుపాయాన్నే ఎక్కువగా అడిగేవారు-ముల్లోకాల విశేషాలు తెలిసేవికదా ఉచిత ప్రయాణంతో బాటు!అందునా ఆయన ఈ మానవుల అభ్యర్ధన తిరస్కరించే వాడు కూడా కాదు.నాకు ఇంకా బాగా గుర్తు ఉంది ఆ యుగంలో ఆయనతో నాకున్న అనుభవాలు- దాన్ని బట్టే ఇంత ధీమాగా చెబుతున్నా.
అంచేత కొద్ది మంది మానవులు కూడా మేఘాల ప్రయాణం చేసేవారు నారద మహర్షి ధర్మమా అని - మేఘనాధుడే కాదు!
ఆరోజుల్లో ప్రసార మాధ్యమాలు లేవుగా మరి -ఎలెక్ట్రానిక్,ప్రింట్,ఆకాశవాణి అన్నిమాధ్యమాలు ఆయనే.అందుకనే దేవతలు కూడా ఆయన మీదే ఆధార పడే వారు.ఆయన ఎక్కడకి వెళ్లినా రాచమర్యాదలు చేసేవాళ్ళు(మునీశ్వరుడు అయినా) అన్ని సంగతులు అందరి సమాచారాలు చెప్తాడని లోలోపల అందరి ఆశ ఇప్పటిలాగా అసత్యవార్తలు ఉన్నరోజులు కాదుగా మరి,అన్నీ వాస్తవాలే.అందునా నారద మహాముని త్రిలోక సంచారి కూడానూ! త్రిమూర్తుల దగ్గ్గర ఏమైనా ముఖ్యమైన వార్తలు ఉంటే లీక్ చేస్త్తాడేమోనని ఆశ కూడా ఓ మూలన! అదీ కాకుండా దేవుళ్లందరికి ఒక అనుమానం కూడా ఉండేది- వాళ్ళ భార్యల దగ్గరకు వెళ్లి వీళ్ళ రహస్యాలు బట్టి బయలు చేస్తాడేమోనని ఈ మునిగార్ని మచ్చిక చేసుకునే ప్రయత్నం కూడానూ!
ఏదైతేనేం ఆ రోజుల్లో నారదుడి ధర్మమా అని కొద్ది మంది మానవుల మేఘాలలో ప్రయాణం చేసేవాళ్ళు.అదీ దారిలో మేఘాలని నిమిరి, ముట్టుకుంటూ ప్రయాణమాయె మరి-అద్భుతం కదూ.మనం అంటే ఇప్పుడు మేఘాలని ముట్టుకోకుండా ప్రయాణం చేస్తున్నాం ఓ పెద్ద డబ్బాలో కూర్చొని!
ఇదంతా ఎందుకు రాసానంటే- మీకు తెలియని విషయాలు కాస్త మీ చెవిన వేద్దామని- సత్య యుగం సమయం వాసనలు ఉన్న వాడిని కదా మరి!
సాధారణంగా అక్షతలు లేదా అక్షింతలు వేయడానికి పెద్దరికం కావాలి- పెద్ద వయసు ఉండాలి- అక్షతలు వేయించుకునేవాళ్ళ కంటే.ఈ కార్యక్రమం చేసి ఆశీర్వదించడానికి చేతిలో అక్షింతలు ఉండాలి- సమయం సందర్భం ఉండి తీరాలి.ఇది క్షణకాలంలో జరిగిపోయే ప్రక్రియ,ఆశీస్సులు మాత్రం దీర్ఘకాలం ఉంటాయి!
ఈ అక్షింతలు పెళ్ళిళ్ళప్పుడు తలంబ్రాలుగా రూపాంతరం చెందుతాయి.అదీ అచ్చంగా వధూవరులు మాత్రమే ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకునే ప్రక్రియ- పరిమాణం కూడా చాలా ఎక్కువే ఉంటుంది.ఇద్దరూ ఇలా వేసుకోవడం వలన ఒకరి మీద ఒకరు అక్షింతలు-భవిష్యత్తులో-ఎలా వేసుకోవచ్చో అనుభవంలోకి వస్తుంది.
అందుకే అనుకుంటా- పెళ్లి అయిన కొన్నాళ్ళకి ఈ జంటలు- విషయంతో నిమిత్తం లేకుండా ఒకళ్ళ మీద మరొకళ్ళు అక్షింతలు వేస్తూనే వుంటారు- జీవితాంతం.అంటే వివాహ సమయంలో ఇరువురూ వేసుకునే తలంబ్రాలు వాళ్ళ జీవితాల్లో అక్షింతలుగా రూపాంతరం చెందాయన్నమాట- చేతులనుంచి నోరుకి మారినట్టు.
-కొందరు మాత్రమే- అందర్నీ ఓకే గాటికి కట్టట్లేదు “సుమా”!!! ఒక్కొక్క సమయంలో వయసుతో నిమిత్తం లేకుండా- చిన్నా-పెద్ద బేధం లేకుండా, సమయం సందర్భం లేకుండా అక్షింతలు వేసేటప్పుడు మాత్రం అక్షింతలు నోట్లో నుంచి వస్తాయి కాబట్టి- చేతిలో అక్షింతలు ఉండాల్సిన పనే లేదు.ఎంతసేపు అక్షింతలు వేయచ్చు అనే నియమం లేదు-మన నోరు ఇష్టం.
ఈ.టి.వి (ETv) వాళ్ళని నెంబర్ కనుక్కోని మొన్నామధ్య నా మీద "సుమ”కి పితూరీ చేశారట-నేను “సుమ” ప్రస్తావన నా తెలుగురాతల్లో ఎక్కువగా తెస్తున్నానని- "మల్లూ పిల్ల-అదేనండీ మలయాళీ అమ్మాయి" అయినా మన తెలుగుపిల్లల కంటే తెలుగు పరిజ్ఞానం ఎక్కువ కాబట్టి నా మాటల్ని "సుమ కాదు సుమా" గా అర్ధం చేసుకుంది.ఈ తరం మన పిల్లలకంటే ఆమే నయం ఈవిషయంలో! (మన వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు కూడా సుమ బాషా పరిజ్ఞానాన్ని, సందర్బోచితంగా మాట్లాడే విధానాన్ని, తెలుగు భాషా ప్రయోగాన్ని తరచూ మెచ్చుకుంటూనే ఉంటారు) గుడికి వెళ్ళినప్పుడు అర్చకుల వారు కూడా మన మీద అక్షతలు వేస్తారు కదా- దీవిస్తూ-దేవుడి తరఫున! మనం కూడా పూజో, వ్రతమో చేసినప్పుడు దేవుడి మీద అక్షతలు వేస్తాం కదా-భక్తితోనే కదా!
అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు పుట్టినరోజునాడో, పండగలప్పుడో అక్షంతలు వేయుంచుకుంటాం కదా వాళ్ళ పాదాలకి నమస్కరిస్తూ.అలాగే ఈ తరంలోని కొంతమంది- మన ఇళ్ళకి వచ్చినప్పుడు మనకాళ్ళకి దండం పెట్టి అక్షింతలు వేయించుకుంటారుగా మన దీవెనలకోసం.
ఆ మధ్య మామేనల్లుడొకడు వాడి భార్యతో అమెరికా నుండి హైదరాబాద్ వచ్చాడు; “శ్రీరామ్ మరియూ సౌమ్య”వాడి పెళ్ళికి నేను హైదరాబాద్ వెళ్లడం జరిగింది 2016 లో.మమ్మల్ని-వాడి చెల్లెలి కాపురం చూడటానికి బెంగళూరు వచ్చారు.ప్రత్యేకంగా మాఇంటికి వచ్చి మా దంపతులకి బట్టలుపెట్టి మా కాళ్లకు దండం పెట్టి అక్షించింతలు వేయించుకుని మరీనూ ఆశీర్వాదం తీసుకున్నారు ఇరువురూనూ- చెప్పొద్దూ-మాకు చాలా సంతోషం వేసింది.
ఇంకా సంబరం ఏమిటంటే-సొంత మేనమామ-అత్తలం కాకపోయినా-సొంతవాళ్లకంటే ఎక్కువ ప్రేమతో వాళ్ళు అలా చేయడం -వాణ్ణీ మేము అలాగే చూస్తాం అనుకోండి.ఈ రోజుల్లో రక్తసంబంధీకులే పలకరించడం మానేస్తున్నారు- నడమంత్రపుసిరులతో! చాలామంది అనుకుంటారు గానీ ప్రేమ చూపించడానికి రక్త సంబంధంతో సంబంధమే లేదు ఏ రోజుల్లో కూడా!
ఈ రోజుల్లో-ఇప్పటి అమ్మాయిలు, అబ్బాయిలు- మనం ఎవరింటికి వెళ్లినా, పొరపాటున మన ఇంటికి వాళ్ళు వచ్చినా “హాయిలు,బాయిలు”(Hi and Bye) అని పలకరించడం తప్ప మాట్లాడుతున్నారా పెద్దవాళ్ళతో- వెధవ దొబ్బిడాయి కాకపోతేనూ. ఉన్నమాటంటే ఉలుకులూ, కోపాలూనూ-అయినా సరే నేను అనటం మానను అనుకోండి.
ఏదో అనుకుంటారుగానీ-పెద్దవాళ్ళ అక్షింతలు దీవెనలే, ఉత్తిపుణ్యానికే అక్షింతలు వెయ్యరుగా- ఏదో వెధవ పని చేస్తేనో, లేదా ఏదైనా పని సక్రమంగా చెయ్యకపోతేనో వేస్తారు - ఆ వేసిన అక్షింతల ఫలితంగా మనం సరిదిద్దబడతాం.అంచేత మనకు షష్టిపూర్తి దాటినా- సహస్ర చంద్రోదయం చూసినవారు-,పెద్దలూ పుణ్యాత్ములేగా నాలుగు మాటలు వాళ్ళు అంటే మాత్రం పీక్కోవాలా మరి.
