ఆస్థానవిదూషకుడు8 mins Read

నగర సంకీర్తన18 mins Read

మితభాషి!18 mins Read

“తేలురాయి”ఉంగరం18 mins Read

చద్దన్నం18 mins Read

పీట!!18 mins Read

“డొంక” ఈ పదం విన్నారా... అసలు డొంక అంటే ఏంటి!!! 18 mins Read

వంటఇంటి గడప18 mins Read

ఒట్టు - నమ్మకాలు18 mins Read

నమలడం - చూయింగ్18 mins Read

మజ్జిగ అలవాటు ఎందుకు పోయింది8 mins Read

బుడగలు18 mins Read

ఆంధ్రా భోజనాలు - రోటి పచ్చళ్ళు!18 mins Read

గానుగ – గానుగెద్దు18 mins Read

మొదటి కృష్ణుడు - రెండవ కృష్ణుడు18 mins Read

పరమపదసోపాన పటము18 mins Read


divider

ఆస్థానవిదూషకుడు

రాజులకాలంలో ఆస్థానవిదూషకులు ఉండేవారు,వీరి పని హాస్య ప్రసంగాలు చేయడం, హాస్య సంభాషణలు, చతురోక్తులని సభలో విసరడం.ఛలోక్తిగా మాట్లాడుతూ చమత్కారపూరితంగా ప్రశ్నలువేసి సభలో వివిధవ్యక్తుల నుంచి సమాధానాలను రాబట్టడం.చిక్కుప్రశ్నలని వేస్తూ సభలో సభ్యుల మేధస్సుకు పదునుపెడుతూ ఉండటం, సమయస్ఫూర్తిగా మాట్లాడుతూ ఉండటం కూడా వారి దైనందిన జీవితంలో ఓభాగం.

దీనివల్ల సభలో ఒక సామరస్యపూరితమైన, ఆహ్లాదభరితమైన వాతావారణం నెలకునేది; ఏదైనా ఓ గంభీరమైన సమస్యవల్ల సభ వేడెక్కిపోయినా విధూషకుడు ఆ వాతావరణాన్ని చల్లపరిచేవాడు తన మాటలతో. ఏదో విదూషకుడు అనగానే సరదాగా జోకులు వేయడం, హాస్యంగా మాట్లాడటమే వృత్తిగా ఉన్నవాడు కాదు.రాజుదగ్గర అందరికంటే కాస్త చనువు ఎక్కువ ఉన్నవాడు, చనువు తీసుకోగలిగినవాడు కూడానూ.ఒక్కోసారి పరిమితులు దాటికూడా మాట్లాడే చొరవ, ధైర్యం సామర్ధ్యం, సమయస్ఫూర్తి కూడా ఉన్నవాడు.
ఒక్కోసారి రాజుగారు తీసుకునే నిర్ణయాలు బాగులేకపోయినప్పుడు, సమంజసంగా అనిపించకపోయినప్పుడు సభలోని సభ్యులకు మాట్లాడే ధైర్యం ఉండేదికాదు.ఆ సమయంలో విదూషకుడు చొరవ తీసుకుని అదే విషయాన్ని రాజుగారికి, ఛలోక్తిగానో, వ్యంగ్యంగానో వ్యాఖ్యానిస్తూ ఉండేవాడు.రాజుల మేధకు కొదవలేదు కదా, ఈ విదూషకుని మాటల్లోని అంతరార్ధాన్ని ఇట్టే పసికట్టేవాళ్ళు. విషయం అర్ధం అయ్యి తాను తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడమో,సరిచేయడమో చేసేవాళ్ళు రాజులు.

ఓసారి రాజుగారితో వ్యవహారం, కత్తిమీదసాము లాగానే ఉంటుంది; అలాంటి సమయాల్లో, “కర్ర విరగకుండా,పాము చావకుండా” అన్నట్టుగా చాలా చాకచక్యంగా వ్యవహిరించాల్సి వస్తుంది-లేదంటే ఓసారి ప్రాణాలకే ప్రమాదం కూడా.అదీసంగతి, ఆస్థాన విదూషకుడు అంటే ఆషామాషీ వ్యవహారంకాదు. అలాంటి విదూషకుల్నివ్యావహారిక భాషలో ఓ తమాషా వ్యక్తిగా (హాస్యమే చేసేవాడిలాగా) చిత్రీకరించేవాళ్ళు, అందుకనే ఈ రోజుల్లో కూడా కొంతమంది ఎవరైనా ఎక్కువగా హాస్యంగా మాట్లాడినా వాళ్ళని విదూషకులు అని పిలుస్తూ ఉండటం- విదూషకులతో పోల్చడమో పరిపాటి అయిపొయింది.

కొన్ని కుటుంబాల్లో హాస్యం పాళ్ళు ఎక్కువ ఉన్నవాళ్ళని వాళ్ళ ఇంట్లోవాళ్ళు“వీడు మా ఆస్థాన విదూషకుడు” అని కూడా అనడం జరుగుతూఉండేది.ఇప్పుడు కాదు లెండి,అంత హాస్య చతురత, హాస్య గ్రంధులు ఇప్పటివాళ్లలో ఎక్కడ ఉంటున్నాయి కనుక. ఇంట్లోవాళ్ళతో మొహం మాడుచుకోవడం- బయటకెళ్లితే మాత్రం ఏదో “డెంటల్ క్లినిక్” వెళ్లినట్లో,“క్లోజ్ అప్” టూత్ పేస్ట్ ఏడ్వర్ టైజ్మెంట్ అన్నట్టు 32 పళ్ళూ బయటి పెట్టి ఇకిలించడం- అయినదానికీ, కానిదానికీనూ.ఓ వేళ ఇంట్లోవాళ్ళు సరదాకి అన్నా నామోషీగా ఫీల్ అయ్యేవాళ్లే ఎక్కువ.

ఇప్పటికే "వీడెవడ్రా బాబూ, రోజూ విసిగిస్తాడు" అని అనుకుంటూ ఉండుంటారు ఈరోజుకి ఇది చాలు, ఇక ఉంటా

divider

నగర సంకీర్తన

సూర్యుడికి, మనం నిద్రలేచే సమయానికి ఏ మాత్రం సంబంధం లేకుండా లేస్తున్న రోజులు ఇవి; ఇప్పటి “పిల్లకాయలు” -పుల్లింగానికి, స్త్రీలింగానికి ఇదే పదం-అందుకని అబ్బాయిలూ, అమ్మాయిలూ అని అర్ధం అనుకోవచ్చు(తెలుగు వ్యాకరణంలో నిష్ణాతుణ్ణి అయితే కాదుగానీ, ఈ వివరణ సరి అయినదే అనుకుంటున్నా) మీలో చాలామందికి ఓ శంక రావొచ్చు- మనం లేవడానికి- సూర్యుడికి సంబంధం ఏమిటి- “అసలు సూర్యుడికి ఎందుకు మనం ఎప్పుడు లేస్తే” అని!

సూర్యుడికి ఏమీ అవదు - అయన ప్రతినిత్యం ఠంచనుగా అయన రావాల్సిన సమయానికి 365 రోజులూ వస్తాడు- కాకపోతే మేఘాలవల్లో,చలివల్లో మనకు కనపడకపోవచ్చు- ఆయన రావడం మాత్రం ఖాయం- ఏ మాత్రం సెలవల్లేకుండా పనిచేస్తాడు మనలాగా కాదు!

సూర్యుడు వచ్చినతర్వాత లేచేవాళ్లే ఎక్కువ ఈ రోజుల్లో-ఎవరో బహు తక్కువశాతం మంది మాత్రమే సూర్యుడికి “మేలుకొలుపు” పలుకుతారు-కొంతమందైతే అనునిత్యం చేస్తారు- వేంకటేశ్వరుడి సుప్రభాతంతో పాటుగా-అదికూడా సుబ్బులక్ష్మిగారి కమ్మని కంఠంతోటి;

“ఆ…. పూర్వపురోజుల్లో, పొలాల్లో పనులు అయిపోగానే (అప్పట్లో నగరీకరణలు, నగరాలు లేవుగా, అన్నీ పల్లెలే) సాయంత్రానికి పెందలాడే తినేసి పడుకుంటారు కాబట్టి- అంత పొద్దున్నే లేవగలిగేవాళ్ళు- ఇప్పుడు అర్ధరాత్రో, అపరాత్రో పడుకునే మా బోటోళ్లు, అంతపొద్దున్నే లేవమంటే ఎలా కుదురుతుంది” అని కొంతమంది సన్నాయి నొక్కులు నొక్కుతారు, మరికొందరయితే ఇంట్లో వాళ్ళమీద గయ్యిమని లేస్తుంటారు.

పల్లెటూళ్ళో కాక చిన్నపట్నాల్లో పెరిగినవాళ్లకు కూడా ఆ రోజుల్లో వేకువఝామునే లేవడం అలవాటు-అంటే సూర్యుడు “వాళ్ళ ఊళ్ళో అడుగిడకముందే” అన్నమాట. అలా సూర్యుభగవానుడికి స్వాగతం పలకటం రివాజు- ఇదీ ఒక కారణమే ఇప్పటికీ అప్పటి పెద్దతరం వాళ్ళు-మాలాంటివాళ్ళు ఆరోగ్యంగా- ఏ రోగాలు లేకుండా ఉన్నామంటే. పల్లెల్లో వాళ్లయితే పొలం పనులకు సిద్ధం అయిపోయేవాళ్లు, అదే పట్నాల్లో అయితే స్కూల్ గ్రౌండ్స్ కి వెళ్ళో, ఊళ్ళో ఉన్న పెద్ద ఖాళీ స్థలాల్లోగానీ వ్యాయామాలకు, నడకలకూ వెళ్లేవారు. కాస్త ఆధ్యాత్మికత, ధార్మిక వాతావారణంలో పెరిగినవాళ్ళు, ఆ స్పృహ ఉన్నవాళ్ళు-తెల్లవారుఝామునే ఓ చిన్న బృందంతో “నగర సంకీర్తన” చేసేవాళ్ళు!

అది మొదలయ్యే వీధిలో ఉన్న కొద్దిమందితో మొదలయ్యేది, క్రమేపీ వీధులగుండా వెళ్తున్నప్పుడు-అక్కడ వీధిలో వాళ్ళుకూడా ఈ కార్యక్రమంలో చేరేవాళ్ళు.దేవుడి పాటలు, భజనల తో, కీర్తనలతో, ఊళ్ళో వాళ్ళని మేలుకొల్పడం జరిగేది;ఇది నిత్యం ఒకేసమయానికి మొదలయ్యేది. ఎవరైనా లేచే సమయానికో, లేదా ఈ కీర్తనలు, భక్తి గీతాలు, భజనలు వింటూ లేస్తుంటేనో ఓ విధమైన అవ్యక్త భావన కలిగేది-మనసుకు ఆహ్లాదంగా కూడా ఉండేది-మా చిన్నతనంలో మేము కూడా ఈ నగర సంకీర్తనలో పాలుపంచుకునేవాళ్ళం.

ఇలాంటి నగరసంకీర్తన చేసే అలవాటు ఆంధ్ర ప్రాంతంలో, కర్ణాటకలోనూ ఉండేది- బహుశా, తమిళనాడులోనూ, కేరళలోనూ ఉందేమో-నాకైతే తెలియదు; కాలక్రమేణా మన అలవాట్లలోనూ,జీవన విధానంలోనూ పెనుమార్పులు- ఊహించని విధంగా వచ్చాయి. ఆ మార్పుల వెల్లువలో ఈ “నగరసంకీర్త అనేది దాదాపుగా కనుమరుగయిపోయింది (ఓ వేళ ఇంకా ఆంధ్రా ప్రాంతంలో జరుగుతున్నాయి అంటే సంతోషమే)

ఈ నగరసంకీర్తనలు అనే విషయమే మర్చిపోవడం జరిగింది; కాకపోతే కర్ణాటక ప్రాంతంలో-ఇంకా కొన్ని చోట్ల-మైసూర్ లాంటి పట్టణాల్లో కూడానూ ఇప్పటికీ నగర సంకీర్తనలు జరుగుతాయని తెలిసింది.సామాజిక మాధ్యమాల ధర్మమా అని ఆ వీడియో క్లిప్స్ కూడా మనకు కనువిందు చేస్తున్నాయి.చిన్నపిల్లలు కూడా తమ పెద్దవాళ్ళతో ఈ నగర సంకీర్తనల్లో భాగస్వాములే కాకుండా-ప్రముఖ పాత్ర వహిస్తూ, సారధ్యం వహిస్తూ ఉండటం చాలా సంతోషం.

కర్ణాటకలోని దక్షిణప్రాంతంలో ఉన్న”అశ్వద్దపుర” అనే పట్నంలోమొన్నీమధ్య జరిగిన “నగరసంకీర్తన” వీడియో చూడటం తారసపడింది,అది సామాజిక మాధ్యమాల్లో సంచలనం కలిగించింది-“చూడటం వరకే” అనుకోండి.అలా కాకుండా ఇది స్ఫూర్తిగా తీసుకొని వేరే ప్రాంతాలవాళ్ళు కూడా ఇలా చేస్తే సంతోషం, అదే నిజమైన సంచలనం. ఆ వీడియో చూసినతర్వాత ఈ నగర సంకీర్తన గురించి రాయాలి అనిపించింది!

భక్తికి భక్తి, తెల్లవారు ఝామున వ్యాయామానికి వ్యాయామం,మనసు ప్రతికూలంగా ఉండటానికి అవకాశం, అదే సాధనగా మారి ఎప్పుడు పాజిటివ్ గా ఉండటానికి కూడా దోహదపడుతుంది కూడా-మన సాంప్రదాయాల్లో అర్ధం పరమార్ధం ఉంటాయి ఎప్పుడూ!