ఏదో ఇంట్లోవాళ్ళు అన్నారని పీక్కుంటారు గానీ,ఇంట్లోవాళ్ళు మన మంచి చెప్పకపోతే ఊళ్లోవాళ్లు, పేస్ బుక్ గాడు,గూగుల్ గాడు ఉద్ధరిస్తారా వీళ్ళల్ని. అంచేత పెద్దవాళ్ళ, మన శ్రేయోభిలాషుల నోటి అక్షింతలు దీవెనెలుగా తీసుకుంటే వాటిల్లో సారం అర్ధం, పరమార్ధం బోధ పడుతుంది- మన జీవితమూ భేషుగ్గా సాగిపోతుంది. అంచేత నేను చివరాఖరికి చెప్పేదేమిటంటే-చేతితో వేసేవి- నోటితో వేసే అక్షింతలు కూడా శుభప్రదమే!
మీరెవరైనా బెంగుళూరు వస్తే- వీలుచేసుకుని ఇటుగా మాఇంటికి రండి- ఓ నాలుగు అక్షింతలు వేస్తాం-కాఫీ, భోజనాలతో బాటుగా!
(మీరు మాకు బట్టలు ఎక్కడ తేవాల్సి వస్తుందో అని మాత్రం మానేయకండి)
యువతరానికో గమనిక:
అక్షతలు అంటే క్షతము గానివి-నాశనము గానివి అని అర్ధం!
"నీలాపనిందలు" అన్న పదం ఏడాదికి ఒకసారి వినాయకచవితి నాడు పూజా విధానంలో శమంతకమణి వృత్తాంతం ఉన్న కధలో చదువుతాం, వింటాం-ఆ తర్వాతే చవితి చంద్రుణ్ణి చూస్తాం ఏ ఇబ్బంది లేకుండా...
మనం జీవితంలో పొరపాట్లు,తప్పులు చేయడం సహజం- దాదాపుగా అందరం-అలా కాకుండా ఒక పొరపాటు, తప్పూ కూడా చేయకుండా ఉన్న మహానుభావులు ఉంటే వారందరికీ శతకోటి వందనాలు ముందుగా.తెలిసి చేసినవాటికి నిందలు, ఒక్కోసారి అపనిందలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఆ విషయాన్ని బట్టి అవతలవాళ్లకి మనకు మనం విశదీకరించుకోవాల్సి వస్తుంది, నిందపడితే దాన్ని ఒప్పుకోవాల్సి అన్నాఉంటుంది, లేదూ అది అపనింద అయితే రుజువు చేసుకొని మన మీద పడ్డ అపనిందని రూపుమాపు చేయాల్సి ఉంటుంది “మరక మంచిదే కానీ (సర్ఫ్ఎక్సెల్ ఉందిగా) నింద కాదుగా”!
ఇలా నిందలకు,అపనిందలకు గురిఅయి దాన్ని రూపుమాపు చేసుకోవడానికి, చాలా కష్టపడాల్సి వస్తుంది, అప్పటివరకూ నిందతోబాటు మానసిక వేదనకి గురి కావాల్సి వస్తుంది కూడా.ఇలాంటి ఒక సందర్భం అన్నాఅనుభవంలో లేని ప్రాణి ఉండడేమో బహుశా ఈ లోకంలో. ఒక్కోసారి అపనింద అని తెలిసినా, దాన్ని జీవితాంతం మోస్తూ మనం ఏమీ చేయలేక ప్రేక్షకపాత్ర వహించవలసిన సందర్భాలు కూడా కద్దు కొందరి జీవితాల్లో-, అదృష్టం బావుంటే కాలగతిలో అవతల వాళ్లకు నిజానిజాలు తెలిసే పరిస్థితులు కలగవచ్చు- అపార్ధపు భావనలు వీడవచ్చు!
ఇంత విషయం,సాధక బాధకాలు తెలిసి కూడా నీలాపనిందలకు గురికావడం తెలివి తక్కువ కాదూ. శమంతకమణి తస్కరణకు గురి అయినప్పుడు ఏదో శ్రీకృష్ణపరమాత్మ కాబట్టి ఆయన మీద నీలాపనిందలు పడ్డప్పుడు, కార్యసూరుడై రంగంలోకి దిగి ఆ నీలాపనింద మాపుకున్నాడు, “అంతేకాక సత్యభామని, జాంబవతిని కూడా పెళ్లి చేసుకోగలిగాడు- మనకంతటి సామర్ధ్యమేదీ”!
ప్రతీ వినాయకచవితికి ఈ శమంతకమణి కధ చెప్పుకొని అక్షింతలు మన శిరస్సున చల్లుకొని, చవితి చంద్రుణ్ణి చూడొచ్చు అనే తరుణోపాయం మానవాళికి దొరికిన సౌలభ్యం!
అయినా ఈ రోజుల్లో ప్రత్యక్షంగా చంద్రుణ్ణి చూసేవాళ్ళు ఎంతమంది-సినిమాల్లో, వీడియోల్లో చూడటం తప్ప! తెలిసి చేసినా, తెలియక చేసినా, ఒక్కోసారి మనకి సంబంధం లేకపోయినా అపనిందలు తప్పవు., ప్రతీ సారీ “శమంతకోపాఖ్యానం” చదువుకోలేం కాబట్టి (అదీ కాక శ్రీకృష్ణుడంత పోటుగాళ్ళం కాదు కూడా)అందరితో జాగ్రత్తగా మెసలితే సరిపోదూ- ఈ నీలాపనిందల గోల ఉండదు.
అయినా సరే ఒకవేళ అపనింద వచ్చి మీద పడితే- శమంతకోపాఖ్యానం చదివితే –ఆ సమస్యని అధిగమించే సామర్ధ్యం రావొచ్చేమో-ఈ మారు ప్రయత్నం చేస్తే పోలా!
జై శ్రీకృష్ణ
ఈ పదం అర్ధం ఎంతమందికి తెలుసు-తెలిసిన వాళ్ళు చేతులెత్తండి అని అనబోవడం లేదు!!!
తెలిస్తే సంతోషం, ఆ పదాన్ని ఇంకా మీరు ఉపయోగిస్తూ ఉంటే మహా సంతోషం, ముదాహం,మీ “సంతుకి” అర్ధం చెప్పి ఉంటే మహదానందం కూడానూ!
అసలు ఈ పదమే తెలియన వాళ్ళకి,పదానికి అర్ధం తెలియన వాళ్లకి ఈ వివరణ!!!
ఏదైనా పనిని పూర్తిచేయకుండా వదిలేసినా!
మంచి పద్ధతులు, మంచి అలవాట్లని వదిలేసినా!
పరుల నడవడిక మంచిగా లేకపోయినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు! అప్పటి దాకా మంచిగా ఉన్న వ్యక్తి చెడ్డ ప్రవర్తనకి మారినా!
“అప్పట్లో వాడుకలో ఉండే పదం”- అని ఎందుకు అంటున్నానంటే - ఈమధ్య కాలంలో ఎక్కడా వాడుకలో ఈపదం వినలేదు మరి!
“మరుగున పడిపోయిన పదాల్లో” ఇదీ చేరిపోయినట్టుంది- బాధపడుతూ నాకూ మొరపెట్టుకుంది-అందుకనే ఆ పదాన్ని పట్టుకుని లాక్కొచ్చి మరీ చెపుతున్నా!
"తిలలు అంటే నువ్వులు, ఉదకం అంటే జలం"
“తిలలు-ఉదకం” ఎప్పుడు వాడతారో ప్రతీ వాళ్లకి తెలిసి ఉండాలి, తెలియకపోతే తెలుసుకోండి- నేనైతే చెప్పబోవడం లేదు!
ఇది కూడా తెలియకపోతే తెలుగువాళ్ళు ఎలా అవుతారు అలా అని ఎలా చెప్పుకుంటారు!
ఓహో తెలుగు వాళ్ళం అని చెప్పుకోవడానికే గర్వపడని వాళ్ళం కదా మనం!
"తిలోదకాలకే" తిలోదకాలు ఇస్తే నేను ఆశ్చర్య పడటం ఏమిటో- నా పిచ్చి, చాదస్తం కానీ!
తెలుగుని రాయండి, మాట్లాడండి, వాడండి- మీ సొమ్ము అడిగానా ఏమైనా!
మలయాళీ పిల్ల అయిన "సుమ" - తెలుగు కూత ఘనంగా పెడుతుందిగా!
చప్పట్లు కొట్టడమేనా సుమకి- తెలుగు వాళ్ళ చెంపల మీద కొట్టినట్లుగా అనిపించట్లేదా!
మన తెలుగు వాళ్లకి పెద్దాయన, ఉపరాష్ట్రపతి గారిని చూసి అన్నా కొద్దిగా రోషం రావాలిగా!
ఆ….అని అంటారా.…సరే ఎవరు మాత్రం ఏమి చేయగలరు…. తెలుగు తల్లినే విడగొట్టిన ఘనత మనది!
ఇంతకంటే మన దగ్గర నుంచి ఎక్కువగా ఆశించడం “తెలుగు బాష” అత్యాశే మరి!
ఇలా చెప్పాను అని కనీసం పచ్చి తెలుగులో (ఇంగ్లీష్ లో కాకుండా) తిట్టుకోండి నన్ను (చెడ్డ పదంతో మాత్రం కాదు) అలాగే మీ కాంటాక్ట్ లిస్ట్ లో నుంచి నా పేరు తీసేయకండి!
మన పరిచయాలకు మాత్రం తిలోదకాలు ఇవ్వకండి-ప్రేమలకీ, స్నేహానికి, బంధుత్వాలకే తిలోదకాలు ఇచ్చేస్తున్న రోజులు మరి!
పూర్వ కాలం నుంచి మనిషి వస్త్రాలు ధరించడం-ఆచ్ఛాదనకు, అలంకారానికి-మన ముఖారవిందాన్ని మెరుగులు దిద్దుకోవడానికి చేయడం రివాజుగా వస్తోంది.మన అందరికి ఎవరికి తగ్గట్టుగా మన వస్త్రాలు,సందర్భాన్ని బట్టి-వాతావరణాన్ని బట్టి కట్టుకోవడం చేస్తుంటాం.