ఈ సందర్భంగా ఇప్పటితరం వాళ్ళకి-అందరికీ కాదు-ఓ చిన్నసలహా ఏమిటంటే (అడగకుండా ఇచ్చే సలహా అన్నమాట-ఈ రోజుల్లో సలహాలు ఎవరు అడుగుతున్నారు) చేతులకి ఓ “ఆరోగ్య పట్టితో ఉన్న గడియారం” చుట్టుకుని- ఎన్నిపరుగులు తీశామో, గుండెచప్పుడు ఎలా ఉందో, కొవ్వు ఎంత తగ్గిందో, రక్త ప్రసరణ ఎలా ఉందో,వగైరా, వగైరాలు- ఇలాంటి వివరాలు చూసుకోవాల్సిన పనిలేదు ప్రతిరోజు.

అప్పటి తరంవాళ్ళ జీవనవిధానాన్ని అవలంబించండి- “డిజిటల్ పౌరులు” అయినా కూడా- పిచ్చిపిచ్చి అలవాట్లు,జీవన సరళి మానేస్తే,అప్పుడు ఏ మాయరోగం మీ దగ్గరకు రాదు- ఏ మీటలు చేతులకు స్టైల్ గా కట్టుకొని చూసుకోవాల్సిన పనీ ఉండదు.ఈ విషయం ఏ “ఆక్స్ఫర్డ్ వాడో- కేంబ్రిడ్జి వాడో” రీసెర్చ్ పేపర్ రాశాం అని చెప్తే –“ఓహో అలాగా మాబాగా చెప్పారు, మాకు తెలియదు సుమీ అది” అనేసుకుని గుడ్డిగా ఫాలో అవ్వాల్సిన పని ఉండదు- వాళ్ళేదో మనకు జ్ఞానోదయం కలిగించినట్టు!

divider

మితభాషి!

మన మాటలు సరదాగా ఆనందించేవాళ్ళు ఉంటారు,చాలామంది-బహుకొద్దిమంది మాత్రమే దాన్ని సోది, సొల్లువాగుడుగా భావించేవాళ్ళూ ఉన్నారనుకోండి- ఉంటారు;లోకంలో ఇది సహజం కనుక, తప్పేమీకాదు; అలా అని మన సహజస్వభావాన్ని మార్చుకోవాలా?

సరదాగా మాట్లాడటం ఒక కళేగానీ, అపచారేమో, నేరమో కాదుగా-దీన్ని వాగుడుగా భావించేవాళ్లకి బహుశా “హాస్య గ్రంధులు” తక్కువ మోతాదులో అన్నా ఉండాలి, లేదంటే అసలు ఆ గ్రంధులే వాళ్ళ శరీరాల్లో లేకుండా అన్నా ఉండివుండాలి. (భగవంతుడు వీళ్ళని కిందకి పంపించేటప్పుడు కావాలనే పెట్టి ఉండకపోవచ్చు)

ఏది ఎలాగున్నా-వాళ్లకి ఇబ్బంది కలిగించకుండా ఉండాలంటే-దీనికి తరుణోపాయం ఏమిటంటే వాగుడుగా భావించేవాళ్ళ దగ్గర వీలయితే నోరుమూసుకొని ఉందాం, అనుకుంటాంగానీ అలాఉండలేం,కష్టమే మరి-(తిరిగేకాలూ తిట్టేనోరూ ఊరికినే ఉండలేవుగా మరి)

మితభాషిగా ఉంటూ మిగిలినవాళ్ళ దగ్గర “మన అసలుగా” ఉందాం- అలా అయితే ఏ గొడవాలేదు-వాళ్లకి మన “అసలు” నచ్చదుకదా మరి, అదేమిటో మనకీ “వాళ్ళ అసలు నచ్చదని” వాళ్ళకెందుకు తెలియదో-తెలియకేంకాదు, వాళ్ళ వరకు వాళ్ళ స్వభావాలు కరెక్ట్ అనుకుంటారు!

అసలు విషయం ఏమిటంటే,వీళ్ళు మేధావుల వర్గం కాకపోయినా చాలా ప్రత్యేక వ్యక్తులు అనుకుంటారు-మనకేం అభ్యంతరం లేదు కూడానూ వాళ్ళ ఆలోచనల వల్ల-మనబుర్రలో గుజ్జు ఏమీ తగ్గదు కదా; వీళ్ళతో వచ్చిన తిప్పలల్లా అందరూ వీళ్ళలాగే ఉండాలనుకోవడమే- పైపెచ్చు వాళ్ళలా ఉండకపోతే మనం మామూలు మనుష్యులం కాదనుకుంటారు అదే అసలు సమస్య.

వీళ్ళు గిరిగీసుకుని, మాటాలు తూకంలో పెట్టినట్టు-కె.బి.సి లో ప్రశ్నలకు సమాధానాలు చెప్పేట్టుగా ఉండాలి- అమితాబ్ బచ్చన్ అన్నా ఒక్కోసారి లఘు సంభాషణలు అనుమతిస్తారుగానీ-వీళ్ళకి మాత్రం నప్పదు మరి.పద్ధతిగా క్రమం తప్పకుండా ప్రతిరోజూ- సంవత్సరం పొడుగునా వాళ్ళ పద్ధతిలో జీవిస్తూఉంటారు-సాధారణంగా వీళ్ళు మితభాషుల్ని ఇష్టపడుతుంటారు. నాలుగు ముక్కలు ఎక్కువ మాట్లాడినా, అదేపనిగా మాట్లాడినా అసలు పడదు- వాళ్ళ ఇష్టం అనుకోండి-ఎవరి జీవితాలు వారివి- ఎవరి ఇష్టం వచ్చినట్టు బతికే స్వేచ్ఛ ప్రతివారికీ ఉంటుంది- ఈ ఒక్క సంగతీ వాళ్ళూ గుర్తుపెట్టుకుంటే అందరికీ బాగుంటుంది-ముఖ్యంగా మనలాంటి వాగుడుకాయలకి!

పోన్లెద్దూరూ ఎవరు ఏమనుకుంటే మనకేమి ఈ బతుకు ఇలా బతికేద్దాం-మనం తప్పేమీ చేయట్లేదుగా, వాళ్ళు వాళ్ళలా బతుకుతున్నప్పుడు, మనం మనలా బతకకూడదా!ప్రపంచమంతా, వీళ్ళతోపాటు మన మాటల్ని అలా అనుకుంటున్న వాళ్ళదగ్గర కాస్త తక్కువగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం-కష్టం అయినా! మన మాటల్ని, ప్రవర్తనని ఆనందంగా ఆస్వాదించటానికి, మనతోబాటే సంతోషంగా “అతిగా మాట్లాడే”బోలెడంత ప్రపంచం ఉంది మనకి-కొదవా ఏమిటి-సరదాగా ఉంటూ జీవించేద్దాం!

ఇప్పటికి ఇలా లాగిచ్చేదాం బండిని మళ్ళీ మనుష్యజన్మ వస్తుందో లేదో తెలియదు- ఒక వేళ వచ్చినా మనకు ఈజన్మ- వచ్చేజన్మలో గుర్తుండదుగా మరి అందుకని!

divider

“తేలురాయి” ఉంగరం

"గోడమీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చేపోయేవారికి వడ్డించు బొమ్మ"అంటే ఏమిటో వయసు మీరినవారికి,మా తరంవారికీ మాత్రమే తెలిసిన పొడుపు ఇది.

“వృశ్చికం” అంటే రాశిచక్రం అనే పేరు విన్నవాళ్ళకి ఇది ఒక రాసి అని తెలుసు,వాళ్ళ రాసి చక్రం స్కార్పియన్ అయితే టక్కున సమాధానం చెప్పేస్తారు. అలాగే “తేలు” అంటే స్కార్పియన్ అని ఇంగ్లీష్ లో అంటారని అందరకీ తెలుసు; “స్కార్పియన్” అని అడిగితే “జోడియాక్ సైన్” అని చెప్పేస్తారు.ఇవన్నీ ఇలా ఉంటే ఈరోజుల్లో చాలామంది తేలు ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూసిన వాళ్ళే లేరు అంటే అతిశయోక్తి ఏమాత్రం కాదు-ఎంచేతంటే ఈజీవాలు దాదాపుగా మన దృష్టి నుంచి కనుమరుగయిపోయాయి.

పూర్వం రోజుల్లో,ప్రతి పల్లెలో- పొలాల్లోనూ,ఇళ్లలోనూ ఇవి రోజూ కనపడటం అనేది, గోడలమీద పాకటం అనేది సర్వసాధారణమైన విషయం.అదీకాకుండా అప్పట్లో చాలా పల్లెటూర్లలో కరెంటు ఉండేది కూడా కాదు.కిరోసిన్ లాంతరు దీపాలు,చిన్న దీపపు బుడ్లునూ, ఏదో కొద్దిమంది ఇళ్లల్లోనే పెట్రోమాక్స్ లైట్లు ఉండేవి. ఈ కిరోసిన్ లాంతర్ల వెలుగులో ఇంట్లో కొద్దిభాగం చీకటిగానే ఉండేది, దానితో తేళ్లు ఎక్కడ ఉన్నాయో తెలిసిందే కాదు!

తేలు కుట్టినప్పుడు, తేలు మంత్రం అని వేసేవారు, గోరు వెచ్చగా కాచిన నువ్వుల నూనెని తేలు కుట్టిన ప్రాంతంలో రాసేవాళ్ళు, కొన్నిచోట్ల ఏదో ఆకు పసరు రాసేవారు కూడా - చికిత్స విధానం ఏదైనా కాసేపటికి ఆ నొప్పీ, మంటా తగ్గిపోయేవి.

మా చిన్నతనంలో మానాన్న దగ్గర ఓ “తేలు రాయి ఉంగరం” ఉండేది,మా చిన్నప్పటి జ్ఞాపకాలు బాగా గుర్తు ఇప్పటికీ, తేళ్ళూ-ఆ ఉంగరమూనూ; నాకు గుర్తుఉన్నంతవరకు-మాఊళ్ళో మాదగ్గరే ఆ తేలురాయి ఉంగరం ఉండేది! అర్ధరాత్రి, అపరాత్రి అని ఉండేది కాదు, తేలు కుట్టినవాళ్ళు- మాఇంట్లో తేలు రాయి ఉంగరం ఉందని తెలిసి మా ఇంటికి వచ్చేవాళ్ళు, తేలు కుట్టిన మనిషికి విపరీతమైన, మంటా నొప్పీ ఉండేవి, కొంతమందైతే పైకే అరిచేవాళ్ళు, ఏడిచేవాళ్ళు కూడా ఆ నొప్పికి.

ఆ రాయి ఉన్న ఉంగరం తేలు కుట్టినచోట పెట్టి ఉంచేవాళ్ళు-ఓ అరగంటకు, గంటకో ఆ నొప్పి తగ్గిపోయేది-బహుశా ఆ కుట్టిన తేలు తీవ్రతని బట్టి సమయం ఉండి ఉంటుంది! ఎప్పుడు ఎవరికీ అవసరం వస్తుందో తెలిసేది కాదు కనుక ఇంట్లో ఓ పెట్టెలో గుర్తుగా ఉంచేవాళ్ళం-ఇంట్లోఉన్న వాళ్లందరికీ తెలిసేట్టుగా.అది వాడటం అయిపోయిన తర్వాత ఆ రాయివున్న ఉంగరాన్ని మంచినీళ్ళతో కడిగేసి, ఆరబెట్టి మళ్ళీ పెట్టెలో పెట్టేయడం జరిగేది.

ఈ రోజుల్లో పల్లెటూళ్లలో కూడా తేళ్లు మాయమయిపోయినట్టున్నాయి;ఓవేళ ఒకటో ఆరో ఉండి కుట్టినా, మందులు,ఇంజెక్షన్లు వచ్చేసాయి చాలా ఏళ్ళ క్రితమే. అయినా ఈరోజుల్లో కొందరు మనుషులు కుట్టేపాటి ముందు తేలుకొండె దెబ్బ ఎంత,ఈ మనుషులతో పోటీ పడలేకే బహుశా ఈ తేళ్లు మాయం అయిపోయి ఉంటాయి.

(ఆ ఉంగరం ప్రస్తుతం మా రెండో అన్నయ్య గోపి దగ్గర వుంది- తేళ్లు మాయం అయిపోవడంతో అది వాడి పూజా మందిరం లోకి చేరిపోయింది)

divider

చద్దన్నం (అల్పాహారం)

ఉదయాన్నే లేవగానే అల్పాహారం దాదాపుగా అందరూ తీసుకునే వాళ్లే-ఎవరో- ఒకరో ఇద్దరో తప్ప- నా ఉద్దేశం బహు కొంతమంది తప్ప-అంతే గానీ నాకు తెలిసినవాళ్లలో అల్పాహారం తీసుకునేవాళ్ళ గురించి ప్రస్తావించట్లా.

ముందుగా దంతధావనం అయిన తర్వాత ఓ వేడి పానీయం గొంతులో పడాల్సిందే- అది కాఫీ, టీ మరింకేదైనా కావచ్చు ఎవరి ఇష్టాన్ని బట్టి-(కాకపోతే రాత్రిపూట కొంతమంది పుచ్చుకునే వేడి మరియూ ద్రవ పదార్ధాలు ఇక్కడ నిషిద్ధం) వాళ్ళ పళ్ళు, ఒళ్ళు-మధ్యలో మనిష్టం ఏమిటి (అప్పుడప్పుడు మా పెద్దన్నయ్య అంటూ ఉంటాడు- "షేర్ కభీ మూ దోతా హై క్యా"అని)

ఇక్కడ కూడా కొంతమంది ఉంటారు-ఇలా ఏమీ తీసుకోనివాళ్ళు కూడాను- నా దృష్టిలో వీళ్ళు “గొప్పవాళ్ళు”-పొద్దున్నే లేవగానే అలా ఏమీ తీసుకోకుండా ఎలా ఉంటారు అనేది నాకు ఎప్పుడూ ఆశ్చర్యమే. వీళ్ళని గొప్పవాళ్ళకింద మీరు జమకట్టకపోతే- “ప్రత్యేకమైన వాళ్ళని” అనుకుందాం-దీనికేమీ మీకు అభ్యంతరం ఉండదు కదా!