వస్త్ర ధారణ మన శరీరానికి ఆచ్ఛాదనే కాక మన వ్యక్తిత్వాన్ని,మన అభిలాషని, అభిరుచిని కూడా ప్రస్ఫుటంగా వ్యక్తం చేస్తుంది- ఇతరులకు. మనకు ఉన్న వాటిలో మంచివి-మంచిగా ధరించడం ముఖ్యం- బ్రాండెడ్ దుస్తులే వేసుకోవాలనేం లేదు,స్తోమతని బాట్టి అభిలాషని బట్టి దుస్తులు ధరిస్తాం.అలా అని ప్రతీసారి ఏదో సాదా సీదాగానే వేసుకున్నా అంతగా నప్పదు-అలా అని డాబుగా కట్టుకోమని కాదు-ఉన్నంతలో సందర్భాన్ని బట్టి-మన వస్త్రధారణ ఉండటం అభిలషణీయం మనం ఏదో సాధువులమో,స్వామీజీలమో అయితే వేరే విషయం.సాధువులు ఒక రకంగానూ స్వామీజీలు ఇంకో రకంగానూ, సద్గురు ఒకరకం గాను, సద్గురువులైన పీఠాధిపతులు వేరొకరకం గాను వస్త్ర ధారణ చేస్తారు-సాధారణంగా వీళ్ళవి దీక్షా వస్త్రాలు అంటారు అని మన అందరికి తెలిసిన విషయమే! కలికాలపు గురువుల వేష ధారణ మనం చూస్తూనే ఉన్నాం- డిజైనర్ డ్రెస్సులతో!
సాధారణ మనుష్యులు మాత్రం కొంతకాలం ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో-దీక్ష తీసుకొంటుంటారు -మండలం రోజులు, నెల రోజులు అని, ఆయా దేవుళ్ళ పేరుతొ దీక్ష తీసుకోవడాన్ని బట్టి ఉంటుంది-ఆ సమయంలో నిర్ణయించిన,నిర్ధారించిన వస్త్రధారణ మాత్రమే చేస్తారు.
అలాకాకుండా మామూలురోజుల్లో కూడా ఒకటో రెండో జతల బట్టలు-చీరలు మాత్రమే నిత్యమూ కట్టుకునేవాళ్ళు మనకు తటస్థపడుతుంటారు.వీళ్ళకేదో డబ్బులేక,బట్టల్లేకా కాదు- పొదుపు మంత్రం గాని, వాడితే పాడైపోతాయని గానీ, అయి ఉండచ్చు-బీరువాల్లోనూ, అలమారాల్లోనూ మూలుగుతూ పది ఉంటాయి కుప్పలుగా-కట్టుకునే స్తొమత ఉండి కూడా కట్టుకోని వాళ్ళగురించి ప్రస్తావన అనవసరం!లేని వాళ్ళు ఎలాగూ కట్టుకోలేరు, వీళ్ళకేం మాయరోగమో మరి- దీక్షా వస్త్రాల్లాగా ఎప్పుడూ అవే అవే బట్టలతో కన్పిస్తుంటారు.
వస్త్ర ధారణని బట్టి కూడా మనుషుల వ్యక్తిత్వాలని అంచనా వేస్తారు మనస్తత్వ శాస్త్రవేత్తలు!
బడాయి కాకపొతే-ఆ మాత్రం కనుక్కోవడానికి శాస్త్రాలు చదవాలా ఏమిటి, మనం రోజూ చూడటల్లా కొల్లలుగా ఇలాంటివాళ్ళని!
“మధురా నగరిలో చల్లనమ్మబోదు దారి విడువుము కృష్ణా”-అనే పాటని చాలామంది వినేవుంటారు,నృత్యనాటిక కూడా చూసే ఉంటారు!
ఈ పాట సందర్భం కూడా మనందరికీ తెలుసు- ద్వారకా నగరంలో శ్రీకృష్ణుడు చల్లలమ్మే గొల్లభామల్ని అడ్డగించి వాళ్ళ దగ్గర ఉన్న పాలు, వెన్న, పెరుగులని తీసుకునేవాడు- వాళ్ళ స్నేహితులతో కలిసి.గొల్లభామలకేమో ఆ వ్యాపారమే జీవనాధారం-వాళ్ళ భర్తలు మాత్రం శ్రీకృష్ణుడు బలవంతంగా తమ దగ్గర తీసుకున్నాడు అంటే నమ్మేవాళ్లు కాదు.ఆ సందర్భంలో శ్రీకృష్ణునికి తమ బాధలు ఏకరువు పెడుతూ గొల్లభామలు పాడిన పాట ఇది.
ద్వాపర యుగాంతంతోనే శ్రీకృష్ణుడు- గొల్లభామలు అంతర్ధానం అయిపోయారు!
అయినా కూడా తర్వాత యుగంలో కూడా- అంటే మనం ప్రస్తుతం గడుపుతున్న కలియుగంలో కూడా ఈ వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు-గొల్లభామల రూపంలో కాదు- దుకాణాల రూపంలో-మా చిన్నతనం రోజుల్లో కూడా, పాలు, పెరుగు, మజ్జిగ అమ్మేవాళ్ళు ఉండేవారు.
ఇక ఈ రోజుల్లో సంగతి చెప్పనే అక్కర్లేదు- చాలామంది వంటలు చేసుకోవడమే మానేశారు-పెరుగు తోడుపెట్టే తీరిక, సమయం కూడా లేదు-చేతులో ఉన్న చరవాణి “కామధేనువు- అక్షయపాత్ర” అయిపొయింది, ఏది కావాలన్నా వేలుతో నొక్కేయడమే-తక్షణమే మన కళ్ళ ముందు ప్రత్యక్షం-పాలు, వెన్నా పెరుగుతో సహా!
ఏది ఏమైనాఇప్పుడు అమూల్ వారి “గొల్లభామ” (Milkmaid) అంటే తెలిసిపోతుంది-అది న్యాయం కూడా, అమూల్ ఎక్కడ నుంచి వచ్చింది.అప్పటి ద్వారకానగరం అయిన ఇప్పటి గుజరాత్ రాష్ట్రం నుంచేగా మనకు వచ్చేది- అంచేతేనేమో మన దేశంలో పాలవిప్లవానికి దాని వెల్లువకి పితామహుడైన “చెరియన్ గారు” గొల్లభామ అనే పేరుని ఆంగ్లంలో పెట్టి ఉంటారు-గొప్ప దార్శనికుడు గొల్లభామ “మిల్క్ మెయిడ్” అయింది అన్నమాట -ఈ రోజుల్లో ఇలా చెపితే కాస్త తొందరగా అర్ధం అవుతుంది.ఆ మిల్క్ మెయిడ్ డబ్బా చూస్తే ద్వారకా గుర్తుకొస్తుంది గొల్లభామలు గుర్తుకొస్తారు-శ్రీకృష్ణుడు కూడా అనుకోండి.
అది “ఈ గొల్లభామకి” అర్ధం అంతేగాని గొల్లభామ అంటే గ్రాస్ హోపర్ పురుగో, మిడతో మాత్రం కాదు!
ఏదో వానాకాలం చదువులు అంటే ఆ రోజుల్లో ఎండలే కాసేవికావేమో అని ఆక్షేపించకండి మరి.ఆ రోజుల్లో వానాకాలం వచ్చిందంటే చాలు గట్టిగా వర్షం వస్తే స్కూలుకి ఎగనామం పెట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళం-ఈ రోజుల్లో లాగా కాదుగా- ఇప్పుడు అంతా పిల్లల ఇష్టమే మరి స్కూలుకి వెళ్లాలన్నా మానేయాలన్నా!
స్కూల్ వాళ్ళు సెలవు ఇచ్చినా, మేం స్కూల్ ఎగ్గొట్టినా-ఇంట్లోనే ఉండి చక్కగా వర్షం వస్తుంటే ఒక మైనపు కాగితం పూర్తిగా కప్పుకొని కాగితపు పడవలు తయారుచేసి నీళ్లలో వదిలే వాళ్ళం.కొంతదూరం వాటి వెనకాలే వెళ్లడం- ఒక్కొక్కసారి వేరే వాళ్ళ సందుల్లోకి కూడా వెళ్లి పోయే వాళ్ళం ఆ ధ్యాసలో పడి; అవి మునిగిపోగానే ఇంటివైపు వెనక్కి రావడం మళ్ళీ పడవలు చేయడం.
“ఒరేయ్ జలుబు చేసి చస్తూందర్రా అలా వానల్లో నానితే” అని పెద్దవాళ్ళు అరుస్తూ ఉండేవారు-మేం లక్ష్యపెడితేగా! వాళ్ళూ ఒక సారి అరిచేసి వాళ్ళ పనుల్లో మునిగి పోయేవాళ్ళు.ఎంత సేపు మాకోసం కాపలాలు కాస్తారు పెద్దవాళ్ళు,వాళ్ళ పనులు వాళ్లకి లేవూ- ఇప్పుడంటే ఉన్న”ఒక్క నలుసు” కోసమే ఇరవై నాలుగు గంటలూ తాపత్రయం తల్లి తండ్రులకి!
మరీ వర్షాలు తీవ్రంగా ఉంటే స్కూలుకి ఆ సమయంలో రెండు మూడు రోజులు సెలవలు ఇచ్చేసేవాళ్ళు- పిల్లలందరూ స్కూల్ కి రావడానికి ఇబ్బంది పడతారనీను,అంత వర్షంలో ఇంట్లోంచి బయటకి రావడం ప్రమాదమనీను. నిజం చెప్పొద్దూ మనసులో ఘాట్టిగా దేవుడికి దండం పెట్టుకునే వాళ్ళం వర్షాలు తగ్గకూడదని!! అదేంటో దేవుడు కూడా రెండు మూడు రోజులు వర్షాలు ఆపకుండా కురిపించేవాడు మేము అడిగినప్పుడల్లా- ఎప్పుడో ఒక్కొక్కసారి తప్ప-అందుకనే అనేవారేమో “పిల్లలంటే దేవుడికి కూడా ముద్దే” ఎంచక్కా మామాట వినేవాడు!