“దంతధావనం అయితే గానీ ఇలాటి వేడి పానీయాలు స్వీకరించమని” నియమం లేని వాళ్ళు కూడా ఉంటారనుకోండి-"పక్క కాఫీ" తాగేవాళ్ళు- పక్కకి వెళ్లి తాగేవాళ్ళు కాదు, అదే- "బెడ్ కాఫీకి" మక్కీ తర్జుమా.అలాగే పక్క దిగి దంతధావనం చెయ్యకుండా తాగేవాళ్ళు కూడాఉంటారనుకోండి (మరీ పక్కమీద కూచ్చోని తాగితే ఏం బాగుంటుంది అని బహుశా వీళ్ళ మనసులో ఉద్దేశం అయి ఉండొచ్చు కూడా) వీళ్ళందరూ కూడా పొద్దున్నే తాగేవాళ్ళ కిందే లెక్కకి వస్తారు (అలా అని తాగుబోతులు మాత్రం కాదు సుమా) దాని తర్వాత లఘు శంకలు, దీర్ఘ శంకలు- అన్ని శంకలు అనుకోండి అయిపోతాయి; అటుపై- అభ్యంగన స్నానం అయిన తర్వాత అల్పాహారం తీసుకుని ఆత్మారాముణ్ణి జోల పుచ్చుతారు.ఆ విధంగా “ఉపవాస భంగం” అవుతుందన్నమాట (నిద్రలో ఏమీ తినలేదుగా మరి) దీన్నే ఇంగ్లీష్ వాడు “బ్రేక్ ఫాస్ట్” అన్నాడుగా-అంచేతే నేను ఉపవాస భంగం అనే పదజాలం వాడా అన్నమాట.

బహుశా విశ్వామిత్రులవారికి కూడా ఇదే ఉద్దేశం ఉండొచ్చు- రామలక్ష్మణులని లేపకుండా తన పాటికి తాను ఒక్కడే కాఫీ తాగేస్తే బాగుండదు కదా,అంచేతే ఆ కారణాలు, ఈ కారణాలు చెపుతూ సుప్రభాతం పాడుతూ ఉండి ఉంటాడు ప్రతిరోజూనూ. రాములవారు మాత్రం తక్కువ వాడా-ఆయనకి ఈసంగతి తెలియక కాదు- విశ్వామిత్రుణ్ణి రోజూ ఆట పట్టించడం కోసమే రోజూ ఆలస్యంగా లేస్తుంటాడు బహుశా.పైకి మాత్రం “విశ్వామిత్రుడి సుప్రభాతం ఇంకా రాలేదుగా” అనే వంక పెట్టుకుని నిద్ర నటిస్తూ ఉండిఉంటాడు (మనం కూడా అలారమ్ పెట్టుకున్న టైముకు మెలకువ వచ్చినా "ఇంకా అలారమ్ మోగలేదుగా" అని పడుకోము అలాగే ఇదీనూ) అదీ కాకుండా శ్రీరాముడు తొందరగా లేస్తే విశ్వామిత్రుడు సుప్రభాతం మర్చిపోయే అవకాశం కూడా ఉండనే ఉంది కదా-అంచేత కూడా అయిండొచ్చు.

రామాయణంనుంచి ఇక మన విషయంలోకి వస్తే-ఇప్పుడు నేను మాత్రం ఎవరు ఏమేమి తింటారో ఆ వివరణ ఇచ్చే ప్రయత్నం చేయబోవడం లేదు-కంగారు పడకండి.అవన్నీ రాయడం మొదలు పెట్టానంటే -హోటళ్లలో ఉండే మెనూ కార్డులలో ఉన్న పదార్ధాలంతా ఏకరువు పెట్టాలి-అంత అఘాయిత్యం చెయ్యలేను.ఇంతకష్టపడి ఓ వేళ రాశానే అనుకోండి- మీలోనే ఎవరో అనొచ్చు- “మీరు రాసిన లిస్ట్ లో మేము తినేది లేదుగా”అని- ఇవన్నీ నాకు అవసరమా పొద్దున్నే.

అసలు విషయం మర్చిపోయి మీకూ-నాకు వాగ్వివాదం మిగిలిపోతుంది-వాటి జోలికి పోవట్లా నేను!

“మా చిన్నతనంలో” అని ఏదైనా అంటే మీకు కోపం రావచ్చు- అయినా సరే రాయాల్సిన పరిస్థితి వచ్చింది- అమెజాన్ వాడిని, కొన్ని స్టార్ట్ హోటల్ లో ఈ మధ్య మెనూ చూసిన తర్వాత( అమెజాన్ వాడు పిడకలు, వేపపుల్లలు అమ్మడంలా అలాగే)

నా వరకు నేను డిగ్రీ చదివే రోజులవరకు-పొద్దున్నే “చద్దన్నం” లాగించేసేవాణ్ని- ఆవకాయ అన్నమో, కందిపొడితోనో, పెరుగు అన్నమో.హోటల్ గట్రాలు మాత్రం - కాలేజీకి వెళ్లిన తర్వాత స్నేహితులతో- ఎప్పుడైనా.ఆదివారం మాత్రం నేనూ, మా అన్నయ్య క్రమం తప్పకుండా హోటల్ కి వెళ్ళేవాళ్ళం-మా నాన్నగారు బిల్లు కట్టేసేవారు-మేము తినడం వరకు మాత్రమే.

ఈ రోజుల్లో “చద్దిఅన్నం” అంటే ఎవరికీ తెలియదు- ఓ వేళ తెలిసినా- అది పని మనిషికి కేటాయించే సరుకుగా గుర్తింపు పొందింది- “పొద్దున్నే కూడా బర్గర్లు, పీజ్జాలు తినేవాళ్ళకి” ఇది తెలియాలి అనుకోవడం తప్పే మరి.

కానైతే స్టైల్స్, ఫాషన్లు, ట్రెండుల పేరుతో- వీళ్ళ కంపెనీల కాంటీన్ లోనో, వారాంతపు పార్టీలలో, పేరు మార్చి పెడితే మాత్రం తినేస్తారు (చద్దన్నాన్ని) లేదంటే ఏ “న్యూట్రిషనిష్టో , హెల్త్ స్పెషాలిస్టో” - చద్దన్నం, తరవాణి మంచిది అని సలహా “ఇచ్చిందనుకోండి” సుబ్బరంగా లాగించేస్తారు.అదికూడా హోటల్ నుంచి తెప్పించుకుని మరీను- ఇంట్లో చద్దన్నం మాత్రం పనికి రాదుగా. (ఈ ఫీల్డ్లో ఆడవాళ్లే ఎక్కువ ఉంటున్నారు అందుకని స్త్రీలింగాన్ని వాడాను ఈ పదంలో -అంతేగానీ, బేధాలు, అభిజాత్యాలు,వెటకారాలు-గోదావరిజిల్లా వాళ్ళలాగా-మాత్రం లేవు)

ఈ హోటళ్ల వాళ్ళు మిగిలిన అన్నం ఏం చెయ్యాలో తెలియక చద్ది అన్నం ఈ విధంగా అమ్మేసుకుంటూ ఉంటారు- కొత్త పేర్లతో- దాని మీద మంచి టాపింగ్ చేసి మరీను - (రీసైక్లింగ్ ఐడియాలు వాళ్ళవి వాళ్లకు ఉంటాయి అనుకోండి) వెర్రి జనాలు ఎగేసుకుని లైన్ లు కట్టి మరీ తింటుంటారు బయటకు వెళ్ళినప్పుడు“ప్రో బయాటిక్ ఫెర్మెంటేడ్ రైస్” చాలా యమ్మీగా ఉందని వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పేస్తూ “ఇన్ స్టాగ్రామ్” లో పోస్టింగ్ లు పెడుతూ ఉంటారు.

అమెజాన్ వాడు, ఇలాంటి హోటళ్ల వాళ్ళు మన పూర్వీకుల తిళ్ళు ప్రాచుర్యంలోకి తెస్తున్నందుకు “సంతోషపడాలా”, లేక వాడెవడో వచ్చి చెపితేగానీ “తెలియలేదు- చవట వెధవలం అని సిగ్గు పడాలా”, మనం తినే తిళ్ళ పేర్లు మార్చి, ముస్తాబుచేసి వాడు మనల్ని దోస్తున్నందుకు “ఉక్రోషపడాలా”.ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పినప్ప్పుడు వినకుండా తొక్కలో నామోషీ అనుకుని, ఇప్పుడేమో యాపుల ద్వారా బోలెడన్ని డబ్బులు మన పిల్లలు తగలేస్తుంటే “ఏడవలేక నవ్వుకోవాలా!”

ఏది ఎలాగున్నా ఇప్పటికీ కొన్ని ఇళ్లల్లో కొంతమంది మాత్రమే చద్దన్నాలు తింటున్నారు, మరి కొద్దిమందయితే చద్దన్నానికి పోపు,కాస్త మసాలా వేసి పారేయకుండా తింటున్నారు.

మనం కట్టే బట్టా,తినే తిండి చెప్పుకోవడానికి “సిగ్గుపడాల్సినది- నామోషీ అనుకోవడం” అనే వెధవ జాడ్యాలు మానేస్తే ఇప్పటి తరానికి సగం రోగాలు తగ్గుతాయి.ఇప్పుడు వచ్చే రోగాల్లో చాలామటుకు “మన మాయరోగాల వల్లే” వచ్చేవే - ఆ సంగతి ఎంత తొందరగా తెలుసుకుంటే అంత ఆరోగ్యం జాతికి.

ప్రపంచంలో ఏ జాతివాడైనా వాళ్ళు తినే తిండి విషయంలో సిగ్గుపడుతున్నాడా - ఈ ప్రశ్నకు సమాధానం మన అందరికి తెలిసిందే!

ఆ మధ్య వచ్చిన లాక్ డౌన్ ధర్మమా అని- గాంధీ గారిలాగా ఎవరి పనులు వాళ్లే చేసుకున్నాంగా- ఆ సందర్భంగా చద్ది అన్నం, కందిపొడి, ఆవకాయతోనూ, చద్దిన్నపు పెరుగుతోనూ తినే భాగ్యం కలిగింది-మళ్ళీ చిన్నతనపు రోజులు తల్చుకుంటూ హాయిగా తిన్నాను.

చద్ది అన్నం తినడంవల్ల కింద పేర్కొన్న లాభాలు వస్తాయి అని మేము తినలేదు మాచిన్నతనంలో- “ఆరోగ్యానికి మంచిది” అని మాపెద్దవాళ్ళు చెప్పారు-తినేసేవాళ్ళం; బాబూ మోహన్ లాగా “ఎందుకు, ఏమిటి, ఎలా” అనే ప్రశ్నలు వేసేవాళ్ళం కాదు-(వేయాలేకా,బుర్ర లేకా కాదు,పెద్దవాళ్లమీద ఉన్న గౌరవం) అందుకే ఆరోగ్యంగా ఉన్నాం,రోజుకి ఐదు మైళ్ళు అయినా చులాగ్గా నడిచేయగలుగుతున్నాం.

అసలు ఆ చద్దన్నం తిని బయటకి వెళితే అంత తొందరగా ఆకలి, నీరసం ఉండేవి కాదు, పై పెచ్చు కడుపులో చలవగానూ,శరీరం చలాకీగానూ ఉండేది కూడా;అందుకనే చదువుతో పాటు ఎంతసేపు ఆడినా అలసట ఉండేదే కాదు.

మీలో అందరికి కాకపోయినా కొందరికన్నా తెలుసనుకోండి చద్దన్నం లాభాలు; ఎలాగూ రాస్తున్నాకాబట్టి ఓ నాలుగు లాభాలు కూడా రాసేస్తా-మళ్ళీ దీనికోసమని "సుందర్ పిచాయ్" ని చెప్పమని అడగక్కర్లేదు.అయన ఎంత ఓపిక ఉన్నవాడే అయినా ఇలా చద్దన్నం గురించి కూడా విసిగించేస్తే ఎలా-మనం అడిగే అడ్డమైన ప్రశ్నలకి ఎలాగూ సమాధానాలు చెప్పక తప్పట్లేదు ఆయనకి.

ఇమ్మ్యూనిటి-రోగనిరోధక శక్తీ పెరుగుతుంది,,వేడి చేయడం అంటూ ఉండదు. కాల్షియమ్, ఐరన్,పొటాషియం సంగతి చెప్పనే అక్కర్లేదు. మనకు జీర్ణం అవడానికి కావాల్సిన బాక్టీరియా ఉండటంవల్ల మలబద్దకం మన దగ్గర్నుంచి పారిపోతుంది- టాయిలెట్ లో కుర్చీ వేసుకునే, పక్క వేసుకునే ఉండక్కర్లా-బోలెడు డబ్బులు తగలేసి ప్రో బయాటిక్ పెరుగు కొనుక్కుని తినక్కర్లేదు.

ఇదంతా నే రాయడం వల్ల నా తృప్తే గానీ- మీకు దమ్మిడీ ఉపయోగం లేదు- చద్దన్నం తినకపోతే- "ఓ. ఐ సీ" అని అనడం తప్ప!మహా అయితే నాలాగే ఈ చద్దన్నం తిన్నవాళ్ళు కాస్త వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తులు తలుచుకుంటూ లొట్టలేసుకోవడం జరుగుతుంది అంతే.