నేను మాత్రం “తగ్గకూడదురా దేముడా” అని-అనేవాణ్ణి! “రా” అని దేముణ్ణి అంటే అర్ధం-ఆయన నాకు చాలా క్లోజ్ కాబట్టి- మా అమ్మ చెప్తూవుండేది దేవుడు మన ఇంట్లో లాంటివాడే- వాణ్ని- “వాడు”, “రా” అని అనొచ్చు-చనువుగా- ఏమీ అనుకోడు, పైగా మనతోనే ఉండిపోతాడు ఎప్పుడూ అని- అందుకనే- ఆ అలవాటు వల్లే కాబోలు- ఆయన ఇప్పటికీ నాతోనే ఉండిపోయాడు- “అచ్చంగా ఎప్పటికీ” అని కూడా అని చెప్తుంటాడు నాతో-దేవుడు మాట తప్పడనుకుంటా- మనలా కాదు ఆయన!!
అంచేత స్కూల్ సరిగ్గా తెరిచేవారు కాదు-దాంతో పాఠాలూ ఒక పట్టాన పూర్తిఅయ్యేవి కాదు; కొన్ని కొన్ని సబ్జక్ట్స్ మాత్రం ఎక్స్ట్రా క్లాసులు పెట్టి మరీ పూర్తి చేసేవారు.పబ్లిక్ పరీక్షలు కాకపొతే మాత్రం చెప్పని పాఠాలు పరీక్షల సిలబస్ లోంచి తీసేసి పరీక్షలు పెట్టె వాళ్ళు.
అందుకని వాటిని వానాకాలం చదువులు అనేవాళ్ళు- ఏ వానాకాలం చదువులు అయినా మాతరం అంతా బానే పైకి వచ్చాంగా మా జీవితాల్లో- కాదంటారా!!
ఇప్పుడు కలికాలం, డిజిటల్ కాలం, అన్నీ “E-చదువులేగా” ఇప్పుడు!
కక్కుర్తిగా,పీనాసితనంగా,పిసినారితనంగా ఉండేవాళ్ళని మనం చాలా మందిని కాకపోయినా కొంతమందిని అయినా చూసి ఉంటాం చిన్నప్పటినుంచి ఇప్పటివరకు. ఆ రోజుల్లో కంటే ఈరోజుల్లో ఇలాంటి వాళ్ళు ఎక్కువగా కనపడతారు.ఆ రోజుల్లో కొంతమంది అలా ఉండేవారు అంటే కొంతవరకు అర్ధం చేసుకోవచ్చు.ఎందుకంటే చాలా మంది మధ్యతరగతి వాళ్ళే ఉండేవాళ్లు సమాజంలో. డబ్బు ఉన్న వాళ్లలో పై రకంగా ఉండేవాళ్లు కొంతమంది,మరి కొంతమంది వాళ్ళ వరకు బానే ఖర్చుపెట్టుకునే వాళ్ళు,ఇతరులకి పెట్టాలన్నా,
ఇవ్వాలన్నా మనసు వచ్చేదికాదు.ఒకళ్ళో,ఇద్దరో మాత్రం విశాల హృదయంతో “నీ” “నా” అనే తేడా లేకుండా చూసేవాళ్ళు- ఖర్చు విషయంలో కూడా.
ఇదంతా ఎందుకు రాస్తున్నాను అంటే, "కక్కుర్తిగా,పీనాసితనంగా,పిసినారితనంగా” ఉండేవాళ్ళని “కౌపీనం గాళ్ళు” అని కూడా పిలిచేవాళ్ళు అప్పట్లో.ఇప్పట్లో ఆ పదం వాడుకా లేదు, చాలా మందికి అర్ధం కూడా తెలియదు.అసలు కౌపీనం అంటే అర్ధం తెలుసుకుందాం ముందు!
కౌపీనం అంటే "గోచి, లంగోటీ" అని అర్ధం- మళ్ళీ వీటికి అర్ధం అడుగుతే మాత్రం కష్టమే- సాధారణంగా సాధువుల, సన్యాసుల వస్త్ర ధారణ- గోచీ మాత్రమే పెట్టుకొనేవారు, అది తప్ప వాళ్ళ వంటి మీద ఇంకే ఆచ్చాదనా ఉండేది కాదు- ఈ రోజుల్లో కాదు లెండి.ఇప్పుడు వాళ్ళ ఫాషన్ కూడా మారిపోయింది- ట్రెండ్ ని బట్టి.
(కుస్తీ పోటీల్లో వస్తాదులు లంగోటి పెట్టుకుంటారు,జపాన్ లో ని “సుమోలు” కూడా లంగోటితో కనిపిస్తారు కదా)
సాధువులు, సన్యాసులు, స్వామీజీలు అంటే- వాళ్ళు జీవితంలో ఆధ్యాత్మిక మార్గానికి వెళ్లారు కాబట్టి అలా పరిమితంగా కట్టుకునేవాళ్ళు; ఒకటో, రెండో జతలు ఉంటాయి, అవి ఉతికి శుభ్రం చేసుకుని కట్టుకుంటారు- అవి దీక్షా వస్త్రాలు. కానీ, అన్నీ ఉన్నవాళ్ళకేం మాయ రోగం!ఉన్నవాళ్లు కూడా పై లక్షణాలతో ఉంటే- “కౌపీనం గాడు” అని, వాడివన్నీ “కౌపీనం లక్షణాలే” అని అనడం రివాజు అప్పట్లో-పూర్తి బట్టలు కట్టుకున్నా కూడా- మనసుకు గోచి పెట్టుకున్నట్టు లెక్క–అంతేగాని బౌతికంగా గోచీలు పెట్టుకునేవాళ్ళు కాదు లెండి వీళ్ళు-చూట్టానికి బాగుండదు కదా అందుకని వీళ్లూ బట్టలు వేసుకుంటారు.కాకపొతే రెండో మూడో జతలు ఉంటాయి-అవే అవే తిరిగి కట్టుకుంటూ ఉంటారు- దీక్షా వస్త్రాల్లాగా!
అదర్రా కౌపీనం తాలూకూ కధా కమామీషూనూ!!!
అంచేత మీరు పిసినారి అనే పదం వాడేటప్పుడు-దానికి ప్రత్యామ్నాయంగా కౌపీనంగాళ్ళు అని వాడవచ్చు.కొత్తపదం తెలిసినట్టూ ఉంటుంది పాతపదం మరుగున పడిపోకుండా కూడా ఉంటుంది అని నా ఆశ!ఎప్పుడైనా మీ తల్లితండ్రులు వాడే పాత పదాల్ని వింటూ ఉండండి- వాటినీ వాడుతూ ఉండండి మీ సంభాషణల్లో- ఆంగ్ల పదాలే కాదు!
మీ ఆస్తులేమన్నా అడిగానా మిమ్మల్ని-తెలుగు భాష ఎలాగూ మరుగునపడిపోతోంది ఇంగ్లీష్ ముక్కలతో కలిపి-ఆంగ్ల పదం లేకుండా మూడు నిమిషాలు ఈ తరంలో ఒక్కరు కూడా మాట్లాడ లేరు తెలుగు భాషలో. కనీసం పాత పదాల్ని అన్నా వాడండి- తెలుగు భాషలోని మాధుర్యాన్ని మీరు చవి చూసి అవతల వాళ్లకి కూడా రుచి చూపించండి. మన ఆస్తులే కాదు భాష కూడా- కాపాడుకోవాలి-ఏ జాతికైనా ఆస్తి, సంపదా భాషే- కాపాడుకోవాల్సిన బాధ్యత ముందు తరాలదే!
బాగా కోపం వచ్చినప్పుడు…… మరియూ ఏదైనా కమ్మనైన,ఘుమఘుమలాడే వంటకం వాసన తగిలినప్పుడు లోపల ఉన్న ఆత్మారాముడు అదాట్టుగా లేచినప్పుడు అప్రయత్నంగా మనం చేసే “ముఖవిన్యాసం”.ఇది ఇప్పటి వాళ్ళకి తెలియని,అప్పటి వాళ్ళకే తెలిసిన గొప్ప ప్రక్రియ.
పదాలలో చెప్పలేక కాదు కానీ ముక్కుద్వారా చేసే అసంకల్పిత చర్య,మాటల్లో కంటే సరి అయిన భావాలు ప్రకటించవచ్చు కాబట్టి దీని ద్వారా. “ముఖ భంగిమ” అని కూడా అనొచ్చు ముక్కుతోచేసినా,ఏంచేతంటే ముక్కు మీమొహంలొనే ఉందిగా,నా మొహంలో లాగా!
ఈ సరికి “ముక్కు పుటాలు ఎగరేయడం-ముక్కు పుటాలు ఆదరటం” అంటే అర్ధమైంది కదా.మరి ఇక, ఇప్పుడు,తక్షణమే ఒక్క సారి గుర్తు తెచ్చుకోండి,పై సందర్భాల్లో మీమొహం కూడా ఎలా అయ్యింటుందో గత స్మృతుల్లో-నా ఉద్దేశం పూర్వజన్మలోవి అని కాదు- ఇప్పటివే -మీరు ఇప్పటివరకు గమనించి ఉండరు.ఎందుకంటే కోపం వచ్చినప్పుడు అద్దం దగ్గరకి పరిగెత్తలేం కదా.అలాగని అవతల వాళ్ళమీద కోపం వచ్చినప్పుడు వాళ్ళని అడగలేం కూడా, నా మొహం ఎలా ఉందని,బాగుండదు కదా-అసయ్యంగా కూడా ఉంటుంది!
అలా అని అద్దం ముందు కోపాన్ని సాధన చేయలేం కూడా,ఎంచేతంటే ఎదురుగా కనపడేది మన మోహమే కదా- ముద్దు వస్తూ ఉంటుంది,కోపం ఎందుకు వస్తుంది.అలా అనుకుంటాం గానీ మనమొహం మనకే ముద్దుగా అనిపించకపోతే అవతల వాళ్ళకి అనిపించాలి అని ఎలా అనుకుంటాం చెప్పండి. “కాకిపిల్ల కాకికి ముద్దులాగా” కూడా-అవును మరి,లేపోతే కోకిల వచ్చి కాకిపిల్ల ముద్దుగా ఉందని చెప్తుందా,చోద్యం కాకపొతే -అలాగే మన మొహం మనకు ముద్దు- లోకులకు ఎలా ఉన్నా!
ఇప్పటికి విషయం పూర్తిగా అర్ధమైందిగా, ఆలస్యమెందుకు ఇంకోసారి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఈ వర్ణనా, వివరాలు గుర్తుతెచ్చుకోండి-బుర్రలోంచి ఫెడేలుమని ఈ భంగిమ వచ్చేస్తుంది మీ మొహంలో.మీరు ఎవరినన్నా తెలిసిన ఫోటోగ్రాఫర్ని ఫోటో తీయుంచుకోవడానికి ఏర్పాటు చేసుకోకలిగితే దానికి మించింది లేదు భేషుగ్గా ఉంటుంది;లేదూ ఇదిమరీ బాగుండదు అనుకుంటే ఒక సీ.సీ కెమెరా రూములో పెట్టించుకోండి. అప్పుడు చక్కగా కోపానికి కోపం వస్తుంది,ముక్కు పుటాలు అదురుతాయి మంచి భంగిమలతో-ఫోటో కూడా క్లిక్ అయివుంటుంది, వీడియో ఫుటేజ్తో బాటుగా. “చక్కనమ్మ చిక్కినా అందమే” అంటారు గానీ, చక్కనమ్మకి కోపం వచ్చినా అందంగానే ఉంటుంది- నా మాట అబద్దమైతే ఒక్క సారి ప్రయత్నం చేయండి!
అలాగే ఏదైనా కమ్మనైన,ఘుమఘుమలాడే వంటకం వాసన తగిలినప్పుడు కూడా పైన చెప్పినట్టు భావప్రకటన చేస్తారు కదా- దానికి ఋజువులు గట్రాలు అక్కర్లా- అక్కడున్న వాళ్లే అనేస్తారు-మీ ముఖ,ముక్కు భంగిమ చూసి!
నాకు మాత్రం మర్చి పోకుండా ఒక్క ఫోటో, వీడియో క్లిప్పింగ్ “వాట్సాప్” లో ఫార్వర్డ్ చేయండి ఎంచక్కా- నేను లైక్ కొట్టి అందరికి ఫార్వర్డ్ చేస్తా- పనిలోపనిగా ముఖ పుస్తకంలో- అదేనర్రా “పేస్ బుక్ లో” ఓ పోస్ట్ పడేస్తా- ఆ వేలితోనే “ఇంస్టాగ్రామ్” లో కూడా తోసిపడేస్తా- ఈ మూడిట్లో ఒక్కటన్నా లేనివాడు భూప్రపంచంలో ఉండరు కదా- మీకు బోలెడు లైకులు ఖాయం. అప్పుడు ఈ ప్రక్రియ ఓ అంటువ్యాధి లాగా పాకిపోతుంది-చైనావాళ్ళ“టిక్ టోక్” లాగా! మీ ఫోటోలు వీడియో నిషేదించరులెండి మోడీ గారు-“టిక్ టోక్” లాగా!
ప్రయత్నేఫలీ,ఇంకెందుకు ఆలస్యం-ఎవరు ముందుగా పంపిస్తే వాళ్లకు లాభం!!
గోరుచుట్టు లేవడం - ఇదేమిటి - వేలుపట్టున గోరు మొలుస్తుంది, లేస్తుంది, మరీ ఎక్కువగా లేచినప్పుడు కత్తిరించడం చేస్తాం, విన్నాం, చూసాం, చూస్తాం కూడా. మరి ఈ గోరు చుట్టు లేవడం ఏమిటి?
వేలు మీద గోరు మొలవడం అనేది మన వేలుకు రక్షణగానే గానీ,గోళ్లు పెంచి వాటికి రంగులు వేయడానికి మాత్రమే కాదు (ఒక్క ఆడవాళ్ళకి తప్పించి),ఎవరినీ రక్కడానికీ కూడా కాదు-నా ఉద్దేశం ఇంట్లో వాళ్ళని-మరీ ముఖ్యంగా మొగుణ్ణి అని మనసులో అసలు అర్ధం.అలా అని బయట కీచకులని ఉపేక్షించక్కర్లేదు-ఎవరైనా అపకారం తలపడితే మాత్రం రక్షణ కవచంగా రక్కడానికి పనికి వస్తాయి (ఆడపిల్లలూ ఇది మాత్రం గుర్తుంచుకోండేం) “ఆరోగ్యసేతు” యాప్ తన చరవాణిలో వేసుకున్నవాడిని రక్షించినట్టు(ఇది సర్కారు వారు అన్న మాట,నాది మాత్రం కాదండి బాబూ, అనవసరంగా నా మీద కాలు దువ్వకండి) “ఇంటికి గోడలాగా” రక్షణకన్నమాట!
ఒక్కొక్కసారి గోరుకు దెబ్బ తగిలినప్పుడు మనకు తెలియకపోవచ్చు- పరధ్యాసతో ఉండి కావచ్చు-గ్రహించక పోవచ్చు (చిన్నపిల్లలయితే వళ్ళు తెలియకుండా ఆడుతూ ఉండచ్చు)రెండు మూడు రోజుల్లో ఆ గోరు చుట్టూ- వేలూ గోరూ మధ్యలో అన్నమాట- చీము చేరి వేలు వాచిపోయేది.దానితో విపరీతమైన నొప్పితో బాధపడేవాళ్లం.ఆ రోజుల్లోదీనికి గృహవైద్యం మరియూ చిట్కా ఏమిటంటే-నిమ్మకాయకు చిల్లుచేసి వేలుకు గొడుగులాగా తొడిగేయడం క్రమేపి,రెండుమూడు రోజుల్లోఅది తగ్గిపోయేది. చేతిమీద పుట్ట గొడుగులాగా కనపడేది- పుట్టగొడుగు తినేవాళ్ళం కాదనుకోండి- కానీ మాకు బాగా కనపడేవి ఆరోజుల్లో మొక్కల మధ్యా,కుప్పల మధ్యా!!
ఈ రోజుల్లో అంటే ఏమాత్రం తేడా కనపడ్డా లగీసుకొని వెళ్తాము వెంటనే డాక్టర్ దగ్గరకు -వైద్యం చేయించుకోవడానికి! రెండు రూపాయిల నిమ్మకాయతో పోయేదానికి- డాక్టర్ ఫీజు, మందులు వెరసి తడిసి మోపెడు అవుతుంది.ఇప్పుడు ఆ రోజులనాటి నిమ్మకాయల చిట్కా వైద్యం లేదు కాబట్టి ఈ పదం వాడకంలో లేదు;కొన్నాళ్లకు ఈ పదమే కనుమరుగై పోతుంది మాతోపాటే!!!
ఏది ఎలా ఉన్నాఈరోజుల్లో గోరు చుట్టు లేకున్నా-చేతికి వేళ్ళు, వేళ్ళకి గోళ్ళు లేని మనుషులు ఉండరు- గోడలు లేని ఇళ్ళు ఉండవు ఈ సృష్టిలో;ఒకవేళ పొరపాటున మీ ఊళ్ళో ఆలాంటివాళ్ళు తారసపడితే మాత్రం ఫోటో పంపండి మరచిపోకుండా.
అదర్రా గోరుచుట్టూ ఉన్న గోరు పురాణం ఏదో నాకూ ఇలాగా తెలుగులో రోజుకొకసారి మిమ్మల్నందరినీ గోకక పోతే నా వేలుకీ, దానికున్న గోరుకీ దురద మరి ఏం చెయ్యను!!! గోళ్లు కత్తిరుంచుకున్నా వేలు దురదపెడుతుంది ఏమిటో!!!
అసలు గంజి అంటే ఎంతమందికి తెలుసు ఈతరంలో, అర్ధం తెలిస్తే సహజంగానే గంజి వార్చడం తెలిసిఉంటుంది(అత్తెసరు-అత్తకి ఎసరు అని అనుకుంటారు ఇప్పటి అమ్మాయిలు ఇదేదో తొందరగా నేర్చేసుకుంటే బాగుంటుంది అని కూడా అనుకుంటారు) “ఆవిరి వంట పాత్ర” (ప్రెషర్ కుక్కర్) వంట ఇంట్లో అడుగుపెట్టింది మొదలు క్రమేపీ ఈపద్ధతి దాదాపు కనుమరుగు అయిపోయింది.
ఆ రోజుల్లో ఎక్కువ పత్తిబట్టలకి (కాటన్ వస్త్రాలు) గంజిపెట్టాలి అంటే బియ్యం నూకలతో గంజి చేసేవారు;కాల క్రమేణా గంజిపొడి కొనడం మొదలు పెట్టారు. ఇప్పుడు కాటన్ వస్త్రాలు కట్టుకోవట్లేదు చాలామంది.ఏ కొద్దిమందో కొనుక్కుంటున్నారు,తీరుబడి ఉంటే గంజి పెడుతున్నారు.ఎండటానికి మండే సూర్యుడు ఉండాలి కదా(సూర్యుడు లేకుండా ఊరికనే జనానికి ఒళ్ళు మండి పోయే రోజులు కదా-ఇక సూర్యుడి అవసరం ఎవరికట)
అయినా ఇప్పటి తరం వేసుకునే బట్టలే వేరు,అదీ కాకుండా వీళ్లకి తెలిసినంత పొదుపు మనకి కూడా తెలియదు. బట్టలు చాలా పొదుపుగా, కురచగా వాడతారు)అదీ కాక ఆ బట్టలు ఆరేయటానికి అంత స్థలం ఏ ఇంట్లో ఉంది ఈ రోజుల్లో.ఈదెబ్బతో ఇన్ని అవస్థలు పడతామని గంజి పెట్టడం మానేశారు. ఆ గంజి పెట్టని ఇస్త్రీ బట్టలు వేసుకుంటే జ్వరం వచ్చిన రోగి నీరసంతో వాలిపోయినట్లుగా బట్టలు వాలిపోయి ఉంటాయి.“కర కరా” నిలబడకుండా (crisp గా) అని మనసులో భావం,అంతేగానీ “కురుకురే” కాదు.