ఆశ్చర్యం ఏమిటంటే ఒకళ్ళో, ఇద్దరో ఇప్పటి చదువులు చదివి, ఉద్యోగాలు చేస్తూ ఇక్కడా, విదేశాల్లో కూడా అప్పుడప్పుడు చద్దన్నం తింటూ వాళ్ళ పిల్లలకు కూడా పెడుతున్నవాళ్ళు కూడా ఉన్నారు- వాళ్లకి ఈ నా ఈ చద్దన్నం అంకితం.

ముగించేముందు

నేను “చద్దన్నం” అనే దానిమీద రాద్దామని మొదలు పెట్టిన సమయానికి యాదృచ్చికంగా చద్దన్నం మీద సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అయింది.స్టార్ హోటల్ లో చద్దన్నాన్ని ఎనిమిది వందల రూపాయలకి అమ్ముతున్నారు అని.

ఇది చూసిన తర్వాత కాస్త కొనసాగిద్దామని అనిపించింది... కోవిడ్ వచ్చిన సమయంలోనూ- మన నిరోధకశక్తి గురించి మనం తినే ఆహార పదార్ధాలు, మన పూర్వీకుల జీవిన విధానం గురించి పుంఖాను పుంఖాలుగా వాట్సాప్ యూనివర్సిటీ లోనూ,సామాజిక మాద్యమాల్లోనూ ఇరగదీసే రాతలే వచ్చాయి;ఇదేమీ మామూలు మహమ్మారి కాదు-అయినా మనదేశంలో ఎంతోమంది దీని బారిన పడ్డ వాళ్ళు తక్కువ-పడ్డవాళ్ళలో కూడా బయట పడ్డ వాళ్ళ శాతమే ఎక్కువ- 97 శాతం పైనే. కాస్త ఇలాంటివి చూసినప్పుడన్నా తెలివితెచ్చుకొని గుడ్డిగా అనుకరణలు మానేస్తే ఆరోగ్యంగా ఉంటాం!

చద్దన్నం విషయమే తీసుకోండి- అదే చద్దన్నం ఇంట్లో చేసుకోవడానికి నామోషీ ఎందుకు- హోటల్ కి వెళ్లి ఎగేసుకొని 800 రూపాయలు వాడికి ఇచ్చి తినడం ఏమైనా గొప్పా- అది వెర్రి తనమే అవుతుంది గానీ గొప్పదనం అవదు.

అమెజాన్ వాడు- పిడకలు, పందుంపుల్ల (వేప పుల్ల) అమ్ముతుంటే ఆహా, ఓహో అనుకుంటూ వాడు అడిగినంత డబ్బు ఇచ్చి కొనేసి వాడేస్తాం- అదే “మా చిన్నతనంలో మేము వాడాము” అని చెప్తే, వాళ్ళని అదేదో కానిపని చేసినట్టు చిన్నచూపు చూడటం-పల్లెటూరు బైతు కింద జమకట్టడం ఏమైనా సభ్యతా.

ఓ యాభై ఏళ్ళక్రితం మీ తల్లితండ్రులో,తెలిసినవాళ్ళో- ఎలా తిన్నారో,ఎలా బతికారో-తెలుసు కాబట్టి కాస్త బుర్రకి ఎక్కించుకొని కొద్దిగా అన్నా వాళ్ళ అలవాట్లని అనుకరించండి- నిక్షేపంగా నిండు నూరేళ్లు ఆరోగ్యంగా బతికేస్తారు- ఏ రోగాలు, మాయరోగాలు లేకుండా.అంతేగానీ గూగుల్ వాడో,ఇంకెవడో చేపింది గుడ్డిగా చేయడం కాదు.

ఓ బర్గరో,పిజ్జా నో తింటూ- ఓ కోక్ బాటిల్ తో దాహం తీర్చుకుంటే- ఆకలి కాదు తీరేది,మీ ఒంట్లో, కొవ్వు-పంచదార, అనారోగ్యం అర్జెంటు గా వచ్చి కూర్చుంటుంది.

ఇవన్నీ మీకు తెలియకనా-దొబ్బిడాయిగానీ!

divider

పీట!!

పీట ఓ మఠం లాంటిది, పీట మీద కూచొని భోంచేయడం పెద్దరికానికో చిహ్నం, దాని మీద కూచొని భోంచేస్తుంటే ఏదో పెద్ద పెద్దరికం వచ్చిన ఫీలింగ్ వచ్చేది లోపల (పిల్లలకు) అప్పట్లో పెద్దవాళ్ళు పీటల మీద కూర్చొని భోంచేసేవారు- బహుశా అందుకేనేమో పెద్దవాళ్ళకి మర్యాద చేస్తే "పెద్ద పీట వేశారు” వాళ్లకి అనేవాళ్ళు - ప్రతీఇంట్లోనూ ఓ నాలుగయిదు పీటలు ఉండేవి, అంతకంటే ఎక్కువ కావాలంటే- అవసరానికి ఆదుకోవడానికి వీధిలో బోలెడు గుమ్మలున్నాయిగా- టక్కున వెళ్లి అప్పుగా తెచ్చుకోవడానికి.

పిల్లలు కూచ్చోవడం మాత్రం కిందే- పిల్లలకు కూడా పీట మీద కూచొని భోంచేయాలని సరదా, ముచ్చటా ఉండేది.అప్పుడు కొందరిళ్ళల్లో ఓ చిన్నపీట కొనిచ్చేవారు ఇంట్లోవాళ్ళు పిల్లల గోల పడలేక. ఇక చూడాలి ఆ పీట వేసుకుని దాని మీద “బాసిపీఠం” వేసుకొని కూర్చొని మొదటి రోజు తింటుంటే- ఏదో సింహాసనం ఎక్కిన ఫీలింగ్ ఉండేది. కానైతే కొన్నిరోజుల తర్వాత అలా కొద్దిగా కంచం మీదకి ఒంగి కూర్చొని తినాలంటే కష్టం అనే ఫీలింగ్ మొదలు అయ్యేది.పీటమీద “బాసిపీఠం” కొద్దిగా సడలించి ఓ కాలు కింద పెట్టి కూచొని భోంచేయడం మొదలయ్యేది, అది సుఖంగానే ఉండేది అనుకోండి- అదో అలాగే చిన్నపిల్లకాయలు పీటమీద కూచొని తినే సరదా తీర్చుకునేవాళ్ళు.

అదే వేసవికాలం అయితే- తాటాకు విసనకర్రలతో గాలి వచ్చేట్టుగా- అది కూడా నెమ్మదిగా- ఆ భోంచేసి పెద్దవాళ్లకి విసరడం చిన్నపిల్లకాయల వంతే మరి- ఓ విధంగా శుశ్రూష లాంటిదే.మరి ఆరోజుల్లో అన్ని ఇళ్లల్లో ఫ్యాన్ లు ఉండేవి కాదు- ఓవేళ ఉన్నా ఒకటే ఉండేది, మరి ఇందరికి ఒక్క ఫ్యాన్ తో సరిపోదుగా.

సరే, వేసవికాలం అనగానే ఎవరికైనా గుర్తుకొచ్చేది కొత్త ఊరగాయలు,మామిడి పండ్లు-చిన్నరసాలు, పెద్ద రసాలు- చెరుకు రసాలు, అవీ దొరకడాన్ని బట్టి అనుకోండి.కానైతే పెక్కుమంది ఇష్ట పడేది, జుర్రుకొని తినేది, పీచులో ఓ చిన్నపాటి చుక్కకూడా లేకుండా ఇష్టంగా తినేది “నూజివీడు చిన్నరసాలే” మరి.అలా అని మిగతా మామిడిపళ్ళ రకాల్ని, మరి ముఖ్యంగా బంగినపల్లి మామిడి పళ్ళని చిన్న చూపు చూసినట్టు కాదు.

అసలు రసం మామిడిపండు తినడం అనేది ఓ కళ (కొద్దిగా మోటుగా ఉన్నా ఈ సందర్భంలో చెప్పక తప్పదు- “ఏమిటీ ఈ మూర్తి ఇంత అసయ్యంగా చెప్పాడు” అని మాత్రం అనుకోకండి- పాఠకులు అర్ధం చేసుకుని క్షమించి పారేయండి) పెద్దవాళ్ళు అనేవాళ్ళు "రసం పండు తిని మామిడి టెంక బయట పారేస్తే-పం.లు వాటి దగ్గరకు తినాలని వచ్చి తిట్టుకుని వెళ్లిపోవాలి, దాంట్లో ఏమీ లేదు" అని! ఆ లెవెల్లో మామిడి పండు తినాలని చెప్పడమే వాళ్ళ ఉద్దేశం తప్ప- వేరే జంతువుతో పోల్చడం అనేది-మరో ఉద్దేశమో, అసభ్యతో, చెండాలమో కాదు! పీట మీద భోజనాల విషయంలో ఇంకోటి కూడా ఉందండోయ్-అందరి భోజనాలు అయినతరువాత ఆ పీటల్ని సుబ్బరంగా కడిగి ఎండలో ఆరబెట్టేవాళ్ళం, ఆ తర్వాతే వాటిని మళ్ళీ ఇంట్లో పెట్టడం అదీనూ- చాదస్తం కాదు “శుచీ-శుభ్రం” అంటే అదే మరి- అవన్నీ గట్టెక్కించేసాంగా మరి ఈరోజుల్లో.కోవిడ్ ధర్మమా అని మళ్ళీ కాస్త “శుచీ- సుబ్బరాలు ” మొదలయ్యాయి ప్రస్తుతానికి. అవి భవిష్యతులో పాటిస్తామో- వాక్సిన్ రెండు డోసులూ వేయించుకున్నాం కాబట్టి, మనంత మొనగాళ్ళం లేమని- మళ్ళీ ఈ అలవాట్లని అటక మీదకెక్కిస్తామో- కాలమే చెప్పాలి మళ్ళీ పీట సంగతికొస్తే, అలా కూర్చొని తినడంవల్ల,మోకాళ్ళకు, వీపుకు, మెడకు ఆఖరికి పొట్టకు మంచి ఎక్సర్ సైజు అయ్యేది- అందుకే ఏ మాయరోగాలు వచ్చేవి కాదు ఆ రోజుల్లో వాళ్లకి.ఆ పీటల్ని అటకలకెక్కించి డైనింగ్ టేబుల్ భోజనాలు నేర్చుకున్నాం- తెల్లదొరల దగ్గర నేర్చుకున్న మహాచెడ్డ అలవాట్లలో ఇది మరి ముఖ్యం, మనకు రోగాలు మొదలయింది ఈ అలవాటుతోనే.

మీ ఇళ్లల్లో పీటలు లేకపోయినా అప్పుడప్పుడు కింద కూచొని తింటూ ఉండండి- ఎక్సర్ సైజు, మరియూ ఆరోగ్యం కూడానూ...

లేదూ అంత సరదా- ముచ్చటా పడితే మాత్రం పీటలు బోల్డెన్ని దొరుకుతాయి -వెళ్లి ఒకటి కొనుక్కు తెచ్చుకోండి- ఆ...ఈ మాత్రం దానికి మన ఒళ్ళు కదపాలా ఏంటి అనుకుంటే- అమెజాన్ వాడు అన్నీ అమ్ముతాడుగా-వాటికి పురమాయించండి.తెచ్చి మీ ఇంట్లో పడేస్తాడు-మీకు కూడా పీట ముచ్చటా తీరిపోతుంది.ఆ దెబ్బతో మీఇంటికి నేను భోజనానికి వచ్చినప్పుడు పీట భోజనం పెట్టచ్చు నాకు (ప్లేట్ భోజనం అనుకునేరు- పీట భోజనం)

ఆ మధ్య ఓ ఆప్తమిత్రుడు “పీట ఫోటో” పంపాడు (ఉపాధ్యాయుల వెంకటేష్- పూర్వాశ్రమంలో అతగాడిని “యు.ఎస్.ఆర్” అనేవాళ్ళు లెండి-ఎందుకు, ఏమిటి అని మాత్రం అడక్కండి-దాని గురించి ఇంకో వ్యాసం రాయాల్సి ఉంటుంది) సామాజిక మాధ్యమాల్లో మీరందరూ కూడా చూసే ఉంటారు అనుకోండి.అదిగో అది చూసినప్పుడు పీట గురించి నాలుగు ముక్కలు- ఆ జ్ఞాపకాలు నెమరు వేసుకుందాం అనుకున్నా (ఎలాగు పీటమీద కూచొని తింటూ నెమరు వేయలేనుగా ఇప్పుడు)దాని పర్యవసానమే ఈ పీట మీద నా ఈ మాటలు-ఈ జ్ఞాపకాల నెమరువేత! ఈ రోజు ఆదివారం కదా,వీలైతే -పీట లేకపోయినా కనీసం ఇంట్లో కింద కూచొని తినండి...

divider

“డొంక” ఈ పదం విన్నారా... అసలు డొంక అంటే ఏంటి!!!

దాని గురించి తెలుసుకోవాలంటే అందరం కలసికట్టుగా పల్లెల్లోకి వెళ్లాల్సిందే మరి, కళ్ళుమూసుకుని నాతో రండి, మిమ్మల్ని అందర్నీ జాగ్రత్తగా డొంకలు చూపించి మళ్ళీ మీ ఇంట్లో జాగ్రత్తగా దిగబెట్టేస్తా-ఎందుకంటే డొంకలుండేవి అక్కడే కదా.

ఆ రోజుల్లో సంగతి చెప్తున్నా- మనకందరికీ తెలిసిన విషయమే- - చాలా పల్లెటూళ్లలో రోడ్లు అనేవి ఉండేవి కాదు- ఎడ్లబళ్ళు, పశువులు, మనుషులు నడిచి నడిచి, అవే రోడ్లుగా మారిపోయేవి, పల్లెల్లో ఉన్నవాళ్లే కాస్త మట్టీ- రాళ్లు, తెచ్చి వాళ్ళే రోడ్డులాగా ఏర్పాటు చేసుకునేవాళ్ళు.కాస్త రాజకీయాల్లో పలుకుబడి ఉన్నవాళ్లు, ఆర్ధిక స్తొమత ఉన్నవాళ్లు ఉన్న పల్లెలకయితే ఒకటో ,రెండో రోడ్లు ప్రభుత్వం ద్వారా ఏర్పాటు అయ్యేవి.