డ్రై క్లీనింగ్ వాడికి వేసేవాళ్ళు ఉన్నారు,తక్కువ శాతం అనుకోండి.
ఏవిటో గంజిపెట్టిన నిటారుగా నిలబడే (పూర్వం పోలీస్ బాబాయ్ ఖాకీ లాగూ లాగా. కోసుగా ఉండేవి, నిమ్మకాయలు కోసుకోవచ్చు అన్నంత పదును గాగంజి పెట్టిన వాసన, గంజి ఎక్కువైతే నడుస్తున్నప్పుడుఆ చప్పుడే వేరు.
గంజి పెట్టిన బట్టలు ఎప్పుడు వేసుకుంటామో మరి.అప్పటివరకు గంజివార్చలేని అన్నం తింటూ బతికేద్దాం!!! ఇంత చదినాక కూడా “గంజి పెట్టడం” అంటే అర్థం తెలియని బాల మేధావులకి- నా ఉద్దేశం ఈ తరంవాళ్ళకి- “మీ భాషలో స్టార్చ్ పెట్టడం”!!!
సేవ రంధి
ప్రేమ రంధి
తిండి రంధి
ఆటల రంధి
కబుర్ల రంధి
నటన రంధి
నాట్యం రంధి
పాటల రంధి
పఠనం రంధి
వీక్షణం రంధి
చదువు రంధి
సంగీతం రంధి
తిరగడం రంధి
వాగడమే రంధి
సినిమాల రంధి
వాయిద్యం రంధి
చడవడమే రంధి
రాయడమే రంధి
సాధించడం రంధి
మాట్లాడటం రంధి
పడుకోవడం రంధి
పనిచేయడమే రంధి
కాలక్షేపం మీదే రంధి
వంట చేయడమే రంధి
ఇతరులకు సేవ చేయడం రంధి
నోరు మూసుకోక పోవడమే రంధి
సమయం వృధా చేయడమే రంధి
ఈ పాటికి చాలామందికి అర్ధం అయ్యేఉంటుంది నేను ఏం రాయబోతున్నానో;
ఇంకొంతమందికి,రంధి అనేపదం విననివాళ్ళకి అర్ధంకాకపోయిఉండొచ్చు.
మనలో ప్రతీ ఒక్కరూ పైన పేర్కొన్న వాటిల్లో కొన్ని కోవలకు చెందిఉంటాం సహజంగానే-స్వభావ రీత్యా,అభిలాష రీత్యా!!!
పై వాటిలో కొన్ని రంధిలకు నేను బానిసని,లాక్ డౌన్ ధర్మమా అని పనీ,పంగు లేకుండా కొత్తగా తిండి రంధి పెరిగిందని అనిపిస్తోంది ఇంట్లోనే కూర్చోవడం మూలాన-అలా అని బయటకు వెడదామంటే కోవిడ్ భయమాయే.ఈ రంధి పెరగకుండా ఉండటానికి పైనపేర్కొన్నవాటిలో నాకు మక్కువైన వాటి మీద ఎక్కువగా రంధి పెడుతున్నా.
మీపరిస్థితి ఏమిటో కూడా గుర్తించి మీరంధితో జాగ్రత్త పడండి,ఎందుకూ మాట పడటం-తిండి కాకుండా మక్కువైన మీ మిగిలిన రంధి కొనసాగించండి.
ఇప్పటికి కూడా దీని అర్ధం తెలియని వాళ్ళ కోసమే సుమా!(సుమకి తెలియని విషయమే ఉండదాయే!)
“రంధి” అంటే ధ్యాస!!
వెధవ అనడంలో ఆప్యాయత కనపడుతుంది.ఛీత్కారంతోనో కోపంతోనో అంటే వేరే అర్ధం అనుకోండి.వెధవ అని అననివాడు,అనిపించుకోకుండా ఉన్న మానవమాత్రుడు ఈ భూప్రపంచంలో ఉండడు అంటే అతిశయోక్తి అలంకారం అయితే కాదు;మీ సంగతి చెప్పండి.కాదు అని గుండె మీద చెయ్యి వేసుకొని,ఒట్టు వేసిమరీనూ,ఒట్టు తీసి గట్టు మీద పెట్టడాలు లేవు తర్వాత!
కాకపోతే ఒక్క తెలుగువాళ్లకు తప్పితే,తెలియని పదం కాబట్టి, అనిపించు కోవాలన్నా, అనాలన్నా తెలుగు వాళ్ళకే పరిమితం చేద్దాం.అయినా మన తెలుగువాడు లేని దేశం ఏదైనా ఉందా ప్రపంచపటంలో.ఢంకా బజాయించి చెప్పగలను లేదని-ఆమధ్య ఏదో మాటల్లో ఉండగా “పిచాయ్” ని అడిగా ఇది.
కొద్దిగా ఉక్రోషంగా అవును అన్నాడు;కొద్దిగా ఉడుకుమోత్తనం వినిపించింది ఆ గొంతులో(తాను తెలుగు వాణ్ని కానందుకు)-మా పక్కరాష్ట్రం వాడివే కదయ్యా నువ్వయినా అని అన్నాఊరడింపుగా.
అయినా గురజాడ అప్పారావుగారే గిరీశం చేత కన్యాశుల్కంలో అనిపించేశారు కదా “మనవాళ్ళు ఉట్టి వెదవాయలోయ్” అని,అంత పెద్ద ఆయనే అన్నాడంటే అది తిట్టుకాదు,దీవెనే మరి.
మన చిన్నప్పుడు రోజులు గుర్తుతెచ్చుకుంటే మన పెద్దవాళ్ళు ఆప్యాయతతో అన్న సందర్భాలు కోకొల్లలు“ఒరే వెధవా” అన్న మాటలో ప్రేమా,ఆప్యాయత ధ్వనించలా.
స్కూల్లో కూడా మాష్టార్లు ఒక్కక్క సారి ఇలాగే పీల్చేవారు కూడా.తిట్టుగా కాదు నవ్వుతూ ఆప్యాయతతో;నాకైతే అలాగే అనిపించేది.మీరు కూడా ఒక్కసారి “రింగులు రింగులు” వేసుకొని కళ్ళు మూసుకొని గతంలోకి ఒక్కసారి వెళ్లి ఆ సంఘటనలు మననం చేసుకోండి.ఖచ్చితంగా నాలెక్క ప్రకారం ఇప్పుడు మాత్రం అలాగే అనిపిస్తుంది, అప్పుడు మీకు అనిపించకపోయినా!!!
“వెదవ్వేషాలు వెయ్యకు” అని ఎప్పుడైనా మీ నాన్న అని ఉంటే,దానికి రెండు కారణాలు ఉంటాయి.ఆయనా చిన్నప్పుడు ఇవే పనులు చేసుంటాడు,వాళ్ళ నాన్నతో దొబ్బులు తిని ఉంటాడు;రెండో కారణం ఆయన తన చిన్నతనంలో ఈ వేషాలు వేయనందుకు, ఉక్రోషంతో నిన్ను వెదవ్వేషాలు వేయకు అని ఉంటాడు.
నా ఊహా,అంచనా తప్పదు.
కావాలంటే మీనాన్నని ఇప్పుడు అడుగు, ఒప్పేసుకుంటాడు టపీమని అవన్నీ తప్పి పోయినందుకు -ముసి ముసి నవ్వులతో రెండో మూడో కంట్లో నీళ్లతో సహా- అదే ఆనంద బాష్పాలతో అన్నమాట.దీనికి కారణం “రాముడు మంచి బాలుడు” అని అందరి చేత అనిపించు కోవాలనే తాపత్రయం, దుగ్ధానూ ఆయనకు తన చిన్నతనంలో!!
నువ్వు పెద్దవాడివి అయ్యావు కదా ఎలాగూ- అదీ కాకుండా నీకూ జీవితంలో,ఇంట్లో పదోన్నతి కలిగిందిగా.నాలుగు ఏళ్ళు ఆగితే నువ్వూ ఈ పదం వాడతావు మీపిల్లాడితో.
తెలుగు భాషలో ఇలాంటి పదాలు కోకొల్లలు,వీటితో వచ్చే ఆప్యాయతలు, మాధుర్యాన్ని తప్పిపోతున్నారు ఈ రోజుల్లో చాలామంది.
తెలుగుని ప్రేమించండి మీపిల్లల్ని ప్రేమించినట్టు-మనమంతా తెలుగు బిడ్డలమే కదా ఈ హద్దులు లేని ప్రపంచంలో.ప్రపంచ సరిహద్దులు చేరిపేసి “మాకు ఎల్లలు లేవు” అని ప్రతీ దేశానికి వెళ్లి అక్కడ తిష్ట వేస్తున్నారు.ఈ రోజుల్లో తెలుగు వాడికి పరిచయంఅవసరం లేదు, వాడి ప్రతిభే వాణ్నిపరిచయం చేస్తోంది ప్రపంచానికి.నిజానికి తెలుగు వాడికి ప్రతిభ ఉంది కాబట్టే ఎక్కడ అడుగిడినా రాణిస్తున్నాడు.
తరతరాల నుంచి సాంప్రదాయంగా వస్తున్న పదం.మీ పిల్లకాయలకి తెలుగు బాగా రాకపోయినా మీరు ఇప్పుడు ఈపదం వాడుతూ ఉండండి.మా నాన్నేదో వెరైటీ గా తిట్టాడు అని సంబరపడి వాడి స్నేహితులతో చెప్పుకుంటాడు గొప్పగా.
వెదవ - వేళ్ళతో దవడ పై వడ్డించు
వెధవ - వెయ్యేళ్లు ధనముతో వర్ధిల్లు
చివరగా మిమ్మల్ని వెధవ అని దీవిస్తున్నా-“వెయ్యేళ్లు ధనముతో వర్ధిల్లండి”
తెలుగు మాట్లాడుతూ,చదువుతూ, రాసే వాళ్లకు మాత్రమే ఈ దీవెనలు!!!
పల్లెటూరు నేపధ్యం, వ్యవసాయం ఉన్న వాళ్ళకి, సుపరిచితమైన పదం ఇది
వారి దైనందిన జీవితంలో.దీని యొక్క ప్రాతినిధ్యం,ఇబ్బందులు పల్లెవాళ్ళకి
తెలిసినంతగా పట్నంలో ఒకరికో ఇద్దరికో తెలిసిఉండవచ్చు!
“కలుపుకు తిరిగే ప్రతీ ఒక్కరూఆత్మీయులు కానట్టే” పంటలో కలుపుమొక్కలు కలిసిపోతాయి.పంట దిగుబడి తగ్గకుండా అసలు ధాన్యం (పంట) తీసుకోవాల్సిన సారం ఈ కలుపు మొక్కలు తీసుకోకుండా రైతు ఎప్పటికప్పుడు ఏరిపార వేస్తాడు చేనులో నుంచి.
రైతు ఏ మాత్రం అశ్రద్ధ చేసినా అవి దట్టంగా పెరిగిపోతాయి.అసలు పంట మొక్కలు నీరసించి మంచి మరియు రావాల్సిన దిగుబడి ఇవ్వవు.కలుపు మొక్కలు పంటలో కలిసిపోయి కలుపుకు పోయేమొక్కలు కనపడటానికి.
ఇప్పటికీ ఇది అర్ధంకానివాళ్ళుఈ సారి ఆకుకూరలు, కొత్తిమీర కొని ఇంటికితెచ్చిన తర్వాత చూడండి.రైతు ఎంత జాగ్రత్తపడినా ఒకటో రెండో కలుపుమొక్కలు అందులో ఉండిపోతాయి,అవే మనం తీసి అవతలపడేస్తాం-ఆ ఆకుకూరలు వాడే ముందు.
అలాగే మనం నివసించే ప్రపంచంలో కూడా రకరకాలవాళ్ళు ఉంటారు,ఆ కలుపుకుపోయేవాళ్లలో కొందరు కలుపు మొక్కలు ఉంటారు పొలంలోమల్లే. అక్కడ ఏరి పారేస్తాం-ఇక్కడ వీరికి దూరం జరుగుతాం- ఏరి పారేయలేం కాబట్టి!!!
ఇది గ్రహించి ఏమాత్రం జాగు చేసినా,గ్రహించక పోయినా జీవితంలో చాలా నష్ట పోవల్సి ఉంటుంది.భద్రతతో అప్రమత్తంగా మెలగాల్సిన వాళ్లం మనమే.
వాతాపి- ఇల్వళుడు ఇరువురూ రాక్షసులు మాయా రూప విద్యలు తెలిసిన వాళ్ళు-దారిన పోయే వాళ్ళని భోజనానికి పిలిచే వాళ్ళు.ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం “వాతాపి” మేక రూపం ధరించే వాడు, ఇల్వళుడు ఆ మేకని చంపి వచ్చిన అతిధులకి భోజనంలో ఓ వంటకం కింద వడ్డించేవాళ్ళు.
ఆ అతిధులు తినడం పూర్తవగానే ఇల్వళుడు “వాతాపి బయటికి రా”అనేవాడు.మేక రోపంలో ఆహరంగా మారి అతిధుల పొట్టలో ఉన్న వాతాపి అతిధుల పొట్టలు చీల్చుకొని బయటకు వచ్చేవాడు.అప్పుడు వాళ్ళిరువురు చనిపోయిన బాటసారుల వద్ద ఉన్న ధనాన్ని దోచుకునేవారు,ఇది వాళ్లకి నిత్యకృత్యంగా, దినచర్యగా మారింది.
ఓ రోజు అటుగా అగస్త్యమహాముని రావడం తటస్తించింది- ఆయన అగస్త్య మాహా ముని అని ఈ ఇరువురి రాక్షసులకు తెలియదు, ఆయనని చూసిన “వాతాపి- ఇల్వళుడు” ఆ మునిని వారి ఆతిధ్యం స్వీకరించమన్నారు.అగస్త్యుడు కూడా ఆనందంగా అంగీకరించాడు-అనుష్టాలు అన్నీ ముగించుకుని భోజనానికి సిద్ధమయ్యాడు.ఎప్పటి మాదిరిగానే, భోజనంలో మేక రూపంలో ఆహరంగా మారిన “వాతాపి” ముని పొట్ట లోపలకి చేరిపోయాడు.
(అగస్త్య మహాముని మాంసాహారం తినడం ఏమిటి అనే సందేహం కొంతమందికి రావొచ్చు- చాలా మందికి తెలిసిన విషయమే అయినా ఇక్కడ కొద్దిగా ఉపాఖ్యానానికి వెళ్తాను. జన్మతః బ్రాహ్మలు కాని, బ్రాహ్మణేతరులు అయిన మహానుభావుల్ని ఎందరినో ఇప్పటికీ యజ్ఞ యాగాదులలో హవిస్సులూ ఇస్తున్నాము- పూజిస్తున్నాం కూడా- ఈ సమాచారం వజ్రసూచికోపనిషత్తు ప్రకారం- ఈ కోవకి చెందినవాడే అగస్త్య మహామునీశ్వరుడు కూడా) అగస్త్యమహామునికి వీళ్ళు బాటసారుల మీద ప్రయోగిస్తున్న మాయ విద్యలు, తెలిసిన వాడటం వల్ల,తన పొట్టలో వాతాపి మేక రూపంలో ఉన్నాడని తెలియడం వల్ల -భోజనానంతరం ఇల్వళుడు “వాతాపి బయటకి రా” అనే లోపే అగస్త్యమహాముని “జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం” అన్నాడు;ఆ దెబ్బకి లోపల ఉన్న వాతాపి జీర్ణమయిపోయాడు మహాముని పొట్టలోనే.
అందుచేతే అందరు తల్లులు ఆ రోజుల్లో, మా రోజుల్లో పిల్లలకి పాలు పట్టగానే “జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం” అనే వాళ్ళు-చిన్నపిల్లలకి పొట్టలో ఏ ఇబ్బందీ లేకుండా పాలు అరిగిపోవాలని.ఈ రోజుల్లో కూడా అమ్మమ్మలు, నానమ్మలు ఇళ్లల్లో ఉంటే వాళ్ళ మనుమలు, మనుమరాండ్రలకి ఇలా చేయడం మనం చూడొచ్చు.
ఈ కధ నేనిప్పుడు ఎందుకు చెప్తున్నా అని అనుకుంటున్నారా-మనం అగస్త్య మాహాముని లాంటి గొప్పవాళ్ళం కాకపోయినా,సామాన్యులమైనా- ప్రస్తుతం ప్రపంచంలో-మన చుట్టూ చేసుకున్న పరిస్థితుల్లో ఈ “కోవిడ్- రాక్షసి” వాతాపి లాగా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎదుటి వారి అజాగ్రత్త వల్ల మన పొట్టలోకి ప్రవేశిస్తాడు -ఇక్కడా ఇల్వళుడు లేక పోలేదు- చైనా రాష్ట్రపతి “షీ జీ పింగ్” ఇల్వళుడే మరి.
అందుకని మీరు భోజనం చేసిన ప్రతిసారి "జీర్ణం జీర్ణం కొవిడ్ జీర్ణం” అని అనుకుంటూ ఉండండి మీ పొట్టమీద రాసుకుంటూ- ఈ మంత్రానికి వాతాపి లాగా కొవిడ్ రాక్షసి మీ పొట్ట లోపలే చచ్చి ఊరుకుంటుంది.
పూర్వం “ఏ పుట్టలో ఏ పాముందో” అనే వారు-పాము సంగతి, పుట్ట సంగతి తెలియదు కానీ, అందరి పొట్టల్లోకి కొవిడ్ రాక్షషి ప్రవేశించటానికి మాత్రం అవకాశం ఉంది.అంచేత మీరందరు నా మాట విని ఎంచక్కా రెండు పూటలా ఈ మంత్రాన్ని ఉచ్ఛరించండి.
మీకు తెలియకుండానే ఒక వేళ మీ పొట్టలో కనక అది దూరి ఉంటే నే చెప్పిన మంత్రంతో మీ పొట్ట సురక్షితం అయిపోతుంది“మోడీ గారు చెప్పినవి వింటారు కదా-మరి నేను చెప్పింది కూడా చెయ్యండి మరి!”
ఏదో ఈ సందర్భంలో వాతాపి గుర్తుకొచ్చాడు,అందుకనే ఇంత రాయాల్సి వచ్చింది మరి- మీరెవరూ నే చెప్పినది చెయ్యకపోయినా మా చిన్నప్పటి కధ మీ అందరికీ గుర్తు తేవడం నాకు మాత్రం ఆనందంగా ఉంది! “జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం” అనే మాటలు ఎందుకు వచ్చాయో తెలియని వాళ్లకి దాని మూలాలు తెలుస్తాయి కనీసం!
సకల జీర్ణ ప్రాప్తిరస్తు- అలా ఏది పడితే అది తినబోకండి!
ఈ పదం తెలుగు నిఘంటువులో కూడా ఉండదేమో ఈరోజుల్లో, నలభై దశాబ్దాల వయసు మీదపడిన వాళ్ళకితప్ప ఎవరికి తెలియకపోవచ్చు.ఏదో కొన్నిఇళ్ళలో వాడుకలో ఉంటే-ఇప్పటి తరంలో బహుశా కొద్దిమందికి తెలియడానికి అవకాశం ఉంది.