ప్రతి పల్లెలోనూ ఇళ్ళు అన్నీ ఒక ప్రాంతంలోనే ఉండేవి- ఓ వంద గడపలూ, నాలుగు ఐదు వీధులూనూ-అక్కడనుంచి దూరంగా ఎవరి పొలాలు వాళ్లకి ఉండేవి; ఉదయాన్నే- ఎడ్లు, ఎడ్ల బళ్ళు, పొలం పనులకి వెళ్తుండేవారు రోడ్డు కానీ రోడ్డులో.ఇవి కాకుండా, పొలాల మధ్య,పోరంబోకు స్థలాల మధ్య దారి ఉండేది- రాళ్లతో, రప్పలతో, చెట్లతోనూ, ఎగుడు దిగుడుగానూ-అవి రోడ్లు కాదు కదా- అలాంటి వాటిని డొంక రోడ్డు అనేవాళ్ళు.ఎడ్ల బళ్ళు, వెళ్లి, వెళ్లి, క్రమేపి ఓ స్థాయి పెద్ద రోడ్డుగా విస్తీర్ణం అయ్యేది. చెట్ల కొమ్మలో-ఎక్కువగా జువ్వి చెట్లు, రావి, మర్రి చెట్లే ఉండేవి-తుమ్మ చెట్టు కొమ్మలో, మరే చెట్టు కొమ్మలో డొంక రోడ్డులోకి పెరిగితే- వాటిని ఎప్పటికప్పుడు ఆ వెళ్ళేవాళ్ళే తుంచుతూ ఉండేవారు, గొడ్డళ్లతో కొట్టేస్తూ ఉండేవారు. ఎడ్లబళ్లలో ప్రయాణం చేస్తూ వున్నప్పుడు పల్లె- పల్లెకి మధ్య ఇలాంటి డొంక రోడ్లు కొన్ని వచ్చేవి కూడా.అప్పుడు ఎడ్ల బండి తోలేవాళ్ళు లోపల కూర్చున్నవాళ్ళకి చెప్పే వాళ్ళు, “మొహాలు బయటకి పెట్టపోకండి, నిలబడబోకండి అందరు “జల్లలో” కూర్చోండి- చెట్ల కొమ్మలు, మూళ్ళ కొమ్మలు మొహానికి కొట్టుకుంటాయి” అని.

అలాగే కొన్ని డొంక రోడ్లు, షార్ట్ కట్ లో అసలు రోడ్డులోకి దారి తీసేవి, అలాగే కొన్ని చోట్ల గుట్టలు, పుట్టలు, చెట్లు, చెరువులు, ఎవరివీ కానీ పోరంబోకు స్థలాలు, ప్రభుత్వ భూములు లాంటి అవాంతరాల వల్ల, చాలా చుట్టు తిరిగి వెళ్లాల్సివచ్చేది; దాంతో ప్రయాణం కాస్త ఎక్కువ దూరం అయ్యేది కూడా.

అడిగిన ప్రశ్నకి తిన్నగా సమాధానం చెప్పకుండా “జిలేబి చుట్టల్లాగా తిప్పుతూ చెప్పినా, సక్రమంగా చెప్పక పోయినా”వాటిని డొంకతిరుగుడు సమాధానం అనేవాళ్ళు “తిన్నగా చెప్పక ఆ వెధవ డొంక తిరుగుడు సమాధానం ఎందుకు అని తిట్టేవాళ్ళు కూడా”! ఇప్పుడు డొంకలు లేకపోయినా,డొంకలు చూడకపోయినా ఇప్పటికీ మనకి అప్పుడప్పుడు ఇలా “డొంకతిరుగుడు” సమాధానం చెప్పేవాళ్ళు తగులుతూ ఉంటారు- లేదంటే మనకే ఆ లక్షణాలు ఉండి ఉండచ్చు కూడా. డొంక రోడ్లు, ఎడ్లబళ్ల ప్రయాణాలు, ఎడ్ల మెడల్లో మువ్వల చప్పుడు, ఎడ్లని అదిలిస్తూ చేసే చెర్నాకోలు చప్పుడు, బండి చక్రాలు చేసే చప్పుడు- అదే కనక రాత్రి పూట అయితే, ఆ చీకటి, కీచురాళ్ళ చప్పుడు, కప్పల బెకబెకలు,బండికి ముందు కట్టిన ఓ లాంతరు వెల్తురు-ఆ అనుభవాలే వేరు.ఇప్పుడు జనం సినిమాల్లో మాత్రం చూడగలుగుతున్నారు; ఆ మాత్రం దానికే “ఆహా ఓహో” అనుకుంటూ ఉంటారు, కానీ అవన్నీ అనుభవించిన తరం మాది.

ఇప్పుడు పల్లెల్లో ఉన్నవాళ్లు కూడా ఈ ఎడ్లబళ్ల ప్రయాణాలు చేయలేరు, చెయ్యట్లేదు, రోడ్లు వచ్చాయి, కార్లు వచ్చాయి, మోటార్ సైకిళ్ళు వచ్చాయి, ట్రాక్టర్లు వచ్చాయి, నడవాల్సిన పని లేదు, ఎడ్లబండి ఎక్కే పనేలేదు, అసలు ఈపాటికి ఎడ్ల బండ్లు కనుమరుగయి ఉంటాయి. ట్రాక్టర్లు, వాటికి ట్రాలీలు వచ్చిన తర్వాత. అదీ కాకుండా పూర్వంలాగా అంత తీరుబడిగా పనులు చేసే,చేయించుకునే కాలమూ కాదు-స్పీడ్, స్పీడ్, స్పీడ్ యోగమాయె-ఈ స్పీడ్ ప్రపంచం అంతటా విస్తరించింది.

అందరం పరుగెడుతున్నాం- పక్కవాళ్ళని చూసి మన పరుగు పెంచేస్తున్నాం- వాడెందుకు పరుగెడుతున్నాడో వాడికే తెలియదు, వాణ్ని చూసి మనమూ పరుగెడుతున్నాం.పరుగు ఆపడం అంటే ఎక్కడ వెనక పడిపోతామో అనే భయం-అసలు “వెనకపడి పోవడం ఏమిటో”.ఈ పరుగు ఎప్పుడు ఆగుతుందో తెలియదు-ఆగదు చివరి శ్వాస వరకూ మనిషి పరుగెడుతూనే ఉంటాడు.

అదర్రా సంగతీ, డొంక అంటే- డొంక తిరుగుడు లేకుండా- వివరంగా చెప్పేసాను; కళ్ళుతెరుచుకుని చూస్కోండి, మీరందరూ మీ ఇళ్ళకి క్షేమంగా ఈ డొంకల్లోంచి చేరివుంటారు.ఇంకో ఇలాంటి సందర్భం మరోమారు వస్తే ఎంచక్కా ఇలాగే మళ్ళీ తీసుకెళ్తా!

divider

వంటఇంటి గడప

గడప అంటే ఇప్పటి తరానికి తెలియక పోయినా ఆశ్చర్యం లేదు, అసలు గడపలే లేని ఇళ్లల్లో ఉంటున్నాం మనం ఇప్పుడు- దాంతో గడప సంగతే మర్చిపోయాం అందరమూనూ; గడప అంటే నా చిన్నతనం గుర్తుకొస్తుంది.వీధి గుమ్మానికి ఉన్నగడప చాలా విశిష్టమైనది, ఎంచేతంటే ఎవరు ఇంట్లోకి రావాలన్నా దాని ద్వారానే కదా.అందుకనే ఎలాంటి పండగలకైనా, శుభకార్యాలకయినా వీధి గుమ్మపు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేవాళ్ళు.అలాగే మామిడి తోరణాలు తప్పనిసరి, పండగల్ని బట్టి బంతిపూల దండలు తోరణాలుగా కట్టేవాళ్ళు, దానితో ఆ ఇంటికి వచ్చే కళే వేరు మరి.

(ఎప్పుడూ వీధి గుమ్మం దగ్గర కబుర్లు చెప్తూ ఉంటే ఇంట్లోవాళ్ళు- "వీధి గుమ్మానికి దండలాగా ఎప్పుడూ అలా అక్కడే ఉండకపోతే ఇంట్లోకి వచ్చి కాస్త పనులు చేయచ్చుగా" అనడం కూడా కద్దు అప్పట్లో)

ఆ తర్వాత ఇంట్లోని మొదటి గడపకి కూడా అలంకారం చేసేవాళ్ళు-ఇంటిని బట్టి, గదుల్ని బట్టి గడపలుండేవనుకోండి;ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వంట ఇంటి గడప.

ఆరోజుల్లో అందరి ఇళ్లల్లో అమ్మలు ఎక్కువ సమయం వంట ఇంట్లోనే గడపాల్సివచ్చేది.పెద్దకుటుంబాలు, వచ్చేపోయే బంధువులు మరి.దానికి తోడు “మడి” అదీ ఉంటే ఇంక చెప్పనక్కరలేదు.ఇంట్లోవాళ్ళకి టిఫిన్లు- కాఫీలు, అయిన తర్వాత,వంట ప్రయత్నాలు, అందరి భోజనాలు అయిన తర్వాతా ఆ మహా తల్లులు ఆ వంటఇంట్లో తినేవారు.

అప్పటికే శ్రమపడి ఉంటం వల్ల, కాస్త కంటిమీద కునుకు పట్టేది, అలా ఆ కట్టుకున్న చీర చెంగు తీసుకుని, వంటయింటి గడపపై తల పెట్టి తలగడలా చేసుకుని కాస్సేపు కునుకుతీసేవాళ్ళు.ఒక్కోసారి గడప వీలు కుదరకపోతే ఆ వంటఇంట్లోనే ఓ చేయిని తలగడలా చేసుకుని కునుకుతీసేవాళ్ళు.

“నిద్రసుఖం ఎరగదు, ఆకలి రుచి ఎరగదు” అన్నట్టు, ఒంటి బడలికవల్ల ఆదమరచి నిద్రపోయేవారు.ఇప్పటిలాగా గంటల తరబడి కాదు, ఓ పావు గంటో, ఇరవై నిమిషాల్లో, మహా అయితే అరగంట మాత్రమే నిద్ర (మనం “పవర్ నాప్” అంటామే అలాంటిది)

మరి కాస్సేపట్లో, కాఫీలో, టీలో ఉండనే ఉంటాయి; ఈ తతంగం అంతా రెండు “కుంపట్ల మీదో, ఓ కెరొసిన్ స్టవ్ మీదో” జరిగేది, అదీ ఇత్తడి గిన్నెల్లో వండటాలు కూడానూ-రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా!

ఆ రోజుల్లో చాలామంది తల్లులకు వంట ఇంటి గడప అనేది చాలా ప్రాశస్త్యంతో కూడుకున్నది.గడపని శ్రీమహాలక్ష్మిగా భావించి చూడటంవల్ల- ఎవరూ గడప మీద కూర్చోవడం అనేది లేనేలేదు.పొరపాటున మన కాలు గడపకి తగిలితే వెంటనే కళ్ళకు అడ్డుకునేవాళ్ళం.ఇప్పటిలాగా నడుస్తూ మనుషులనే చూసుకోకుండా తన్నుకుంటూ వెళ్లే రోజులు కాదుగా మరి. ఇల్లు పవిత్రం, ఇంట్లో అన్నీ పవిత్రమే మరి-ఇంట్లో వాళ్ళతో సహా ఇప్పటికీ ఆ వంట ఇంటి గడప తల్చుకుంటే అవే దృశ్యాలు కళ్ళముందు మెదలాడుతూ ఉంటాయి-అలాంటిది ఇప్పుడు గడపలేని ఇళ్లల్లో ఉంటున్నాం; ఎందుకో ఈరోజు “అమ్మా-వంటయింటి గడప” గుర్తుకొచ్చాయి!

divider

ఒట్టు - నమ్మకాలు

ఓ మాటంటే నమ్మకం,పెద్దవాళ్ళు ఏదైనా చెబితే అది వేదం,వాళ్ళ మాటల్ని “తు.చ తప్పకుండా” పాటించడం;మనుషుల్లో నిజాయితీ, వారి మాటల్లో నిజాయితీ ఉండేది.

పిల్లల్లో కూడా ఒకళ్ళ మాటంటే అవతలవాళ్ళకి నమ్మకం, ఆ మాటలకి తోడు ఒక్కో సందర్భంలో -అది అవతల వాళ్లకు మీమాంస కావచ్చు,సందర్భం

అనుమానించేట్టుగాఉండొచ్చు, అప్పుడు “ఒట్టు వేసి” మరీ చెప్పడం ఉండేది!

“ఒట్టు” అనేది చాలా పవిత్రమైనది!

అమ్మ మీద బట్టు-దేవుడు మీద ఒట్టు! (అమ్మా, దేవుడూ ప్రామాణికాలే కాకుండా-తాను ఒట్టు వేసి చెప్పే మాట నిజం కనుక అమ్మకి ఏమీ అవదని, దేవుడు ఏమీ చేయడని ఓ ఘాట్టి నమ్మకం)

నీ మీద ఒట్టు (ఆ వ్యక్తిమీద ఒట్టు వేసేవానికున్న విలువలకు తార్కాణం) పుస్తకం మీద ఒట్టు (పుస్తకం అంటే సరస్వతీదేవితో సమానం అనే భావన-ఇప్పటికీ పుస్తకం కాలికి తగిలిన లోపల తప్పుగా భావిస్తాము, కళ్ళకద్దుకుంటాం, మనలో మనమే ప్రాయశ్చిత్తంగా తోచినట్టు అనుకుంటాం)

సరస్వతి దేవి మీద ఒట్టు (ఇది పాశుపతాస్త్రం లాంటిది- తిరుగేలేని ఒట్టు)

అలా వేసే ఒట్టులకు ఎంతో నిజాయితీ-ఒట్టు వేసినవాళ్ల మీద నమ్మకం ఉండేది; వేసేవాళ్ళకి నిజాయితీ-నమ్మకం;అవతలవాళ్ళకీ ఒట్టు వేసేవాళ్ళ మీద నమ్మకం. ఇక్కడ “అబద్ధం చెబుతున్నారేమో” అనే అపనమ్మకం ఉండేదే కాదు-నమ్మకం అంతే,శషభిషలకు, అనుమానాలకు తావు లేదు.

ఓవేళ అవతలివాడు ఒట్టువేసి అబద్ధం చెబితే వాడికే ఏదైనా జరుగుతుందనే ఓ నమ్మకం కూడానూ-ఇదే కారణం చేతే ఒట్టు వేసేవాళ్ళు కూడా ఆషామాషీగా ఒట్టు వేసేవాళ్ళు కాదు “ఒట్టు తీసి గట్టున పెట్టేవాళ్ళు” కూడా ఉండేవారనుకోండి- సాధారణంగా ఇలాంటి వాళ్ళని సులభంగా కనిపెట్టేయడం జరిగేది-వాళ్ళ స్వభావాల్ని బట్టి.అంచేతే కొంతమంది ఒట్టు వేసినా అవతలవాళ్ళకి నమ్మకం ఉండేది కాదు.

కారణం- బాల్యం, వయసు, కలుషితం కాని మనసులు, మనుషులమీద నమ్మకం! అంచేతే ఎవరు ఏది చెప్పినా నమ్మేవాళ్ళు,అందునా ఒట్టువేసి మరీ చెబితే ఆది భగవంతుని మాటంత పవిత్రమైనది “పాప-పుణ్యాలమీద,దేవుడి మీద” వాళ్లకున్న నమ్మకం;ఒట్టు వేసిన వ్యక్తి మీద ఉన్న నమ్మకంతో బాటు!

అక్కడ ఉన్న అందరూ నమ్మేవారు-ఇక అది ఆ వ్యక్తి నిబద్ధతకి ప్రామాణికం లాంటిది;ఊరిజనం “రచ్చబండ తీర్పుకు” కట్టుబడేటటువంటిది-అదీ, ఒట్టుకి ఉన్న విలువా-స్థానమూనూ!

ఈ వాతావరణంలో పెరిగిన ఎవరైనా సందేహంలేకుండా వాళ్ళు జీవితాంతం నిజాయితీగానే బతికేస్తారు-దాదాపుగా,ఎవరో కొద్దిమంది మినహాయించి. మనకు చిన్నప్పుడు తెలిసినవాళ్లలో ఇలాంటివాళ్ళు ఒకళ్ళనో, ఇద్దరినో, కొంతమందినో ఇప్పటికీ చూస్తుంటాం.కానైతే చాలామంది వాళ్ళ చిన్నప్పటి స్వభావాలనుంచి మార్పు తెచ్చుకుని మాటమీద నమ్మకంతో బాటు నిజాయితీగా మారిన వాళ్ళూ లేకపోలేదు. అంచేత పరుల మీద వాళ్ళ చిన్నప్పుడే “ఓ ముద్ర” వేసేయడం మంచి పద్ధతి కాదు- ఆ రోజుల్లో అయినా, ఈ రోజుల్లో అయినా!

ఓ పద్ధతిగా, మంచి వాతావరణంలో పెరిగినవాళ్లు, అబద్ధాల పునాదుల మీద జీవితాల్ని కట్టుకోవాలని అనుకోరు- అది "ఓటి పునాది" మీద ఇల్లు కట్టడం లాంటిది- ఏదో రోజున ఒరిగిపోవడమో, పడిపోవడంతో జరుగుతుంది.

పునాదుల్ని బట్టి కట్టడాలు ఎలా నిలిచిపోతాయో, నిజాయితీ విలువల్ని బట్టే మనుషుల జీవితాలూనూ!

divider

నమలడం - చూయింగ్

చూయింగ్ అంటే అందరికీ గబాల్న అర్ధం తట్టకపోవచ్చుగానీ-వెంటనే “చూయింగ్ గమ్” మాత్రం గుర్తుకొస్తుంది.చూయింగ్ గమ్ ఎందుకు తింటారు-లాభాలు, నష్టాలూ, ప్రయోజనాల గురించి ఇప్పుడు నేను చెప్పబోవడం లేదు- చూయింగ్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం ఇప్పుడు!

చూయింగ్ ని తెలుగులో నమలడం అంటారని అందరికీ తెలిసిందేగా.పొద్దున్నుంచి పడుకునేంతవరకూ ప్రతివాళ్ళం ఏదో ఒకటి నములు తూనే ఉంటాం-అల్పాహారాలు, భోజనాలు కాకుండా“పిండిమర” లాగా నోటిని సాధ్యమైనంతవరకు ఆడిస్తూనే ఉంటారు చాలామంది-ఎవ్వరో కొద్దిమంది“జిహ్వ చాపల్యం” తక్కువ ఉన్నవాళ్లు తప్ప!

“నమిలి తినండర్రా, అలా గుటుక్కున మింగితే అరిగి చావదు” అని మన చిన్నతనంలో ఇంట్లో చాలాసార్లు దొబ్బులు తిన్నవాళ్ళమే.అన్నం కానీ, ఏదైనా తినే పదార్ధం నమిలి తినాలని, ఎన్నిసార్లు నమిలి తినాలో- మరీ ముఖ్యంగా "అన్నం" విషయంలో మరీ మరీ చెప్పేవాళ్ళు.

కనపడ్డ పండ్లు, మరీ ముఖ్యంగా గట్టిగా ఉండే జామకాయలు, పుల్లమామిడి కాయలు, జొన్న చేలల్లో నడుస్తుంటే కనపడే గట్టి దోసకాయలు, చెరుకుగడలు (ఇదయితే ఎడ్వర్ టైజ్ మెంట్లలో మాత్రమే చూస్తాము ఇప్పుడయితే) ఇవన్నీ నమిలి తిన్నతరమే కదా - అంచేతే పళ్ళు, చిగుళ్లు గట్టిగా ఉండేవి కూడా;

ఇప్పటి తరానికి చేయ తరమే కాదు!

నమిలి తినడం అనేది మన జీర్ణ ప్రక్రియకి చాలా దోహదం చేస్తుంది- ఈ రోజుల్లో ఫాస్ట్ ఫుడ్స్ తో బాటు సాఫ్ట్ ఫుడ్స్ బాగా తినటం అలవాటయిపోయింది జనానికి- సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు కదా- సహజమే. అదేమిటో ఇప్పటి చిన్నపిల్లలకి కూడా తెలుసేమో-పెద్దయిన తర్వాత సాఫ్ట్ వేర్ ఉద్యోగాల్లోనే చేరుతామని.లేదంటే సాఫ్ట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ ఇప్పటినుంచే తింటూ ఉంటే సాఫ్ట్ వేర్ ఉద్యోగాల్లో ప్రత్యేక కేటాయింపులు (స్పోర్ట్స్ కొత్త లాగా) ఉంటాయనీ వేళ్ళకి ముందే తెలిసి ఉంటుంది…

కాస్త గట్టి పదార్ధాలు తినడం అలవాటు చేసుకోండి, ఏది తిన్నా కాస్త స్థిమితంగా నములుతూ, తినడం అలవాటు చేసుకోండి;ఇది తిన్నది తిరగడానికి ఆరోగ్యంగా ఉండటానికి దోహద పడుతుంది. ఇది చదివి నామీద "పళ్ళు నమలడం" మాత్రం చేయబోకండి!

మీ నములుడు, మీ ఇష్టం….. నా పళ్ళెకెందుకు దురద!

(ఈ నామాట వినకపోయినా ఫర్వాలేదు, కాస్త కాళ్ళూ చేతులు కట్టేసుకుని ఇంట్లో కూచోండి- ఈ రోజు పూర్తిగా, కొన్నిరోజులు జాగ్రత్తగా ఉండండి)

divider

మజ్జిగ అలవాటు ఎందుకు పోయింది

“మజ్జిగ, చల్ల” అంటే తెలియని వాళ్ళు ఉండరు-ఈ రోజుల్లో ఇళ్లల్లో వాడకపోయినా కూడా.పూర్వం రోజుల్లో మజ్జిగ అనేదే ఉండేది, పెరుగు అనేది శ్రీమంతుల ఇళ్లలోనూ, ఆర్ధిక స్థితిగతులు బాగా ఉన్నవాళ్ళ ఇళ్లకే పరిమితం- ఆ రోజుల్లో మధ్యతరగతి కుటుంబాలే ఎక్కువ ఉండేవి (ఇప్పటి మధ్య తరగతి కుటుంబాల్లా కాదు)

భోజనంలో చివరి అధరువు మజ్జిగే మరి, ఓవేళ మధ్యతరగతి ఇంట్లో పెరుగు ఉన్నా అది ఆ ఇంటి పెద్దవరకూ ఉండేది -ఆరోజుల్లో ఇంతమందిని పోషించేది ఆ ఒక్క పెద్ద రెక్కల కష్టంతోనే- ఆయన ఆరోగ్యం చూసుకోవడం ఇంటిల్లి పాది బాధ్యత కూడా. అదికాక ఎవరైనా బంధువులు వచ్చినప్పుడో,పండగలూ- పబ్బాలు వచ్చినప్పుడు ఇంటిల్లిపాదికి పెరుగు తోడుపెట్టడం ఆనవాయితీ.

అలాగని శ్రీమంతుల ఇళ్లల్లో మజ్జిగ ఉండేది కాదు అని కాదు- వాళ్ళ ఇళ్లల్లో కూడా మజ్జిగ వాడకం ఉండేది.కొంతమంది విశాల హృదయులు వాళ్ళ పాడితో మజ్జిగ చిలికి ఇంటికి వచ్చినవాళ్లకి ఇచ్చేవారు- కొద్దిగా దిగువ మధ్యతరగతి కుటుంబాలు- వీళ్ళకి ఎరికఉన్నవాళ్ళు వాళ్ళ ఇళ్లల్లో ప్రతిరోజు మజ్జిగ తెచ్చుకునేవారు. ఆప్యాయతలు- ధర్మం ఇప్పటి లాగా పూర్తిగా కనుమరుగవని రోజులాయె మరి!

ఈ పరిస్థితులవల్ల -పెరుగు అనేది “ఒక స్థాయి ఉన్నవాళ్లు తినే పదార్ధం అనేది” దాదాపుగా నానుడిగా ఉండేది-వాస్తవమేగా!ఆ భావన మధ్యతరగతికుటుంబాల్లో బలంగా నాటుకుపోయింది.రోజులు మారి - తర్వాత తరం ఉద్యోగాల్లోకి రావడం- సంపాదనల వల్ల “పెరుగు తినడం” ఓ స్టేటస్ సింబల్ గా భావించడం జరిగేది.

ఆ భావన మనస్సులో బలంగా నాటుకుపోవడంవల్ల -కొన్నాళ్లకి మజ్జిగతో తినడం అనేది ఒక “నామోషీగా” పరిగణించడం మొదలుపెట్టారు;దానితో అందరి ఇళ్లలోనూ మజ్జిగ అనేది దాదాపుగా కనుమరుగయిపోయింది.నా ఉద్దేశ ప్రకారం జనాలకి మజ్జిగ అలవాటు పోవడానికి ఇది ప్రధాన కారణం!

అప్పట్లో రెండురోజులు ఇంట్లో మజ్జిగ మిగిలితే దానితో,”మజ్జిగ పులుసో, చల్ల పులుసో” చేసేవాళ్ళు-అది ఒక మంచి ఆరోగ్యకరమైన ఆధరువుగా ఆస్వాదించేవాళ్ళు కూడా.ఇప్పుడైతే పెరుగు తోడుపెట్టుకుని దానికి మజ్జిగగా చిలికి ఈ పదార్ధాలు చేసుకోవాల్సి వస్తోంది!

మొన్నామధ్య ఓ ఐదు నక్షత్రాల హోటల్ వాడు చద్ది అన్నాన్ని 700 వందల రూపాయలకి అమ్ముతున్నపుడు చద్దన్నం అందరికి గుర్తుకొచ్చింది.డాక్టర్లు, శాస్త్రజ్ఞులు మజ్జిగలో ఉన్న లాభాలు తెలిసి, చెప్పినా జనం వినడం అనేదిలేదు- మజ్జిగ పోసుకోవడం నామోషీగా మరి. (చద్దన్నం నామోషీగా చూసేవాళ్ళు, ఇప్పుడు చద్దన్నం వైపు చూస్తున్నారు, వాడెవడో చెప్తే చెయ్యడం బాధగా ఉన్నా-ఏదో విధంగా జనం చద్దన్నం వైపు చూస్తున్నారు-మంచిదేగా)

మజ్జిగలో ఇన్ని విశేషాలు ఉన్నాయని, అది ఒంటికి చాలా మంచిందని ఏ గూగుల్ వాడో చెప్తాడు- దాన్ని అమెజాన్ వాడు ఎంచక్కా రెండు మూడు వందల రూపాయలకి అమ్ముతాడు (మన వేప పుల్లలు, పిడకలు అమ్మినట్టు) ఓహో అలాగా- “గూగులమ్మకి” తెలిసినంత మన ఇంట్లోవాళ్ళకి కూడా తెలియదు- అని మనవాళ్ళు ఎగేసుకొని మరీ కొంటారు.