పిల్లలందరూ మా చిన్నతనంలో భోజనాలకి కలిసి కింద కూచ్చునేవాళ్లం.ఎవరు ముందు తింటే వాళ్లు గబగబా లేచి ఆ తిన్న చేతితో,తడితో ఒక అచ్చులా చేతి ముద్ర వేసేవాళ్లం,ఇంకా తిననివాళ్ళ కంచాల పక్కన.అంటే అందరికంటే వాళ్ళు ముందుగా తిన్నట్టు.ఇలా చేతిముద్ర వేయడాన్ని సొడ్డు అనేవారు.
ఈ ప్రయోగాన్ని పెద్దవాళ్ళు కూడా అప్పుడప్పుడు వాడేవారు.పిల్లలు కబుర్లు చెప్పుకుంటూ ఎంతసేపటికి తిండి దగ్గరనుంచి తెమలకపోతే-ముందు సొడ్డు కొట్టిన వాళ్ళకి ఆదిఇస్తాం,ఇదిఇస్తాం అని ఆశ చూపించేవాళ్లు.
చిన్న పిల్లలంకదా,ఆ ప్రలోభాలకు పడిపోయి అందరం గబగబాతినేసేవాళ్ళం,
ముందుగా ఎవరికి వాళ్లే సొడ్డు కొడదామని!
కొన్ని కొన్ని ఆటల్లో కొంతమంది పిల్లలు-అవతల వాళ్ళను “ఔట్” చేసినట్టుగా
చెప్పడానికి సోడ్లు అనే పదం వాడేవాళ్ళు!
అదర్రా సొడ్డు కధ!!!
ఈరోజుల్లో వాళ్ళకి ఈపదమే తెలియదు,ఇక అర్ధం అడగడం వ్యర్ధం,అందుకే నేను వివరిస్తా.అయినా ఈ లక్షణాలు ఉన్వాళ్లు వీళ్లకి తెలిసిన వాళ్లలోఉండకుండా ఉంటారంటారా.ఎదో వీళ్ళకి తెలిసిన పదాలతో పిలుస్తూ ఉండొచ్చు.ఇది చదివిన తర్వాత కొత్తపదం ఒకటి తెలుస్తుంది కదా,వీళ్ళకి కూడా.జ్ఞానం విజ్ఞానం పంచాలి, పెంచాలి కదా.
మనతరం వాళ్ళ సంగతి ఎందుకులేండి,గోరోజనం గాళ్లని “తలలో వెంట్రుకలంతమందిని” చూసుంటాం.వీళ్ళతో వేగి వేగి, ఇక వేగ లేక ఆ వెంట్రుకలు చాలావరకు ఎప్పుడో రాలిపోయాయి.
గోరోజనం-గోరు, జనం కాదు-“గర్వానికి ఎక్కువ అహంకారానికి తక్కువగా ఉన్నావాళ్ళు”.కనపడని గర్వం, అహంకారం,ఈరెండూ పుష్కలంగా ఉంటాయి.కానీ,వీళ్లకి ఉన్నతెలివితేటలవల్ల అలా కనపడరు.వీళ్ళ తెలివితేటలు ఎలా వుంటాయంటే వాళ్ళ స్వభావాన్ని ఎక్కువ బయటపడకుండా జాగర్త పడతారు.
వీరిని అప్పుడప్పుడు కలిసేవారికి వీరి స్వభావం పట్టుకోవడం కష్టం.కానీ వీరిని తరచూ కలిసేవారికి మాత్రం తెలుస్తుంది.ఎందుకంటే వీళ్లు ఎక్కువసేపు వాళ్ళ స్వభావం-అదే “గోరోజనం” బయటపెట్టకుండా ఉండలేరు.లోపలున్న మనిషి తన్నుకోని వస్తాడు.వీళ్ళని అప్పుడప్పుడు కలిసేవాళ్ళు మాత్రం వీరి మీద సదభిప్రాయంతోనే ఉంటారు.
వీరితో సన్నిహితంగా ఉన్నవాళ్ళు వీరి స్వభావం తెలిసినా సర్దుకుపోతారు,అంతే గానీ, అవతల వాళ్లకి- వీళ్లకి సమాధానం చెప్పడం చేతకాక గానీ, చెప్పలేక గానీ కాదు.ఈ విషయం గోరోజనం గాళ్ళు గ్రహించలేరు,వారికున్న స్వభావ రీత్యా. అందుకని వాళ్ళు చాలా తెలివిగలిగిన వాళ్ళం అనే భ్రమలోబతికేస్తుంటారు.మన చుట్టూ ఉన్న సమాజంలో వీళ్ళలాంటివాళ్లు ఒకళ్ళు,ఇద్దరు తారస పడతారు.
వదిలేద్దాం వాళ్ళ మానాన వాళ్లని,మనకి పోయేదేమీ లేదు.బతక నీయండి అలాగే ఎదో ఒకచోట పాఠంనేర్పే మనిషి వీళ్లకి ఎదురవుతాడు,ఆందరూ అందరి లాగా ఊరుకోరు కదా. ఎవడో ఏసుకుంటాడు,ఇరగతీస్తాడు.
వీళ్ళ లాంటివాళ్ళ మన “సహజలక్షణాలు” మార్చుకోనక్కర్లా.అలా మారితే వాళ్లచెడ్డలక్షణాలు మనల్ని ప్రభావితం చేసినట్టే కదా.మన సహజమైన ఉపకారగుణం, ప్రేమ తత్వం మనం మార్చనక్కర్లా.కొంతమందికి ఈ నాఅభిప్రాయం సమ్మతం కాకపోవచ్చు.వాళ్ళని బట్టే మనమూ మారాలి అనుకోవచ్చు.నాకు ఆ ఆలోచన,ఆ తత్వం నచ్చదు.ఎవర్నీ బలవంతం చెయ్యను నాలాగే ఉండమని,నాతత్వమే సరి అయిందనీ.ఎందుకంటే ఈ ఆలోచనలు ఎవరి స్వభావాన్ని బట్టి ఉంటుంది.
ఇక్కడ నాకు చిన్నప్పటి నుంచీ చాలాఇష్టమైన కధ చెబుతా,బహుశా మీలో చాలా మందికి తెలుసు కూడా. “చర్విత చరణం” అయినా మరొక్కసారి ఈ సందర్భంగా మననం చేసుకుంటూ మీదృష్టికి తేవాలనే కుతూహలం తో...
ఒకానొక పల్లెటూరులో చిన్న పిల్లకాలవ ఉంటుంది.ఒక సన్యాసి ప్రయాణం చేస్తూ ఆ పల్లె మీదుగా,ఆ పిల్లకాలువ దగ్గర ఆగిపోతాడు,ఒక చిన్నదృశ్యానికి ఆకర్షితుడై.ఒక తేలు ఆనీటి ఒరవడికి కొట్టుకుపోతూ ఉంటుంది.తన వంతు ప్రయత్నాలు చేస్తోంది ఒడ్డున పడటానికి, గట్టున చేరడానికి.అప్పుడు ఈసన్యాసి తన చేతివేలు అందిస్తాడు,అది ఆలంబనగా తీసుకొని ఆ ప్రాణి ఒడ్డున పడుతుందని. ఈప్రయాసలో ఆతేలు సన్యాసి చేతి వేలు దొరకబుచ్చుకుంటుంది.వెంటనే ఆయన వేలుని కుడుతుంది.ఆ ప్రయత్నంలో మళ్ళీ నీళ్లలో పడిపోతుంది.మళ్లీ సన్యాసి అదే సహాయం చేస్తాడు.ఆతేలు మళ్ళీ కుడుతుంది.ఇది పలుమార్లు జరగటం చూసి అదే దారినపోయే “దానయ్యలు కాదు”,ఆ ఊరువారే.
“ఏమయ్యా పిచ్చి సన్యాసి, ఆతేలు అలా వదలకుండా,సహాయం చేసే నిన్నే కొడుతుంటే, “వెఱ్ఱిబాగులవాడివి” కాబోతే ఎందుకయ్యా,నీ మానాన నువ్వు వెళ్ళి పోక-దాని కర్మకి వదిలేసి”.
అప్పుడు సన్యాసి: “అది చచ్చిపోతానని తెలిసికూడా,చచ్చిపోయే సమయంలోకూడా దాని “సహజ స్వభావాన్ని”వదలనప్పుడు,ఒడ్డున ప్రాణాలతోఉన్న నాసహజస్వభావాన్ని వదలగలనా!!!”
ఎదుటి వాళ్ళ లక్షణాలు వాళ్ళదగ్గరే ఉండనివ్వండి.మనకు సహజంగా భగవంతుడు మంచిలక్షణాలు ఇచ్చినప్పుడు ఇలాంటి అడపాదడపా తారసపడే వాళ్ళకోసం మనం మారడం ఏం వివేకం,విజ్ఞత-మనస్వభావంవల్ల వాళ్ళు మేలు పొందొచ్చు,మన సహాయం కోసం వాళ్లు అడగొచ్చు.ఇలాంటి వాళ్ళకి ఎందుకు చేయాలనే ఆలోచన రానివ్వకుండా మన సహజస్వభావం ప్రకారం నడుచుకుందాం.
అలాకాకుండా ఉండాలని మీ మనసు, మెదడు చెబుతాయి.ఒక రకమైన ప్రతిస్వభావంతో-అక్కడ కావలసింది విజ్ఞత గానీ, ప్రతీకారంగా ఉండటమో,కసి తీర్చుకుందామనో,వారి మనస్తత్వానికి బుద్ధి చెబుదామనో ఉండనవసరం లేదు.సందర్భం వచ్చినప్పుడు వారికి అర్ధమయ్యే భాషలో చెప్పాలి.
ఇది పూర్తిగా నా అభిప్రాయం,అభిలషణీయం.
మీకు తెలిసిన వాళ్లలో,నాకు తెలిసినవాళ్లు,నాకు తెలియకుండా ఇలాంటివాళ్లు ఉంటే(తికమకగా ఉందా!) కొద్దిగా వాళ్ళపేర్లు చెప్పి పుణ్యం కట్టుకోండి. ఎప్పుడైనా,
ఇకనైనా ఎదురు పడితే జాగర్త పడతా- నేను అమాయకుణ్ణి అని మీకూ తెల్సుగా!! ఉంటా మరి!!