ఈ వెధవ వేషాలు ఆపేసి కాస్త మజ్జిగతో అన్నాన్ని కలుపుకుని తింటూ ఉండండి-మధ్యమధ్యలో-మీ ఒంటికే మంచిది- నాకేమీ ఉపకారం కాదు.ఏదైతేనేం కరోనా దెబ్బతో జనం కాస్త మన పూర్వీకుల ఆహారపు అలవాట్ల వైపు తొంగి చూస్తున్నారు-ఒకందుకూ అదీ మంచిదే-సంతోషించ తగ్గ విషయమే!

divider

"బుడగలు"

బుడగలు, అదేనండి బెలూన్లు తెలియనివాళ్ళు ఉండనే ఉండరు- అప్పట్లో కాదు, పూర్వం కాదు, ఇప్పుడైనా, ఎప్పుడైనా.ఇవి వేడుకలకి, మన ఆనంద సమయాలని ఇతరులతో పంచుకునే చిహ్నాలు కూడా.రంగురంగుల బుడగలు ఊది ఇంట్లోనూ,గుమ్మాలకి కడుతూ ఉంటే ఆ సంబరమే వేరు. పిల్లలంతా పోటీలుపడి మరీ- ఎవరు ఎంత తొందరగా ఎక్కువ బుడగలు ఊది పెద్దవాళ్ళకి అందిస్తామో అని ఊదుతూ ఉండేవాళ్ళు; బుడగలు ఊదేటప్పుడు మాత్రం బుగ్గలు నొప్పి పుట్టేవి- అయినా లక్ష్య పెట్టే వయసు కాదుకదా, ఆ ఆలోచనా ఉండేది కాదు- ఉత్సాహం వల్ల!

చిన్నవాళ్ళతో బాటుగా ఇంట్లోఉన్న పెద్దవాళ్లుకూడా బుడగలు ఊడేవారు; వాటికి తోడుగా రంగురంగుల కాగితాలు వివిధ డిజైన్లలో కట్ చేసినవి, అవి కూడా అలంకిరించేవాళ్ళం.ఆ ఊళ్లో ఉండే “కంగన్ అండ్ ఫ్యాన్సీ షాప్” లో కొన్నవి-అప్పట్లో ఆ షాప్ పేరుకి అర్ధం తెలిసేదికాదు-కానైతే ఆ షాప్ లో ఏం దొరుకుతాయో మాత్రం తెలిసేది!

కాలం మారిపోయింది-కానైతే అప్పటికీ ఇప్పటికే ఒక్కటే తేడా- బుడగలు వాడటం మానేయలేదు పైపెచ్చు బోలెడు రకాలు, బోలెడు సైజుల్లో (ఇప్పటి గాలిపటాల్లాగా) దొరుకుతున్నాయి, వాటిని వాడుతున్నారు- “మనం ఊదటం మానేసాం”!

అసలు చిన్నతనంలో బుడగలు ఊదటం అనే అలవాటు వల్ల ఊపిరి తిత్తులు దుమ్మూ ధూళి లేకుండా-సుబ్బరంగా పనిచేసేవి- స్వచ్ఛమైన గాలితో బాటుగా! ఊపిరితిత్తులకు ఈ బుడగలు ఊదటం అనే ప్రక్రియ సహాయకారిగా ఉంటుందని తెలియని వయస్సు-కాకపోతే బుడగలు ఊది ఇవ్వడం అనేది ఓ సరదా, వేడుక. కొద్దిగా వయసు పెరిగిన తర్వాత తెలిసింది అలా చేయడం వల్ల మన ఆరోగ్యం సుబ్బరంగా ఉంటుందని- ఉంది కూడానూ-ఇప్పటికీ!

ఇంట్లో ఫంక్షన్ అయినా (ఇంట్లో ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారు కనుక) హోటల్ వాడే అన్నీ అలంకరించి పెడతాడు- బుడగలు ఊదిపెట్టి, వాటిని కట్టి పెట్టడంతో సహానూ; ఊదినవాడి బుగ్గలు నొప్పి పుట్టినా వాడి ఊపిరితిత్తులు మాత్రం డోఖా లేకుండా నిక్షేపంగా పనిచేస్తాయి.

ఈ రోజుల్లో లంగ్ ఫంక్షన్ టెస్ట్ కి (LFT) వెళితే “పల్మనాలాజిస్ట్” ఈ బూరలు ఊదటం కూడా చేయిస్తారు- అందరు డాక్టర్లు కాదు లెండి- అప్పుడు తేలుతుంది ఈ బుడగలు ఊదటంవల్ల లాభాలు.బుడగల తత్వంతో బాటు-జీవితతత్త్వం కూడా బోధపడుతుంది

-మరి విషయం మన ఊపిరికి సంబంధించింది కదా!

ఇప్పటికీ పోయింది ఏమీ లేదు,ఎంచక్కా ఓ పది బుడగలు కొనుక్కుని రోజూ ఊదుతూ ఉండండి-నిస్త్రాణగా ఉన్న మీ ఊపిరితిత్తులు హుషారుగా ఠక్కున లేచి కూర్చుంటాయి;అవి హుషారుగా ఉంటే మిమల్ని కూడా హుషారుగా ఉంచుతాయిగా- పల్స్ ఆక్సీ మీటర్లతో పనిలేదు!

అందునా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఇలా బుడగలు ఊదడం మీ ఒంటికి లాభం కూడానూ-ఇకనయినా మొదలు పెట్టండి-బుగ్గలు నొప్పి పుట్టినా ఆపకండి!

ఏదో బుడగలు గుర్తుకొస్తే ఇదంతా రాయాలని అనిపించింది-వెధవది ఈ రాయడం అనే అలవాటువల్ల ఏదో ఒకటి రాయకపోతే బుర్రా- చేయి నిమ్మళంగా ఉంచవు నన్ను, అవీ నిమ్మళించవు నే రాసేదాకా!

divider

ఆంధ్రా భోజనాలు - రోటి పచ్చళ్ళు!

దేశంలో ఇతర ప్రాంతాలవారు అన్నపు భోజనం అంటే ఆంధ్రా భోజనం కోసమే చూస్తారు-పశ్చిమ ప్రాంతాలకి వెళ్లినా (ముంబై) ఉత్తర ప్రాంతాలకి వెళ్లినా (ఢిల్లీ) అలాగే దక్షిణ భారతదేశంలో అందరి దైనందిన ఆహారం వరితోనే.అయినా ఏ రాష్ట్రం వారి వంటలు- చేసేవిధానం వేరు;వరిని “ప్రధానఆహారంగా” తినే కన్నడ వారయినా, అరవ వారయినా, మళయాలీయులైనా-ఆంధ్రా భోజనం అంటే మిక్కిలి ఇష్టపడతారు- దాదాపుగా.

ఆంధ్ర ప్రాంతంలో అన్నంలో తినే పదార్ధాలు చేసే విధానమే వేరు, ఆ ఖారాలు ఉప్పులూ, రుచులే వేరు.మరీ చెప్పుకోవాల్సినది ఊరగాయలు, రకరకాల పొడులతో బాటు- “రోటి పచ్చళ్ళ” గురించి.తాజాగా చేసుకునే ఈ రోటి పచ్చళ్ళు చాలా ప్రత్యేకం-దాదాపుగా ప్రతి కూరగాయతో రోటి పచ్చళ్ళు చేస్తారు.వీటితో బాటు కందిపచ్చడి ప్రత్యేకం, అలాగే పేసర పచ్చడి కూడానూ - ఇది ఫక్తు ఆంధ్ర స్పెషాలిటీ.

అలాగే వంకాయ దోసకాయ కాలేసి(కాల్చి) పచ్చడి రుచిలో మరో అద్భుతః!

ఇప్పుడు రోళ్ళు వాడకపోయినా- మిక్సీలో చేసినా అవి రోటిపచ్చళ్ళుగానే పరిగణిస్తాము.ఆంధ్రుల వంట ఇళ్లలో ఈరోజుల్లో “రోళ్ళు” కనుమరుగయినా ఆ పచ్చళ్ళని ఇంకా మనం రోటిపచ్చళ్ళు అనే పేరుతో పిలవడం- ఆ రోళ్ళకి ఆంధ్రులు ఇచ్చే “మర్యాద- గౌరవమూనూ”.అలాగే రోటి పచ్చళ్ళు తింటున్నప్పుడల్లా- మన పాతతరం వాళ్ళని తల్చుకోకుండా ఉండలేముకూడా.

ఆంధ్రేతురులు ఆంధ్రా భోజనాల్లో చాలామంది ఇష్టంగా తినేది ఈ రోటిపచ్చళ్ళే మరి!

ఆంధ్రాభోజనాలలో ఉన్నన్ని పదార్ధాలు వేరెక్కడా ఉండవంటే అతిశయోక్తి ఏమాత్రం కాదు!
హోటళ్లవాళ్ళు “ఆంధ్రా భోజనం” (మీల్స్) అనే ప్రత్యేకంగా బోర్డు పెడతారు చాలా చోట్ల. ఏదైనా ఆంధ్రుల భోజనాల రుచి చూడాలంటే-శాఖాహారమైనా, మాంసాహారమైనా-ఖచ్చితంగా ఆంధ్రాప్రాంతానికి వెళ్లి తినాల్సిందే- అక్కడ అసలు సిసలైన రుచి తెలుస్తుంది.

ఓరోజు వంటకి బద్ధకించినా ఓ పచ్చడి వేసుకుని, తర్వాత పెరుగుతోనో-మజ్జిగతోనో అన్నం తినడం పూర్తి చేసినా కడుపునిండిపోతుంది, ఆత్మారాముడు ఆనందపడిపోతాడు.ఈ డిజిటల్ యుగంలో కూడా ఈ రోటిపచ్చళ్ళు చేయని, చేసుకోని ఆంధ్రుల ఇల్లు ఉండదు-విదేశాల్లో ఉన్న ఆంధ్రులని కూడా కలుపుకొని! “ఈ నామాట ఎంత నిజం అంటే సత్య హరిశ్చంద్రుడు చెప్పేమాట అంత నిజం” అదన్నమాట ప్రామాణికం!

మా ఇంటికి భోజనానికి వస్తే మాత్రం అధమం రెండు రోటిపచ్చళ్ళతో-మిగతా ఆధరువులతో బాటు-లేదంటే పచ్చళ్ళతో భోజనం ముగించేస్తామేమో అని అపోహ పడొచ్చు మీరు-మీకు భోజనం పెట్టడం ఖాయం-కన్నడిగులు కామధేనువు అయిన “నందిని” ఆవు నెయ్యితో!వశిష్ఠుడి ఆశ్రమంలో ఉన్న కామధేనువు పేరే “నందిని” -దానినే “సురభి” అనే పేరుతో కూడా పిలుస్తారు అన్న సంగతి మీకు తెలిసేవుంటుంది.

ఆ తర్వాత సచ్ఛమైన (ప్యూర్) ఫిల్టర్ కాఫీ కూడా చేతిలో పెట్టేస్తాం! ఈ వెధవ మహమ్మారి పోయినతర్వాత- ఇటుగా వస్తే (బెంగుళూరు) మాఇంటికి ఓమారు వచ్చివెళ్ళండి.రోజూ కబుర్లు మాత్రమే చెప్తాడు అని అనుకోకండి-మంచి ఆతిధ్యం కూడా ఇస్తాం మాఇంట్లో-మీరు రావడమే ఆలస్యం మరి.

నాకు సోదర తుల్యులైన భమిడిపాటి రాధాకృష్ణ గారు ఓ రోజు మా మాటల్లో రోటిపచ్చళ్ల గురించి ప్రస్తావన తెచ్చినట్టు గుర్తు- దాని ఫలితమే ఈ రోటిపచ్చళ్ళు!

divider

గానుగ – గానుగెద్దు

గానుగ అనే పదాన్ని తెలుగు భాషలోంచి ఇప్పటి తరం తీసేసినట్టే!-వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు వాడుతున్నప్పుడు, ఈ పదం విన్నవాళ్ళు మాత్రం గుర్తు పెట్టుకొని వాడటానికి అవకాశం ఉంది!

అసలు గానుగ అంటే ఏమిటి, దాన్ని దేనికి వాడేవారో ఓసారి గుర్తు చేసుకుందాం-నాలుగు దశాబ్దాల క్రితం పుట్టినవాళ్లకు ఇది ఏమిటో తెలిసే ఉంటుంది- అదికూడా నగరంలో పుట్టినవాళ్ళు కాకుండా అయితే మాత్రమే;పల్లెల్లో, ఓ మోస్తరు పట్టణాల్లో పుట్టిన వాళ్లయితే ఇది చూసీ ఉంటారు, దీన్ని వాడకం చూసీ ఉంటారు.

ముఖ్యంగా నూనెలు ఆడించటానికి దీన్ని ఎక్కువగా ఉపయోగించేవారు, వీటిల్ని నూనె గానుగలు అనేవాళ్ళు,ఆరోజుల్లో.

ఎలాంటి నూనె కావాలన్నా ఈ నూనె గానుగలలోంచే తయారు చేసేవారు- ఆ గానుగ చుట్టూ ఓ ఎద్దు అలా తిరుగుతూనే ఉండేది, ఒకేమూసలో చట్రంలా తిరిగితే కళ్ళు తిరుగుతాయి కాబట్టి-ఆ ఎద్దుకి కళ్ళకి గంతలు కట్టేవారు. ఇలా గానుగలలో పనిచేసే ఎద్దులు వాటి జీవితాంతం ఆ గానుగ చుట్టూనే తిరుగుతూవుండేవి, అవి ఎన్ని అడుగులు వేసినా, జీవిత కాలమంతా అక్కడే తిరుగుతూవుండేది.అందుకనే, ఎదుగుదలలేని జీవితాలతో బతికేవాళ్ళని, ఏ కొద్దిమార్పు కూడా లేకుండా ఓకే మూసలో బతికేవాళ్లని గానుగెద్దుతో పోల్చేవారు, "గానుగెద్దు జీవితం" అని అంటుండేవారు.

మా చిన్నప్పుడు మేమూ కూడా కొద్ది ఎక్కువ మొత్తంలో నూనెలు కావాలంటే, ముడిపదార్ధాలు తీసుకెళ్లి అక్కడ గానుగ పట్టించేవాళ్ళం (నందిగామలో గాంధీ విగ్రహం దగ్గర- ఆఫీసర్స్ క్లబ్ పక్కన ఈ నూనె గానుగ ఉండేది)

ఈ మధ్య “ఆయిల్ పుల్లింగ్” అనేది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యం చేశారు- ఆరోగ్యరీత్యా మంచిదని-అది కూడా గానుగ తీసిన నూనెనే వాడాలని- ఈ దెబ్బతో జంటనగరాల్లో మెషిన్ గానుగలు బాగా వచ్చినట్టు భోగట్టా- జనాలకి ఎప్పుడు ఓ కొత్తదనం కావాలి కదా-అందునా ఆరోగ్యానికి సంబందించిందాయే-ఊరుకుంటారా మరి.

ఈ సూత్రంతో ఇలాంటి కొత్త కొత్తవి ప్రచారం చేస్తారు, ప్రాచుర్యంలోకి తెస్తారు.జనాల ఆరోగ్యం ఎలా ఉన్నా ఈ నూనె అమ్ముకునే వాళ్లకి బోల్డు లాభాలు-వ్యాపార సూత్రం అదే కదా.

అలాగే అప్పట్లో “సున్నపు గానుగలు” కూడా ఉండేవి-సిమెంట్ వాడకం మొదలు అయినతరువాత కూడా; కొంతమంది సున్నం గానుగల్లో ఆడించిన (ఇసుక, సున్నం కలిపిన మిశ్రమాన్ని) ఇంటిగోడలు కట్టటానికి వాడేవాళ్లు,చాలా దృఢంగా ఉండేవి వీటితో కట్టిన ఇళ్ళు- చక్కటి చల్లదనంతోబాటు. సిమెంట్ అనే పదార్థాన్ని కనిపెట్టక ముందు మనదేశంలో కట్టిన ప్రతీ పురాతన కట్టడాలు, గుళ్ళు, గోపురాలు ఈ మిశ్రమంతో కట్టేవారు- వీటిలో రకరకాల పదార్థాలని కలిపేవారనుకోండి ఆ కట్టడాలకు (బెల్లం, కోడిగుడ్డు సొన, గంజినీళ్లు ఇంకా ఇతరమైనవి)

మన దేశంలోని ఇళ్ళు, పురాతన కట్టడాలు,గుళ్ళు గోపురాలు ఇలాంటి మిశ్రమాలతోనే కట్టేవాళ్ళు, ఎన్ని వందల ఏళ్లయినా చెక్కు చెదరకుండా అప్పటివి ఎన్నో ఇప్పటికీ ఉన్నాయి.

గానుగ, గానుగెద్దు ఫోటో కూడా పంపిస్తున్నాను ఈ ఆర్టికల్ తో బాటుగా- తెలియనివాళ్ళకోసం!

divider

మొదటి కృష్ణుడు-రెండవ కృష్ణుడు

శ్రీకృష్ణుడు అంటే ఒక్కడే కదా, కురుక్షేత్ర సంగ్రామ సమయంలో అర్జునుడికి భగవద్గీత చెప్పింది ఆయనే కదా.ఘంటసాల పాడింది, గంగాధర శాస్త్రి పాడిందే అదే కదా;ఇతమిద్దంగా తేలింది ఏమిటంటే శ్రీకృష్ణుడు ఒక్కడే.అలా కాకుండా ఒకటవ కృష్ణుడు, రెండవ కృష్ణుడు అని కూడా ఉన్నారని, లేదంటే ఉండేవారని ఇప్పటివాళ్ళకి అసలు తెలియని తెలియదు.మా అదృష్టం కొద్దీ వినడమే కాదు చూసాం కూడా మా చిన్నతనంలో.నిజ్జం, ఒట్టు, మీకు ఆ విషయం చెబుదామని నా ఉద్దేశం.చెప్పగలను గానీ ఇద్దరు కృష్ణులని చూపించమంటే మాత్రం నావల్ల కాదు- ముందే చెప్తున్నా ఇక విషయంలోకి వస్తాను!

మా చిన్నతనంలో టి.వి లు లేవు కదా- అసలు అలా ఉంటాయని ఊహ కూడా లేదనుకోండి.ఒకటో రెండో సినిమా హాళ్లు ఉండేవి కాస్త వినోదానికి.పండగలొస్తే అప్పుడప్పుడు తిరునాళ్ళు జరిగేవి అవే పెద్ద ఉత్సవాలు,అలాగే ప్రవచనాలు, పురాణేతిహాసాలు- దేవాలయాల్లో పండితులు చదివేవారు.పండుగ సందర్భం అయితే- పండుగను బట్టి, రామాయణంలో, మహాభారతంలో, భాగవతంలో- కొన్నిఘట్టాలు ఓ నెలరోజులపాటు చెప్పేవారు!

డాక్టర్ “బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు” కాళిదాసుకి, కాళికాదేవి ప్రత్యక్షం అయి వరమిచ్చిన తర్వాత- వారిద్దరి మధ్య సంభాషణ- సంస్కృతంలో అయన చెపుతుంటే- కళ్ళముందు అమ్మవారు- కాళిదాసు కనపడేవారు అంత అద్భుతంగా చెప్పేవారు-మా ఊరులో ఉన్న రామాలయంలో-దాదాపు 55 ఏళ్ల క్రితం.అప్పటికి అయన ముప్పయి వయసులోపే ఉండవచ్చు-ఇప్పటికీ కళ్ళముందు ఆ దృశ్యం కదలాడుతుంది!

ఇలా చెప్పటానికి- వేరే ఊరు నుంచి వచ్చే పండితులు-నియమనిష్ఠలున్న బ్రాహ్మల ఇళ్లల్లో ఆతిధ్యం స్వీకరించేవారు- వసతితో సహా- అలాగే పీఠాధిపతులు వచ్చినా కూడా!

వీటితో బాటు, హరి కధలు (ములుకుట్ల సదాశివశాస్త్రి గారు) నాటకాలు, డ్రామాలు కూడా నడిచేవి; ఎక్కువగా పౌరాణిక ఘట్టాలు అయితే శ్రీకృష్ణ రాయబారమో, శ్రీకృష్ణ తులాభారమో నడిచేవి.డి.వి సుబ్బారావు గారి సత్య హరిశ్చంద్ర ఒక్కసారి మాత్రం మా ఊళ్లో వేసినట్టు గుర్తు-రాత్రి మొదలు పెడితే ఉదయం ఐదు గంటల వరకూ నడిచేది.

(మళ్ళీ కాలేజీలో చదివేరోజుల్లో, నా ఫ్రెండ్ ఆనంద్ తో బెజవాడలోని “తుమ్మలపల్లి వారి కళాక్షేత్రయ్య కళావేదికలో” డి.వి.సుబ్బారావు హరిశ్చంద్ర నాటకం చూసాం- రాత్రి పదకొండు గంటల తర్వాత మొదలయి మరునాడు ఉదయం ఐదు గంటల వరకు సాగింది- కాటికాపరి సీన్ లో ఆయన పద్యాలు పాడే విధానానికి, మాటలకి హాలులో ఏడవని వాళ్ళు లేరు అంటే అతిశయోక్తి కాదు)

శ్రీకృష్ణ తులాభారం పద్యాలతో ఉండటం వల్ల “ఒన్స్ మోర్ లు” ఎక్కువగా జనం అడిగేవారు, రాయబార ఘట్టం కూడా చాలా పెద్దది అవటం మూలాన, “ఒన్స్ మోర్” ల వల్ల పదేపదే అవే పద్యాలను మళ్ళీమళ్ళీ పాడాల్సి వస్తుంది కనుక- కృష్ణుడు పాత్రకి మాత్రం అధమం ఇద్దరో, ఒక్కోసారి ముగ్గురో ఉండేవారు.

చిన్నతనం- ఏదో ఉత్సాహంతో దుప్పటితో-చలికాలం అవటం వల్ల-గుడికి వెళ్ళేవాళ్ళం ఇది చూడటానికి -గుడి బయట ఆవరణ ప్రాంతంలో ఈ నాటకాలు వేసేవారు.అప్పట్లో గుడులయినా, బడులయినా చాలా విశాలంగా విస్తీర్ణంగా ఉండేవి (ఇప్పటిలాగా అపార్ట్మెంట్స్ లో స్కూళ్ల లాగ, ఇళ్ల మధ్య ఓ గుడిలాగా కాదు)

నాటకం చూస్తూ, చూస్తూ మధ్యలో నిద్రపోయేవాళ్ళం,నిద్రకు ఆపుకోలేక- ఎప్పుడు లేచి చూసినా నెమలి పింఛంతో శ్రీకృష్ణుడే కనపడేవాడు.కాకపోతే మనిషి మారిపోయేవాడు,ఇంకో రకంగా ఉండేవారు. మాకు అర్ధం అయ్యేది కాదు-నిద్ర మత్తులో అలా కనపడుతున్నారేమో అని అనిపించేది.తర్వాత తెలిసింది- ఈ పద్యాలు పాడటానికి-(ఒన్స్ మోర్ ల వల్ల) ఈ నాటకం ఓ ఐదు, ఆరుగంటలు నడవటం మూలాన అంతమంది కృష్ణులు ఉంటారని-ఆ విధంగా చాలామంది కృష్ణులని చూసేవాళ్ళం మా చిన్నప్పుడు-అదీ సంగతి ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు అంటే!

divider

పరమపదసోపాన పటము

చిన్న నిచ్చెనలు, చిన్న పాములు, పెద్ద నిచ్చెనలు, పెద్ద పాములు-కష్టాలు, సుఖాలు, ప్రమాదాలు, ఇబ్బందులు, సంతోషాలు, ఆనందాలు, హఠాత్పరిణామాలు, ఉత్సుకత కలిగించే సంఘటనలు, విజయాలు అపజయాలు, ముందుకు వెళ్ళటాలు, వెనకడుగు వేయటాలు!

మా తరంలో వాళ్ళు, బహుశా తరవాత తరం వాళ్ళు కూడా ఈ పరమపద సోపాన పాఠం- వైకుంఠపాళి ఆడి ఉంటారు (ఈ రోజుల్లో ఈ పదం కరువైపోయి స్నేక్ అండ్ లాడెర్స్ అనే పేరుతో ఇప్పటి పిల్లలు ఆడుతున్నారు)

ఆ పటం ముందు పెట్టుకొని-మరీ ముఖ్యంగా ఆదివారాల్లో, సెలవురోజుల్లో పిల్లలందరం చేరి ఆడేవాళ్ళం అదీ చూడముచ్చటైన గవ్వలతో (డైస్ తో కాదు) పందెం వేసినప్పుడు నాలుగు పడితే నిచ్చెన, మూడు పడితే పాము నోట్లో అయితే, కళ్ళు మూసుకుని దేవుడికి దండం పెట్టుకొని గవ్వలు ఎక్కువ సేపు ఆడించి వాటిని ముద్దుపెట్టుకొని మరీ పందెం వేసేవాళ్ళం.

నాలుగు పడి నిచ్చెన గదిలోకి వెడితే ఆనందంతో కేరింతలు- మళ్ళీ ఇంకోసారి పందెంవేసే అవకాశం వచ్చేది.ఈ క్రమంలో చిన్నపాము నోట్లోపడి కిందకి రావడం,నిచ్చెనలెక్కి పైకి ఎక్కడం జరుగుతుండేది.చాలాసార్లు కిందపడి, మీదకెక్కి ఓ వైకుంఠంకి దగ్గర గడుల్లోకి వెళ్లేసరికి సంబరంగా ఉండేది.అంతలోనే కొంత దిగులు, పామునోట్లో పడకుండా వైకుంఠానికి చేరేదాకా.కొంతమంది పిల్లలు అక్కడదాకా చేరిన తర్వాత దేవుడి గదిలోకి వెళ్లి దేవుడి పటానికి దండం పెట్టుకొచ్చి మరీ చివరి పందెం వేసేవాళ్ళు-ఇక గవ్వలు సరిగ్గా పడి వైకుంఠానికి చేరితే సంబరం అంబరాన్ని తాకేది.

ఈ ఆట ఆడుతున్నంతసేపూ ఉత్సాహం, ఉద్విగ్నత, ఏడుపులు కూడా జరిగేవి- దీని ద్వారా జీవిత తత్త్వం అర్ధం అయ్యే వయసు కాదది.అయినా ఇంట్లో వాళ్ళు, స్కూల్ లో తెలుగు మాస్టారు వీటి అర్ధం పరమార్ధం (ఆధ్యాత్మికత) ఓటమి గెలుపులని జీవితాలకి ముడిపెడుతూ, ఎలాంటి స్వభావాలు అలవర్చుకోవాలి, స్వార్ధం, అహంకారం, లాంటి వాటికి ఎందుకు దూరంగా ఉండాలో ఉదాహారణలతో సహా చెప్పేవారు.

ఆ పటం ముందు కూర్చొని ఆడుతూ ఉంటే సమయం తెలిసేది కాదు; క్రమేపీ వీటిని జీవితాల్లో అన్వయించుకోవడం తెలిసేది వయసు పెరిగిన కొద్దీ.ఆ రోజుల్లో ప్రతి ఆటలోనూ, అర్ధం- పరమార్ధం ఉండేవి- అవి పెద్దలు విడమరిచి చెప్పేవారు కూడా.

వైకుంఠం అయినా, కైలాసం అయినా ప్రతి వ్యక్తి ఆపసోపాలు పడుతూ, పడుతూ లేస్తూ ఈ జీవిత పరమపద సోపాన పటంలోని చివరి గడులకు చేరుకుంటారు- ఎంచేతంటే జీవితమే ఓ వైకుంఠపాళీ కనుక!